గాలి జనార్ధనరెడ్డిగారు ముఫ్ఫై కిలోల బరువైన వజ్రాల కిరీటం స్వామివారికి బహూకరించారట. ఆహా ఎంత కనులపండువగా వుందండీ, చూట్టానికి రెండు కళ్ళూ సరిపోవటంలేదంటే నమ్మండి. దీనితో స్వామివారికి ఏడు కిరీటాలు పూర్తయ్యాయట. వారికి ఎన్నో కిలోల బంగారం కూడా వుందట. ఈనాడు వాడు రాశాడండీ.
కానీ ఒక్కటే అర్థంకావట్లేదు మన జనార్థనరెడ్డి గారు సమర్పించింది వారి సొంత డబ్బా లేక ప్రజల డబ్బా? ప్రజల డబ్బైతే అక్షరాలా 45కోట్లు ఆవిధంగా ఖర్చుపెట్టే హక్కు సారుకెవరిచ్చారు? సొంత డబ్బైతే వాటికి లెక్కా, పత్రమూ వుండాలిగా(అహ వున్నయ్యో లేదో నాకు తెలియదండీ, వున్నాయా అని అడుగుతున్నా అంతే) పైగా వారి సొంత కార్యక్రమానికి అసెంబ్లీ సమావేశాలకొచ్చినట్లు అంతమంది కర్ణాటక మంత్రులెందుకు విచ్చేసినట్లో దొరగారివెంట(అసలీ గ్యాంగుని చూసే అది ప్రభుత్వ కార్యక్రమమేమో అని అనుమానమొచ్చింది సుమండీ నాకు).
ఇంకో సందేహం! అసలెప్పుడైనా ఆ ఏడుకొండలవాడు దిగివచ్చి నాకు కిరీటం చేయించండి, నాకు వజ్రాల నగలు చేయించండి అని చెప్పాడంటారా? మన పిచ్చిగానీ చెపితే గిపితే మనలాంటోళ్ళకెందుకు చెపుతాడండీ మీరు మరీనూ. ఏ అమితాబచ్చన్ కల్లోకో, జనార్ధనరెడ్డికల్లోకో వచ్చి శలవిస్తాడుగానీ!! సర్లేండి, అయినా మీకూ నాకూ చెపితే మాత్రం ఏం చేయించగలమండీ మన మొహం. వాళ్ళయితే ఆపధ్ధతే వేరు. ఓ కే, అంతంత డబ్బుపెట్టి నగలూ అవీ చేయించే బదులు వాటిలో కనీసం పదో వంతు ఖర్చు పెట్టి ఏవైనా మంచి పనులు చెయ్యవచ్చుగదా అనిపిస్తోందా మీకు? హవ్వ! కళ్ళుపోతై చెంపలేసుకోండి యమార్జెంటుగా. ఎదో ఒహ నలభయ్యయిదు కోట్లు పెట్టాడని గాలిని ఆడిపోసుకుంటున్నాం మనం కానీ అసలు అన్నన్ని విరాళాలు పొందుతున్న టి.టి.డి వాటన్నిట్నీ ఏం చేస్తోందో మీకేమయినా తెలుసా? బావుంది నన్నే ఎదురు అడుగుతారేమండీ? నాకు తెలియకేకదా మిమ్మల్నడుగుతా?
అబ్బ కాదండీ, కళ్యాణ మండపాలు వ్యాపారమండీ, అవి సేవలెలాగవుతై? వేద పాఠశాలలా? అవి కొంతమందికే అందుబాటులో వుండేవే మరి? ఏంటీ అన్నదానమా? కొండపైనే కాదు కదండీ ఆకలిగొన్న అభాగ్యులుండేది? అదేదో మరో నాలుగుచోట్ల కూడా చెయ్యొచ్చుకదండీ స్వామి తనకి వంద కిరీటాలు చేయించినంత ఆనందిస్తారు. ఎండా వానా చలీ లెక్క చెయ్యకుండా స్వామి దర్శనానికొచ్చే భక్తులకి సత్రాల్లాంటివి మరిన్ని కట్టించొచ్చు కదండీ?
