Wednesday, 18 November, 2009

రీయూనియన్ -3 (నా మొదటి సస్పెన్స్ కథ)

ఏం చెయ్యాలో ఇద్దరికీ పాలుబోలేదు. పోలీసులేమో మామాట నమ్మటంలేదు. ఇక అక్కడుండి చేసేదేమీలేనందువల్ల నెమ్మదిగా పోలీస్ స్టేషన్ బయటికొచ్చాం. మమ్మల్ని వెంబడిస్తున్నవాళ్ళ జాడలేదు. ఎటు వెళ్ళాలా అని ఆలోచించుకుంటూండగానే ఎదురుగా ఒక పోలీస్జీప్ వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఇన్స్పెక్టర్ని చూడగానే మాలో ఏమూలో ఆశ మళ్ళీ చిగురించింది. ఆయన దగ్గరికివెళ్ళి మాగోడంతా మళ్ళీ వినిపించాం. మనిషి శాంతస్వభావుడనుకుంటా, విసుక్కోకుండా అంతా విని "ఆ బంగళా ఎక్కడుందో చూపించగలరా?" అనడిగాడు. ఆ ఆలోచన మాకింతవరకూ తట్టనందుకు మమ్మల్ని మేమే తిట్టుకుని జీపెక్కి బంగళాకి దారితీశాం. ఆశ్చర్యకరంగా బంగళాలోగానీ తోటలో గానీ నరమానవుడెవ్వడూ లేడు సరిగదా అప్పటికి రెండు మూడు గంటల క్రితం వరకూ అక్కడొక పార్టీ జరిగిందన్న ఆనవాళ్ళు కూడా ఏమీ కనిపించటంలేదు. ఈ దెబ్బకి ఇన్స్పెక్టర్ కూడా మమ్మల్ని అనుమానిస్తాడేమో అని భయపడ్డాం కానీ ఎందుకో అతడు మా మాటలు నమ్మినట్లున్నాడు. ఒక్కసారి బంగళా అంతా కలియతిరిగి పరిశీలించి "ఈ బంగళాలో ఉన్నవాళ్ళ గురించి ఆరా తీయించి వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తాను. ఈలోపు అవసరమైతే మీరు స్టేషనుకు రావాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని రోజులు ఊళ్ళోనే ఉండండి. మా కానిస్టేబుల్ ఒకరిని మీకు రక్షణగా ఉంచుతాను" అన్నాడు. మాకు గుండెలు జారిపోయాయి. దివాకరం మనిషో దెయ్యమో అర్థం కావటం లేదు ఒక పక్క. ఈ పరిస్థితుల్లో ఇంకొన్ని రోజులిక్కడ గడిపితే వాడే క్షణంలో అయినా వచ్చి మీద పడితే? ఈసారి తప్పించుకునే అవకాశం కూడా ఉండదేమో?? ఊహించటానికే భయం వేస్తోంది. దేవుడిపై భారం వేసి ఒప్పుకున్నాం.

