Friday 5 September, 2008

ఏ కులమూ నీదంటే

నరసరావుపేట యం.సి.ఏ రోజుల్లోని ఒక మరచిపోలేని జ్ఞాపకం శ్రీశైలం, నాగార్జున సాగర్ యాత్ర. మా మిత్రబృందంలో ఒకడికి అనిపించిందే తడవుగా అందరం సిద్ధమయిపోయాం. బడ్జెట్ ప్రయాణం కావటాన బయల్దేరటానికి ముందుగానే మాలో ఒక మిత్రుడు అక్కడి వివరాలు కొన్ని సంపాదించాడు. అందులో ముఖ్యమైనదీ, మా చెవుల్లో పాలుపోసినట్లు వినిపించిందీ - శ్రీశైలంలో ఎక్కడ పడితే అక్కడ ధర్మసత్రాలుంటాయని, వాటిల్లో వసతి, భోజనం ఉచితంగా లభిస్తాయని. అదృష్టం కొద్దీ మేము మాట్లాడుకున్న జీపువాడు కూడా తన కొడుక్కి నాగార్జున సాగర్ చూపించాలని ఎన్నాళ్ళనించో అనుకుంటూ వుండటంతో తక్కువకే బేరం కుదిరింది. మొత్తానికి తలా రూ.300/- లతో(అక్షరాలా మూడువందల రూపాయలు మాత్రమే) ఏడుగురం మిత్రులం ఒక శుభరాత్రి బయల్దేరి మార్కాపురం మీదుగా తెల్లవారేప్పటికి శ్రీశైలం చేరాం. షరా మామూలుగానే పాతాళగంగలో మునకేసి, స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆత్మారాముడి గోల పడలేక భోజన సత్రాలకై వెదకటం మొదలెట్టాం. అప్పుడు తెలిసిన గొప్ప నిజమేమిటంటే అక్కడి సత్రాలు చాలావరకు caste based. అంటే ఏ కులంవారి సత్రంలో ఆ కులంవారికే వసతి లభిస్తుంది. కొన్ని సత్రాలు ఇతర కులాలవారికి కూడా భోజనం మాత్రం పెడతాయిగానీ వేరుగా కూర్చుని తినాలి. ఏం చెయ్యాలో ఒక్కడికీ పాలుబోలేదు. ఒకేకులానికి చెందిన వాళ్ళతోనే ఇట్లాంటి చోట్లకి రావాలని మాకు తెలియదింకా అప్పటికి.

మాలో ఇద్దరు ఫలానా1, మరో ఇద్దరు ఫలానా2, ఇక మిగతా ముగ్గురూ వేర్వేరు ఫలానాలన్నమాట. చూడబోతే ఒక్కోడూ ఒక్కోగదిలో వుండాల్సొచ్చేట్టుగా వుంది. అసలు వూరొచ్చిందే అంతా కలిసి ఎంజాయ్ చేద్దామని. మరెలా? సరే చించగా చించగా, గది ఇచ్చే ముందు ఇంటిపేరు, గోత్రం అడగటం చూసి ఒకడికి బ్రహ్మాండమైన లైటు వెలిగింది. ఫలానా1 కి సంబందించిన ఏవో ఒక గోత్రం/ఇంటిపేరు కాంబినేషను బట్టీ వేయించేసి ఒకడిని మాతోపాటు మా ఫలానా1 సత్రంలోకి లాగేశాం. మిగతా ఇద్దరు ఇతర ఫలానాలక్కూడా ఫలానా2 తాలూకు కాంబినేషన్లు బట్టీ పట్టించి వాళ్ళని ఫలానా2 లోకి విజయవంతంగా తోసేశాం(అని అనుకున్నాం). మాతో పాటు వచ్చినవాడు మేమే వార్నీ అనుకునే స్థాయిలో తడుముకోకుండా గోత్రనామాలు చెప్పిపారేశాడు. అవతల కూడా అంతా హ్యాప్పీసే అనుకుంటూ హాయిగా భోంచేసి గదిలో తొంగున్నాం.