అసలు మన్లోమనమాట రోజూ భక్తులేసే కానుకల్లో ఎన్ని సక్రమంగా స్వామివారికి చెందుతున్నయ్యంటారు? ఏంటి నువ్వేసే బోడి వంద రూపాయలకి అక్కడో మనిషిని పెట్టి నీకు రసీదిచ్చే ఏర్పాటు చెయ్యమంటావా అనకండి. అంతా గాలిగారి అంతటివాళ్ళుండరు కదండీ? నాలాంటి వాళ్ళ జనాభాయే ఎక్కువ మనదేశంలో. మరామాత్రం తెలుసుకోవాలనిపిస్తుందీ వెర్రి మనసుకి. తెలీదా? సర్లేండి మిమ్మల్ని మరీ ఇబ్బంది పెడుతున్నట్లున్నాను.
అద్సరేగానీ మా వీధి చివర ఈమధ్య కొత్తగా వెంకటేశ్వరస్వామి గుడి కట్టారండీ. స్వామి అచ్చు తిరపతి వెంకన్నలాగున్నారంటే వెళ్ళి చూసొచ్చాను. మీరు నమ్మరుగానీండి, ముమ్మూర్తులా అదే విగ్రహం. అప్పుడే నాకింకోటనిపించింది. ఇలాంటి దేవుణ్ణే చూట్టానికి ఎక్కడో అల్లంతదూరంలో తిరపతికెళ్ళి, వసతి దొరక్క రోడ్డు మీద పడుకుని, నాజీ శిబిరాల్లాంటి క్యూ కాంప్లెక్సుల్లో మగ్గి ఇవన్నీ అవసరమంటారా? ఇక్కడే ఈస్వామికే మనసారా దణ్ణంపెట్టుకోవచ్చుకదా? దేవుడెవరైనా ఒక్కడే కదండీ? ఏంటేంటి ప్రశాంతతా? ఆధ్యాత్మికతా?? పవిత్రత కూడానా??? హమ్మో హమ్మో ఇంకాపండే! ఇవన్నీ తిరపతిలో ఇంకా వున్నాయని మీరనుకుంటున్నారా బాబయ్యా? మన్లో మనమాట మీరు మనదేశంలో అడుగెట్టి ఎన్నేళ్ళయిందండీ? మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తున్నానా? సరే వుంటానండీ, మీరు తిరపతి నించొచ్చాక కలుస్తా.
16 comments:
ఆ తిరపతి ఎంకన్న "గాలి"ని, "దిక్కు" పాలకుల్ని ఎగా దిగా చూసే రోజొచ్చిందండీ ....చా నిజమా ! నమ్మరాండీ - అదిగో వీరభోగ కర్పూర వసంతరాయలు గుర్రమెక్కి వస్తున్నాడండీ...ముష్టిలో ముష్టిని వీర ముష్టి...మరి దానాల్లో, దానం - సమర్పణలో సమర్పణ ఏమిటో మీరే నిశ్చయించాలండీ......"వెంకన్నా - ఎలాగూ నీ పెళ్ళి పెడాకుల్లాగా వున్నది, నా పెళ్ళికి వచ్చి కొంచెం కాగడా చూపించు" అన్నట్టు ఉన్నదండీ ఈ తతంగమంతా.... అయినా ఊర్లో పెళ్ళికి ఉరుకూ, ఇంట్లో పెళ్ళికి ఇరుకూ కదండీ....అలానే ఉంటుందండీ "గాలి", "గోలి", "నాడా", "కాడా" వారి సంగతి...అదండీ మరి ఇంతే సంగతులు చిత్తగించవలెను...
mee blog caption super :-)
chala baga rasarandi... ainaa aa vivaralanni manaboti vallaki evaru cheptaru lendi!!
మీరిలాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేసేస్తే చాలా ఖష్టమేనండీ మరి! మొత్త టపా మొత్తం మీద ఎన్ని సార్లు లెంపలు వేసుకున్నానో తెలుసాండీ?
