Thursday, 22 July, 2010

ప్రయాణం - 2

నేను వీధినబడి(అనగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణకై రోడ్డెక్కి) దగ్గర దగ్గర దశాబ్దం పూర్తవ్వొస్తోంది. ఈ సందర్భంగా వెనక్కు తిరిగి నా ప్రయాణం ఒక్కసారి నెమరేసుకోవడం, అంతకన్నా ముఖ్యంగా నా ఉద్యోగ పర్వంలోని వివిధ దశల్లో కీలకమనదగ్గ అవకాశాలు కల్పించిన ముగ్గురు స్నేహితులను గుర్తు చేసుకోవడం కోసం ఈ ప్రయత్నం.ఇంటికెళ్ళి ఒక పదిరోజులుండి తిరిగి హైదరాబాదొచ్చా. నా క్లాస్‌మేట్స్ లో అప్పటికి ఒక నలుగురు మాత్రమే మంచి ఉద్యోగాల్లో చేరారు. మిగిలినవారిలో చాలామంది నాలాగే ఖాళీ. పైగా దాదాపు అందరూ హైదరాబాదులోనే ఉన్నారు. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్క సందులో నివాసం. ముందు నలుగురే ఉంటామని చెప్పినప్పటికీ ఎప్పుడు చూసినా కనీసం పదిమందికి తక్కువకాకుండా ఉండేవాళ్ళం. అంతా మా స్నేహితులే. సందడికి ఏమాత్రం తక్కువుండేది కాదు. వంట పనికీ, ఇంటిపనికీ, బజారు పనులకీ ఒక చార్టు ఉండేది. ఆరోజు పని ఉన్నవాళ్ళు వండి వారుస్తుంటే మిగతావాళ్ళంతా పేకాడుతూ గడిపేసేవాళ్ళు. సాయంత్రం పూట రామకృష్ణ మఠంలో స్పోకెన్ ఇంగ్లీషులో చేరాం అందరమూ. అరుదుగా ఎక్కడైనా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని తెలిస్తే పొలోమని మంద మందగా పరిగెత్తుకెళ్ళేవాళ్ళం. చాలా కంపెనీల్లో గేటు దగ్గరి సెక్యూరిటీ గార్డు దగ్గరే ఆగిపోవాల్సొచ్చేది. ఇలా ఒక ఆరునెలలు గడిచింది. ఒక రోజు మా స్నేహితుడి స్నేహితుడొకడు వచ్చాడు. వాడికి తెలిసినవాడెవడో ట్యూషన్ సెంటరొకటి పెట్టి ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడట. మనం మాత్రమెందుకు ప్రయత్నించకూడదు అన్నాడు. ఆలోచన బానే ఉందికానీ పెట్టుబడి? అప్పటికే ప్రతీనెలా ఇంటినుంచి తెప్పించుకుంటున్నందుకు అందరికీ సిగ్గుగా ఉంది. మళ్ళీ దీనికోసం ఇంట్లో డబ్బు అడగాలనిపించలేదు, కానీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చెయ్యాలన్న పట్టుదలగా మాత్రం ఉంది. చివరకు ఏదయితే అదయ్యిందనుకుని, మా నెలఖర్చుల్లోంచి తలా సగం తీసి అయిదారుగురు స్నేహితులం కలిసి ఆరువేల రూపాయల పెట్టుబడితో కూకట్‌పల్లిలో 2001 విజయదశమి రోజు మొదలుపెట్టాం, "ఫ్రెండ్స్ స్టడీ సర్కిల్".