అవతలి సత్రంలో ఒక చిన్నతేడా జరిగింది. గదులు ఇవ్వటానికి కూర్చున్నవాడికి మా బట్టీవీరుల్ని చూసేసరికి ఏం అనుమానం వచ్చిందో ఏమో, ఇంటిపేరు/గోత్రం తో సరిపెట్టకుండా మేనమామ గోత్రం చెప్పమని అడిగాడు ఒక బట్టీబాబుని. దాంతో కంగారుపడ్డ మావాడు ఏం చెప్పాలో తెలియని టెన్షన్లో వెనకనించి మావాళ్ళు సైగచేస్తున్నా పట్టించుకోకుండా 'ఆయనదీ అదే గోత్రం' అనేశాడు. చచ్చింది గొర్రె. గొడవ మొదలు. నీ అసలు కులమేమిటో చెప్పమని అంటాడు సత్రంవాడు. మావాడికీ ఆవేశమొచ్చి 'మంచితనానికి మాలని, మానవత్వానికి మాదిగని, అమ్మతనానికి కమ్మని ...(మిగతా డైలాగు గుర్తులేదు)'తో సరిసమానమైన డైలాగు వేశాడు బాలయ్య లెవెల్లో. కానీ అస్సలు కళాహృదయంలేని సత్రంవాడు ఆ డైలాగునేమాత్రం పట్టించుకోలేదు. రచ్చ మళ్ళీ మొదలు. మావాళ్ళ తడబాటు చూసి సత్రకాయగాడికి అనుమానం నిర్థారణ అయిపోయింది. దాంతో వాడు 'వీడు మావాడని మీరెవరైనా నిరూపిస్తే సంవత్సరం పాటు ఉచితంగా మీఇంట్లో పని మనిషిగా చేస్తాను' అని మావాళ్ళకి సవాళ్ళుకూడా విసరటం మొదలెట్టాడు. ఇక పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించి మావాళ్ళే నెమ్మదిగా అక్కడినించి జారుకున్నారు.

జరిగిన విషయం సాయంత్రం విన్న నేను మావాడూ విరగబడి నవ్వాం రవితేజలా, వెకిలిగా. అసలు ఇలాంటి విషయాన్ని ఎలా మానేజి చెయ్యాలో మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిందిగా ఒక ఉచిత సలహా కూడా పారేశాం వాళ్ళమొహాన. కానీ మాకేం తెలుసు ఆరోజు రాత్రికే మాక్కూడా గర్వభంగం జరగబోతోందని.

షాపింగ్ పేరుతో సాయంత్రమంతా తిరిగి, పనిలో పనిగా శ్రీశైలం వచ్చిన అమ్మాయిలందరినీ కవర్ చేసేసి బాగా పొద్దు పోయాక సత్రానికి తిరిగొచ్చాం. మర్నాడు పొద్దున్నే బయల్దేరి సాగర్ వెళ్ళాలనేది ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం. సాయంత్రమంతా బయట అడ్డమైన చెత్తా తిన్నందువల్ల నాకూ, నాతో పాటు ఇంకొకడికీ ఆకలివెయ్యలేదు. దాంతో వెళ్ళి భోంచేసి రమ్మని మాతో వున్న బట్టీబాబుని మాత్రం పంపించాం. ఉత్సాహంగా తలూపి వెళ్ళినవాడు కాస్తా కాసేపటికి ఖంగారుగా తిరిగివచ్చి 'భోజనం చేస్తుంటే అంతా నన్నే పరీక్షగా చూస్తున్నారురా మామా' అనేశాడు. అంతే మా ఇద్దరికీ గుండెల్లో అణుబాంబులు పేలాయి. వార్నాయినో కొంపదీసి గుట్టురట్టవ్వలేదు కద అనుకుని మావాడిని అసలు ఏం జరిగిందో చెప్పమన్నా. భోజనానికి వెళ్ళగానే మగాళ్ళు అంతా చొక్కాలు విప్పి భోంచెయ్యాలని చెప్పారట. సరే అని మావాడు చొక్కా విప్పి చుట్టూ చూసేసరికి చాలామంది అవపోశనపడుతూ కనిపించారుట. అంతే మావాడు కూడా ఆవేశపడిపోయి ఏదో వాడికి తోచినట్లు అవపోశనపట్టి భోజనం చేసివచ్చాడు. వీడి వంటిమీద జంధ్యం లేకపోయినా అవపోశనపట్టేటప్పటికి జనాలు అనుమానంగా చూడటం మొదలెట్టారు. అసలు అది పూర్తిగా మావాడి తప్పు కూడా కాదు. ఆరోజు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు వాడికి చెప్పాం మమ్మల్నే చూస్తూ మేమెలా తింటే అలాగే తినమని. రాత్రి పక్కన మేము లేము కాబట్టి వేరేవాళ్ళని ఫాలో అయిపోయాడు వాడు సిన్సియర్ గా.ఇక చూస్కోండి ఏరాత్రప్పుడు వచ్చి బయటికి గెంటుతారా అని ఎదురుచూస్తూ, గెంటితే గెంటారు తన్నకుండా వదిలితే అదే పదివేలు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆరాత్రి గడిపాం. అదృష్టవశాత్తూ అలాంటివేమీ జరగకుండానే తెల్లవారింది. త్వరత్వరగా స్నానాలూ గట్రా కానిచ్చి బయటపడి ఊపిరి పీల్చుకున్నాం. నాగార్జునసాగర్ యాత్ర మాత్రం పెద్దగా సాహసకార్యాలు లేకుండానే పూర్తయింది. ఇది జరిగి దాదాపు పదేళ్ళవుతున్నా ఇప్పటికీ ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించే అనుభవం ఇది.