సిగరెట్లు, మందులు, జూదాలు, దొడ్డిదారిన అమ్మే టికెట్లు, సేవలు,VIP లకు స్పెషల్ ట్రీట్మెంట్లు, గాడిద గుడ్లు..ఇవన్నీ కళ్ళారా చూశాక పాపం ఇంకా ఆయన కొండమీద ఉన్నాడనే మీరనుకుంటున్నారాండీ?
బ్లాగగ్ని గారూ, ఛంపేశారు పొండి! సుపర్బ్ అనే మాట చాలా చిన్నదనుకోండి!
ణారాయణ నారాయణ..
వెంకన్న ఇపుడు కోటీశ్వరులకీ, సెలెబ్రిటీలకీ మాత్రమే అందుబాటు లో ఉన్నాడు.
మీరు చెప్పింది అక్షరాల నిజం. ఆ గోల లో, తొక్కిడి లో, తిరుమల వెల్లడం శుద్ధ దండగ. మనసు ఉసూరుమనడానికే ఆ కొండకి పోయేది.
ఐనా ఎందుకు వెళ్తాం? అంతే! అదే విష్ణుమాయ!
ఫణిగారు,,
నా మనసులో ఉన్న ప్రశ్నలన్నీ ఎలా చెప్పారండి. నాకైతే తిరుపతి అంటే ఎవరిని తందామా అన్నంత కోపంగా ఉంది. దాని బదులు మా ఇంటి దగ్గరలో ఉన్న వేంకటేశ్వరుడుకే దండం పెట్టుకుంటున్నా.. పాపం ఆ వెంకన్న కూడా ప్రభుత్వ హయాములో కెళ్లిపోయాడు. ఎలా చెప్తే అలా వినాలి. ఏది తొడుక్కోమంటే అది తొడుక్కోవాలి. ఎప్పుడు దర్శనీమయమంటే అప్పుడు ఇవ్వాలి. జాలేస్తుంది నాకైతే.. :(
TTD ఉద్యోగుల్లో ఎంతమంది సరిగ్గా డ్యూటీ చేస్తున్నారో ఆ వెంకటేశ్వరుడే కనిపెట్టలేడనుకుంటా! ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఎవడో ఒక దళారి 'ఆఫర్లతో' కలుసుకుంటాడు. దర్శనం నుంచీ, లడ్డూలవరకూ! సర్వదర్శనంలో నిలబడ్డవారికి దిక్కుండదు గానీ సాక్షాత్తూ స్వామి వారికి ఎదురూగ్గా వెళ్ళాలని వచ్చే ప్రముఖులకు మాత్రం ఎదురుండదు. కొండమీద కాటేజీలు లాడ్జీల్లా మారినా, "సకల" పదార్ధాలూ, వస్తువులూ అక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నా, బషీర్ బాగ్ అతిథిగృహంలో రాసలీలలు జరిగినా స్వామి వారేమీ అనరు. కళ్యాణ కట్ట దగ్గర క్షవరం చేసేవారు డబ్బు నిలబెట్టి వసూలు చేసినా పర్లేదు.పదినిమిషాల స్నానం కోసం కాటేజీకి వంద రూపాయలు తీసుకునే వారు కళ్యాణకట్ట లోనే ఉన్నా ఓకే! లడ్డూలు ఎవరికెన్ని కావాలో అన్ని తరలిపోతున్నా ఓకే!
ఇంతా చేసి గర్భగుడిలో ఆడ పోలీసులు /మగ గార్డులు "ఏంటి ఈయన్ని చూసేది, నడవండి"అన్నట్లు ఈడ్చిపారేస్తారు, వచ్చినోడు వీవీఐపీ అయితే తప్ప! దర్శన భంగం, అవమానం, శారీరక శ్రమ,ఆశాభంగం ఒకే క్షణంలో లభ్యం! తిరుపతి యాత్ర సంపూర్ణం!
జ్యోతి గారు చెప్పినట్లు స్వామి వారే దేవస్థానం ఆధీనంలో ఉన్నపుడు ఎవరేం చేస్తార్లెండి!
