"పండిత
పుత్రుడు ప్రసాదుకి, నాన్న వ్రాయునది. సూటిగా
విషయానికొస్తాను. నీకు గడ్డాలు, మీసాలూ వచ్చి పదిహేనేళ్ళూ, డిగ్రీ
చేతికొచ్చి పదీ, ఉద్యోగమొచ్చి ఎనిమిదీ, బట్టతల
వచ్చి రెండేళ్ళూ గడిచాయి. అయినాగానీ నీకిప్పటికీ మాకొక కోడల్ని తీసుకురావాలని
మాత్రం అనిపించట్లేదు. ఇహ ఆగడం మా ఇద్దరివల్లా కాదు. నువ్వేదో మన సాంప్రదాయం
పిల్లని చేసుకుని ఆమెతో మాకు సేవలు చేయించకపోయినా ఫరవాలేదు. ఆమాటకొస్తే, మరాఠీనో, మళయాళాన్నో, కన్నడాన్నో, కొంకిణినో
ఏదో ఒక లంకిణిని చేసుకు తగలడితే చాలు. ఇహ నీకొక్క ఆర్నెల్లే గడువు, ఈలోపు
ఆ శుభఘడియలు రాకపోతే, మా కొడుకు పుట్టగానే బి.బి.భయానక్
సినిమాలు చూసి దడుచుకుని నిత్యానంద శిష్యుల్లో చేరిపొయ్యాడని సరిపెట్టుకుని, నేనూ
మీ అమ్మా ఆస్తంతా తీసుకుని హరిద్వార్ వెళ్ళిపోతాం. ఇక నీ ఇష్టం. అసలు ఫోన్ చేసి
నిన్ను ఝాడిద్దామనుకున్నాగానీ, నాకు
నీమీదున్న కోపానికి ఒక్కసారి మొదలెడితే నా మాట నేనే విననని మీ అమ్మే పట్టుబట్టి ఈ
ఉత్తరం రాయించింది - ఇట్లు విశ్వనాధం వ్రాలు" ఉత్తరం పూర్తి చేసిన ప్రసాదుకి
చెమటలు పట్టాయి. నాన్న పట్టుదల తనకు తెలుసు, ఇక
వాయిదాలు వేసి లాభం లేదు.
అప్పటికే ప్రసాదు భుజమ్మీదుగా తనుకూడా
ఉత్తరాన్ని చదివేసిన ప్రభు అన్నాడు "వ్యవహారం చాలా సీరియస్
అయినట్లుందిరోయ్". ప్రభు ప్రసాదుకి క్లాస్మేట్ కం రూమ్మేట్ కం కొలీగ్
అన్నమాట. "అవునురా, ఇంక తప్పించుకోవటానికి వీల్లేదు.
అర్జెంటుగా పెళ్ళికూతుళ్ళ వేట మొదలుపెట్టాలి" అన్నాడు ప్రసాదు. తేలిగ్గా
నవ్వేసిన ప్రభు, "ఇంతేగదా, మంచి
రోజు చూసి పెళ్ళిచూపులు మొదలెడితే సరి. ఇంతకీ నీకెలాంటి అమ్మాయి
కావాలనుకుంటున్నావు?" అనడిగాడు. దానికి ప్రసాదు కళ్ళు మూసుకుని గుండ్రాలు
తిప్పుకుంటూ "వాలు జడ, పెద్ద కళ్ళు, కోకిల
కంఠం ..." అంటుండగా ప్రభు అదిరిపడుతూ, "ఊహల్లోంచి
బయటికిరా చిట్టితండ్రీ. నువ్వలా గుండ్రాలు తిప్పుకుంటున్నప్పుడే నాకనుమానం
వచ్చింది. నేనడిగింది అది కాదు. ఏ టైప్ అమ్మాయి కావాలీ అని." అన్నాడు.
"టైప్ అంటే?" అడిగాడు ప్రసాదు వెర్రిమొహం వేసుకుని.
ప్రభు ఉత్సాహంగా మొదలుపెట్టాడు "అమ్మాయిలు మూడు రకాలు ...", ప్రసాదు
వెంటనే అందుకుని చెప్పాడు, "ఆ గుర్తొచ్చింది, సాత్వికం, ప్రచోదకం, భయానకం, కదూ!".
"నీ బొంద, నే చెప్పేది రజనీకాంత్ చెప్పిన తమిళ
టైపులు కాదు, అసలు సిసలు తెలుగు అమ్మాయిలు. ఇందాక
చెప్పినట్టుగా, వీళ్ళు మూడు రకాలు `నాటు`, `నీటు`, `ఘాటు`. వీళ్ళల్లో
నీకు ఎవరు సరైన టైపో ముందు తెలుసుకుంటే పెళ్ళి చూపుల్లో ఎలాంటి అమ్మాయిని
ఎంచుకోవాలన్నది సులువవుతుంది" అన్నాడు ప్రభు. ప్రసాదుకి ఆ చర్చ మీద ఆసక్తి
పెరిగిపోతుండగా, "చెప్పు గురూ" అన్నాడు కుతూహలంగా.