27 comments:

Kottapali said...

భలే రాశారు.
మిగతా ముగ్గురూ వేర్వేరు ఫలానాలన్నమాట.
చచ్చింది గొర్రె.
విరగబడి నవ్వాం రవితేజలా, వెకిలిగా.
అంతే మావాడు కూడా ఆవేశపడిపోయి ఏదో వాడికి తోచినట్లు అవపోశనపట్టి భోజనం చేసివచ్చాడు.
ప్రయోగాలు అద్భుతగా ఉన్నాయి.

సుజాత వేల్పూరి said...

భలే రాశారు నిజంగానే! శ్రీశైలంలో ఉన్న దాదాపు అన్ని సత్రాలూ కులం బేస్ గానే ఏర్పడ్డాయి. ఇప్పుడు చెప్తున్నాను, ఇలాగే మా కుటుంబంతో పాటు స్నేహితుల పిల్లలని మా అమ్మ, నాన్న గారు ఒక సారి శ్రీశైలం తీసుకొచ్చినప్పుడు (ఇద్దరూ రెడ్లు కావడంతో)వాళ్లకి పేర్లు కూడా మార్చాల్సి వచ్చింది. ఒకడికి శర్మ, మరొకడికి శాస్త్రి అని పేర్లెట్టి మాతోపాటు తీసుకెళ్లాం. అప్పుడు మేము చిన్న పిల్లలం కావడంతో సంగతి సరిగ్గా అర్థం కాలేదు. శ్రీశైలం దాకా ఎందుకు, నరసరావు పేట పక్కనే ఉన్న కోటప్ప కొండలో కూడా ఉన్న నాలుగైదు భోజన సత్రాలూ కులం బేస్ గా ఉన్నవే! తప్పదు లెండి!

అయితే నరసరావు పేట బ్లాగర్లలో ఇంకోర్ని చేర్చుకోవచ్చన్నమాట.

Kathi Mahesh Kumar said...

బాగుంది తతంగం.

ఉమాశంకర్ said...

చాలా చాలా చాలా బాగా రాశారు.

దయచేసి రాస్తూనే ఉండండి.. మానొద్దు

/ఉమాశంకర్

durgeswara said...

emichestaam naayanaa meekemo tirdhayaatralu vihaarayaatralayipoyaayi. vaallakemo annadaanam kulasevalaa maarimdi. kalimaaya. chaduvukunnaavukadaa aalochimchu, muslimlu makkaaku, cristian lu betlehaam ku yaatrachesetappudu, ilaa chestaaraa? ammaayilanu choodataaniki akkadadaakaaemdukunaayanaa manapakkaveedhichaalu.

Bhãskar Rãmarãju said...

