మేము నరసరావుపేటలో యమ్.సి.ఏ వెలగబెట్టేటప్పుడు మూర్తి అనే ఒక సహాధ్యాయి ఉండేవాడు. మనిషి చాలా మంచివాడు, మృదుస్వభావి. కానీ వాడికి ఉన్న ఒక గొప్ప బలహీనత వాడి జనరల్ నాలెడ్జి. మన దేశప్రధాని ఎవరన్న దాని మీద కూడా మావాడికి సందేహమే. అలా అని నోరుమూసుకుని కూర్చుంటాడా అంటే లేదు. ఏవిషయంలోనైనా, తెలిసినా తెలియకున్నా ఏదో ఒకటి వాగందే వాడి నోరు ఊరుకునేది కాదు. అప్పట్లో, అంటే 98-01 లలో రోజూ మా కాలేజీ దగ్గరి టిఫిన్ సెంటరులో టిఫిన్ చేసి కొసరుగా అక్కడున్న పేపర్ని ఆసాంతం చదివేసి ఆ విశేషాలమీద చర్చించుకొని(వీలైతే కొన్నిసార్లు చిన్నపాటి వాదనలు/గొడవలు కూడా పెట్టుకొని) తీరిగ్గా కాలేజీకి వెళ్ళటం మా దినచర్య. ఈ చర్చలన్నింటిలో మా మూర్తి కూడా మహోత్సాహంతో పాల్గొనేవాడు. ఒకరోజు ఉదయం మిత్రబృందం అంతా యధాప్రకారం టిఫిన్ కుమ్మేస్తున్నాం. మూర్తి మాకన్నా కొంచెం ముందుగా తినేసి బయటకెళ్ళి పేపరు చదువుతున్నాడు. ఉన్నట్టుండి బయటనుంచి పెద్దగా అరుపులు,కేకలు. తేరుకొని చూద్దుం కదా బయట మా మూర్తి రౌద్రమూర్తిగా మారిపోయి శివతాండవం చేస్తున్నాడు. పైగా మధ్య మధ్యలో 'ఎంత ధైర్యం ఈ అమెరికా వాడికి' అనీ 'ఇండియా మీదే దాడి చేస్తానంటాడా' అనీ అరుపులొకటి. అప్పుడే సీనులోకి ఎంటరయిన మాకు విషయం అర్థం కాలేదు. నెమ్మదిగా మూర్తిని చల్లబరిచి అసలు సంగతి అడిగితే అనాటి 'ఈనాడు' లో తాటికాయంత అక్షరాల్తో వచ్చిన వార్తని చూపించాడు. ఇంతకీ ఆ వార్త హెడ్లైన్స్ ఇదీ 'కాశ్మీర్లోని శిబిరాలపైన దాడి జరపడంలో తప్పులేదు - జార్జి ఫెర్నాండెజ్'. అంతే, అప్పటిదాకా మూర్తి అరుపులతో మార్మోగిన టిఫిన్ సెంటర్ మా నవ్వుల్తో దద్దరిల్లసాగింది.
అసలు విషయమేమిటంటే అంతకు ఒకటి రెండు రోజుల క్రిందట అమెరికా, తీవ్రవాద శిబిరాలున్నాయనే నెపంతో సిరియా,సూడాన్ ల రసాయన కర్మాగారాలమీద వైమానిక దాడులు నిర్వహించింది. దాని తర్వాత అప్పటి సదరు మన రక్షణ మంత్రి గారు కాశ్మీర్ లోని తీవ్రవాద శిబిరాలపై భారత సైన్యం మాత్రమెందుకు దాడులు చెయ్యకూడదు అని అర్థం వచ్చేటట్లు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మూర్తిగారి జనరల్ నాలెడ్జి ప్రకారం జార్జి, జేమ్సు, బిల్లు లాంటివన్నీ అమెరికా పేర్లే. దాంతో మావాడు ఇదేదో అమెరికా వాడు జారీ చేసిన ప్రకటన అనుకున్నాడు. అదీ సంగతి.
10 comments:
హ్హ హ్హ హ్హ!!!
బావుంది!
బ్లాగ్వనాల్ని బ్లాగ్దావాగ్ని దహించేస్తుంది :D
చాలా బాగుంది ... !!
హ్హ హ్హ హ్హ ....చాలా బాగుంది
బాగుంది
మా స్నేహితుడు ఒకడు విమానం మీద లండన్ లొ దిగ బోతు లండన్ రాజధాని ఏమిటన్నాడు. అలా ఉన్నది. మీ ఆఖ్యాన శైలి చాలా బాగున్నది....
మీ అప్పడం టపా లొ పద్యం బాకీ బడ్డారు. రాకేశ్వరుడు సూచించినట్లు ప్ప ప్రాసతో కందం గురించి చూస్తున్నాను.
చాలా బాగుంది! మరిన్ని జ్వాలలతో మీ బ్లాగాగ్ని ని ఇంకా ప్రకాశింపచేయండి!!! :-)
అయ్యా మీరు ఎక్కడ ఉన్నారు?ఈ మధ్య కాలంలో మీ టపాలూ లేవు?నవంబర్,డిసెంబరు ఐపొయాయి,జనవరి కూడా చివరికొచ్చింది మీరు మూడేసి నెలలకొక బ్లాగు వ్రతం పెట్టుకున్నా ఆ గడువూ ముగుస్తోంది మరి.
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
Post a Comment