Wednesday, 28 July 2010

ప్రయాణం - 4

నేను వీధినబడి(అనగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణకై రోడ్డెక్కి) దగ్గర దగ్గర దశాబ్దం పూర్తవ్వొస్తోంది. ఈ సందర్భంగా వెనక్కు తిరిగి నా ప్రయాణం ఒక్కసారి నెమరేసుకోవడం, అంతకన్నా ముఖ్యంగా నా ఉద్యోగ పర్వంలోని వివిధ దశల్లో కీలకమనదగ్గ అవకాశాలు కల్పించిన ముగ్గురు స్నేహితులను గుర్తు చేసుకోవడం కోసం ఈ ప్రయత్నం.

అప్పుడొచ్చింది నేనెన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న బ్రేక్. ఈసారి మిత్రుడు చంద్రశేఖర్ రూపంలో. తను బెంగుళూరులోని ఒక పెద్ద కంపెనీలో పనిచేసేవాడు. ఒకరోజు తను ఫోన్ చేసి రెజ్యూమె పంపించమని చెబితే పంపాను. రెండురోజుల తరువాత మొదటి రౌండు, మరో వారంలో రెండో రౌండు పూర్తయ్యాయి. మరుసటి రౌండు త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారుకానీ నెలదాకా ఎలాంటి సమాచారమూ లేదు. దీనిమీద చాలా ఆశలు పెట్టుకున్న నాకు చాలా నిరుత్సాహం కలిగింది. ఇంతకాలం ఎటువంటి జవాబూ రాకపోయేటప్పటికి నేను తిరస్కరించబడ్డాననే అనుకున్నాను. చందు మాత్రం త్వరలో పిలుపు వస్తుందని చెబుతూ వచ్చాడుకానీ నిజం చెప్పాలంటే ఆసమయంలో నాకామాటలు ఏమాత్రం నమ్మకాన్ని కలిగించలేదు. అసలు సంగతి తేల్చెయ్యకుండా తనెందుకనో నానుస్తున్నాడని ఏమూలో అనిపించిన విషయం మాత్రం వాస్తవం. ఇలా ఆశ నిరాశల మధ్య ఊగిసలాడి చివరకు ఈ ప్రయత్నం విఫలమయ్యిందని డిసైడ్ అయిపోయినంతలో ఒకరోజు ఉన్నట్లుండి ఆ కంపెనీ నుంచి ప్రాజెక్ట్ మానేజర్ ఒకాయన ఫోన్ చేసి త్వరలో నన్ను పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరు కమ్మని చెప్పారు. మళ్ళీ ఆశలపల్లకీ భుజాలపైకెక్కింది. చందుకు ఫోన్ చేసి వివరాలవీ చెప్పి మళ్ళీ ఇందాకటి మానేజర్‌కు ఫోన్ చేసి నేను రాగల తేదీ చెప్పేశాను. ఇక అతిపెద్ద పనొకటి మిగిలింది, బాసుతో మాట్లాడి సెలవు సంపాదించడం.

చాలా ఆఫీసుల్లోలాగే మా ఆఫీసులోనూ బాసుకు కొంతమంది గూఢచారులుండేవాళ్ళు. వారిలో ఒకరు నేను చివరగా బెంగుళూరులోని మానేజరుతో ఫోన్ మాట్లాడుతున్న వివరాలు ఎలాగో విన్నాడని తెలిసింది. ఇక కాస్త టెన్షన్ మొదలయ్యింది. బాసుకు అబధ్ధంచెప్పి బెంగుళూరు వెళ్ళొద్దామనుకున్న అభిప్రాయంలో ఉన్నవాడిని అర్జంటుగా ఆప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. చేసేదిలేక బాసు దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేసి సెలవడిగాను. విషయం విన్నాక ఎగిరిపడతారనుకున్న మా బాసు విచిత్రంగా చాలా ప్రశాంతంగా అంతా విని నేను వెళ్ళబోయేది చాలా మంచి కంపెనీ అని, ఇది నాకు చక్కటి అవకాశం అని నాలుగు మంచిమాటలు చెప్పి మరీ సెలవిచ్చారు. రిజర్వేషన్ కూడా పెద్దగా ఇబ్బంది పడకుండానే దొరికింది. ఇన్ని మంచి శకునాల మధ్య నేను మొదటిసారి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులు దాటి బెంగుళూరులో అడుగుపెట్టాను.

ఇంటర్వ్యూ ముందురోజు చందును కలిసినప్పుడు తను నేను దాదాపుగా ఎంపిక అయినట్లేననీ, ఇప్పుడీ ఇంటర్వ్యూలు నామమాత్రమేననీ చెప్పాడు. ఇంటర్వ్యూ ఆదుర్దాతో కొంతా, ఆ భవనాలూ, కార్పొరేట్ వాతావరణమూ, రంగు హంగులూ చూసి మరికొంతా డీలాపడ్డ నాకు మంచి టానిక్‌లాగా పనిచేశాయి ఆ మాటలు. మనసులోనుంచి టెన్షన్ పూర్తిగా ఎవరో చెయ్యిపెట్టి తీసేసినట్లుగా మాయమయిపోయింది. మరుసటిరోజు వరుసగా మూడు ఇంటర్వ్యూలు జరిగితే అన్నీ పూర్తి ఆత్మ విశ్వాసంతో చేశాను. ఫలితం చెప్పడానికి ఇంకా సమయం తీసుకుంటారేమో అనుకున్నానుగానీ సాయంత్రం నా మూడో ఇంటర్వ్యూ పూర్తయిన కాసేపటికి తీపికబురు తెలిసింది. అప్పుడు చెప్పాడు చందు, తను ఇదివరకు చెప్పిన మాటలు నాలో విశ్వాసం కలిగించడానికి చెప్పినవి మాత్రమేననీ నా ఎంపిక తరువాతి ఇంటర్వ్యూలన్నీ చేసిన తరువాతే జరిగిందనీ. నా మానసిక స్థితిని సరిగ్గా అంచనా వేసి సమయస్ఫూర్తితో చందు చెప్పిన ఆ మాటలు నాకు చెప్పలేనంత మేలు చేశాయి. అంతేకాక ఒక టీం వాళ్ళు నన్ను రెండో రౌండ్ వరకు ఇంటర్వ్యూ చేసి ఆపేసి ఎటూ తేల్చకుండా తాత్సారం చేస్తుంటే చందు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మరో టీం వారికి నా రెజ్యూమె పంపించి నన్ను రికమెండ్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూ ఏర్పాటు చేయించిన విధానం అంతా తెలిసి నాకు నోట మాట రాలేదు. ఆవిధంగా బెంగుళూరు ఐ.ఐ.ఎం ఎదురుగా ఉన్న కంపెనీలో నా కార్పొరేట్ జీవితం మొదలయ్యింది.