కంప్యూటర్ ఇంజనీరింగ్‌లోని ఏసబ్జెక్టుకైనా ట్యూషన్, అలాగే సి, సి++, జావా, విజువల్ బేసిక్ ఇలా ఏలాంగ్వేజీకైనా ట్యూషన్ మా ప్రత్యేకత(!). కరపత్రాలు సిధ్ధమయ్యాయి. తీరా వాటిని రోడ్డు పక్కన నుంచుని పంచాలంటే మాకందరికీ నామోషీ వేసింది! అలా అని డబ్బులిచ్చి ఎవరైనా కుర్రాడిని పెట్టుకుందామా అంటే ఉన్నదంతా ఇన్స్టిట్యూట్‌కే అయిపోయి తలా వెయ్యితో మిగిలాము. వాటితోనే మిగతా నెల గడవాల్సిన పరిస్థితి. ఇంతలో మిత్రుడొకరికి ఒక బ్రహ్మాండమైన ఉపాయం తట్టింది. రోజూ కూకట్‌పల్లి పరిసరాల్లో వేసే దినపత్రికలన్నీ మొదట ఒకచోటకు చేర్చి, అక్కడినుండి కాలనీల వారీగా విడదీసి పంపిణీ చేస్తుంటారు. అక్కడున్న ఒకాయనను బతిమాలో బామాలో మంచి చేసుకుని వాళ్ళు పత్రికల్ని విడదీసుకుంటున్నప్పుడు మా కరపత్రాల్ని అందులో ఉంచేందుకు ఒప్పించాము. ఆయన ఒప్పుకున్నాడుగానీ తమ కుర్రాళ్ళకు వాళ్ళపనే సరిపోతుందనీ కరపత్రాలు మేమే పెట్టుకునేటట్లయితే అభ్యంతరం ఉండదనీ షరతు పెట్టాడు. ఒప్పుకుందే మహాభాగ్యం అనుకుని సరే అన్నాము. తెల్లవారుజామున మూడింటికి వెళ్ళి ఓపిగ్గా అన్ని దినపత్రికల్లోనూ కరపత్రాలుంచేవాళ్ళం. ఆ విధంగా రెండు సార్లు చేశాక కాస్త స్పందన రావటం మొదలైంది.

బాచ్‌కు ఒక్కరు వచ్చినా కాదనకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాం(మాకు నిలదొక్కుకోవడం ప్రధానం కాబట్టి). మాలో బాగా మాట్లాడగలిగేవాడొకడు వచ్చిన వాళ్ళకి వివరాలూ అవి చెప్పడం, ఫీజు బేరమాడేవాళ్ళని హేండిల్ చెయ్యడం వంటి బాధ్యతలు తీసుకున్నాడు. బోధన ప్రధానంగా నామీద పడింది. అప్పటికి మూడేళ్ళూ కాలేజీలో చాలావరకు సబ్జెక్టులు మిత్రులకు వివరించడం వల్ల నాకు నిభాయించగలననే నమ్మకం ఉండేది. సినిమాల్లో చూపించినట్లుగా మొదటిరోజే గుంపులు గుంపులుగా వచ్చేసి ఇన్స్టిట్యూట్‌లో ఎవరూ చేరలేదు. మొదటి రెండు రోజులూ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాం. మూడవరోజు ఒక బి.సి.ఏ. అమ్మాయి సి లాంగ్వేజి డెమో క్లాసుకోసం వచ్చింది, తన మిత్రురాలిని వెంటేసుకుని. ఆ కూడా వచ్చినమ్మాయి ఓపావుగంట నా క్లాసు విని, నన్నో నాలుగైదు ప్రశ్నలు వేసి సంతృప్తి చెందాక తన స్నేహితురాలికి మా ఇన్స్టిట్యూట్‌లో చేరటానికి పచ్చ జెండా ఊపింది. ఆ విధంగా ఆ అమ్మాయి మా మొదటి విద్యార్థినయ్యింది (తను పూర్తి కోర్సు విని సగం ఫీజు ఎగ్గొట్టిందనుకోండి, అది వేరే సంగతి). ఒక వారం పోయాక పరిస్థితి కాస్త ఆశాజనకంగా మారింది. నాకు ఊపిరి తీసుకోడానికి వీల్లేనంతగా క్లాసులు మొదలయ్యాయి. ఉదయం ఆరునుంచి పదకొండు వరకూ, సాయంత్రం నాలుగునుంచి తొమ్మిదింటిదాకా క్లాసులుండేవి. మొత్తానికి ఒక ఇరవై మంది లెక్క తేలారు. నేను చెబుతున్న వి.బి క్లాసుకు మంచి స్పందన వచ్చి నోటి మాట ద్వారానే వరసగా మరో రెండు బాచ్‌లు చేరారు. ఇదంతా చేస్తూకూడా నేను నా ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం మానలేదు.

