Friday 16 November, 2012

నామక'రణం'

నా బాల్య మిత్రుడు శ్రీధర్‌కి బాబు పుట్టిన సందర్భంగా వాడిని కలిసి అభినందనలు తెలుపటానికి నిన్న సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళా. ఏదో సమస్యకు పరిష్కారం కనుగొనాల్సినవాడిలాగా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు వాడు నేను వెళ్ళేసరికి. పలకరింపులయ్యాక విషయమేంటని నేను ప్రశ్నించేలోపే వాడే అడిగేశాడు.

"పదకొండో రోజున మా వాడికి పేరు పెట్టాలిరా. మంచి పేరేదైనా సజెస్ట్ చేస్తావా కొంచెం".

నేనసలే అపరిచితుడి టైపు. అంటే భయంకరమైన శిక్షలూ అవీ వేస్తుంటానని కాదు, మల్టిపుల్ పర్సనాలిటీ అన్నమాట. నేనే సలహా ఇవ్వాలన్నా నాలోని వివిధ వ్యక్తులు దాన్ని రకరకాల కోణాల్లోంచి శోధించి, చీల్చి చెండాడనిదే నేనొక నిర్ణయానికి రాను.

మొదటగా నాలోని గీతాచార్యుడు నిద్ర లేచాడు. "నాయనా పార్థా! నేను చెప్పేది సావకాశంగా విను".
"ఈ పార్థుడెవరురా? నా పేరు శ్రీధర్"
"షటప్. అలా మొదలెడితేనే గానీ భగవద్గీత ఎఫెక్టు రాదు నాయనా. అడిగినదానికి మాత్రమే సమాధానం చెప్పు. నీ పేరు నీ భార్య తరఫు బంధువులెంతమందికి తెలుసు నాయనా?"
"మా అత్తగారు, మామగారు తప్ప మిగతా అందరికీ నేను హారిక భర్తగానే పరిచయం స్వామీ" అన్నాడు శ్రీధర్. వాడు కూడా గీత మూడ్‌లోకి వచ్చేసినట్లున్నాడు. హారిక వాడి భార్య పేరు.
"మంచిది. మరి మీ అపార్ట్మెంట్‌లో?"
"నేనెప్పుడో పొద్దుననగా వెళితే రాత్రిగ్గానీ ఇంటికి రాను స్వామీ. మా ఆవిడే ఎక్కువ ఫేమస్ ఇక్కడ. నన్ను హారిక భర్తగానే ఎక్కువమంది గుర్తిస్తారు."
"బాగుంది. చివరగా ఇది చెప్పు. మీ ఆఫీసులో పరిస్థితి ఏమిటి?"
"కొన్నాళ్ళ క్రితం వరకూ మా టీం వాళ్ళకు మాత్రమే నా పేరు తెలుసు స్వామీ. కానీ మొన్నామధ్య మా ఆవిడ అదేదో వంటల ప్రోగ్రాము, బంగారం గెలుచుకునే ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేసి పిచ్చి డాన్సులేసి రచ్చ రచ్చ చెయ్యడంతో ఆఫీసంతటికీ ఫలానా ఆవిడ భర్త అని తెలిసిపొయ్యింది."
"సూపరు. దీన్నిబట్టి నీకేం అర్ధమవుతోంది నాయనా? నీ స్మార్ట్ ఫోనులో ఎన్ని ఫీచర్లున్నప్పటికీ కొంతకాలానికి రెడ్ మరియు గ్రీన్ బటన్లను మాత్రమే ఎలా వాడటం మొదలెడతావో, మగవాడికి పెళ్ళికి ముందు ఎంత పెద్ద/కొత్త పేరైనా ఉండవచ్చుగానీ పెళ్ళయిన తరువాత ఫలానా ఆవిడ భర్తగా మాత్రమే పిలువబడతారు. అనివార్యమగు ఈ విషయము గూర్చి ఆలోచించ వలదు. కొత్త పేరు, కొత్త పేరు అని టైం వేస్ట్ చేసుకొనవలదు."

గీతాసారం శ్రీధర్ బుర్రకెక్కినట్లుగానే కనపడుతోంది. కాసేపాలోచించి బుర్ర గోక్కుని భయంగా అన్నాడు "కానీ కొత్త పేరు ఆర్డరు హారికది గురూ". ఒక భార్యా విధేయుడిని మరొక భార్యా విధేయుడుకాక ఇంకెవరు అర్ధం చేసుకోగలరు. వెంటనే గీతాచార్యుడిని బజ్జోపెట్టి నాలోని సనాతనవాదికి ఫోన్ చేశా.