వంశీ గారూ మీరు నన్ను తిట్టారో లేక గాలిగారిని తిట్టారో అర్థం కాలేదు. ఏదేమైనా వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలు :)
స్వాతి గారు, పానీపూరీ గారు - కృతజ్ఞతలు.
సుజాత గారు - టపా నచ్చినందుకు సంతోషం. ఆవేశమంతా ఈ రకంగానన్నా కక్కేసి ఏదో బరువు దించుకోవటం తప్పితే ఈ విషయంలో మనం చెయ్యగలిగేది పెద్దగా ఏమీలేదండీ.
sujata గారూ - అవును. ఏటికేడాదీ రద్దీ పెరుగుతూనే వుంది. భక్తి పెరిగిందో పాపాలు పెరిగి పాపభీతి పెరిగిందో వెంకన్నకే ఎరుక.
జ్యోతి గారూ - మీరూ నాటైపే అని తెలిసి సంతోషం కలిగింది. చాలావరకూ ఇలాంటి కారణాలవల్లనే నేను గత నాలుగేళ్ళుగా తిరుపతి వెళ్ళలేదు(అంతకుమునుపు నా చిన్నతనంనించీ అయిదేళ్ళ క్రితం వరకూ దాదాపు ప్రతీ ఏడూ వెళ్ళేవాళ్ళం కుటుంబసమేతంగా)
జ్యోతి గారు - దేవుడే దేవస్థానం చేతిలో బందీ.. బావుంది. మీరు కూడా ఇలాంటి టపానే రాసారని గుర్తు. మీరు తిరుపతి వెళ్ళకూడదని ఆ టపాలో ఒట్టు పెట్టుకున్నారు.
సుజాత గారు - మిగతా విషయాలు చూసీ చూడనట్టుగా (ఇంకేమీ చెయ్యలేక) వొదిలేసినా ఈ నెట్టేయడం, తోసేయడం, భక్తుల పట్ల అమర్యాదకరంగా (అమానవీయంగా) ప్రవర్తించడం, దానికి రద్దీ ని నియంత్రించడమనే లెజిటిమసీ - వొళ్ళు మండించేలా చేస్తుంది. ఇంకో విష్ణుమాయ ఏమిటంటే, భక్తులంతా, ముసలీ ముతకా తేడా కూడా లేకుండా, ఆ గుంపులో సమిష్టి గా తోసేసుకుంటూ ఉంటారు. అక్కడికెళ్ళగానే ఒక్కోక్కరికీ పూనకం వచ్చేసి, తోసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. తిరుపతి వెళ్ళకూడదని
లెంపలేసుకుంటూనే వెళ్తూనే వుంటాం. ఇదే మన బలహీనతా, వాళ్ళ (తి.తి.దే. వారి)బలం (!)
బ్లాగాగ్ని గారు - బావుంది. సగటు హిందూ భక్తుని బాధలివి. దేవుడు కావాలంటే, డబ్బో, అధికారమో ఉండక తప్పదిపుడు.
