Monday 16 November, 2009

రీయూనియన్ -1 (నా మొదటి సస్పెన్స్ కథ)

ఫోను గణగణా మ్రోగుతోంది. గాఢనిద్రలో ఉన్న నేను ఉలిక్కిపడి లేచాను. గడియారం అయిదు గంటలు చూపిస్తోంది. ఎవరో ఇండియానుంచి. ఈ సమయంలో ఎవరబ్బా అనుకుంటూ ఎత్తి హలో అన్నాను వీలయినంతగా విసుగును దాచుకుంటూ. “భాస్కరం ఉన్నాడాండీ” అంటున్నారెవరో అవతల్నించి. ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. మా పల్లెలో వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ నన్నలా పిలవరు. ఎన్నో ఏళ్ళ క్రితం అమెరికా వచ్చి స్థిరపడిన నేను భాస్కర మూర్తిగానో లేక కె.బి.మూర్తిగానో మాత్రమే అందరికీ పరిచయం. ఆశ్చర్యాన్ని దాచుకుని బదులిచ్చా “నేనే మాట్లాడుతున్నాను, మీరెవరండీ”. అటువైపునుంచి కాస్త ఉద్విగ్నత నిండిన స్వరంతో వినిపించింది "నేనురా భాస్కరం, దివాకరాన్ని". ఒక్కసారి నేనున్నది కలో నిజమో అర్థం కాలేదు. దివాకరం పదవ తరగతి వరకూ నా సహాధ్యాయి. దాదాపు ముఫ్పై ఏళ్ళ తరువాత ఇదే వాడితో మాట్లాడటం. కుశలప్రశ్నలు, ఇద్దరమూ ఇప్పుడేం చేస్తున్నది వగైరా వివరాలన్నీ అయ్యాక చెప్పాడు అసలు సంగతి. “ఒక్కసారి శేఖరం, విశ్వేశ్వరం లను కూడా తీసుకుని పల్లెకు వస్తే చాలారోజుల తరువాత కలిసినట్టూ వుంటుంది పల్లె చూసినట్లూ వుంటుంద”ని. ఒక్క క్షణం ఆలోచించి సరేనన్నా. మరికాసేపు పిచ్చాపాటి మాట్లాడి మిగతా ఇద్దరితో ఈ విషయం చెప్పి ఒప్పించే బాధ్యత నామీద పెట్టి సెలవు తీసుకున్నాడు దివాకరం.

తిరిగి వచ్చి పడుకున్నానేగానీ నిద్ర పట్టలేదు. ఒక్కసారిగా నన్ను నోస్టాల్జియా ఆవరించింది. మేం నలుగురం పదవతరగతి వరకూ ఒక జట్టు. ఊరంతటికీ పోకిరి కుర్రాళ్ళుగా అప్పట్లో మంచి(?) పేరే వుండేది నలుగురికీ. మా పేర్ల చివరి అక్షరాలని బట్టి రమ్ బాచ్ అని పిలిచే వాళ్ళు ఊరి జనాలు. చిన్న చిన్న అల్లరి పనులనుంచీ ఒక మోస్తరు రౌడీ వేషాల వరకూ మేము చెయ్యని వెధవ పని లేదు. ఎంత అల్లరి చిల్లరగా తిరిగినా ఆశ్చర్యంగా నలుగురం జీవితంలో మాత్రం బాగానే స్థిరపడ్డాం. శేఖరం నేను వచ్చిన అయిదేళ్ళకి అమెరికా వచ్చేశాడు. విశ్వేశ్వరం హైదరాబాదులో గవర్నమెంటు ఉద్యోగి అని విన్నాను. దివాకరం మాత్రం పల్లెలోనే వ్యవసాయం చేస్తూ ఉండిపోయాడు. ఇన్నాళ్ళకి మళ్ళీ ఇలా వాడితో మాట్లాడే అవకాశం వచ్చింది. తెల్లవారుతూనే శేఖరానికి ఫోన్ చేసి విషయం చెప్పాను. తనకి పైనెలలో ఇండియా వెళ్ళాల్సిన పని ఉందనీ అప్పుడైతే వీలవుతుందనీ చెప్పాడు. నేనూ అదే సమయానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. నా భార్యా పిల్లలు రావటానికి అంతగా సుముఖత చూపించలేదు, నేనూ పెద్దగా బలవంతం చెయ్యలేదు. ఎక్కువ సమయం స్నేహితులతో గడపాలంటే ఒంటరిగా వెళితేనే మంచిదని అనిపించింది నాకు. విశ్వం నంబరు కూడా సంపాదించి వాడికీ విషయం చెప్పాను. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇక మేమంతా కలుసుకోబోయే రోజుకోసం ఎదురుచూడటం ప్రారంభించాను.