మామూలుగా తెలుగు సినిమా కథలయితే ఇక్కడితో శుభం కార్డు పడిపోతుంది. కానీ మా వైజాగ్ బాసు ఇంకావుంది అని చూసుకోవటానికి అలవాటుపడ్డ ప్రాణం కావడంతో కథలో ఒక చివరాఖరి మెలిక పెట్టారు. తిరిగి వెళ్ళినతరువాత నన్ను తన చాంబర్లోకి పిలిచి వివరాలు అడిగారు. ఉద్యోగం లభించిన ఉత్సాహంలో ఉన్న నేను ఒక ప్రవాహంలా మొదలుపెట్టి అన్ని వివరాలూ చెప్పుకుంటూ పోతున్నానేగానీ ఆయన అంతా శ్రధ్ధగా వింటూ నేనెక్కడ దొరుకుతానా అని చూస్తున్నట్లు మాత్రం గ్రహించలేదు. ఉన్నట్లుండి నన్ను మధ్యలో ఆపి "అయితే నువ్వు చేస్తున్న ప్రాజెక్టుల వివరాలు కూడా చెప్పావన్నమాట" అని అడిగారు. మామూలుగా ఏ ఇంటర్వ్యూలోనైనా మీరు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టు వివరించమని అడుగుతారు కాబట్టి అందులో నాకేమీ తప్పు కనిపించలేదు. చెప్పానని బదులిచ్చా. అంతే, బాసు అగ్గిరాముడై శివాలెత్తిపోతూ కంపెనీ రహస్యాలను బయటివాళ్ళకు చెప్పినందుకు నన్ను చీల్చి చెండాడటం మొదలుపెట్టారు. మేము పనిచేస్తున్నవన్నీ సాధారణ ప్రాజెక్టులు మాత్రమే, ఏవీ ప్రోడక్టులు కాదు. మా కంపెనీ వ్యాపార రహస్యాలు అవతలివాళ్ళకు తెలిసిపోతాయన్న భయాలేవీ పెట్టుకోవాల్సిన అవసరం లేదక్కడ. నేనిచ్చే వివరణను బాసు ఎంతమాత్రమూ పట్టించుకోలేదు. ఇషాక్‌ను పిలిచి విషయం వివరిస్తే ఆయనా బాసుకు సర్దిచెప్పటానికి ప్రయత్నించారు కానీ బాసు అప్పటికీ శాంతించలేదు. కాసేపటిగ్గానీ బాసు మనసులో ఉన్న అసలు విషయం బయటికి రాలేదు. నేను నా రిలీవింగ్ లెటర్ తీసుకోవాలంటే తెల్ల కాగితం మీద సంతకం పెట్టాలని షరతు విధించారు ఆయన. నాకు దిక్కు తోచలేదు. మిగిలిన సహోద్యోగులకు విషయం చెబితే ఎట్టిపరిస్థితుల్లోనూ అలా చేసి ఇరుక్కోవద్దని సలహా ఇచ్చారు. బాసేమో సంతకం లేకుండా లెటరిచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. అలా ఒక రెండు గంటలు ఇబ్బంది పెట్టిన తరువాత చివరికి ఆయన ఏమనుకున్నారో ఏమో నాక్కావాల్సిన లెటర్లన్నీ సంతకం పెట్టి ఇచ్చేసి తక్షణం ఆఫీసు వదిలి వెళ్ళిపొమ్మని చెప్పేశారు. ఎలాగయితేనేం మెత్తబడినందుకు బాసుకు థాంక్స్ చెప్పుకుని బతుకు జీవుడా అంటూ బయటపడ్డాను.

అదండీ, నా గుండ్రాలు, గుండ్రాలు ఫ్లాష్‌బాక్. అలా నా ఉద్యోగ నౌక ప్రశాంత తీరానికి చేరుకుంది. దానికి సాయం పట్టినవాళ్ళు హెచ్.ఎస్, కిరణ్ మరియు చందు. ఉద్యోగాల పరంగా చూస్తే ఒకరి సాయం గొప్పగా మరొకరిది చిన్నగా బయటివారికి అనిపించవచ్చు. కానీ నాకు సంబంధించినంతవరకూ ముగ్గురిదీ అమూల్యమైన సహాయం, ఎక్కువ తక్కువలు లేనేలేవు. నేనీరోజు ఉన్నస్థితికి ప్రత్యక్ష కారణం ఈ ముగ్గురూ అన్న కృతజ్ఞతా భావం నా మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. థాంక్స్ చెబితే వాళ్ళ స్నేహాన్ని, సహాయాన్ని చిన్నబుచ్చినట్లే అవుతుంది. అయినా నాకింకెలా వ్యక్తం చెయ్యాలో తెలియక ఇలా చెప్పక తప్పటంలేదు "థాంక్స్ రా హెచ్.ఎస్! థాంక్స్ రా కిరణ్!! థాంక్స్ రా చందు!!!"

Saturday, 24 July 2010

ప్రయాణం - 3

నేను వీధినబడి(అనగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణకై రోడ్డెక్కి) దగ్గర దగ్గర దశాబ్దం పూర్తవ్వొస్తోంది. ఈ సందర్భంగా వెనక్కు తిరిగి నా ప్రయాణం ఒక్కసారి నెమరేసుకోవడం, అంతకన్నా ముఖ్యంగా నా ఉద్యోగ పర్వంలోని వివిధ దశల్లో కీలకమనదగ్గ అవకాశాలు కల్పించిన ముగ్గురు స్నేహితులను గుర్తు చేసుకోవడం కోసం ఈ ప్రయత్నం.