"ఒక పని చెయ్యి, విష్ణు సహస్రనామాల పుస్తకం తిరగెయ్యి. బోలెడన్ని మంచి పేర్లు దొరుకుతాయి."

"ఆగాగు తండ్రీ! హారికవి ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయీ విషయంలో. పేరు మూడు లేక నాలుగు అక్షరాలకు మించి ఉండకూడదు. అది ఇంతకుముందు ఎవరూ పెట్టుకోని పేరై ఉండాలి. నోరు తిరగని పదాలు పేరుగా పెట్టకూడదు వగైరా, వగైరా" అన్నాడు శ్రీధర్.

సనాతనవాదికి నాక్ఔట్ పంచ్ పడింది. నాలో ఉన్న ఆధునిక/అభ్యుదయ వాది విజృంభించాడు ఈసారి.

"చైనా వాళ్ళు పిల్లలు పుట్టగానే ఏదైనా గిన్నో తపేళానో కింద పడేసి ఆ వచ్చిన సౌండుని బట్టి పేర్లు పెడతారుట. ఆ పధ్ధతి ఇంతవరకూ ఇండియాలో ఎవరూ ట్రై చేసినట్లు రుజువుల్లేవు. ఒక్క దెబ్బతో రెండు పిట్టలన్నట్లు ఒక కొత్త ట్రెండ్ సృష్టించినట్లుగానూ ఉంటుంది" అన్నాను. 

శ్రీధర్ కళ్ళు మెరిశాయి. ఉత్సాహంగా ఒక్క ఉదుటన లేచి లోపలికి వెళ్ళాడు, వాళ్ళ సూపర్ పవర్ ఆమోదముద్ర వేయించుకోటానికి. కొన్ని క్షణాలు భారంగా గడిచాక "ఢన్ టిన్ ఢాంగ్" అని పెద్దగా చప్పుళ్ళు వినబడ్డాయి.

నా హృదయం కృతజ్ఞతతో భారమయిపోయింది. సలహా తీసుకోవడమే కాకుండా దానికి విలువనిచ్చి వెంటనే అమలు చేసే ఇలాంటి స్నేహితుడు ఎంతమందికి దొరుకుతాడు? నెమ్మదిగా బయటకు వస్తున్న శ్రీధర్‌ను కౌగిలించుకుని వీలయినంత ఎమోషనల్‌గా చెప్పాను "థాంక్స్ రా మామా". వాడు కోపంగా చూసి నన్ను విదిలించుకుని అన్నాడు "చాల్లే వెధవ్వేషాలు. చచ్చు సలహా ఒకటి ఇచ్చింది చాలక". అప్పుడు చూసాను, కారు మబ్బుల్లోంచి అప్పుడప్పుడే బయటపడుతున్న చందమామలాంటి వాడి లేత బట్టతలమీద ఉన్న మూడు బొడిపెలను. జరిగిందేమిటో అర్ధమయ్యింది.

వాతావరణం తేలికపరచటానికి ఒక వెర్రి నవ్వు నవ్వి అన్నాను "సిస్టర్‌కి ఈ అయిడియా నచ్చినట్లు లేదు. పోనీ ఒక పని చెయ్యి. ఏదైనా తెలుగు పదం, అది క్రియా పదమో విశేషణమో అయినా పర్లేదు, తీసుకుని దాని చివర నకారపు పొల్లు తగిలించి ..." అంటుండగా, శ్రీధర్ అడ్డుపడి "ఆగాగు, ఆ అయిడియా ఏదో తెలుగులో ఏడువు, నీ మాటలొక్క ముక్క కూడా అర్థం కావడంలేదు" అన్నాడు.

"నీ ఇంగ్లీష్ మీడియం బుర్రకర్థమయ్యేట్లు చెప్పాలంటే నాతరం కాదు కానీ, మచ్చుకి కొన్ని పేర్లు విసుర్తా విను - అనుమాన్, సమ్యమన్, అవరోహ్, పురోగత్ - లాంటివి".