మిమ్మల్ని తిట్టానని ఎందుకనుకుంటున్నారో చెబితే ఆ వీరభోగ వసంతరాయలికి చెబుతా...ఆ తర్వాత ఆయన ఇష్టం, మీ అదృష్టం..... :)
గుర్రపు డెక్కల శబ్దాలు వినిపిస్తాయో, తాళు(లు)కుట్టనమే జరుగుతుందో, పదఘట్టనే మారుమ్రోగుతుందో, పదాతిదళ సంరంభమే కనిపిస్తుందో ... :)
నాయనా బ్లాగాగ్ని,
నా లెక్కలు నాకే చెప్పడం లేదు. నువ్వు అడిగితే ఎలా నాయనా. అయినా నీకు ఒక దేవ రహస్యం చెప్తాను విను. అసలు నా కస్టాలు అన్నీ మీ భక్తుల వల్లనే, ఎమంటారా, మరి మీరే కదా ప్రతిదానికి విష్ణుమాయ అని నన్ను ఇరికించింది. ఇదంతా ఆ కుబేరుడు విని నిజమంగానే నేను ఏదో మాయ చేస్తున్నాను అనుకొని ఎక్కడ తనని మొసం చెస్తానో అని భయపడి తన అనుచరులని నా మీదకి పంపాడు. వాళ్ళే తి.తి.దే ఉద్యోగులు. ఇక ఈ పెద్ద పెద్ద ధనవంతులకు ప్రత్యేక దర్శనాలు అవి ఇవి అంటావా మరి వాల్లందరూ కుబేరుడి(వాల్లంతా ఒకే పార్టీ) ప్రత్యేక రెకమండేషన్ పత్రము తో వచ్చినారు కదా తప్పదు. ఇక రాజకీయ నాయకులు అమ్మో వీళ్ళకి ఎదురు తిరిగితే ఇంకేమైనా ఉందా! ప్రభుత్వ భూమి లో ఉంటున్నానని నా గుడి కూలగొట్టించి నాకు నిలువ నీడ లేకుండా చెయ్యరూ. భలే వాడివే మనం ఇప్పుడు భారత రాష్ట్రపతి లాగా అన్నమాట. దీవెనలు ఇవ్వడానికే గాని అసలు పవర్ వీటో చెయ్యబడంది.
ఇట్లు
శ్రీ వేంకటేశ్వర స్వామి(కలియుగ దైవం),
తిరుమల తిరుపతి దేవస్థానం(ప్రస్తుతానికి),
ఆంధ్రప్రదేశ్(విడిపొతే రాయలసీమ),
భారతదేశమ్.
మేము కూడా ఐదేళ్ల క్రింద వరకు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లేవారం. ఇప్పడైతే వెళ్లాలంటేనే విరక్తిగా ఉంటుంది. ఆ దేవుడే అవినీతి పరులను తన చుట్టు పెట్టకున్నాడు. ఇప్పటి చైర్మన్ ని చూస్తే నాకైతే చాలా కోపంగా ఉంది. అసహ్యంగా కూడా. ఈ పదవి ఇస్తానంటేనే టిడిపిలో ఉండి కాంగ్రేసుకు సపోర్ట్ చేసాడు. ఈ మధ్య వైకుంఠ ఏకాదశిరోజు ఒకవైపు భక్తులు గొడవ చేస్తున్నా.. నాకేంటి అని ప్రముఖులను స్వాగతించడంలో మునిగిపోయాడు. అసలు భక్తులే ఈ సమస్యను పరిష్కరించగలరేమో. ఇలాటి సంఘటనలు జరిగినపుడు ధర్నాలు, నినాదాల కంటే ఆ అవినీతి పరులను పట్టుకుని తంతే సరి. రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపులకు చేసే ధైర్యముంటుంది కాని ఇలాటి వాటిలో ఎందుకుండదు. ఎవరినో అనేముందు , మనమేం చేస్తున్నాము, చేయగలము అని ఆలోచించాలి. ఒక్కరు చేయలేకున్నా , సమిష్టిగా చేయలేనిది ఉందా??
ఫణి గారు, మీరింకానూ. కిరీటం స్టేటస్ సింబలండీ బాబు. కిరీటం పెట్టుకోవటం కాదు, చేయించటం. అయినా, గాలి సోదరులు ప్రజలందరికీ టోపీలు పెట్టి, తనివి తీరక, స్వామి వారికీ కిరీటం పెడదామని సరదా పడి మొక్కు తీర్చుకుంటే, మధ్యన మనకేంటండీ.
ఇంకో వార్త. "గాలి" సోదరులకు సమాజ సే(షే)వ మీద గాలి మళ్ళిందట. కడపలో ఓ ఐరన్ ఫాక్టరీ 3000 కోట్ల పెట్టుబడితో పెడతారట. "కడప" ఎందుకంటారా? స్వామి వారి "గడప" అదే కదండీ!
