Wednesday 3 February, 2010

నరకం 2.0

త్రిలోక సంచారి అయిన నారదులవారు అలవాటు ప్రకారం ముల్లోకాలూ తిరుగుతూ ఒకసారి నరకం మీదుగా వెళుతున్నాడు. మామూలుకంటే భిన్నంగా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ఆలోకాన్ని చూసి ఆశ్చర్యం కలిగిందాయనకు. "ఎప్పుడూ పాపుల హాహాకారాలతో, యమకింకరుల వికటాట్టహాసాలతో దద్దరిల్లుతుండే నరకమేనా ఇది" అని ఆశ్చర్యపోతూ దిగి నరకంలోకి ప్రవేశించాడు విషయం తెలుసుకుందామని. చూస్తే ఏముందీ, దిగాలుగా ఓ మూల నిలబడున్నాడు చిత్ర గుప్తుడు. ఆయనకు కొద్ది దూరంలో ముఖాలు వేళ్ళాడేసుకుని యమకింకరులు! శిక్షలు విధించటానికి తీసుకుని రాబడ్డ పాపులంతా తమలో తాము పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నారు. నారదుడి ఆశ్చర్యం రెట్టింపైంది. "చిత్రగుప్తా, ఏమిటి సంగతి, ఏదో పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్లు కనిపిస్తున్నావు?" అడిగాడు నారదుడు. "ఏం చెప్పమంటారు స్వామీ నా కష్టాలు? చాలా చిక్కు సమస్యలో ఇరుక్కున్నాను. మీరే నన్ను కాపాడాలి. అసలే యమధర్మరాజులవారు వచ్చే సమయం అయ్యింది" అన్నాడు చిత్రగుప్తుడు, బావురుమనే గొంతుతో. నారదుడేదో బదులివ్వబోయే లోపు యమధర్మరాజు వస్తున్న సూచనగా గంట మోగనారంభించింది. చిత్రగుప్తుడూ మిగిలిన కింకరులూ ఎంతో ఆదుర్దాగా చూడటం మొదలుపెట్టారు. మరికొన్ని క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమవ్వనే అయ్యాడు సమవర్తి.

వస్తూనే చిత్రగుప్తుడి మీద హుంకరించాడు "చిత్రగుప్తా, ఏం చేస్తున్నారు మన కింకరులంతా? ఇంతమంది పాపులని వదిలేసి కబుర్లు చెప్పుకుంటున్నారా??" వణుకుతున్న గొంతుతో బదులిచ్చాడు చిత్రగుప్తుడు, "అది కాదు మహాప్రభూ, వీరికి శిక్షలు విధించాలనే ప్రయత్నిస్తున్నాం కానీ...". "ఏమిటి కానీ? మీకు చేతకాకపోతే నేనే శిక్షిస్తా చూడండి.” యమధర్మరాజు ఠీవిగా వెళ్ళి ఒక పాపి దగ్గర ఆగి అడిగాడు. "ఏమిటి ఇతడు చేసిన పాపం?" చిత్రగుప్తుడు చిట్టా తెరిచి అతడు చేసిన పాపాల వివరాలన్నీ చదివాడు. "అలాగా, అయితే ఇతడిని తలక్రిందులుగా వేళ్ళాడ దీయించి, మంటలలో కాల్పించి, సలసల మరిగే నూనెలో వేయించండి." క్షణాలమీద ఏర్పాట్లు చేశారు యమ కింకరులు. కానీ యమధర్మరాజునే సంభ్రమానికి గురిచేస్తూ అదేదో పన్నీటి స్నానం చేస్తున్నట్లుగా అనుభూతి చెందసాగాడు అతడు. కణకణ మండే నిప్పులుగానీ సలసల మరిగే నూనెగానీ అతడికి కొంచెంకూడా బాధకలిగించడంలేదు. ఆశ్చర్యంతో తలపంకిస్తూ తరువాతి పాపి వద్దకు వెళ్ళాడు యముడు. ఈసారి అడగవలసిన అవసరంలేకుండానే అతడి పాపాల వివరాలన్నీ చదివి వినిపించాడు చిత్రగుప్తుడు. "ఇతడిని అత్యంత వాడియైన కత్తులు బల్లెములతో నిలువెల్లా పొడిపించి, ఒళ్ళంతా ఉప్పూ కారాలు రాయించండి" ఆజ్ఞాపించాడు యముడు. ఈసారీ ఫలితం లేకపోయింది. యముడు పరాభవాన్ని తట్టుకోలేక పోతున్నాడు. ఈసారి మూడవ పాపిని "ఏనుగులూ ఖడ్గమృగాలచే తొక్కించమని" ఆజ్ఞాపించాడు. మళ్ళీ అదే తంతు. పాపులంతా శిక్షలకు భయపడకపోగా వాటిని ఆస్వాదిస్తున్నారు. ఎంత కఠినమైన శిక్ష అయినా కూడా వారిని బాధించలేక పోతోంది. "ఇదీ సంగతి, ఇప్పటికైనా అర్థమయ్యిందా ప్రభూ" అన్న భావం కనిపించింది యముడికి చిత్రగుప్తుడి కళ్ళల్లో.