మరో విచిత్రమైన విషయం, పల్లెలో సెల్ఫోన్ సిగ్నళ్ళు బాగానే వస్తున్నాయి. తోట బంగళాలో మాత్రమే లేవు. వెంటనే శేఖరానికి ఫోన్ చేశాను. అవతల ఫోన్ మోగుతోంది కానీ ఎవరూ ఎత్తటం లేదు. దాదాపు అరగంటసేపు ఆపకుండా ప్రయత్నించాను కానీ ఫలితం లేదు. విసిగిపోయి ఫోన్ పక్కన పడేశాను. ఫోన్ బహుశా వీడిదగ్గర లేదేమో? నాకు టెన్షన్ తో కాళ్ళూ చేతులూ ఆడటంలేదు. విశ్వం "నేను ప్రయత్నిస్తా కాసేపు" అని ఫోన్ తీసుకుని డయల్ చేసి "ప్చ్! ఇప్పుడు ఎంగేజ్ వస్తోంది" అన్నాడు. అంటే అవతల ఫోన్ దగ్గర ఎవరో ఉన్నారన్నమాట ఇప్పుడు! ఆపకుండా విశ్వాన్ని ప్రయత్నిస్తూనే ఉండమన్నాను. మరో అయిదు నిమిషాలకు మళ్ళీ ఫోన్ మోగింది అవతల. ఈసారి వెంటనే ఎత్తారెవరో, శేఖరం గొంతు కాదది. విశ్వం దగ్గర్నించి ఫోన్ నేను తీసుకున్నాను. వెనకాలంతా చాలా రణగొణధ్వనిగా ఉంది. ఎవరో హిందీలో మాట్లాడుతున్నారు. శేఖరం గురించి అడిగాను. అవతలనుంచి చెప్పిన విషయం నన్ను నిలువునా కృంగి పోయేట్లు చేసింది. శేఖరం ప్రయాణిస్తున్న రైలుకి ఘోర ప్రమాదం జరిగిందట నిన్న రాత్రి. చాలామంది చనిపోయారట. ఈ సెల్ఫోన్ కూడా చనిపోయిన శేఖరం జేబులో ఆగకుండా మోగుతుండటం చూసి ఎవరో సహాయబృందం వాళ్ళు తీసి మాట్లాడారు. ప్రమాదం ఎక్కడ జరిగిందీ, అక్కడికెలా చేరుకోవాలి మొదలైన వివరాలు తెలుసుకుని భారంగా ఫోన్ పెట్టేశా. విషయం తెలిసి విశ్వంకూడా భోరుమన్నాడు.

ఇంతలో మళ్ళీ నాఫోన్ మోగింది. ఎత్తగానే అవతలినుంచి చిన్న నవ్వు వినిపించింది. "దివాకరం?!" అన్నాను నిలువెల్లా కంపించి పోతూ. జవాబుగా అవతలి వ్యక్తి మళ్ళీ నవ్వి "ఫోన్ ఒక్కసారి లౌడ్ స్పీకర్ లో పెట్టండి భాస్కరం గారూ, నేను మాట్లాడేది విశ్వంగారికి కూడా వినిపించాలి" అన్నాడు. ఈ కొత్త పిలుపుకు ఆశ్చర్య పోతూ చెప్పింది చేశా. వెంటనే అతడు మాట్లాడటం మొదలు పెట్టాడు. "భాస్కరం గారూ, విశ్వం గారూ, మీకిప్పటి వరకూ కలిగించిన అసౌకర్యానికి నన్ను క్షమించండి. నేను మీరనుకుంటున్నట్టు దివాకరాన్ని కాదు. దివాకరం ఆత్మని అంతకంటే కాదు. నాపేరు సురేంద్ర. దివాకరం నా తండ్రి. నా పగ కేవలం శేఖరం మీద. మీతో నాకెటువంటి శతృత్వమూ లేదు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు శేఖరం ప్రమాదంలో మరణించాడన్న వార్త ఇప్పుడే నాకూ తెలిసింది. ఇక మీకు నానుంచి ఎటువంటి ఇబ్బందీ ఎదురవదు. మరొక్కసారి నాతరఫునుంచి జరిగిందానికి క్షమాపణలు." ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ విశ్వం అడిగాడు "శేఖరంపై ఎందుకు నీకంత కోపం?"