నా చదువైపోయి అప్పటికే దాదాపు సంవత్సరం పూర్తవ్వొస్తోంది. ఇక నాకు సరైన ఉద్యోగం దొరకేదేమో అన్న నిస్పృహ నెమ్మదిగా నన్నావరిస్తున్న తరుణంలో అనుకోని విధంగా నాకు సహాయం చేశాడు నా మొదటి మిత్రుడు, హెచ్.ఎస్.శ్రీనివాస్. తనప్పటికే ఒక చిన్న కంపెనీలో చేసేవాడు. వాళ్ళ క్లైంట్కు తెలిసినవాళ్ళు కంప్యూటర్ తెలిసిన కుర్రాళ్ళకోసం వెతుకుతున్నారని తెలిసి, ఆయన్ని బతిమలాడి(ఎం.సి.. వాళ్ళు ఓవర్ క్వాలిఫై అవుతారని ఆయన వద్దన్నా వెంటపడి మరీ) నాకు, మరో రూమ్మేట్కూ(పేరు Ch. అనుకుందాం కాసేపు) ఇంటర్వ్యూ ఏర్పాటు చేయించాడు. ఆవిధంగా పంజగుట్టలోని ఒక ఇన్సూరెన్స్ సర్వీసెస్ కంపెనీలో మూడున్నరవేలతో నా మొదటి అసలు ఉద్యోగం మొదలైంది. ఒకవిధంగా హెచ్.ఎస్. గనుక సమయానుకూలంగా నన్నాదుకోక పోయిఉంటే నేనే డిప్రెషన్లోకో వెళ్ళిపోయి ఉండేవాడిని. తనిప్పించింది చిన్న ఉద్యోగమైనా నైతికంగా నాకది కొండంత మద్దతునిచ్చింది. ఆరకంగా తనది వెలకట్టలేని సహాయం. కొత్త ఉద్యోగం మొదట్లో కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఇన్సూరెన్స్ సర్వేయర్లకు ఉపయోగపడే సాఫ్ట్వేర్ ఒకటి రూపొందించేది మా కంపెనీ అప్పట్లో. మా బాసుకు కంప్యూటర్ పరిజ్ఞానం పెద్దగా లేకపోవడం వల్ల దీని కాంట్రాక్ట్ వేరే కంపెనీకి ఇచ్చివున్నారు. వాళ్ళు ఈయనకు అన్న సమయానికి సాఫ్ట్వేర్ ఇవ్వకుండా తీరా రిలీజ్ చేశాక భయంకరమైన బగ్గులతో రిలీజ్ చేశారు. దానిని మేము టెస్ట్ చేసి చాలావరకూ బగ్గుల్ని కనుక్కుని బాసుతో చెప్పి రిలీజ్ ఆపుచేయించి చాలావరకూ వాటిని ఫిక్స్ చేయించాము. తరువాత ఆయనకు మేము ఎం.సి.. అని తెలిసి సాఫ్ట్వేర్ బాధ్యతలు మొత్తం మాకు అప్పగించారు. అక్కడితో ఆకంపెనీతో మా హనీమూన్ ముగిసి కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే సాఫ్ట్వేర్ పరమ భయంకరమైన డెవలప్మెంట్ వల్ల తుమ్మితే ఊడే ముక్కులా ఉండేది. ఎక్కడ చిన్న మార్పు చేసినా ఏదో మూల కొత్త సమస్యొస్తుండేది. దీనికి తోడు అప్పటికే సాఫ్ట్వేర్ని మావాళ్ళు కొంతమంది గుజరాత్, మహారాష్ట్ర సర్వేయర్లకి అమ్మేశారు. దీంతో రోజూ వాళ్ళదగ్గరినుంచి ఫోన్లు. హిందీ వచ్చని చెప్పిన ఒకే ఒక్క పాపానికి వాళ్ళతో నేనే మాట్లాడి సమాధానపరచాల్సొచ్చేది.

మొత్తానికి ఒక నెలపాటు కిందా మీదా పడి దాన్నొక రూపానికి తెచ్చి కొనుక్కున్నవాళ్ళందరికీ డెలివరీ చేసేశాం. హమ్మయ్య అనుకున్నామో లేదో, మళ్ళీ ఫోన్లు, ఇది పనిచెయ్యట్లేదు అది పనిచెయ్యట్లేదు అని. ఇహ ఇలా కాదని మా బాసు పంపగా నేను, మరో కొలీగ్ గుజరాత్ వెళ్ళి అందరినీ వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, ఏమేం ఇంప్రూవ్మెంట్లు కావాలో అడిగి తిరిగి వచ్చాం. ఈలోపు ప్రాజెక్టు దెబ్బకు అదిరిపోయిన నా మరో స్నేహితుడు Ch. (నాతో పాటు చేరిన వ్యక్తి, ఇతడు చాలా కన్నింగ్ గురూ!) తను టెస్టింగ్ బాగా చేస్తానని బాసుని ఒప్పించి డెవలప్మెంట్ అంతా నా మీద తోసేశాడు. ఆవిధంగా దాదాపు రెండువందల స్క్రీన్లు, తికమక ఇన్సూరెన్స్ కాలిక్యులేషన్లు గల ఒక భారీ ప్రాజెక్టు నా ఒంటరి భుజాలమీద పడింది. కంపెనీలో ఉన్నదే ముగ్గురం, మా బాసు కాకుండా. నేను, Ch., ఇంకొకాయన. ఈమూడోవ్యక్తి మా మానేజర్లాంటివాడన్నమాట. దాంతో నేనూ చచ్చినట్లు ఆభారాన్ని మొయ్యక తప్పింది కాదు. మా బాసు మంచివాడే కానీ కాస్త బి.పి. ఎక్కువ. చిన్న తప్పులని కూడా సహించలేని స్వభావం. రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్లో ఏదైనా సమస్య వచ్చిందని ఫోన్ వచ్చిందంటే మేము(ముఖ్యంగా నేను) చచ్చామన్నమాటే. పైగా .టి. గురించి అస్సలు తెలియకపోవడం వల్ల తప్పులన్నీ డెవెలపర్ అజాగ్రత్త వల్లే వస్తాయనుకునేవాడాయన. కానీ అప్పటికే సాఫ్ట్వేర్ ఆర్.టి.సి. డొక్కు బస్సులా తయారవ్వటం వల్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒకచోట తన్ని నన్ను తన్నించేది. ఇలా రోజు రోజుకూ నా అక్షింతల కోటా ద్విగుణం, త్రిగుణంగా పెరిగిపోతున్న కాలంలో సిలిగురి నుంచి మా బాసుకు స్నేహితుడైన సర్వేయర్ ఒకాయన సాఫ్ట్వేర్లో ఒక మార్పు కోరాడు మా బాసును పర్సనల్గా. మా బాసు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాకు డూ ఆర్ డై లెవెల్లో వార్నింగిచ్చాడు. నేనూ ఒళ్ళు దగ్గిరపెట్టుకునే పని పూర్తిచేశాను. కానీ ఏంచేస్తాం, రిలీజ్ రోజు లేవగానే నా మొహం నేనే అద్దంలో చూసుకొని ఉంటాను, ఒక తప్పు కాలిక్యులేషన్తో సిలిగురి పంపించడం జరిగింది. రెండ్రోజుల తరువాత ఒక సాయంత్రం బాసునుండి ఫోన్, "నేను వచ్చి నీతో మాట్లాడాలి, అప్పటిదాకా ఇంటికి వెళ్ళొద్దు" అని. ఏదో జరిగిందిరా దేవుడా అనుకుంటూ భయపడుతూనే ఒక గంట గడిపాను. బాసు వస్తూనే తప్పు కాలిక్యులేషన్ చూపిస్తున్న రిపోర్ట్ కాగితాలు నా మొహం మీదకు విసిరికొట్టి ఇక మొదలుపెట్టారు స్వచ్చమైన బూతుల దండకం. నేనెందుకు బతికున్నానా అనిపించే లెవెల్లో, ఉద్యోగం కంటే అడుక్కుతినడం మంచిదనిపించే లెవెల్లో ఏకధారగా పావుగంట పాటు ఆఫీసులో అందరిముందూ ఫుట్బాల్ ఆడుకోబడ్డాను. అవమానంతో, రోషంతో బావురుమనడమే తక్కువైన స్థితి. ఇక ఆఉద్యోగం చెయ్యటం నావల్లకాదనిపించింది. ఇంటికి ఫోన్ చేసి సంఘటన గురించి ప్రస్తావించకుండా బాసుతో వేగడం కష్టంగా ఉందని మాత్రం చెప్పేశాను. వాళ్ళూ నాకు మద్దతుగా మాట్లాడటంతో కాస్త ఊరట కలిగింది. వేరేది ఎంత చిన్న ఉద్యోగమైనా సరే చూసుకోవాలని ప్రయత్నాలు ఆరంభించాను.