శ్రీధర్ ముఖంలోకి కొత్త వెలుగొచ్చింది. మళ్ళీ హైకమాండ్ దగ్గరికి పరిగెత్తాడు. అలా పోవటం పోవటం అరగంటగ్గానీ బయటకు రాలేదు. వస్తూనే ఒక కాగితాల బొత్తి నాచేతిలో పెట్టి చెప్పాడు నీరసంగా "ఇవన్నీ నువ్విప్పుడు చెప్పిన మోడల్లో మా ఇంటి చుట్టుపక్కలవాళ్ళు, బంధువులు వాళ్ళ పిల్లలకు పెట్టిన పేర్లట. నా చెయ్యి పడిపోయ్యేట్లు రాయించింది. నీ సలహా బాలయ్యకు చివరి హిట్టొచ్చిన నాటిదంత పాతదని చెప్పమంది"

ఆ కాగితాల బొత్తిని చూశా, చెప్పొద్దూ, కొన్ని పేర్లు నా ఇమాజినేషన్ని మించి ఉన్నాయి, అంధకార్, పాద రక్షక్, ఢమరుక్, రక్త పింజర్ లాంటివి చూస్తే ఆ పేర్లుపెట్టిన తల్లిదండ్రులకు దణ్ణం పెట్టాలనిపించదూ మీకు మాత్రం?


ఇక లాభం లేదు, అభ్యుదయవాదిని అర్జెంటుగా అవతలకు తోలేసి ఆఖరి అస్త్రంగా నాలోని క్రైసిస్ మేనేజరైన ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకర్‌ను ఆవాహన చేశా. ఏమైనా శ్రీధర్‌గాడికి థాంక్స్ చెప్పుకోవాలి. ఇంతకాలం సరైన గుర్తింపుకు నోచుకోని నా మల్టిపుల్ పర్సనాలిటీలన్నిటికీ వీడు మంచి మేత అందిస్తున్నాడు.

ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకర్ వెంటనే పనిలోకి దిగిపోయాడు.

"ఇలాంటి పరిస్థితుల్లోనే కాస్త కొత్తగా ఆలోచించాలి. ఒక బ్రహ్మాండమైన అయిడియా. ఆయుర్వేద మందుల పేర్లు ఒకసారి చూడు, మనకు పనికొచ్చేదేమైనా ఉండొచ్చు."

"నాకొక్క మందు పేరుకూడా తెలియదు. నీకేమైనా తెలిస్తే చెప్పు" అన్నాడు శ్రీధర్ వాడి అజ్ఞానాన్ని బయటేసుకుంటూ.

"ఓకే, ఇదెలా ఉందో చెప్పు 'వరాహోచ్చిష్ట గోరోజన మంజరి'. అబ్బాయి పేరు కాబట్టి చివర్లో మంజర్ అంటే సరిపోతుంది."

"బానే ఉన్నట్లుందిగానీ నోరు తిరగటంలేదు. హైకమాండ్ ఆమోదం పొందటం కష్టం." రిజెక్ట్ చేశాడు శ్రీధర్.

మళ్ళీ తనే అందుకుంటూ "మర్చిపోయాన్రోయ్ చెప్పడం. ఇందాక లోపలికి వెళ్ళినప్పుడు ఇంకొక కండిషన్ ఆడ్ అయ్యింది. ఫ్యూచర్లో మావాడు ఏ అమెరికాలోనో, ఆఫ్రికాలోనో ఉద్యోగం వెలగబెడతాడు కదా. అక్కడ ఇంటిపేరు వెనుక తగిలించుకోవటం సంప్రదాయం కాబట్టి అందుకు అనుకూలంగా ఉండేటట్లు ఏదైనా ఐడియా ఆలోచించాలి మనం."

"ఓహ్, అదెంత పని. ఒక సినిమాలో హీరో తన ఇంటి పేర్లోని మొదటి అక్షరాన్ని తన అసలు పేర్లోని మొదటి అక్షరాన్ని కలిపి తన షార్ట్ నేంగా వాడతాడు. మనం ఇంకాస్త వెరైటీగా మీవాడి అసలు పేరులోని మొదటి అక్షరాన్ని, మీ ఇంటిపేరులోని చివరి అక్షరాన్ని తీసుకుని షార్ట్ చేద్దాం. మీ ఇంటిపేరు ఎదురొడ్డి కదా,  ఇప్పుడు ఉదాహరణకి, చెన్నకేశవ ఎదురొడ్డి, జనార్ధన ఎదురొడ్డి , నరసిమ్హా ఎదురొడ్డి, మురళీధర్ ...."