"కోపమా? హు! కోపం కాదు, పగ, కసి!! మీ ఇద్దరికీ తెలియదు వాడి కారణంగా మా నాన్న బతికుండగా ఎంత క్షోభ అనుభవించాడో? మానాన్న వీడిని ప్రాణ స్నేహితుడని నమ్మితే ఆనమ్మకాన్ని వమ్ము చేసి వెన్నుపోటు పొడిచాడు. ఏ స్నేహితుడూ మరో స్నేహితుడి పట్ల చెయ్యకూడని ద్రోహం చేశాడు. శేఖరం అమెరికా రావడానికి ముందు దగ్గర్లోని టౌనులో ఏదో వ్యాపారం చేసేవాడు. ప్రతీ వారం పల్లెకు వచ్చి నాన్నతో గడిపి వెళ్తూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా మాఇంట్లోనే బస. ఇలా మొదలైన రాకపోకలు నాన్న ఉన్నప్పుడే కాదు లేనప్పుడూ కొనసాగేవి. ఎలా జరిగిందో తెలియదు, మా అమ్మతో వాడి సాన్నిహిత్యం రోజు రోజుకూ పెరగసాగింది. నేను హాస్టల్లో ఉండి చదువుకోవటం, నాన్న తరచుగా ఊరువెళ్ళి రెండుమూడు రోజులదాకా రాకపోవటం కూడా వాళ్ళకు మంచి అవకాశాన్నిచ్చింది. ఈవిధంగా ఎన్నాళ్ళు కొనసాగేదోగానీ శేఖరం అమెరికా ప్రయత్నాలు అనుకున్నదానికంటే త్వరగా ఫలించటం వల్ల దీనికి తెర పడింది. మా నాన్నకు అమ్మంటే ప్రాణం. పెళ్ళి చేసుకున్న నాటినుంచీ ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. ఏనాడూ పల్లెత్తు మాటని ఎరగడు. అలాంటి నాన్నకు ద్రోహం చేసిన ఉసురు అమ్మకు తగలనే తగిలింది. ఆవిడకు కాన్సర్ అని మరెంతో కాలం బ్రతకదనీ తేల్చేశారు డాక్టర్లు. ఆ పరిస్థితిలో కూడా ఆశ చావని నాన్న అమ్మని బ్రతికించుకోవాలని ఎంతో తాపత్రయపడ్డాడు. ఆయన తిరగని ఊరు లేదు, కలవని డాక్టర్ లేడు. ఎంత చేసినా ఫలితం దక్కలేదు. చనిపోయే ముందు చివరి క్షణాలలో అమ్మ నాన్నకు తను చేసిన ద్రోహం గురించి కుమిలిపోయింది. చేసిన పాపం చెబితే పోతుందనుకుందో ఏమో, జరిగినదంతా నాన్నకు చెప్పి క్షమించమని వేడుకుని కన్ను మూసింది. కానీ నాన్నకు ఆరోజునుంచే మొదలైంది అసలైన నరకం. ఎంతగానో ప్రేమించిన భార్య, ప్రాణ స్నేహితుడు కలిసి తనని ఎంతగా మోసం చేశారో తలచుకుని తనలో తనే కుమిలిపోయేవాడు.

కానీ ఎంత బాధ పడుతున్నా ఏనాడూ బయటపడేవాడు కాదు. ప్రతీ వారం హాస్టల్లో ఉంటున్న నాదగ్గరకు వచ్చి నన్ను సినిమాలకూ షికార్లకూ తిప్పేవాడు. అసలు నాన్న తన మనసులో ఇంత బాధను దాచుకున్నాడని నాకెప్పటికీ తెలిసేది కాదు, ఆయన డైరీలు నాకంట పడకపోయి ఉంటే. నాన్న చనిపోయిన తరువాత ఆయన గుర్తుగా కొన్ని వస్తువులు మాత్రం ఉంచుకుని మిగతా ఆస్తులన్నీ అమ్మేసి శాశ్వతంగా ఈఊరునుంచి వెళ్ళిపోదామనుకున్నాను. అలా సర్దుతుంటే కనిపించాయి ఇవి. చదివాక నా రక్తం మరిగిపోయింది. ఎలాగైనా సరే శేఖరం అంతకంతా అనుభవించేట్లు చేసి మా నాన్న ఆత్మకు శాంతి చేకూర్చాలని నిశ్చయించుకున్నా. మా అమ్మ ఎన్నటికీ ఈ విషయం చెప్పదని శేఖరం అనుకుని వుంటాడని తెలుసు. తెలివిగా వాడిని ఇక్కడికి రప్పించి అంతం చేద్దామని పథకం వేశాను. ఎంతో ప్రయత్నం మీద భాస్కరంగారి ఫోన్ నంబరు సంపాదించా. నేను మా నాన్నను చాలావరకూ పోలి ఉంటాను కాబట్టి మిమ్మల్ని కాస్తంత మేకప్ తో నేనే దివాకరం అని చెప్పి సులువుగా మోసగించగలిగాను. మీరూ చాలాకాలం తర్వాత నాన్నను కలవటంవల్ల గుర్తించలేకపోయారు. మిమ్మల్ని నావైపు తిప్పుకోవటానికి వెంకట లక్ష్మి ఉత్తరం గురించి చీకట్లో బాణం వేశాను. శేఖరాన్ని హెచ్చరించకుండా ఉండటంకోసం మీ సెల్ ఫోన్లు పనిచెయ్యకుండా చేశాను. ఇదంతా తర్వాత బయటపడక తప్పదనీ నేను ఖచ్చితంగా జైలుపాలవుతాననీ తెలుసు. అన్నిటికీ తెగించే ఇదంతా చేశాను. కానీ నేనొకటనుకుంటే దేవుడొకటనుకున్నాడు. ఇంతాచేసి వాడిని నాచేతులతో చంపలేకపోయానన్నదే నాక్కాస్త బాధగా ఉంది. ఏమయినా మానాన్న అత్మకి ఈవిధంగా అయినా కాస్త శాంతి చేకూరి ఉంటుంది. ఆ సంతృప్తితోనే సెలవు తీసుకుంటున్నాను." ఫోన్ పెట్టేసిన చప్పుడు. మా ఇద్దరి మనసులూ భారమయ్యాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలని వచ్చి ఇద్దరు స్నేహితులను గురించి నమ్మలేని విషయాలు వినాల్సి వచ్చింది. కంప్లైంట్ వెనక్కి తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ వైపు కదిలాయి మా పాదాలు.