ఇంతలో మరొకసారి నాకు దేవుడు పంపినట్లుగా మరొక స్నేహితుడు జె.వి.ఎస్.కె.కిరణ్ నుంచి సహాయం లభించింది. అప్పట్లో కిరణ్ విశాఖపట్నంలోని ఒక కంపెనీలో పనిచేసేవాడు. అక్కడ వాళ్ళ బాసు జావా తెలిసిన స్నేహితులెవరైనా ఉంటే రిఫర్ చెయ్యమనడంతో నాపేరు ప్రస్తావించడం, ఆయన నన్ను ఇంటర్వ్యూకు రమ్మనమనడం జరిగాయి. సుడిగుండంలో మునిగిపోతున్నవాడికి ఆలంబన దొరికినట్లయింది నాకు. ఇన్స్టిట్యూట్లో జావా క్లాసులు కూడా చెప్పడంవల్ల వి.బి., జావా రెంటిమీదా బానే పట్టు ఉండేది. ఆధైర్యంతో మరుసటిరోజే విశాఖ రైలెక్కేశాను. Ch. ను ఆఫీసులో ఒక్కరోజు ఏదో ఒక కారణం చెప్పి మానేజ్ చెయ్యమన్నాగాని తను చేస్తాడని నమ్మకంలేదు. అయినా మొండి ధైర్యంతో బయల్దేరాను. ఇంటర్వ్యూ అదీ బాగానే చేశాను. కానీ విశాఖపట్నం బాసుకు కాస్త అనుమానం ఎక్కువ. నేనేమయినా తప్పు చేసినట్లయితే కిరణ్‌దే బాధ్యత అని, దానికి తను సిధ్ధపడితే నాకు ఉద్యోగమివ్వడానికి అభ్యంతరం లేదనీ చెప్పారు. నిజం చెప్పాలంటే నాకెవరైనా అలాంటి పిచ్చి షరతు విధించినట్లయితే మరో ఆలోచన లేకుండా బాధ్యత తీసుకోననే చెపుతా. కానీ కిరణ్ మాత్రం నన్ను నమ్మి నా బాధ్యత తీసుకోవడానికి సిధ్ధపడ్డాడు. ఇక్కడ కూడ నా ప్రతిభ కంటే కిరణ్ చేసిన సహాయమే నాకెక్కువ తోడ్పడింది. నేనెంత బాగా ఇంటర్వ్యూ చేసినా కిరణ్ బాధ్యత తీసుకోనని ఒక్కమాటంటే చాలు నాకా ఉద్యోగం వచ్చిఉండేది కాదు. ఆ విధంగా అందరిముందూ ఫుట్‌బాల్ ఆడుకోబడ్డ నెలలోపు ఆరువేల జీతంతో విశాఖపట్నంలో నా రెండవ ఉద్యోగం ప్రారంభమైంది. ఇక్కడ జీతం ఎక్కువన్న సంతోషం కన్నా హైదరాబాద్ ఉద్యోగం నుంచి తప్పించుకున్న సంతోషం ఎన్నోరెట్లు అధికం అనిపించింది.

కొత్త బాసుకూడా మంచి మనిషే కానీ కాస్త వింత తరహా. ఆయనకు ప్రతీది బెంచ్ మార్కింగ్ చేసి చూసే అలవాటు. కొత్త ఆఫీసులో ఇషాక్ అనే ఆయన ఉండేవారు. ఈయన భలే చురుకు, అద్భుత ప్రతిభాశాలి. నేను కలిసి పనిచేసినవాళ్ళలో ది బెస్ట్ అనదగ్గ వాళ్ళలో ప్రథముడు. సహజంగానే ఈయన ఆఫీసులో బాసు తరువాత అత్యున్నత స్థానంలో ఉండేవారు. కొత్త బాసుకు ఈయన మీద విపరీతమయిన గురి. ఎంతంటే ఎవరే పని చేసినా దాన్ని ఇషాక్ అయితే ఎలా చేస్తారో, ఎంత టైములో పూర్తి చేస్తారో పోల్చి చూసి అవతలి వ్యక్తి సామర్ధ్యాన్ని అంచనా వేసేటంత. జావాలో పని అని ఉద్యోగంలో చేరినా ఆఫీసులో మాత్రం బయటెవ్వరికీ తెలియని ఒక సాఫ్ట్వేర్ మీద పనిచేసేవాళ్ళం. ఈ సాఫ్ట్వేర్ మా ఆఫీసువాళ్ళే రూపొందించినది. కాకి పిల్ల చందంగా మా వాళ్ళ కళ్ళకు ఇది మరో నెక్స్ట్ జెనరేషన్ సాఫ్ట్వేర్‌గా కనిపించేదిగానీ దానిలో చచ్చేటన్ని బొక్కలుండేవి. పైగా ప్రపంచంలో ఎవ్వడూ వాడనిది కావడంతో ఏదయినా ఇబ్బందొస్తే మనలో మనం కొట్టుకు చావడమే కానీ గూగుల్లో కాగడా పెట్టి వెతికినా ఏ సహాయమూ దొరికేది కాదు. ఇలాంటిదాన్ని మిగతా వాళ్ళతో పోలిస్తే అతి త్వరగా నేర్చేసుకుని దానిలో ఒక చిన్న అస్సైన్‌మెంటు కూడా పూర్తి చెయ్యడంతో వైజాగ్ బాసుకు నామీద బానే గురి కుదిరింది. దాంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఇషాక్ కు సహాయంగా నియమించడమే కాకుండా రెండు నెల్ల పాటు వరుసగా కొద్ది కొద్దిగా జీతమూ పెంచారు. పరిస్థితి ఫరవాలేదన్నట్టుగానే ఉందిగానీ ఎన్నాళ్ళిలా అనిపించసాగింది. కెరీర్ ప్రారంభించి సుమారు రెండేళ్ళవ్వొస్తున్నా సరైన బ్రేక్ దొరకలేదు ఇంకా. అప్పటికే మిత్రుల్లో చాలామంది పెద్ద కంపెనీల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. పైగా కొత్త బాసు పాతాయన కన్నా ముక్కోపి. పనిలో చిన్న తేడా వచ్చిందా మనం కేరాఫ్ అడ్రసు రోడ్డే.

Thursday, 22 July 2010

ప్రయాణం - 2

నేను వీధినబడి(అనగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణకై రోడ్డెక్కి) దగ్గర దగ్గర దశాబ్దం పూర్తవ్వొస్తోంది. ఈ సందర్భంగా వెనక్కు తిరిగి నా ప్రయాణం ఒక్కసారి నెమరేసుకోవడం, అంతకన్నా ముఖ్యంగా నా ఉద్యోగ పర్వంలోని వివిధ దశల్లో కీలకమనదగ్గ అవకాశాలు కల్పించిన ముగ్గురు స్నేహితులను గుర్తు చేసుకోవడం కోసం ఈ ప్రయత్నం.