ఒక జంధ్యం పోగు అని రాసేస్తే బాపనోడ్నిని represent చేసేయొచ్చు. వాహ్!! క్యా బాత్ హై మియా. కులం అంటే రెండే తరగతులు. ఒకటి బాపనోడు, ఇంకోటి బాపనోడు కానివాడు.
అలాంటప్పుడు రెండే రెండు సత్రాలు ఉండాలిగా? బ్రాహ్మణ సత్రం, నాన్-బ్రాహ్మహణ సత్రము. మరి కమ్మ సత్రం, రెడ్డి సత్రం, అదేదో సత్రం, ఇన్ని దేనికి, వాటికెందుకుబోలేదు మీరు? వాటికెళ్ళి ఇలా జేసుండాల్సింది?

కులం మీద రాయెచ్చు, నేను రాశాను. కాని తక్కువజేసి మాట్టాడొద్దు.
"రాసేవాడికి చదివేవాడు లోకువ.
ఇంకెవడికైనా పక్క కులం వాడు లోకువ.
నీలాంటి వాళ్ళకి బాపనోళ్ళు లోకువ."

Anil Dasari said...

@బ్లాగాగ్ని:

ఇదే మొదటిసారి మీ బ్లాగులో అడుగు పెట్టటం. మీ బ్లాగు ట్యాగ్ లైన్ అదిరింది :-) టపా మరింత నవ్వు తెప్పించింది.

@సుజాత:

పబ్లాసం (పలనాడు బ్లాగర్ల సంఘం) ఎప్పుడు మొదలెట్టబోతున్నారు?

@భాస్కర్ రామరాజు:

ఇక్కడ బ్రాహ్మలు తక్కువ, మిగతావాళ్లు ఎక్కువ అనే ఫీలింగులేమీ లేవు. బ్లాగాగ్ని రాసింది చదివి కాసేపు నవ్వుకుని తర్వాత మర్చిపోవటమే కానీ మరీ అంత సీరియస్‌గా తీసుకుంటే ఎలా? సరదాగా తీసుకోండి.

Bhãskar Rãmarãju said...

>>బ్లాగాగ్ని రాసింది చదివి కాసేపు నవ్వుకుని తర్వాత మర్చిపోవటమే కానీ మరీ అంత సీరియస్‌గా తీసుకుంటే ఎలా? సరదాగా తీసుకోండి
??సరదాగా తీసుకోవాలా? సరే..మీ బ్లాగు మీ ఇష్టం!! మీరు ఎలా చెప్తే అలానే!!

Bhãskar Rãmarãju said...

@అబ్రకదబ్ర
FYI: నర్సారావుపేట పల్నాడులోది కాదు

Rajendra Devarapalli said...

బాబ్బాబు తొరగా ఆపని చెయ్యండి,అప్పుడు మేము మిగుబ్లాసం(మిగతా గుంటూరు జిల్లా బ్లాగర్ల సంఘం)పెట్టుకుంటాం.:)

Anil Dasari said...
This comment has been removed by the author.
Anil Dasari said...

@భాస్కర్ రామరాజు

నరసరావుపేటకి 'Gateway of Palanadu' అని పేరు. అది పలనాడులో భాగం కాకుండా ఎలా పోతుంది?

BTW, ఇది నా బ్లాగు కాదు. లేనిపోనిది, బ్లాగాగ్ని మీ మాటని అపార్ధం చేసుకున్నాడంటే మూడో కన్ను తెరిచి నన్ను దహించేస్తాడు :-)

@రాజేంద్రకుమార్

ముందు గుబ్లాసం పెడదాం. తర్వాత కొట్టుకుని విడిపోయి పబ్లాసం, మిగుబ్లాసం పెడదాం. అప్పుడు రెండు గ్రూపుల మధ్యా కోళ్ల పందాలు కూడా పెట్టుకోవచ్చు ఎంచక్కా :-)

Anonymous said...

నేను శ్రీశైలం ఎప్పుడూ వెళ్ళలేదు. కాని మొదటి సారి వీటి గురించి విన్నప్పుడు నేను నమ్మలేదు.

మీర్రాసిందంతా బాగా నవ్వు తెప్పించింది, కాని అందులో అండర్ కరంట్ మాత్రం, ఎప్పుడూ తెలుస్తానే వుంది.

"విరగబడి నవ్వాం, రవితేజలా, వెకిలిగా"... ఇది పేలింది.