ఎందుకనో తెలియదు, సడెన్‌గా మావాడి ముఖం జేగురు రంగులోకి తిరిగింది. ముక్కుల్లోంచి చెవుల్లోంచి వేడి పొగలు వస్తూండగా అరిచాడు "ఆపరొరేయ్, ఆపు, ఆపు, ఆ............పూ".

నాలోని ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకర్ హర్ట్ అయ్యాడు. ఇంత మంచి ఉపాయం చెప్పినవాడిని ఇలాగేనా నిరుత్సాహపరచడం?

విసురుగా లేచాను. "నేనిచ్చే ఆఖరి సలహా ఇదే. పదోతరగతి తెలుగు మీడియం జీవశాస్త్రం పుస్తకం తీసుకుని ..."

"తెలుగు! తెలుగు!!"

"అదేలే, టెంత్ క్లాస్ తెలుగు మీడియం బయాలజీ బుక్కు తీసుకుని వెతుక్కో, అకశేరుక్, పరపరాగ్ లాంటి చాలా పదాలు దొరుకుతాయి" కసిగా చెప్పేసి బయటికొచ్చాను.

వారం తరువాత నామకరణానికి పిలుపొస్తే సతీసమేతంగా వెళ్ళాను. నా శ్రీమతి తెగ ఉత్కంఠ పడిపోతోంది, ఏ కొత్తపేరు పెట్టబోతున్నారో అని. బారసాల తంతు చివర్లో శ్రీధర్ నావంక ఓరగా చూస్తూ గట్టిగా ఎనౌన్స్ చేశాడు "ఈ పేరు పెట్టటానికి హెల్ప్ చేసిన ఫ్రెండ్‌కి చాలా థాంక్స్. అతని సహాయంతో మేము పెడుతున్న పేరు సరీసృప్".

అక్కడున్నవాళ్ళలో దానికర్ధం తెలిసిన ఒకరిద్దరు పెద్దలు ఢామ్మని పడిపోయారు. మిగతావాళ్ళంతా శ్రీధర్ చుట్టూ చేరి అభినందిస్తున్నారు.

భోజనాలయ్యాక తిరిగి వస్తూ నా శ్రీమతి అంది "భలే కొత్త పేరు కదండీ! ఆ ఫ్రెండ్ ఎవరోగానీ నిజంగా గ్రేట్. మనకూ ఒక బాబో, పాపో పుడితే పేరు పెట్టడానికి ఆయన సలహానే తీసుకోవాలి".

Thursday 2 August, 2012

మీ పేట కూ.......క్ oట

మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం - ఈ సమయం ఇరవయ్యేళ్ళ క్రితం, నలభై లేక అరవై ఏళ్ళ క్రితం ఎలావుండేదో తెలియదుగానీ ఇప్పుడు మాత్రం ఇది మనకున్న లక్షా తొంభై ముదనష్టపు ఛానెళ్ళు ప్రసారం చేసే ముష్టి వంటలని ఇంట్లోని ఆడవాళ్ళు నోరు తెరుచుకుని చూసే సమయం. అలాంటి పన్నెండు గంటల సమయం లో ప్రసారమయ్యే ఒక వంటల కార్యక్రమం, కెమెరామాన్ స్వగతంతో కలిపి మీకోసమే ప్రత్యేకంగా.
                                       ********
టైటిల్ గ్రాఫిక్ అయిపోగానే బుల్లితెర మీద యాంఖరి ప్రత్యక్షమై వాగటం మొదలు పెట్టింది "నమస్కారం. గజిని చానెల్లో టెలికాస్ట్ అయ్యే "మీ పేట కూ.......క్ oట" కార్యక్రమానికి స్వాగతం. మీకు తెలుసు చాలా డేస్‌గా ఈ ప్రోగ్రాం దేశాలు పట్టుకు తిరుగుతూ ఇప్పుడు అమెరికాలోని అడుక్కుంటాన్ నగరానికొచ్చింది. ఇప్పుడు ఈనగరంలో మనకు ఎవరు వంటచేసి పెడతారో అడుక్కుందాం రండి". కాసేపు కెమెరాలో అడుక్కుంటాన్ నగర వీధుల్ని చూపించాక, మళ్ళీ యాంఖరి పళ్ళికిలిస్తూ చెప్పసాగింది "వావ్, మొత్తనికి మనకు వంట చేసి పెట్టటానికి ఒక టేల్గూ ఫామిలీ దొర్‌కింది. ఇప్పుడు వాల్లింటికే ఎల్దాం రాన్‌డి."