ఇంటికెళ్ళి ఒక పదిరోజులుండి తిరిగి హైదరాబాదొచ్చా. నా క్లాస్‌మేట్స్ లో అప్పటికి ఒక నలుగురు మాత్రమే మంచి ఉద్యోగాల్లో చేరారు. మిగిలినవారిలో చాలామంది నాలాగే ఖాళీ. పైగా దాదాపు అందరూ హైదరాబాదులోనే ఉన్నారు. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్క సందులో నివాసం. ముందు నలుగురే ఉంటామని చెప్పినప్పటికీ ఎప్పుడు చూసినా కనీసం పదిమందికి తక్కువకాకుండా ఉండేవాళ్ళం. అంతా మా స్నేహితులే. సందడికి ఏమాత్రం తక్కువుండేది కాదు. వంట పనికీ, ఇంటిపనికీ, బజారు పనులకీ ఒక చార్టు ఉండేది. ఆరోజు పని ఉన్నవాళ్ళు వండి వారుస్తుంటే మిగతావాళ్ళంతా పేకాడుతూ గడిపేసేవాళ్ళు. సాయంత్రం పూట రామకృష్ణ మఠంలో స్పోకెన్ ఇంగ్లీషులో చేరాం అందరమూ. అరుదుగా ఎక్కడైనా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని తెలిస్తే పొలోమని మంద మందగా పరిగెత్తుకెళ్ళేవాళ్ళం. చాలా కంపెనీల్లో గేటు దగ్గరి సెక్యూరిటీ గార్డు దగ్గరే ఆగిపోవాల్సొచ్చేది. ఇలా ఒక ఆరునెలలు గడిచింది. ఒక రోజు మా స్నేహితుడి స్నేహితుడొకడు వచ్చాడు. వాడికి తెలిసినవాడెవడో ట్యూషన్ సెంటరొకటి పెట్టి ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడట. మనం మాత్రమెందుకు ప్రయత్నించకూడదు అన్నాడు. ఆలోచన బానే ఉందికానీ పెట్టుబడి? అప్పటికే ప్రతీనెలా ఇంటినుంచి తెప్పించుకుంటున్నందుకు అందరికీ సిగ్గుగా ఉంది. మళ్ళీ దీనికోసం ఇంట్లో డబ్బు అడగాలనిపించలేదు, కానీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చెయ్యాలన్న పట్టుదలగా మాత్రం ఉంది. చివరకు ఏదయితే అదయ్యిందనుకుని, మా నెలఖర్చుల్లోంచి తలా సగం తీసి అయిదారుగురు స్నేహితులం కలిసి ఆరువేల రూపాయల పెట్టుబడితో కూకట్‌పల్లిలో 2001 విజయదశమి రోజు మొదలుపెట్టాం, "ఫ్రెండ్స్ స్టడీ సర్కిల్".

కంప్యూటర్ ఇంజనీరింగ్‌లోని ఏసబ్జెక్టుకైనా ట్యూషన్, అలాగే సి, సి++, జావా, విజువల్ బేసిక్ ఇలా ఏలాంగ్వేజీకైనా ట్యూషన్ మా ప్రత్యేకత(!). కరపత్రాలు సిధ్ధమయ్యాయి. తీరా వాటిని రోడ్డు పక్కన నుంచుని పంచాలంటే మాకందరికీ నామోషీ వేసింది! అలా అని డబ్బులిచ్చి ఎవరైనా కుర్రాడిని పెట్టుకుందామా అంటే ఉన్నదంతా ఇన్స్టిట్యూట్‌కే అయిపోయి తలా వెయ్యితో మిగిలాము. వాటితోనే మిగతా నెల గడవాల్సిన పరిస్థితి. ఇంతలో మిత్రుడొకరికి ఒక బ్రహ్మాండమైన ఉపాయం తట్టింది. రోజూ కూకట్‌పల్లి పరిసరాల్లో వేసే దినపత్రికలన్నీ మొదట ఒకచోటకు చేర్చి, అక్కడినుండి కాలనీల వారీగా విడదీసి పంపిణీ చేస్తుంటారు. అక్కడున్న ఒకాయనను బతిమాలో బామాలో మంచి చేసుకుని వాళ్ళు పత్రికల్ని విడదీసుకుంటున్నప్పుడు మా కరపత్రాల్ని అందులో ఉంచేందుకు ఒప్పించాము. ఆయన ఒప్పుకున్నాడుగానీ తమ కుర్రాళ్ళకు వాళ్ళపనే సరిపోతుందనీ కరపత్రాలు మేమే పెట్టుకునేటట్లయితే అభ్యంతరం ఉండదనీ షరతు పెట్టాడు. ఒప్పుకుందే మహాభాగ్యం అనుకుని సరే అన్నాము. తెల్లవారుజామున మూడింటికి వెళ్ళి ఓపిగ్గా అన్ని దినపత్రికల్లోనూ కరపత్రాలుంచేవాళ్ళం. ఆ విధంగా రెండు సార్లు చేశాక కాస్త స్పందన రావటం మొదలైంది.

బాచ్‌కు ఒక్కరు వచ్చినా కాదనకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాం(మాకు నిలదొక్కుకోవడం ప్రధానం కాబట్టి). మాలో బాగా మాట్లాడగలిగేవాడొకడు వచ్చిన వాళ్ళకి వివరాలూ అవి చెప్పడం, ఫీజు బేరమాడేవాళ్ళని హేండిల్ చెయ్యడం వంటి బాధ్యతలు తీసుకున్నాడు. బోధన ప్రధానంగా నామీద పడింది. అప్పటికి మూడేళ్ళూ కాలేజీలో చాలావరకు సబ్జెక్టులు మిత్రులకు వివరించడం వల్ల నాకు నిభాయించగలననే నమ్మకం ఉండేది. సినిమాల్లో చూపించినట్లుగా మొదటిరోజే గుంపులు గుంపులుగా వచ్చేసి ఇన్స్టిట్యూట్‌లో ఎవరూ చేరలేదు. మొదటి రెండు రోజులూ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాం. మూడవరోజు ఒక బి.సి.ఏ. అమ్మాయి సి లాంగ్వేజి డెమో క్లాసుకోసం వచ్చింది, తన మిత్రురాలిని వెంటేసుకుని. ఆ కూడా వచ్చినమ్మాయి ఓపావుగంట నా క్లాసు విని, నన్నో నాలుగైదు ప్రశ్నలు వేసి సంతృప్తి చెందాక తన స్నేహితురాలికి మా ఇన్స్టిట్యూట్‌లో చేరటానికి పచ్చ జెండా ఊపింది. ఆ విధంగా ఆ అమ్మాయి మా మొదటి విద్యార్థినయ్యింది (తను పూర్తి కోర్సు విని సగం ఫీజు ఎగ్గొట్టిందనుకోండి, అది వేరే సంగతి). ఒక వారం పోయాక పరిస్థితి కాస్త ఆశాజనకంగా మారింది. నాకు ఊపిరి తీసుకోడానికి వీల్లేనంతగా క్లాసులు మొదలయ్యాయి. ఉదయం ఆరునుంచి పదకొండు వరకూ, సాయంత్రం నాలుగునుంచి తొమ్మిదింటిదాకా క్లాసులుండేవి. మొత్తానికి ఒక ఇరవై మంది లెక్క తేలారు. నేను చెబుతున్న వి.బి క్లాసుకు మంచి స్పందన వచ్చి నోటి మాట ద్వారానే వరసగా మరో రెండు బాచ్‌లు చేరారు. ఇదంతా చేస్తూకూడా నేను నా ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం మానలేదు.