ఎప్పట్నించో ఈ ప్రహసనాన్నంతా చిద్విలాసంగా గమనిస్తూన్న నారదుడిపై పడ్డాయి యముడి కళ్ళు. ఒక్క అంగలో ఆయనవద్దకు వెళ్ళి ఈ గండం గట్టెక్కించమని వేడుకున్నాడు. నారదుడు ఒక్కసారి కళ్ళుమూసుకుని దివ్యదృష్టితో అంతా తెలుసుకున్నవాడై ఇలా చెప్పాడు యముడికి. "యమధర్మరాజా! నీవు ఎంతో కాలంగా నరకంలో విధి నిర్వహణలో నిమగ్నమైపోయి భూలోకంలో ఏం జరుగుతోందో గమనించకుండా వచ్చావు. దాని ఫలితమే ఇది." నడుస్తూ వెళ్ళి మొదటి పాపి దగ్గర ఆగి చెప్పడం కొనసాగించాడు. "భూలోకంలో ఎండలు మండిపోతున్నాయి. భూతాపం పెరిగిపోయి సంవత్సరమంతా ఎండాకాలమే జరుగుతోందిప్పుడు భూలోకంలో. ఆ ఉక్కపోత, ఎండలతో పోలిస్తే నీ శిక్షలొక లెక్క కాదు. ఇకపోతే ఈ రెండవ పాపి. ఇతడిది గుంటూరు. గుంటూరు దేనికి ప్రసిధ్ధమో చెప్పు?" "మిరపకాయలకు" చెప్పాడు యముడు. "ఇంకా?" "గోంగూరకు, పొగాకుకు." "ఇవన్నీ కొన్ని శతాబ్దాల కిందట. ఇప్పుడు గుంటూరు దోమలకు ప్రసిద్ధి. ఒక్కసారి గుంటూరు వెళ్ళి చూసిరా అక్కడ దోమలు ఏపరిమాణంలో ఉంటాయో! పుట్టినదగ్గరినుంచీ ఏనుగులంతేసి దోమలతో కుట్టించుకుంటూ పెరిగినవాణ్ణి, దోమల నేపధ్య సంగీతం లేకుండా నిద్రపట్టని ఈమనిషిని నీ కత్తులూ బల్లేలూ ఏమీ చెయ్యలేవు”. "మరి ఈమూడోవాడి సంగతి?" అడిగాడు యముడు. "అది అర్థమవ్వాలంటే అలా ఒక్కసారి కిందకు చూడు" అన్నాడు నారదుడు. జనంతో కిక్కిరిసిపోయి నిండు గర్భిణిలా వెళుతోంది ఓ సిటీ బస్సు. ఒకపక్కకు బాగా ఒరిగిపోయి దాదాపు పడిపోయే స్థితిలో వెళుతున్న ఆ బస్సును చూసిన యముడు ఆశ్చర్యపోయాడు. "వారంతా ఆఫీసులకు, కాలేజీలకు వెళుతున్న నగర పౌరులు. ఇది కూడా చూడు" అన్నాడు నారదుడు, ఇక్కడ జనం రైల్లోకి ఎక్కడానికి తోసుకుంటున్నారు. రైలు పూర్తిగా నిండిపోయి మనుషులు వేళ్ళాడుతున్నా ఇంకా జనాలు ఎక్కడానికే ప్రయత్నిస్తున్నారు. "వీళ్ళంతా పండగలూ, పబ్బాలకు తమ తమ ఊళ్ళకు వెళుతున్న ప్రయాణీకులు. చివరిగా ఇటోసారి చూడు." అది ఒక ప్రసిధ్ధ పుణ్య క్షేత్రం. క్యూ లైన్లలో ఇసకేస్తే రాలనంతగా కిటకిటలాడుతున్నారు భక్తులు. వీళ్ళు చాలనట్లు వేచియుండే గదుల్లో మరెంతో మంది తమ వంతుకోసం నిరీక్షిస్తున్నారు. "వీరంతా దైవదర్శనంకోసం వచ్చిన భక్తులు. ఇంకా తమ అభిమాన నటుడి చిత్రం చూడటానికో, ప్రతినెలా రేషను సరుకులు సంపాయించటానికో, పిల్లలకు బళ్ళో సీటు సంపాయించటానికో ఇలా ఏదో ఒకదానికై జనసమ్మర్దంలో ఈదేవాళ్ళే అందరూ" అన్నాడు నారదుడు.