(అయిపోయింది)
(ఇది నా మొదటి ప్రయత్నం. బాగుందనిపిస్తే చెప్పండి. బాగాలేదనిపిస్తే మాత్రం తప్పక చెప్పండి. మీ సలహాలూ, సూచనలకు స్వాగతం.)

18 comments:

siva said...

chala bagundi .... inkontha suspense create cheste bagundedhi ...yendukante ninna ti nunchi nenu di ni kosam wait chesaanu ....

విజయ క్రాంతి said...

కథ మూడవ భాగం లో కాస్త పట్టు తప్పినట్టు ఉందండి.
ఈ మలుపు గురించి రెండో భాగం లో ఎవరో కామెంట్స్ లో రాసారు .

మీరు ఇంకా కృషి చేసి ఇంకా బాగా రాస్తారని అనుకుంటున్నాను

sunita said...

కధ తెలిసిన కధలాగా అనిపించింది,కానీ కధనం బాగుంది.

Sravya Vattikuti said...

ఈ మూడవ భాగాని రెండు గా విడగోతే బాగుండేదోమో అని నా అనుకోలు అంటే "విషయం తెలిసి విశ్వంకూడా భోరుమన్నాడు." ఇక్కడ .

నేస్తం said...

అమ్మొ సస్పెన్స్ కధలు రాయాలంటే కత్తి మీద సామె ..హూం ..ముందే అబ్రకదబ్ర గారు చెప్పడం మూలనో మరి ఏమో మూడవ పార్ట్ మొదటి రెండు పార్ట్ లంత బిగి రాలేదు .. ఈ రెండు రోజులు మాత్రం మీ కధ ఏమై ఉంటుందా అని తెగ ఆలోచించా..బాగా రాసారు మొత్తం మీద :)

VAMSI said...

baagundi...

భావన said...

బాగుందండి. నేను దివాకరం కొడుకేమో అనుకున్నా కాని ఇంకో ట్విస్ట్ వూహించలేదు.. బాగుంది..

అబ్రకదబ్ర said...

సస్పెన్స్ కథలని పార్టులు పార్టులుగా రాసి కామెంట్లు అనుమతించటం వల్ల ఇలాంటి తిప్పలే వస్తాయి :-) పాఠకులు మలుపులు ఊహించే ప్రయత్నాలు చెయ్యటం, వాళ్ల వ్యాఖ్యల ప్రభావంతో రచయిత గందరగోళపడిపోయి ముందనుకున్న కథని అంతో ఇంతో మార్చటం.

మీరూ అలా చేశారో లేదో తెలీదు కానీ, పైన ఒకరిద్దరు అన్నట్లు ఈ మూడో భాగంలో బిగి సడలింది. సురేంద్ర దివాకరం కొడుకే అవటం ముందే ఊహించినదే అయినా, ఆ మలుపు కథని పెద్దగా దెబ్బతీసిందేమీ లేదు. దెబ్బతీసిందల్లా - తన నాటకానికి అతను చెప్పిన కారణాలు. అవంత కన్విన్సింగ్‌గా లేవు.