అలా అలా కొన్ని పదుల రెజ్యూమెలు పంచిన తరువాత, ఎంతో మందిని ఫోన్లలోనూ, నేరుగానూ విసిగించిన తరువాత, అలా విసిగించబడ్డ పుణ్యాత్ముడి ద్వారా ఒక బంజారా హిల్స్ 12వ రోడ్డులో ఒక ఆఫీసులో ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూ బానే చెయ్యడంతో ఉద్యోగమూ వచ్చింది. ఏదో మలేషియా ప్రాజెక్టు వస్తుందని ఆశిస్తున్నామని నేను దానిపైన పనిచెయ్యాల్సి ఉంటుందనీ చెప్పారు. జీతం మాత్రం రెండున్నర వేలు. మరేం ఫరవాలేదు, ఎలాగైనా సరే డెవలప్‌మెంట్‌లోకి వెళ్ళటమే నా ధ్యేయం కాబట్టి ఒప్పేసుకున్నా. ఇన్స్టిట్యూట్‌లో కోర్సులు కొన్ని మధ్యలో ఉన్నాయి కాబట్టి వాటి సమయాలు కాస్త అటూ ఇటూ మార్చి నా ఆఫీసు టైంకి అడ్డురాకుండా చేసుకున్నాను. అక్కడినుంచీ మొదలయ్యాయి రెండు కొత్త నరకాలు. ఒకటి బంజారా హిల్స్ 12వ రోడ్డు అయితే రెండోది కొత్త ఆఫీసు. మీలో హైదరాబాద్ పరిచయంలేనివారుంటే గనుక, ఈ బంజారా హిల్స్ 12వ రోడ్డు మాంచి ఖరీదైన ఏరియా. కార్లున్న సార్లకే తప్ప నాలాంటి రెండుకాళ్ళ సవారీగాళ్ళకు ఏమాత్రమూ సరిపడని ప్రదేశం. చాలావరకు బస్సులు బంజారా హిల్స్ మెయిన్ రోడ్డు పైనుంచే వెళ్ళిపోయేవి, లోపలికెళ్ళేవి ఏఅరగంటకో ఒకటి వచ్చేవి. దాంతో రెండు కిలోమీటర్లు లోపలకున్న మా ఆఫీసుకు వెళ్ళాలంటే నడకే గతి. మా ఆఫీసు చుట్టుపట్ల అన్నీ విశాలమైన భవనాలేగాని ఒక చిన్న కాకా హోటల్ కూడా ఉండేది కాదు. భోజనం చెయ్యాలంటే మళ్ళీ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి తిని వెళ్ళాలి. నాకేమో నేరుగా ఇన్స్టిట్యూట్నుంచి ఆఫీసుకు రావడం వల్ల ఉదయం టిఫిన్ చేసేందుకు సమయం దొరికేది కాదు(డబ్బులు కూడా ఉండేవి కాదనుకోండి, అది వేరే సంగతి)


ఉదయం పదిన్నర, పదకొండు గంటల ప్రాంతంలో ఒక అరకప్పు టీ ఇచ్చేవాళ్ళు ఆఫీసులో. ప్రాజెక్టు ఇంకా రాకపోవడం మూలాన అసలు పనేమీ ఉండేది కాదు. దాంతో పదిన్నరెప్పుడవుతుందా, టీ ఎప్పుడిస్తారా అని చూడటమే పని. వెతగ్గా వెతగ్గా, దగ్గర్లో ఒక ఇరానీ హోటల్ మాత్రం దొరికింది. అక్కడ సమోసా తిని టీ తాగి మధ్యాహ్న భోజనం పూర్తయ్యిందనిపించేవాడిని. చేసేందుకేమీ లేకపోవడం వల్ల ఆఫీసులో నిద్రొచ్చేది. ఇలాకాదని మరుసటిరోజు నేను చెప్పాల్సిన వి.బి. క్లాసు తాలూకు కోడ్ ఎక్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. అదీ ఒక మంచికే అయ్యింది. నెలాఖరులో ఒక్కసారిగా మా మానేజరు హడావుడి చేసి ఇంతకాలమూ ఏంచేశావో చూపించమన్నప్పుడు బాగా అక్కరకొచ్చాయి ఈ సాంపుల్స్. నా టీం వాళ్ళు మరో ఇద్దరు అసలేమీ చెయ్యక తిట్లు తిన్నారు. ఇంత హంగామా చేసి ప్రాజెక్టు లేకపోవడం మూలాన జీతమూ ఇవ్వట్లేదని చల్లగా చెప్పేశారు. నేనేమో ఉందిలే మంచికాలం ముందుముందునా అనుకుంటూ రోజూ ఆఫీసుకు వెళ్తూనే ఉండేవాడిని, ఈరోజైనా ప్రాజెక్టు మొదలెట్టబోతున్నామన్న శుభవార్త వినిపిస్తుందన్న నమ్మకంతో. ఇదంతా మూడునెల్ల ముచ్చటే అయ్యింది. ఒక శుభదినాన కంపెనీయే ఎత్తేస్తున్నామని వార్త మా చెవిన వేసి మా దారి మమ్మల్ని చూసుకోమన్నారు. ఇంకేముంది, మళ్ళీ ఇన్స్టిట్యూట్‌కు పూర్తి స్థాయిలో పునరంకితం.

ఈ మధ్యలో మరో సర్కస్ ఫీట్ జరిగింది. టి.సి.ఎస్ వాడు దేశవ్యాప్త టాలెంట్ టెస్ట్ అని ఒకటి పెట్టాడు. మొత్తం మూడులక్షలమందో ఏమో రాశారా పరీక్షని. ఎందుకోగాని ఆ పరీక్ష ముగించి బయటకు రాగానే అనిపించింది, నాకు ఇంటర్వ్యూకు పిలుపొస్తుందని. ఆ తరువాత దాని విషయం పూర్తిగా మరచిపోయి ఇతర ప్రయత్నాల్లో మునిగి ఉన్నప్పుడు, రెండు నెలల తరువాత టి.సి.ఎస్ వాడి కాల్ లెటర్ వచ్చిందని ఇంటినుంచి ఫోన్ వచ్చింది. స్నేహితులు చాలామంది చెప్పారు, టి.సి.ఎస్. రాత పరీక్ష కఠినంగా ఉంటుందనీ, ఒక్కసారి అది దాటితే ఇంటర్వ్యూ సులభమనీ వగైరా వగైరా. సరే నాకూ ఇక జీవితంలో స్థిరపడే సమయం వచ్చిందనే అనిపించింది. అన్ని రకాలుగా సిధ్ధపడి, అవీ ఇవీ తిరిగి చదువుకుని ఇంటర్వ్యూ రోజున వెళితే మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్ళిన వాడిని సాయంత్రం ఆరున్నరవరకూ ఎదురుచూసి తీరా పానెల్ వద్దకు వెళ్ళాక వారితో వాదులాటేసుకుని బయటకు రావాల్సొచ్చింది. ఇంతా చేస్తే దీనికి కారణం వాళ్ళడిగిన ‘Why T.C.S.' అన్న ప్రశ్నకు నేనిచ్చిన సమాధానం, ‘Job Security’. అది మా కంపెనీలోనే కాదు ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరంటారు వాళ్ళు. ఉద్యోగులకు ఆమాత్రం భరోసా ఇవ్వలేకపోతే ఇంత పెద్ద కంపెనీ ఎందుకు అని నేను. అసలు అంత తలతిక్కగా ఎలా మాట్లాడానో ఇప్పటికీ అర్థంకాదు నాకు. ఇంత రభస జరిగాక సహజంగానే నాకా ఉద్యోగం రాలేదు.