ఫణి గారూ,
మంచి చర్చ తీశారు. ఆందరి అభిప్రాయాలు, వ్యాఖ్యలూ చదివాక నాకనిపించింది, మనమందరమూ భక్తితో కొలిచే శ్రీ వేంకటేశ్వరుని గురించిన ఒక చక్కటి వీడియో ని అందరితో పంచుకోవాలని. ఈ వీడియో క్లిప్ 1970 దశకం మొదట్లో వచ్చిన వెంకటేశ్వర వైభవం చిత్రంలోది అనుకుంటాను (జగ్గయ్యగారి వ్యాఖ్యానం వినిపిస్తుంది). యూ ట్యూబ్ లో దొరికింది ఈ వీడియో క్లిప్. మనం యెప్పుడూ చూడనటువంటి/చూడలేని అద్భుత పూజా ప్రక్రియ ఈ వీడియోలో చూడవచ్చు. ఈ కింది లంకే నొక్కండి:
http://rapidshare.com/files/254779230/YouTubeTirumalaTirupatiSriVenkateswaraSwamiVariAbhishekam_toVCD.mpg
నా ఉద్దేశ్యంలో, తిరుపతి తిరుమల దేవస్తానం మొత్తాన్ని ఏదైనా ఒక ఇస్కాన్ లాంటి సంస్థకు అప్పగించాలని, ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి ఈ నిర్వహణ మరొక సంస్థకు ఇస్తూ పొవలి. ఇలా ఇవ్వటం నిర్ణయాన్ని దేశంలోని ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు మాత్రమే చెయ్యాలి, రాజకీయనాయకులు, ప్రభుత్వం వారి ఆధిపత్యం ఉండకూడదు. ఆలయ నిర్వాహణ, భక్తుల బాగోగులు చూడటం తదితర విషయాల గురించిన ఒక డిగ్రీ కోర్సును టి డి డి వారే మొదలుపెట్టి, అందులో ఉత్తీర్ణులైనవారికి మాత్రమే టీ డీ డి లో ఉద్యోగం ఇవ్వాలి. వారిని నియమించటం భక్తులు, ధార్మిక సంస్థల ప్రతినిధులతో కూడిన కమిటి మాత్రమే చెయ్యాలి. ఆ ఉద్యోగం కూడ రెండు సంవత్సరాల కాంట్రాక్టుగా ఉంచాలి, వారి పనితీరు నిస్పక్షపాతంగా పరిశీలించినమీదట మాత్రమే మరొక్క రెండు సంవత్సరాలకు పొడిగించాలి. మంచి పనితీరు చూపించి, భక్తులను ఆదరిస్తున్న ఉద్యోగులకు మాత్రమే పర్మెనేంటు చెయ్యాలి. వారిమీద ఫిర్యాదులు వచ్చి అవి నిజమని నిర్ధారణ అయ్యిన వెంటనే ఉద్యోగంలోంచి తొలగించాలి. ఇలా కొన్ని రెఫాంస్ చెస్తే ఆ ఆలయ నిర్వాహణతీరు మారి, అందరం అక్కడకు వెళ్ళి భక్తి పారవశ్యం పొందవచ్చు. లేకపొతే కొన్నాళ్ళకు అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేని పరిస్తితి రావచ్చు.
శివరామప్రసాదు కప్పగంతు
బెంగొళూరు, భారత్
మీ మెయిల్ అడ్రస్ పంపండి మీకు సమన్లు పంపాలి
మనవాల్లంతావున్నగుంపుకు రమ్మని
durgeswara@gmail.com
శివ గారి సూచనలను పాటిస్తే మంచి మార్పు వస్తుంది. భక్తి స్థానే వ్యాపారం చోటుచేసుకుంది. భక్తి , దైవ చింతన , పాపభీతి లేని వాళ్లకు అధికారం ఇస్తున్నారు. హిందుయేతరులకు ఏరకమైన అధికార , ఉద్యోగ, వ్యాపార అవకాశాలు లేకుండా చేసినప్పుడే తిరుమల పవిత్రత కాపాడబడుతుంది అని నా అభిప్రాయం.
Post a Comment