హైదరాబాదులో దిగగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు దివాకరం. మనిషిని చూస్తే వాడికి యాభై ఏళ్ళని నమ్మేట్లు లేదు. ఇంకా దృఢంగానే వున్న శరీరం, అక్కడక్కడా మాత్రమే నెరిసిన జుట్టు, వాడి వయసు ముప్ఫై, ముప్ఫై అయిదంటే ఎవరైనా నమ్మేస్తారు. ఎయిర్పోర్ట్ నుండి సరాసరి విశ్వం ఇంటికెళ్ళి వాడిని ఎక్కించుకుని పల్లె చేరాం. ఊరి చివర తోట బంగళాలో మా బస ఏర్పాటయ్యింది. "పల్లెలో సెల్ నెట్వర్కులేవీ పనిచెయ్యవురా, అదొక్కటి తప్పితే మీరుండటానికి ఇక ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాను" అంటున్న దివాకరం వంక కృతజ్ఞతగా చూశాము ముగ్గురమూ. పూర్తి ఏకాంత ప్రదేశం. ఉదయం, సాయంత్రం వచ్చి వంటపని, ఇంటిపని చేసి పోయే ఆవిడ తప్పితే ఇంకెవ్వరూ మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యరు. శేఖరం ఒక పూట మాత్రం ఉండి వేరే ఏదో పని ఉందనీ అది చూసుకుని రెండు రోజుల్లో మళ్ళీ వస్తాననీ చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి మాంచి మందు పార్టీ ఏర్పాటు చేశాడు దివాకరం. పెగ్గు మీద పెగ్గు బిగిస్తూ ముగ్గురం ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. చర్చ అటు తిరిగీ ఇటు తిరిగీ మా స్నేహ బంధం మీదకు మళ్ళింది. తాగింది బాగా ఎక్కిందో ఏమో నేనూ విశ్వం "ఈ ప్రపంచంలో మాకన్నా గొప్ప స్నేహితులుండరు" అని నిర్ణయించేశాం. దివాకరం ఏదో ఆలోచిస్తూ సీరియస్ గా ఉన్నాడు. వాడేం మాట్లాడక పోయేటప్పటికి ఏమిటనడిగా. "నిజంగా మనది అంత గొప్ప స్నేహం అంటావా?" అడిగాడు వాడు. "సందేహం ఏమయినా ఉంటే చెప్పు, నిరూపించి చూపిస్తా" అన్నాడు విశ్వం. "అంటే ఇప్పుడు మీరు నాకోసం ఏమయినా చెయ్యటానికి సిధ్ధమా" అడిగాడు దివాకరం. "అడిగి చూడరా. నీకోసం చంపటానికైనా, చావడానికైనా మేం సిధ్ధమే" అన్నాను నేను సినీ ఫక్కీలో. "అవును, అడిగి చూడు, చేస్తామో చెయ్యమో నీకే తెలుస్తుంది" వంత పాడాడు విశ్వం. "నాకోసం ఒక హత్య చెయ్యాలి, చేస్తారా?" అడిగాడు దివాకరం. ఈసారి వాడి గొంతులో మందు తాలూకు నిషాలేదు. వాడడుగుతున్నది నిజంగానో లేక హాస్యానికో మా ఇద్దరికీ అర్థం కాలేదు. "సరేరా, ఇంతకీ నీకు మేం ఏం సహాయం చెయ్యాలో చెప్పు" మళ్ళీ అన్నాడు విశ్వం. "హత్య చెయ్యాలి, చెయ్యగలరా?" రెట్టించాడు దివాకరం. ఈసారి వాడి గొంతులోని కాఠిన్యం నాకు చెప్పకనే చెప్పింది వాడా మాటలు హాస్యానికి అనటంలేదని. విశ్వానికి ఇంకా నమ్మకం కుదిరినట్లు లేదు, "సరేరా, నీక్కాస్త ఎక్కువైనట్లుందిగానీ రేప్పొద్దున మాట్లాడుకుందాం" అంటూ లేవబోయాడు. "నేనడిగేది నీకంత హాస్యంగా వుందా?" అనరిచాడు దివాకరం, కోపంతో వణికిపోతూ. మేమిద్దరం ఆశ్చర్యపోయాం, సాధారణంగా దివాకరం చాలా కూల్ గా ఉంటాడు మా నలుగురిలోకీ. అలాంటిది ఇంత ఆవేశపడుతున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? వాతావరణం కాస్త తేలిక చేద్దామని తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అన్నా "సరేరా, చేస్తాం. కానీ అసలు మేమెవర్ని చంపాలో అది చెప్పు ముందు". "శేఖరాన్ని" తూటాలా తిరుగు జవాబు వచ్చింది వాడినుంచి. "ఏమిటీ?!" ఒకేసారి అరిచాం నేనూ, విశ్వం. మా ఇద్దరి నిషా దెబ్బకు దిగిపోయింది.