కట్ చేస్తే, ఒళ్ళంతా దిగేసుకున్న ఒక నగల దుకాణం ఓనరిణి స్లోమోషన్‌లో యాంఖరి చేతికి ఒక వేపమండల కట్టలాంటిది ఇచ్చి స్వాగతం చెప్తోంది. సందేహాల్రావైన మన కెమెరామాన్‌కి అదేంటో అర్థం కాక జూం చేసి చూస్తే మొత్తం కట్టలో ఎక్కడో రెండు గడ్డిపూలు కనిపించాయ్.

కెమెరామాన్ స్వగతం : "ఓహో, ఇది బొకే అన్నమాట"

యాంఖరి ఇక మొదలెట్టింది "నమస్కారం అండీ, మీ పేరు చెబుతారా" ఓనరిణి చెవుల్దాకా సాగతీసి నవ్వుతూ, కెమెరా వైపు తిరిగి చెప్పింది "హాయ్, దిస్ ఈజ్ డాకిని బజ్జి". యాంఖరి కాస్త కన్‌ఫ్యూజ్ అయ్యి రహస్యంగా ఓనరిణి చెవిలో చెప్పింది "మీరు చేసే వంట పేరు తర్వాత చెబుదురుగాని, ముందు మీ పేరు చెప్పండి". ఓనరిణి అదే నవ్వు మొహంతో కెమెరాలోకి చూస్తూ చెప్పింది "నా పేరు మందాకిని, ఇంటిపేరు బజ్జి. యూ.ఎస్ వచ్చాక మోడ్రన్‌గా ఉండాలని ఎం.దాకిని బజ్జి అని పిలిపించుకోవటం మొదలుపెట్టాను. అమెరికన్స్‌కి నోరు తిరక్క డాకిని బజ్జి అని పిలవటం మొదలుపెట్టారు. అలా నాపేరు డాకిని బజ్జి అయిపోయింది".

కె.స్వ. : "అర్థం తెలియకపోయినా ఈ అమెరికన్లు నీకు సరైన పేరే పెట్టారు."

అంతా విన్న యాంఖరి ఆనందభాష్పాలు రాలుస్తూ "వావ్ సో నైస్ అండీ, మీ నేం స్టొరీ. ఇక మనం వంట స్టార్ట్ చేద్దామా? మీరు చేసే వంట పేరు చెఫ్ఫండి" అన్నది. డాకిని తన చేతిలో సిధ్ధంగా ఉంచుకున్న కాగితం తీసి పైకి చదివింది "కాకరకాయ చీరి మిరియాలపొడి కూరి నూనెలో దేవి పంచదార వేసి చింతపండు కలిపి పాలు పోసి కూర"

కె.స్వ. : ఓసి నీయమ్మ కడుపు కాల. నువ్వు వంట పేరు చెబుతున్నావా లేక దాంట్లో వాడే పదార్ధాల లిస్టు చదువుతున్నావా. అందుకా చీటీలో రాసుకొచ్చావ్,

యాంఖరి ఆనందభాష్పాలు ఆగటంలేదు "వావ్! వింటూంటేనే నోరూర్తోందండీ. అయితే వంట మొదలుపెట్టేముందు ఒక చిట్కా తెలుసుకుందాం"

కెమెరా మరో యాంఖరి మీదకు ఫోకస్ అయ్యింది. "అందరికీ ఉబలాటంగా ఉంటుంది కదండీ, మనమెంత గట్టిపిండమో తెలుసుకోవాలని. మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇలా చెయ్యండి. పొద్దున్నే లేవగానే అరికాళ్ళకి అరిచేతిమందాన ఆముదం రాసుకుని తడినేల మీద అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తండి. మొదటి రోజు మీకేంకాకపొతే రెండో రోజూ ట్రై చెయ్యండి. రెండో రోజూ బానే వున్నారా, ముచ్చటగా మూడో రోజు ప్రయత్నించండి. ఇంకా ఏమీ కాకపోతే మీరు నిజంగా చాలా గట్టి పిండం. వెంటనే మాకు జి.పి అని టైప్ చేసి ఎస్.ఎం.ఎస్. చెయ్యండి, మా వంటల ప్రొగ్రాంలో చేసే వంటలు రుచి చూసే ఉద్యోగం మీలాంటి వారికోసమే ఎదురుచూస్తోంది." 