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,
త్వరలోనే మొదలు పెడదాం!నరసరావు పేట gateway అని భాస్కర్ గారికి మీరే చెప్పారు కాబట్టి, ఇక నేను స్పందించక్కర్లేదు!

రాజేంద్ర కుమార్ గారికి మీరు ఇచ్చిన సమాధానం కూడా సూపర్ గా పేలింది. మా ఆయన కూడా విరగబడి నవ్వారు.(BTW ఈయన్ని నమ్మడానికి లేదు, వాళ్లది వెస్ట్ గొడావరి)

రాజేంద్ర కుమార్ గారు,
నేను ఇటు పల్నాడు బ్లాగర్ల సంఘంలోనూ, అటు గుంటూరు బ్లాగర్ల సంఘంలోనూ కూడా మెంబర్ గా ఉంటాను! ఎందుకంటే నేను రెంటికీ మధ్యలో ఉన్నాను కదా!

Anonymous said...

బ్లాగాగ్ని, అదిరింది జాబు. కొత్తపాళీ రాసినదానికి నా తరపున 'సత్రకాయ'ను కూడా కలుపుకోండి.

సుమారో ఇరవై యేళ్ళ కిందట నాకూ ఇలాంటి అనుభవమే కలిగింది. నేను ఒక్కణ్ణే వెళ్ళాను శ్రీశైలం. దేవస్థానం వాళ్ళదో ప్రభుత్వానిదో సత్రమొకటుందక్కడ. వాడు నాకు గది ఇవ్వనన్నాడు -ఒక్కణ్ణే కాబట్టి. అంతకుముందెప్పుడో ఒక్కళ్ళే వచ్చి ఆత్మహత్య చేసుకున్నారట, అంచేత ఒక్కళ్ళకే గది ఇచ్చే ఆనవాయితీ లేదట అక్కడ. :) మరిప్పుడెలాగ అంటే.. నీదే కులం అని అడిగాడు. చెప్పా. మరింకేం అదిగో పలానా చోట మీ సత్రముంది అక్కడికి పో అన్నాడు. అక్కడికి పోతే వాళ్ళు నా గోత్రం అడిగారు. తెలీదన్నాను. తెలీదు మరి! మరో ప్రశ్న అడగలేదు, గది ఇచ్చారు. భోజనమూ పెట్టారు.

ఇంకో సంగతి.. పెళ్ళిళ్ళ సమయంలో తమ కులానికి చెందిన సత్రం చాలనప్పుడు, వేరే కులాల సత్రాలను తీసుకుంటారనుకుంటా -అద్దెకో, మరి ఊరికినే ఇస్తారో!

Anonymous said...

అన్నట్టు గుబ్లాసం, మిగుబ్లాసాల్లో నన్ను కూడా వేసుకోండి.

Anonymous said...

అద్దిరింది, బ్లాగాగ్ని గారు నేను వళ్ళ బ్లాగుని బట్టీ వారెలో ఉంటారో ఊహించటానికి అందరిలానే కొంచం బుర్ర పెడతా మీ గురించి మాత్రం ఆలోచిస్తే మీ బ్లాగులోని పై ఫోటోనే స్పురిస్తుందండీ... అబ్బా ఆ పిక్, ఆ క్యాపశన్, ఈ టపా అదిరాయి

Bhãskar Rãmarãju said...

@అబ్రకదబ్ర: నేను పుట్టి పెరిగింది, మా నాన్న గారు, మా తాత ముత్తాతలు..మా రూట్ రామరాజు మొత్తం పల్నాడులోనే. నర్సరావుపేట పల్నాడులోదా కాదా పల్నాటివాళ్ళకన్నా బాగా మీకు ఎలా తెల్సిందో, మీరు ఎలా నిర్ణయించారో నాకర్ధం కాల...
సరే అది ఈ పోష్టులో అప్రస్తుతం..


థాంక్సులు

బ్లాగాగ్ని said...

కొత్తపాళీ, సుజాత, ఉమాశంకర్, చదువరి, అశ్విన్, ఇండిపెండెంట్, అబ్రకదబ్ర - బోలెడు థాంకులు.

భాస్కర్ - మీకలా ఎందుకనిపించిందో నాకు తెలియదు. ఎవర్నీ తక్కువ చెయ్యటం ఈ టపా ఉద్దేశ్యం కాదు.