(ఇది నా మొదటి ప్రయత్నం. బాగుందనిపిస్తే చెప్పండి. బాగాలేదనిపిస్తే మాత్రం తప్పక చెప్పండి. మీ సలహాలూ, సూచనలకు స్వాగతం.)

8 comments:

Anil Dasari said...

కథ సగంలోనే ఆపేసినట్లుంది. అప్పుడే బాగుందనీ, లేదనీ చెప్పటం కష్టం. ఇప్పటిదాకా అయితే కథనం బాగుంది. దివాకరం సెల్ ఫోన్ సిగ్నల్స్ లేనిచోటు కావాలనే ఎంచుకున్నట్లుంది.

పరుచూరి వంశీ కృష్ణ . said...

blogagni garu chaalaa baagundi....

వేణు said...

ఫణి గారూ!

మూడు నెల్ల విరామం తర్వాత మీ బ్లాగు టపాతో ‘రీ యూనియన్’ మాకు!

మీ కథ సగంలో ఆపేయటం వల్ల కూడా ఉత్కంఠ కొనసాగుతోంది.:)

"మేమెవర్ని చంపాలో అది చెప్పు ముందు" అన్నపుడు "శేఖరాన్ని" అంటాడని ముందే ఊహించాను!

‘రమ్ బాచ్’ పేరు సరదాగా ఉంది.

టైటిల్ ‘రీ యూనియన్-1’ కాబట్టి కనీసం రెండో పార్టు ఉందన్నమాట! మిగిలిన కథ కూడా త్వరగా రాసేస్తే, అప్పుడు మా అభిప్రాయాలు చెప్పటానికి బావుంటుంది.

బ్లాగాగ్ని said...

అబ్రకదబ్రగారూ, అవును, కథ ఇంకా పూర్తి కాలేదు. పూర్తిగా చదివి మళ్ళీ మీ అభిప్రాయం చెప్పగలరు .

వంశీ గారూ, నా కథ నచ్చినందుకు ధన్యవాదాలు. మిగతా భాగాలుకూడా చదివి మీ అభిప్రాయం చెప్పండి.

వేణు గారూ, అయితే నా మొదటి ట్విస్ట్ కనిపెట్టేశారన్నమాట. రాత్రికి పోస్టుచెయ్యబోయే రెండో భాగంలో మరో ట్విస్ట్ ఉంది, అది కనిపెట్టగలరేమో ప్రయత్నించండి :)

Ravi Varma said...

ఫణి గారు,
మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది.... తరువాత భాగం కోసం ఎదురు చూస్తున్నా...

శరత్ కాలమ్ said...

ఇది చదువుతుంటే ఒక బ్లాగు టపా చదివినట్లే వుంది. ఇలాంటి పొరపాటు నేను కూడా చేసాను. బ్లాగుల్లో మనం సాధారణంగా ప్రధమ పురుషలో వ్రాస్తాము కాబట్టి కథలూ, సీరియళ్ళూ అలాగే వ్రాస్తే బ్లాగు చదువుతున్నట్లు మాత్రమే వుంటుంది. బ్లాగుల్లో వ్రాసే కథలు తృతీయ పురుషలో వ్రాయడం బెటర్.

ట్విస్ట్ బావుంది కాబట్టి మిగతా భాగాల్లో ఏమవుతుందో అన్న ఉత్సుకత వుంది.

Anonymous said...

chala bagundi contiue cheyandi

Anonymous said...

baagundi.poortiga chadavaalanna asakti nelakondi