"వెల్కం బ్యాక్ టూ "మీ పేట కూ.......క్ oట" ఇప్పుడు ఈ కూర ఎలా చెయ్యాలో డాకిని గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు." కెమెరా డాకిని మీదకు ఫోకస్ అయ్యింది. డాకిని గొంతులో నవరసాలూ పలికిస్తూ "ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి" అని చెప్పి అగ్గిపెట్టె తీసింది. అది చూసిన యాంఖరిణి ఎక్సయిట్‌మెంటుతో దాదాపుగా జుట్టుపీక్కుంటూ అరిచింది "వావ్, మీకు యూ.ఎస్.లో మాచ్‌బాక్సెస్ దొర్‌కుతాయా అండీ, మాకు ఇండియాలో ఇవి చాలా రేర్." డాకిని విచారంగా చెప్పింది "అవునండీ, టూ యియర్స్ బ్యాక్ యూ.ఎస్. కీ రావ్‌డాన్‌కి ముందూ ఇండియాలో ఇంకా టూ స్టోన్స్ మధ్యలో కాటన్ పెట్టి కొట్టి స్టవ్ ఆన్ చేసేవాళ్ళు. ఇంకా డెవలప్ అవ్వ్‌లేదన్నమాట."
"ఎలా అయినా మీరు చాలా ఎడ్వాన్స్‌డ్ అండీ" అంది యాంఖరి ఆరాధనగా చూస్తూ

కె.స్వ. : (యాంఖరిని ఉద్దేశించి )ఆపెహే ఎదవగోల. నువ్వు  దాని వీపెంత గోకినా అది నీకు ఇక్కడ ఉండటానికి స్పాన్సర్ చెయ్యదు. సోదాపి పంజూడు.

కాసేపటి తర్వాత ... డాకిని కూర కలియబెడుతూ మాట్లాడుతోంది "ఇలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్స్ చేసాక కాసేపు మూత్పెట్టి ఉడ్‌కనివ్వాలి" డాకిని ఛాన్సివ్వకపోవటంతో యాంఖరి చాలాసేపట్నించీ ఏం మాట్లాడలేదేమో, వెంటనే జంప్ చేసి అందుకుంది "మూతి పెడితే కాలదా అండీ??"

కె.స్వ. : మూతి పెట్టటం కాదే ముష్టి మొహమా. మూత పెట్టటం.

మొత్తానికి కూర సిద్ధం అయ్యింది. డాకిని ఫినిషింగ్ టచ్ ఇస్తూ చెబుతోంది "ఇదండీ మన 'కాకర ..... పోసి కూర' ఇలా దీన్ని సెర్వింగ్ బౌల్‌లోకి తీస్‌కుని సెర్వ్ చేసేముందు గాడిదపాలతో గార్నిషింగ్ చేసుకుంటే టేస్ట్ అదురుతుంది." యాంఖరికి అప్పటికే చాలాసార్లు వావ్ అని అరిచీ అరిచీ గొంతు బొంగురుపోవటం వల్ల ఇంక అరిచే ఓపిక లేక అక్కడే ఉన్న డాకిని పిల్లలిద్దరిని టేస్ట్ చెయ్యడానికి పిలిచింది. వాళ్ళల్లో చిన్నవాడు పరీక్షగా గిన్నెలోకి తొంగి చూసి చెప్పాడు "ఛీ, యాక్, దిస్ ఈజ్ లుకింగ్ లైక్ షిట్. ఇది నేను తినను". పెద్దవాడు చిన్నవాడి చెవిలో రహస్యంగా చెప్పాడు "హే బ్రో, తినొచ్చు పర్లేదు. ఇది మామ్మ్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన డిష్. మామ్మ్ తను చేసిన అసలు డిష్‌ని వెనకాల దాచిపెట్టింది. ఈ యాంఖర్ ఆంటీ ప్రోగ్రాం చివర్లో చీర ఇవ్వకపోతే ఆమెతో ఆ డిష్ తినిపిస్తానని ఇందాక డాడ్ కి చెబుతుంటే విన్నాను" అంతా విన్న యాంఖరికి కాళ్ళూ చేతులూ చల్లబడ్డాయి. ఎందుకైనా మంచిదని చీర పాకెట్టు ముందుగానే పైకి తీసి ఉంచింది. 