Tuesday, 20 July 2010

ప్రయాణం - 1

నేను వీధినబడి(అనగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణకై రోడ్డెక్కి) దగ్గర దగ్గర దశాబ్దం పూర్తవ్వొస్తోంది. ఈ సందర్భంగా వెనక్కు తిరిగి నా ప్రయాణం ఒక్కసారి నెమరేసుకోవడం, అంతకన్నా ముఖ్యంగా నా ఉద్యోగ పర్వంలోని వివిధ దశల్లో కీలకమనదగ్గ అవకాశాలు కల్పించిన ముగ్గురు స్నేహితులను గుర్తు చేసుకోవడం కోసం ఈ ప్రయత్నం.


ఎం.సీ.ఏ. వరకూ నా చదువు బండి సాఫీగా, ఎక్కడా బ్రేకుల్లేకుండా సాగిపోయింది. దాంతో ఉద్యోగం విషయంలోనూ నాకెదురుండదని, ఇట్లా కాలేజీ బయటకు రాగానే అట్లా ఏదో ఒక పెద్ద కంపెనీ నన్నెగరేసుకుపోతుందనీ ఒక పిచ్చి భ్రమ ఏర్పడింది. అప్పటికింకా నాకు ఆంగ్లంలో పట్టు అంతగా లేదు. ఏవో కొన్ని లాంగ్వేజీలు తప్ప కంప్యూటరు పరిజ్ఞానమూ అంత గొప్పగా ఏమీ ఉండేది కాదు. ఈ అర్హతలతో ఉద్యోగం సంపాదించగలనని ఎలా అనుకోగలిగానో తెలీదు కానీ అప్పట్లో తెగ నమ్మకముండేది, మరో ఆరునెల్లలో ఏదో ఒక ఎం.ఎన్.సిలో ఉద్యోగం వచ్చేస్తుందనీ, ఆపై మరో ఏడాదికి ఏ అమెరికానో, ఆఫ్రికానో వెళతాననీ, ఇక అక్కడినించి డాలర్ల పంట పండించి ఇక్కడికి ఎగుమతి చేసేస్తాననీ ఇలా అన్నమాట. ఇంతా చేసి నేను చదివింది నరసరావుపేట పల్నాడు రోడ్డులోని పి.ఎన్.సి.& కె.ఆర్ అనే కాలేజీలో (ఇక్కడ మాకాలేజీ గురించిగానీ నరసరావుపేట గురించిగానీ నాకెలాంటి చులకన అభిప్రాయాలూ లేవని చదువరులు గుర్తించాలి. నిజం చెప్పాలంటే ఈరోజు నేనేదో ఒక స్థాయిలో ఉండగలిగానంటే అది మా కాలేజీ గొప్పతనమే అని నా నమ్మకం). అదే నేను ఏ ఐ.ఐ.టీ.లోనో ఆర్.ఇ.సి.లోనో చదివుంటే ఎలా ఆలోచించేవాడినో మీరే ఊహించండి. ఇది, ఇలానే వేరే విషయాల్లో ఏర్పడిన మరికొన్ని భ్రమలూ తరువాత్తరువాత తొందరగానే తొలగిపోయాయనుకోండి.

నా జీవితపు స్వర్ణయుగమని చెప్పుకోదగ్గ విద్యార్థి దశకు కౌంట్‌డౌన్ మొదలయిన రోజులవి. నేను చివరి సంవత్సరం పరీక్షలకు సిధ్ధమవుతున్న సమయంలో సి.బి.ఎస్.ఐ అనే కంపెనీ వాడిచ్చిన ప్రకటన నా జీవితాన్నే మార్చేసింది. అప్పట్లో ఆకంపెనీ అనుభవంలేని కుర్రాళ్ళను తీసుకుని వారికి మూడునెలల పాటు శిక్షణ ఇచ్చి ఆ తరువాత వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగంలోకి తీసుకునేది. ఎటొచ్చీ మెలిక ఏంటంటే ఈ మూణ్ణెల్ల శిక్షణకు గానూ డెభ్భై వేలు ఫీజు. అప్పటికి దాదాపు ఆరేడేళ్ళుగా వాళ్ళాపని నమ్మకంగా చేస్తుండటం వల్లా, మా నాన్నగారి సహోద్యోగి కుమారుడొకాయన ఆవిధంగానే ఆకంపెనీలో చేరి అప్పటికి మంచి స్థాయిలో ఉండటంవల్లా, నన్నందులో చేరిస్తే బాగుంటుందని మా నాన్నగారికి సదరు సహోద్యోగి గారూ, ఇతర స్నేహితులూ బాగా బ్రెయిన్ వాష్ చేశారు(అఫ్ కోర్స్! వారికందులో దురుద్దేశాలేమీ లేవు, నా మంచికోరే చెప్పారనుకోండి!!) సరే హైదరాబాదు వెళ్ళి వ్రాత పరీక్షయితే వ్రాసాను. ఆ తరువాత ఇంటర్వ్యూ పెట్టారు, అదీ పూర్తయ్యిందనిపించాను. ఇహ రెండు పనులే మిగిలాయి, ఆ డెభ్భై వేలు సంపాదించడం, కంపెనీలో చేరడం. దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతుందన్న సామెత చందంగా ఎన్నడూ లేనిది మా నాన్నగారి సహోద్యోగులు కొంతమంది అప్పివ్వడానికి ముందుకురావడం వల్ల సమయానికి డబ్బు సర్దుబాటయ్యి మిగిలిన పని దానంతటదే జరిగిపోయింది. ఈలోపు చివరి సంవత్సరపు పరీక్షలూ పూర్తయ్యాయి. నా స్నేహితులందరికీ సంతోషంగా చెప్పుకున్నాను ఫలానా కంపెనీలో చేరబోతున్నానని. ఉద్యోగం విషయంలో కూడా నాకెదురుండదన్న నమ్మకం మరికాస్త బలపడింది.