అలా అలా కొన్ని పదుల రెజ్యూమెలు పంచిన తరువాత, ఎంతో మందిని ఫోన్లలోనూ, నేరుగానూ విసిగించిన తరువాత, అలా విసిగించబడ్డ పుణ్యాత్ముడి ద్వారా ఒక బంజారా హిల్స్ 12వ రోడ్డులో ఒక ఆఫీసులో ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూ బానే చెయ్యడంతో ఉద్యోగమూ వచ్చింది. ఏదో మలేషియా ప్రాజెక్టు వస్తుందని ఆశిస్తున్నామని నేను దానిపైన పనిచెయ్యాల్సి ఉంటుందనీ చెప్పారు. జీతం మాత్రం రెండున్నర వేలు. మరేం ఫరవాలేదు, ఎలాగైనా సరే డెవలప్‌మెంట్‌లోకి వెళ్ళటమే నా ధ్యేయం కాబట్టి ఒప్పేసుకున్నా. ఇన్స్టిట్యూట్‌లో కోర్సులు కొన్ని మధ్యలో ఉన్నాయి కాబట్టి వాటి సమయాలు కాస్త అటూ ఇటూ మార్చి నా ఆఫీసు టైంకి అడ్డురాకుండా చేసుకున్నాను. అక్కడినుంచీ మొదలయ్యాయి రెండు కొత్త నరకాలు. ఒకటి బంజారా హిల్స్ 12వ రోడ్డు అయితే రెండోది కొత్త ఆఫీసు. మీలో హైదరాబాద్ పరిచయంలేనివారుంటే గనుక, ఈ బంజారా హిల్స్ 12వ రోడ్డు మాంచి ఖరీదైన ఏరియా. కార్లున్న సార్లకే తప్ప నాలాంటి రెండుకాళ్ళ సవారీగాళ్ళకు ఏమాత్రమూ సరిపడని ప్రదేశం. చాలావరకు బస్సులు బంజారా హిల్స్ మెయిన్ రోడ్డు పైనుంచే వెళ్ళిపోయేవి, లోపలికెళ్ళేవి ఏఅరగంటకో ఒకటి వచ్చేవి. దాంతో రెండు కిలోమీటర్లు లోపలకున్న మా ఆఫీసుకు వెళ్ళాలంటే నడకే గతి. మా ఆఫీసు చుట్టుపట్ల అన్నీ విశాలమైన భవనాలేగాని ఒక చిన్న కాకా హోటల్ కూడా ఉండేది కాదు. భోజనం చెయ్యాలంటే మళ్ళీ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి తిని వెళ్ళాలి. నాకేమో నేరుగా ఇన్స్టిట్యూట్నుంచి ఆఫీసుకు రావడం వల్ల ఉదయం టిఫిన్ చేసేందుకు సమయం దొరికేది కాదు(డబ్బులు కూడా ఉండేవి కాదనుకోండి, అది వేరే సంగతి)


ఉదయం పదిన్నర, పదకొండు గంటల ప్రాంతంలో ఒక అరకప్పు టీ ఇచ్చేవాళ్ళు ఆఫీసులో. ప్రాజెక్టు ఇంకా రాకపోవడం మూలాన అసలు పనేమీ ఉండేది కాదు. దాంతో పదిన్నరెప్పుడవుతుందా, టీ ఎప్పుడిస్తారా అని చూడటమే పని. వెతగ్గా వెతగ్గా, దగ్గర్లో ఒక ఇరానీ హోటల్ మాత్రం దొరికింది. అక్కడ సమోసా తిని టీ తాగి మధ్యాహ్న భోజనం పూర్తయ్యిందనిపించేవాడిని. చేసేందుకేమీ లేకపోవడం వల్ల ఆఫీసులో నిద్రొచ్చేది. ఇలాకాదని మరుసటిరోజు నేను చెప్పాల్సిన వి.బి. క్లాసు తాలూకు కోడ్ ఎక్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. అదీ ఒక మంచికే అయ్యింది. నెలాఖరులో ఒక్కసారిగా మా మానేజరు హడావుడి చేసి ఇంతకాలమూ ఏంచేశావో చూపించమన్నప్పుడు బాగా అక్కరకొచ్చాయి ఈ సాంపుల్స్. నా టీం వాళ్ళు మరో ఇద్దరు అసలేమీ చెయ్యక తిట్లు తిన్నారు. ఇంత హంగామా చేసి ప్రాజెక్టు లేకపోవడం మూలాన జీతమూ ఇవ్వట్లేదని చల్లగా చెప్పేశారు. నేనేమో ఉందిలే మంచికాలం ముందుముందునా అనుకుంటూ రోజూ ఆఫీసుకు వెళ్తూనే ఉండేవాడిని, ఈరోజైనా ప్రాజెక్టు మొదలెట్టబోతున్నామన్న శుభవార్త వినిపిస్తుందన్న నమ్మకంతో. ఇదంతా మూడునెల్ల ముచ్చటే అయ్యింది. ఒక శుభదినాన కంపెనీయే ఎత్తేస్తున్నామని వార్త మా చెవిన వేసి మా దారి మమ్మల్ని చూసుకోమన్నారు. ఇంకేముంది, మళ్ళీ ఇన్స్టిట్యూట్‌కు పూర్తి స్థాయిలో పునరంకితం.