"అయితే వీరిని శిక్షించగల పధ్ధతులేవీ లేనే లేవా స్వామీ?" అడిగాడు యముడు. "ఎందుకులేవూ, తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడూ ఉంటాడన్న సామెత ఊరికే పుట్టలేదు. ఒక్కసారి భూలోకం సంగతులన్నీ తెలుసుకుని కొంచెం కొత్తగా ఆలోచించావంటే ఇట్టే చిక్కుముడి వీడిపోతుంది. దీన్నే మన భూలోక వాసులు డబ్బా బయటి ఆలోచనగా(out of the box thinking) వ్యవహరిస్తుంటారు." అని ఉపదేశించి మాయమైపోయాడు నారదుడు. యముడికి కర్తవ్యం గుర్తుకొచ్చింది. ఒక్కసారి కళ్ళుమూసుకుని దివ్యదృష్టితో చూశాడు. ఏంచేయాలో అర్థమవగానే ఆయన పెదవులమీద విజయగర్వంతో కూడిన మందహాసం ప్రత్యక్షమైంది. తిరిగి మొదటి పాపి వద్దకు వెళ్ళి శిక్షను మార్చి చెప్పసాగాడు "చిత్రగుప్తా, ఇతడిని కళ్ళూ చెవులూ మూసుకోనివ్వకుండా బంధించి, సకల కళా బీభత్సుడూ, ప్రేక్షక భయంకరుడూ అయిన సుమన్ బాబు సృజించిన కళాఖండాలన్నిటినీ ఒక్కోటీ లక్ష సార్లు చూపించండి" శిక్ష వివరించటం పూర్తి కాగానే గుమిగూడిన పాపులందరిలోనూ కలకలం బయలుదేరింది. శిక్ష విధించబడ్డవాడు దడుచుకుని విరుచుకు పడిపోయాడు. తన అంచనా తప్పనందుకు సంతోషిస్తూ యముడు రెండవ పాపి శిక్ష వివరించనారంభించాడు "ఇతడిని ఒక చర్చా కార్యక్రమానికి ప్రయోక్తగా నియమించి, ఆ చర్చకు భూలోకాన్నుంచి గంగాభవాని, నన్నపనేని, విజయశాంతి, రోజాలను ఆహ్వానించి, రచ్చ(చర్చ)ను నిరాటంకంగా పదివేల ఏళ్ళు జరిపించండి." రెండవవాడు లబలబలాడుతూ ప్రాధేయపడనారంభించాడు. పాపుల హాహాకారాలు మిన్నుముట్టాయి. మూడోవాడిని చూస్తూ కొనసాగించాడు యముడు. "ఇతడిని లక్ష్మీ టాక్ షో-లక్ష్మికి తెలుగు అధ్యాపకుడిగా నియమించండి". అదిమొదలు నరకలోకవాసులకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. తిరుగుప్రయాణంలో నారదుడు మళ్ళీ నరకం మీదుగా వెళుతూ పూర్వంలాగే ఆక్రందనలతో, హాహాకారాలతో దద్దరిల్లుతూ ఉన్న ఆలోకాన్ని చూసి సంతృప్తిగా నిట్టూర్చాడు.