మొత్తమ్మీద మంచి ప్రయత్నమే. రెండ్రోజుల పాటు మాతో గోళ్లు కొరికించారంటే చిన్న విషయం కాదు. అభినందనలు. ఇలాగా కొనసాగించండి.

మరో మాట. ఈ కథ చెప్పిన విధానం ఏదో అబ్రిడ్జ్‌డ్ వెర్షన్‌లా ఉంది. హడావిడిగా లాగించేసినట్లుంది. దానిమీద దృష్టి పెట్టండి.

వేణు said...

ఈ సస్పెన్స్ కథ మొత్తమ్మీద - బావుందండీ.

మూడో భాగం ‘కాస్త పట్టు తప్పినట్టూ’, ‘బిగి సడలినట్టూ’ అనిపించటానికి కొంతవరకూ - దృశ్యాలను ప్రత్యక్షంగా వర్ణించటం కాకుండా, పాత్రతో చెప్పించటం కారణమనుకుంటాను. అబ్రకదబ్ర గారు చెప్పినట్టు- ‘తన నాటకానికి అతను చెప్పిన కారణాలు అంత కన్విన్సింగ్‌గా లేవు’.


వ్యాఖ్యల ప్రభావంతో- మీరు ముందనుకున్న కథని ఏ కొంతైనా మార్చారా? మీ అనుభవాలేమిటి? వీటిని మరో టపాగా రాయండి!

‘రీ యూనియన్’ అంటూ ఇంగ్లిష్ లో శీర్షిక పెట్టటం సస్పెన్స్ కథకు 'తప్పనిసరి' అనుకున్నారా? :)

బ్లాగాగ్ని said...
This comment has been removed by the author.
బ్లాగాగ్ని said...

శివ గారు - ఇప్పటికే మూడుభాగాలయ్యిందండీ ఇంకా సాగతీస్తే డెయిలీ సీరియల్ అనుకునే ప్రమాదముందని పెట్టిన ట్విస్టులు చాలనుకున్నా :).

విజయక్రాంతి గారు - అవునండీ, మలుపు గురించి కామెంట్లలో ముందుగానే వచ్చేసింది. కానీ అప్పటికే కథ దాదాపు రాసెయ్యటం వల్లా మార్చేంత టైము, ఓపికా లేక ఈసారికిలా లాగించేశా. మరోసారి మెరుగ్గా రాయటానికి ప్రయత్నిస్తా. పట్టు విషయం అంటారా, నేరం నాదికాదు అబ్రకదబ్రది :)

సునీత గారు - ధన్యవాదాలు.

శ్రావ్య గారు - శివ గారికిచ్చిన సమాధానమే మీక్కూడా :)

నేస్తం గారు - ధన్యవాదాలండీ. బిగి - డిట్టో విజయక్రాంతి గారు.

వంశీ గారు - ఓపిగ్గా నా మూడు భాగాలు చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

భావన గారు - ధన్యవాదాలండీ.

అబ్రకదబ్ర గారు - మీ వల్ల నేనొక పాఠం నేర్చుకున్నానండోయ్. ఈసారి నేనిలాంటి కథ రాసేముందు కామెంట్ మోడరేషన్ పెట్టిగాని మొదలెట్ట కూడదని :) మీ కామెంట్లు నాకన్నా మిగతా పాఠకులనే ఎక్కువ ప్రభావితం చేశాయని చెప్పాలి. ఎందుకంటే మీ వ్యాఖ్య చూసేటప్పటికి కథ రాయటం పూర్తయిపోయింది. మీరు ఊహించింది ఒక చిన్న మలుపేగా అని లైట్ తీసుకున్నా :)

వేణు గారు - స్నేహితుల పునః సమావేశాన్ని తెలుగులో ఏమంటారో తెలియక అలా ఆంగ్లానికి ఫిక్సయ్యా. పునస్సంధానము, పునస్సమాగమము అంటే పొరపాట్న వేరే అర్థాలు ధ్వనించొచ్చని కాస్త భయం వేసింది.

బ్లాగాగ్ని said...