ఈ మధ్యలో మరో సర్కస్ ఫీట్ జరిగింది. టి.సి.ఎస్ వాడు దేశవ్యాప్త టాలెంట్ టెస్ట్ అని ఒకటి పెట్టాడు. మొత్తం మూడులక్షలమందో ఏమో రాశారా పరీక్షని. ఎందుకోగాని ఆ పరీక్ష ముగించి బయటకు రాగానే అనిపించింది, నాకు ఇంటర్వ్యూకు పిలుపొస్తుందని. ఆ తరువాత దాని విషయం పూర్తిగా మరచిపోయి ఇతర ప్రయత్నాల్లో మునిగి ఉన్నప్పుడు, రెండు నెలల తరువాత టి.సి.ఎస్ వాడి కాల్ లెటర్ వచ్చిందని ఇంటినుంచి ఫోన్ వచ్చింది. స్నేహితులు చాలామంది చెప్పారు, టి.సి.ఎస్. రాత పరీక్ష కఠినంగా ఉంటుందనీ, ఒక్కసారి అది దాటితే ఇంటర్వ్యూ సులభమనీ వగైరా వగైరా. సరే నాకూ ఇక జీవితంలో స్థిరపడే సమయం వచ్చిందనే అనిపించింది. అన్ని రకాలుగా సిధ్ధపడి, అవీ ఇవీ తిరిగి చదువుకుని ఇంటర్వ్యూ రోజున వెళితే మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్ళిన వాడిని సాయంత్రం ఆరున్నరవరకూ ఎదురుచూసి తీరా పానెల్ వద్దకు వెళ్ళాక వారితో వాదులాటేసుకుని బయటకు రావాల్సొచ్చింది. ఇంతా చేస్తే దీనికి కారణం వాళ్ళడిగిన ‘Why T.C.S.' అన్న ప్రశ్నకు నేనిచ్చిన సమాధానం, ‘Job Security’. అది మా కంపెనీలోనే కాదు ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరంటారు వాళ్ళు. ఉద్యోగులకు ఆమాత్రం భరోసా ఇవ్వలేకపోతే ఇంత పెద్ద కంపెనీ ఎందుకు అని నేను. అసలు అంత తలతిక్కగా ఎలా మాట్లాడానో ఇప్పటికీ అర్థంకాదు నాకు. ఇంత రభస జరిగాక సహజంగానే నాకా ఉద్యోగం రాలేదు.

12 comments:

Ravi said...

టీసీయెస్ లోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు మీ మనసులో మాట నిజాయితీ గా ఉద్యోగ భద్రత అని చెప్పారు.

కానీ ఈ ఇండస్ట్రీలో ఇంత నిజాయితీ పనికిరాదేమో అనిపిస్తుంది. ఎవడైతే మనసు చంపుకొని కంపెనీ వాళ్ళని సంతృప్తి పరుద్దామని సమాధానాలు చెబుతాడో వాడే కావాలి వాళ్ళకి. నా ఉద్యోగం కోసం అలా నేను ఎన్ని సార్లు ఆత్మవంచన చేసుకున్నానో నాకే తెలియదు. :)

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

100% agreed with the above comment.

శేఖర్ పెద్దగోపు said...

మీ ప్రయాణం1&2 కబుర్లు బావున్నాయి...కాలేజ్ నుండి రిలీవ్ అయ్యాక ఇంచుమించుగా అందరి పరిస్థితి ఇలానే ఉంటుందనుకుంటా...కాలేజీలో మనం ఊహించుకున్న ప్రపంచానికి, బయటకు వచ్చాక చూసిన/ఫేస్ చేసిన ప్రపంచానికి చాలా తేడా ఉంటుందన్న నగ్న సత్యం తెలిసేది అప్పుడేగా!
వీలయితే కొంచం పెద్ద టపా రాయండి..

బ్లాగాగ్ని said...

రవిచంద్ర గారు, సునీల్ నారాయణ గారు - మీరు చెప్పింది అక్షరాలా నిజం! కానీ నాకీ పాఠం ఇలాంటి ఢక్కా మొక్కీలు మరికొన్ని తిన్నాకనే అనుభవమైంది.