కె.స్వ. : తిక్క కుదిరింది. ఆ చీర ఎవడైనా ఎత్తుకుపోతే బాగుండు.

యాంఖరి డాకినిని అడిగింది, "ఈ కర్రీ మీరెవరిదగ్గర నేర్చుకున్నారండీ?" డాకిని గర్వంగా చెప్పింది "ఇంకెవరు, మా అమ్మ. ఆవిడ కాకరకాయ కూర మొదట్లో అందరిలాగే మామూలుగానే చేసేది. తర్వాత్తర్వాత మా నాన్న మీద కోపం వచ్చినప్పుడల్లా ఇలా చేతికందిన ఒక కొత్త ఇంగ్రీడియెంట్ అందులో ఆడ్ చేస్తూ పోయేది. మా నాన్న పైకిపోయే నాటికి మీరిప్పుడు చూస్తున్న ఈకర్రీ తయారైంది."

కె.స్వ. : పాపం పిచ్చి మానవుడు. ఎలా తట్టుకున్నాడో అంత హింసని. గాడిద పాల దగ్గరికొచ్చేటప్పటికి ఇక భరించలేక టపా కట్టేసుంటాడు.

యాంఖరి అందుకుంది మళ్ళీ, "ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసిన డిష్ న్యూట్రిషన్ వ్యాల్యూస్ తెల్స్‌కుందాం. దీన్‌కోసం, ఇండియాలోని మన న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ అండ్ మన షెఫ్  గారు వీడియో కాంఫరెన్స్‌లోకి వస్తున్నారు " టి.వి. తెరమీద ఒక ఆడ ఒక మగ ప్రత్యక్షమయ్యారు. ఆడావిడ జుట్టు కత్తిరించేప్పుడు మీద పడకుండా వేసుకునే కోటులాంటిది వేసుకుంది. ఇక షెఫ్ గారికి అదేదో విఠలచార్య సినిమాలో దయ్యాలకు తొడిగినట్లు ఒళ్ళంతా
తెల్లటి బట్టలు తొడిగి,  తెల్ల టొపీ పెట్టి,  చేతులకు తెల్లటి గ్లోవ్స్ వేశారు. మొహానిక్కూడా బాగా సున్నమేసినట్లు మెరుస్తోంది.

న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ అందుకుంది. "డాకిని గారూ, మీరు వారం క్రితం చేసి ఫెడెక్స్ లో పంపిన కూర పార్సెల్ ఇప్పుడే మాకందింది. మీ వంట అదుర్స్. దీనిలో చాలా డిఫెరెంట్ డిఫెరెంట్ ఇంగ్రీడియెంట్స్ ఆడ్ చేశారు మీరు. కాకరకాయ వల్ల మీకాల్రెడీ ఉన్న పిచ్చి ముదురుతుంది. మిరియాలపొడి వల్ల షార్ట్ టెంపర్ పెరుగుతుంది. లాస్ట్‌లో మీరు కలిపిన గాడిద పాలు మీ వంశ వృధ్ధికి, సారీ, మీ రక్త వృధ్ధికి పనికొస్తాయి"

షెఫ్ గారి వంతొచ్చింది. ఆయన కాస్త కొంటెగా చూస్తూ మొదలెట్టారు "నే చెప్పాలనుకున్నది మేడం గారే చెప్పారు అయినా ఒక్క విషయం చెబుతాను. డాకిని గారూ, మీ వంటలో విచిత్రం చూసారా? ఈ కూర చేసి వారం అయినా దీనికింకా బూజు పట్టటం, వాసన రావటం జరగలేదు. మీరు నిజంగా గ్రేట్ అండీ."

కె.స్వ. : బాక్టీరియా కూడా భయపడి చచ్చుంటుంది ఆ కూర తింటానికి.

యాంఖరి అందుకుంది "చూశారు కదండీ ఈనాటి మీ పేట కూ.......క్ oట కార్యక్రమాన్ని. మరి మేం మీ ఇంటిక్కూడా వచ్చి మీరు చేసే కూ...క్ oట టి.వి. లో చూపించాలంటే ఇప్పుడే ఎస్.ఎం.ఎస్. చెయ్యండి."

ఆ తరువాత తెచ్చిన చీరని డాకిని మొహానకొట్టి - అదే - డాకినికి బహుమతిగా ఇచ్చి, ఒక వందమంది మందగా చేతులూపుతూ బై చెబుతూంటే కార్యక్రమం ముగిసింది.