అబ్రకదబ్ర గారు, వేణు గారు - మీరన్నట్లు కారణాలు అంత కన్విన్సింగా లేని మాట నిజమే. కానీ అక్కడ ఒక చిన్న చిక్కుంది. శేఖరాన్ని తనంత తానే వచ్చినట్లుగా ఇండియాకు రప్పించాలి. ఏ మర్డరో, రేపో చేసిపారిపోయినవాడు అంత తేలిగ్గా మళ్ళీ తిరిగి రాడుగా? కాబట్టి అతడు చేసిన తప్పు ఎవరికీ తెలియదనే భ్రమలో ఉండాలి అని భావించాను. ఇదే దిశలో మరింత ఆలోచించి ఇంకేదయినా మెరుగ్గా రాస్తే బాగుండేది.

అబ్రకదబ్ర గారు - నేనింకా నిడివి ఎక్కువయ్యిందనే విమర్శలొస్తాయనుకున్నాను. మీరు చెప్పిన పాయింటు దృష్టిలో పెట్టుకుంటాను.

మీరిద్దరి విలువైన సూచనలకు ధన్యవాదాలు :)

అబ్రకదబ్ర said...

నేను కథలకి మాత్రమే కామెంట్ మోడరేషన్ ఎందుకు పెడతానో ఇప్పుడర్ధమయ్యుండాలి :-)

నిజానికి, మీరీ కథ మూడు పార్టులుగా ప్రచురించకపోయుంటే అతను దివాకరం కొడుకే అన్న విషయం పట్టుకోలేకపోయుండేవాడినేమో. రెండో భాగం చదివాక మళ్లీ వెనక్కెళ్లి మొదటిభాగం రెండోసారి చదివితే వెలిగిందా సంగతి. ఏకబిగిన కథ మొత్తం చదివేస్తే ఆ అవకాశం ఉండేది కాదు. ఆ రకంగా చూస్తే మీరా హింట్ ఉండీలేనట్లు తెలివిగా ఇచ్చినట్లే.

ముగ్గురు స్నేహితులనీ అనుమానం కలగకుండా ఒకచోటకి చేర్చే ప్లాన్ వరకూ సురేంద్ర నాటకంలో అసహజత ఏమీ లేదు. కన్విన్సింగ్‌గా లేదు అని నేనన్నది ఆ తర్వాత అతని ప్రవర్తననుద్దేశించి. 'శేఖరాన్ని నా చేతులతో చంపలేకపోయాను' అని బాధపడేవాడు ఆ పని చెయ్యమని భాస్కరాన్నీ, విశ్వాన్నీ భయపెట్టటం, బ్లాక్‌మెయిల్ చెయ్యటం ఎందుకో అర్ధమవదు. వాళ్లతో శేఖరాన్ని చంపించే ఉద్దేశం అతనికి ఏ మాత్రమూ లేనప్పుడు, వాళ్లనలా బెదరగొట్టటం, అంత డ్రామా సృష్టించటం .. అదంతా వాళ్ల కోసం కాక పాఠకుల కోసం అన్నట్లుంది. పాఠకుల్లో ఉత్సుకత రేకెత్తించటానికి చేసిన ఈ ప్రయత్నం రెండో భాగంలో సఫలమయింది కానీ, మూడో భాగం చదివి అసలు విషయం తెలుసుకున్నాక అది అతకలేదనిపిస్తుంది. అదీ సంగతి.

కార్తీక్ said...

బావుందండి నేను ఇదే మొదటి సారిమీ బ్లాగు చదవడం.. మూడు ఒకేసారి చదవాల్సి వచ్చింది.. ఈ సస్పెన్స్ కధనం బావుంది.

www.tholiadugu.blogspot.com

బ్లాగాగ్ని said...

Thanks Karthik garu.

venkatesh Dhanekula said...

story super...........

if u try definitely u will become a very good writer.....

Tirumala Thirlangi said...

Hey Phani...Thanks for sending me your blog link...The first thing I did on your blog was started reading your suspense story...Keep up the good work...good narration...though I felt that last part was some what predictable way...The first two parts are really good....maintained the grip....

kishan said...

ha chala bagundi blogagni garu mee suspense story.i wish u will post a lot in the future.waiting for them!!!!!!!!!