దుర్గేశ్వర - ముస్లిములు, క్రిస్టియన్లు ఏం చేస్తారో నిజంగా నాకు తెలియదండీ. కానీ చదువుకునే వయసులో వున్న కుర్రాళ్ళు చాలామంది మాత్రం ఇలానే వుంటారు. కామెంటినందుకు ధన్యవాదాలు.

బ్లాగాగ్ని said...

మహేష్ , రాజేంద్ర - మీకుకూడా బోలెడు థాంకులు. హడావుడిలో పైన మీ పేర్లు మిస్సయ్యాయి చూసుకోలేదు :)

దైవానిక said...

రాజేంద్ర గారు, సుజాత గారు
అప్పుడు మేము గుంకామితెబ్లాసం పెడతాం (గుంటూరు జిల్లా కాకుండా మిగతా తెలుగుదేశం బ్లాగర్ల సంఘం)

బ్లాగాగ్ని, బాగుంది

రాధిక said...

బ్లాగాగ్ని.....kevvvvv.....

"రెండు గ్రూపుల మధ్యా కోళ్ల పందాలు కూడా పెట్టుకోవచ్చు ఎంచక్కా".....keakaaaaaa......

Anil Dasari said...

రాంరాజు గారోయ్,

వామ్మో.. ఇంకాస్తుంటే బాలకృష్ణ స్టైల్లో 'మీ వీధికొస్తా, మీ ఇంటికొస్తా, దాబే .. కొట్టుకుందామా' అనేటట్లున్నారే :)

గొడవెందుకులెండి.నర్సరావుపేటని పల్నాడు నుండి గెంటేస్తానంటే అలాగే.

అన్నట్లు, నేనూ బ్రహ్మనాయుడి వారసుడ్నేనండీ. క్లూ ఇచ్చేశాగా, మా ఊరేదో అర్ధమైపోయిందనుకుంటా.

Bhãskar Rãmarãju said...

అన్నా అబ్రకదబ్ర మరియూ పల్నాటి బ్లాగుసోదర సోదరీమణులూకు:
నర్సరావుపేట ని పల్నాడులో అతికించటాకి నేనెవ్వడ్ని? పల్నాడ్లోంచి తెగ నరకటాకి నేనెవ్వడ్ని. నరసరావుపేట వయస్సు 200 సంవత్సరాలు. పల్నాటి వయస్సు 2000 సంవత్సరాలు, లేక ఇంకా ఎక్కువే. "గేట్ వే ఆఫ్ పల్నాడు" అని ఇంగ్లీషోళ్ళు అన్నారేమో, నేనెప్పుడు విన్లా.
ఏమైనా, కొట్టుకునేదాకా దేనికి. నాకాల్లో 50వేల ముల్లులున్నై. వాటినితీస్కోలేక అల్లాడుతున్న. ఇంక ఈ కొట్లాటలు నాకుదేనికి. నర్సరావుపేట పల్నాడులోదే. పల్నాడు నర్సరావుపేటలోదే. పల్నాడుకి ఇంకో పేరు నరసరావుపేట. ఇంతే సంగతులు. చిత్తగించవలెను.థాంక్సులు.

Mitra said...

For some one who is researching the origin of caste system, can find useful information on this post and responses it received.

Particularly. పబ్లాసం, గుబ్లాసం, మాబ్లాసం, నీబ్లాసం, వాడిబ్లాసం ... ఇంకా ... ఈ గ్రూపుల మధ్యా కోళ్ల పందాలు కూడా పెట్టుకోవచ్చు (similar to fighting between various castes).

Shanmukhi Goli said...
This comment has been removed by the author.
Shanmukhi Goli said...

Hi,

Just a suggestion. Why can't you zip and upload the Chandamama files to Rapidshare/Megaupload and share the links here. Instead of using the tool, downloading and doing lot of other stuff.

I tried using the downloader tool and for what ever the year, i try, it is giving an error message telling that the requested page not found on the server. I tried for almost 1 day with all possible years with no success.

I greatly appreciate your help if you can share the Rapidshare/Megaupload links.

Regards,
Shanmukhi Goli.
shanmukhig@live.com
Micrsoft India R&D Pvt. Ltd.
Hyderabad.