పరీక్షలు పూర్తయిన వారానికి హైదరాబాదులో మా బాచ్‌కు శిక్షణ మొదలు. దాంతో డిసెంబరు మొదటి వారంలో తట్టా బుట్ట సర్దుకుని రాజధానికి మకాం మార్చేశాను. ఒక కొత్త రకమైన విద్యార్థి జీవితం మొదలయ్యింది. మా కాలేజీ లాగా ఇక్కడ గొడవ చేస్తాం, క్లాసులు ఎగ్గొడతాం అంటే కుదరదు. ఎంతైనా నేను తరువాత పనిచెయ్యబోయే కంపెనీ కదా, కాస్త క్రమశిక్షణతో లేకపోతే కష్టం. ట్రైనర్లు మంచి నైపుణ్యంగలవారే ఉండేవారు. మేము పనిచెయ్యబోయే ప్రాజెక్టులకు అవసరమయిన టెక్నాలజీలు బోధించేవారు. రెండు నెలలు గిర్రున తిరిగిపోయి ఫిబ్రవరి వచ్చేసింది. మరో నెలాగితే మద్రాసులో పోస్టింగ్. మా ముందు బాచ్ వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు. మేమూ చిన్న చిన్నగా మద్రాసులో ఏర్పాట్ల గురించి (ఉండటానికి రూము వగైరా) ఆరా తీస్తున్నాం. అవసరమైన సమయంలో అదృష్టదేవత ముఖం చాటేయడం అనేది మధుబాబు నవలల్లో షాడోకి మాత్రమే జరుగుతుందని అప్పటివరకూ అనుకునేవాడిని. ఇంతలో డాట్ కాం బుడగ పేలనే పేలి షాడోని నాస్థాయికి దించేసింది. అప్పటికి దాని పర్యవసానాలూ అవీ అంతగా తెలియలేదు నాకు. వారం తరువాత అనుకుంటా, ఒకరోజు మా ట్రైనర్ "బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, మీరీ కోర్సులో చేరి మంచి పని చేశారు" అన్నాడు. నా స్నేహితులతో ఆరా తీస్తే అతను చెప్పిందాంట్లో అబధ్ధమేమీ లేదని తెలిసింది. నేనా కోర్సులో చేరటానికి కారణమయిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నా మనసులో. మరో వారం తరువాత ఒకరోజు క్లాసుకు వెళ్ళగానే అంతా కోలాహలంగా మాట్లాడుకుంటున్నారు. విషయం ఏమిటంటే మద్రాసులో మాతో సమాంతరంగా నడుస్తున్న మరో బాచ్ వాళ్ళకి ఒక నెలాగి పోస్టింగ్ ఇస్తామన్నారట. అంటే మాకూ పోస్టింగ్ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. మొదటిసారి ఏమూలో కాస్త భయం వేసింది. ప్రోగ్రాం డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాం. ఆయన అలాంటిదేమీ ఉండదనీ, టి.నగర్ బాచ్ విషయంలో జరిగింది వేరనీ మాకలా జరగదనీ చెప్పి సమాధాన పరిచాడు.

మరుసటిరోజే మరో దుర్వార్త. కంపెనీకి రావాల్సిన ప్రాజెక్టులేవో రాని కారణంగా టి.నగర్ బాచ్ వాళ్ళకు పోస్టింగ్ రద్దు చేశారని. ఈసారి మా డైరెక్టరే క్లాసుకొచ్చి వివరించాడు. బయట ఇండస్ట్రీ అసలు బాగోలేని కారణంచేత, కంపెనీలో ఉన్నవాళ్ళే చాలామంది ఖాళీగా ఉన్న కారణం చేత ఇక కొత్త వాళ్ళను తీసుకోవడం ఆపేయాలని యాజమాన్యం నిర్ణయించిందనీ, మేము కట్టిన పూర్తి డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇస్తారనీ, ఇప్పటివరకూ ఇచ్చిన ట్రైనింగు ఉచితంగా ఇచ్చినట్లు పరిగణిస్తారనీ చెప్పుకొచ్చాడు. మరో కొన్నిరోజుల్లో మంచి ఉద్యోగంలో స్థిరపడబోతున్నామన్న సంతోషంలో ఉన్న మా అందరికీ ఈ మాటలు సహజంగానే ఆశాభంగం కలిగించాయి. అందరూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చేసేదిలేక ఆయన మా నిరసనను పైవారికి తెలియజేస్తానంటూ నిష్క్రమించాడు. మరో రెండురోజుల్లో మద్రాసునుంచి సీనియర్ హెచ్.ఆర్ మానేజరొకాయన వచ్చారు. ఆయన మా అందరితోనూ మాట్లాడి సందేహాలేమైనా ఉంటే తీరుస్తారని, ఉద్యోగాల విషయంలో కూడా ఒక అంతిమ నిర్ణయం తీసుకుంటారనీ తెలియజేశారు డైరెక్టర్. సమావేశం రేపనగా ఆరాత్రి మొదటిసారి ఆందోళనతో నిద్ర పట్టక దేవుడిని ప్రార్థిస్తూ గడిపా. ఇంతవరకూ మా ఇంట్లో విషయం తెలియలేదు. అసలే అప్పుతెచ్చి కట్టిన డబ్బు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వనని తేల్చేసి, డబ్బు ఇవ్వటానికి కూడా రేపు మాపు అని తిప్పించుకుంటే ఏంచెయ్యాలో పాలుబోలేదు. మరుసటిరోజు కోరుకోనిదే జరిగింది. ఉద్యోగాలివ్వటం జరగని పని అని తేల్చేశారు వచ్చినాయన. అంతగా అయితే ప్రస్తుతం చివర్లో ఉన్న ట్రైనింగ్ పూర్తి చేస్తామనీ తరువాత సర్టిఫికెట్ కూడా ఇస్తామనీ అంతకన్నా మరే సహాయమూ చెయ్యలేననీ చెప్పేశారు. గుడ్డిలో మెల్లగా, అందరికీ ఇవ్వాల్సిన మొత్తం(వడ్డీ తో సహా) తాలూకు డి.డి. లు తెచ్చి ఎవరిది వారికి ఇచ్చేశారు. అంతా అయిపోయింది. కానీ ముందురోజు రాత్రి అనుభవించినంత ఆందోళన మాత్రం లేదు. కాస్తంత తేలిక పడ్డ భావన - బహుశా పరిస్థితి మన చెయ్యి దాటిపోయాక కలిగే తెగింపు లాంటిది కావచ్చు - కలిగింది. ఇంటికి ఫోన్ చేసి చెప్పేశాను. వాళ్ళూ ముందు కంగారు పడినా డబ్బులు తిరిగొచ్చాయని తెలిశాక కాస్త కుదుట పడ్డారు. ఆ విధంగా చేరకుండానే నా మొదటి ఉద్యోగం ఊడింది. చివరకొచ్చేటప్పటికి ధన రూపేణా నేనేమీ నష్టపోకపోయినప్పటికీ, మూడు నెలల విలువైన కాలం మాత్రం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వచ్చిన కొన్ని మంచి అవకాశాలు ఈ ఉద్యోగం వచ్చేసిందన్న ధీమాలో వదిలేసుకున్నాను.