శేఖర్ గారు - అమ్మా, మిమ్మల్నంత తేలిగ్గా వదుల్తానా? కనీసం మరో రెండు భాగాలన్నా రాబోతున్నాయి ఈ సిరీస్‌లో, కాచుకోండి :) నిజమేనండీ, ఎవరో కొందరు(కాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్టయ్యిన వాళ్ళు) తప్పితే దాదాపు మిగతా అందరూ ఇలాంటి స్ట్రగుల్ తప్పక ఎదుర్కొంటారు.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

____________________________________
కానీ ఈ ఇండస్ట్రీలో ఇంత నిజాయితీ పనికిరాదేమో అనిపిస్తుంది. ఎవడైతే మనసు చంపుకొని కంపెనీ వాళ్ళని సంతృప్తి పరుద్దామని సమాధానాలు చెబుతాడో వాడే కావాలి వాళ్ళకి. నా ఉద్యోగం కోసం అలా నేను ఎన్ని సార్లు ఆత్మవంచన చేసుకున్నానో నాకే తెలియదు. :)
____________________________________

What Ravi said is 200% correct. Same feeling here. Many times, I fooled myself by giving artificial answers to questions.

Nice post.

రవి said...

రవిచంద్ర గారు, గణేశ్ గారు, బాగా అన్నారు. హెచ్చార్ వాళ్ళంటే భలే కోపం, ఇప్పటికీ ఆ కసి అలానే ఉంది నాకు. దానికి తోడు నేను ఉద్యోగం వెతుక్కునేప్పుడు తెలిసిన హెచ్చార్ వారింట ఉండవలసిన ఖర్మ వచ్చింది. నా మీద నాకు పూర్తిగా ఆత్మ విశ్వాసం సన్నగిల్లినపుడు, ఓ తెలుగు వాళ్ళ హాస్టల్లో చేరి, అక్కడి మిత్రుల ద్వారా స్థిరపడ్డాను.

మంచు said...

I don't agree with above comments.
ఉద్యొగం కొసం ఆత్మవంచన చేసుకొవాల్సిన అవసరం లేదు . కావాల్సింది లౌక్యం. మాటల్లొ నేర్పరితనం. ఎవర్ని వారే ప్రొపర్ గా మార్కెటింగ్ చేసుకొవాలి.
టి వి లొ వచ్చే ఆడ్స్ చూడండి... వాళ్ళు చెప్పేవాటిలొ అబద్దాలు వుండవు... కొన్ని క్షణాల్లొ ఒక మంచి ఇంప్రెషన్ కలిగించడానికి ..పదాలు తెలివిగా వాడుకుంటారు... అదీ మర్కెటింగ్ విధానం .. అలాగే మనల్ని మనం జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకొవాలి. అది ప్రిపేర్ అయి వెళితే అబద్దాలు అడాల్సిన అవసరం వుండదు.
ఇంటర్వ్యూ చేసేవాడికి అభ్యర్ది ఒక్కసారి అబద్దం చెప్పినట్టు, తెలీనది తెలిసినట్టు బిల్డప్ ఇచ్చినట్టు అర్ధం అయితే .. పూర్తి ఇంప్రెషన్ పొతుంది. నిజాయితీ ఎప్పటికీ బెటర్ చొయిస్.

http://jobsearch.about.com/od/interviewquestionsanswers/a/interviewquest.htm

వేణు said...
This comment has been removed by the author.
వేణు said...

ప్రయాణం రెండో భాగం కూడా బాగా రాశారు. చాలామంది నిరుద్యోగులకు ఇలాంటి అనుభవాలే ఉంటాయి.

> ప్రాజెక్టు ఇంకా రాకపోవడం మూలాన అసలు పనేమీ ఉండేది కాదు. దాంతో పదిన్నరెప్పుడవుతుందా, టీ ఎప్పుడిస్తారా అని చూడటమే పని. :)

Princess said...
This comment has been removed by the author.
Princess said...

don't get feared of any thing in life. really about interview because it is very easy to get on. If you want great and easy answers you will get through this link:

http://www.interviewquestionseasy.com/58-interview-questions-and-answers.html

reguvardan said...

news4andhra is an Informative Portal which provides information about the latest news and Entertainment.

Telugu Movie News, Telugu Political News and Telugu Cinema Reviews