"మొదట నాటు రకం. వీళ్ళు పెద్దగా చదువుకోని పల్లెటూరి అమ్మాయిలు. భరించలేనంత
ప్రేమ చూపిస్తారు, అంతవరకూ బానే వుంటారు గానీ, ఏదైనా
తేడా వచ్చి చీపురు తిరగేశారో నీ బతుకు కేరాఫ్ కేర్ హాస్పిటలే. పెళ్ళామేగదా సరదాగా
నాలుగు తిట్లూ, కుదిరితే కాసిని దెబ్బలూ వేసుకోవచ్చు
అనుకుంటావేమో, నువ్వు చెయ్యెత్తేలోపే నీ చర్మం వలిచి
చెప్పులు కుట్టించుకోగల వీరనారులు వీళ్ళు"
తడారిపోతున్న గొంతును అతికష్టమ్మీద
స్వాధీనంలోకి తెచ్చుకుని అన్నాడు ప్రసాదు "మనకీ టైపు సరిపడదులే. అసలే
నాక్కాస్త నోటిదూలెక్కువ. మిగతా రకాల గురించి కూడా చెప్పు". ప్రభు
కొనసాగించాడు "రెండవది ఘాటు రకం. ఈ టైపు అమ్మాయిలు మేకప్ ధారాళంగానూ, బట్టలు
పొదుపుగానూ వేసుకుంటారు. వీళ్ళని భరించాలంటే నెలకి కనీసం రెండు-మూడు లక్షలు
సంపాదించగల జేబు బలం, సంపాదించినదాంట్లో ఒక పదివేలు మాత్రం
ఉంచుకుని మిగతాదంతా వీళ్ళ చేతుల్లో పోయగల దానగుణం, నెలాఖరులో
క్రెడిట్ కార్డు బిల్లు చూసి తట్టుకోగలిగే గుండె బలం, ఎక్కడెక్కడో
తిరిగి అర్థరాత్రి, అపరాత్రి ఇంటికొచ్చినా భరించగలిగే
క్షమాగుణం తప్పనిసరి. ఇంకా ..." అప్పటిదాక ఓపిగ్గా వింటున్న ప్రసాదు ఇక
తట్టుకోలేక గట్టిగా అరిచాడు "చాలురా బాబూ, ఇంక
చాలు. నువ్విలా చెపుతూవుంటే ఆర్.జీ.వీ., పూరీ
కలిసి డైరెక్ట్ చేసిన సినిమాని మంచమ్మాయిగారి వాయిస్ ఓవర్‌లో చూస్తున్నట్లుంది. ఇక
తట్టుకోవడం నావల్ల కాదు" అని లేచి వెళ్ళిపోబోతుండగా ప్రభు అన్నాడు
"ఆగాగు, మిగిలిన నీటు టైప్ గురించి కూడా
తెలుసుకో! అసలు ఈకాలం తెలుగు అమ్మాయిల్లో ఎక్కువమంది ఈ టైపే.మిగతా రెండు రకాలతో
పోలిస్తే ఈ రకమైన అమ్మాయిలు పరువుకు చాలా విలువిస్తారు." మధ్యలో అందుకుని
ప్రసాదు ఆశగా అడిగాడు "అంటే వీళ్ళు తన్నడాలు లాంటివి చెయ్యరన్నమాట".
ప్రభు కోపంగా చూస్తూ కొనసాగించాడు
"అదే మరి తొందరపాటంటే. పూర్తిగా విను. ఈ రకమైన అమ్మాయిలు మొగుడిని తిట్టినా, కొట్టినా
ఆవిషయం బయటికి మాత్రం తెలియనివ్వరు. వీళ్ళవి పోలీస్ దెబ్బలవటంవల్ల ఒళ్ళు హూనం
అయ్యేట్లు తన్నించుకున్నా బయటికి మాత్రం మామూలుగానే కనిపిస్తాం. వీళ్ళ తిట్లు కూడా
వాళ్ళ వాళ్ళ మొగుళ్ళకు మాత్రమే అర్థం అవుతాయి. ఉదాహరణకు, బయటి
వాళ్ళెవరితోనైనా `మా ఆయన ఒట్టి వాజమ్మండీ` అనే
బదులు `మా
ఆయన చాలా అమాయకుడండీ` అంటారు వీళ్ళు. దాని లోపలి అర్థం మొగుడు
ప్రాణికి మాత్రమే తెలుస్తుంది. `మా ఆయన చాలా పొదుపుగా ఉంటారండీ` అంటే
దానర్థం ..." ఉత్సాహంగా మధ్యలోనే అందుకుని పూర్తిచేశాడు ప్రసాదు "మా ఆయన
ఒట్టి పిసినిగొట్టు వెధవండీ అన్నట్లు, అంతే కదా" మెచ్చుకోలుగా చూసి
కొనసాగించాడు ప్రభు "శభాష్, ఇట్టే పట్టేశావు నువ్వు. ఇంకా విను, వీళ్ళ
కోరికలు చాలా సింపుల్. పొద్దున్నించీ రాత్రివరకూ తెలుగు, తమిళ, హిందీ
సీరియళ్ళని ఒక పట్టు పట్టడం, రెండ్రోజులకో సినిమా, వారానికోసారి
రెస్టారెంట్, నెలకో పట్టు చీర ఉంటే చాలు వీళ్ళకి.
ఎప్పుడైనా ముద్దొచ్చినప్పుడు తిట్టడం , మూడ్
బాలేనప్పుడు తన్నడం మామూలే."
అంతా విన్న ప్రసాదు సాలోచనగా అన్నాడు
"చూడబోతే ఈ సాఫ్ట్ రకం అమ్మాయిలే నాకు సరిపోతారనిపిస్తోంది" ప్రభు
సంతోషంగా అన్నాడు "అదీ, ఆమాత్రం క్లారిటీ ఉంటే చాలు. ఇంక ఇప్పుడు
నీకు కావలసినది ఒక మంచి ఫోటో ఆల్బం" అన్నాడు. "ఒక్క ఫోటో సరిపోదా? ఆల్బం
దేనికిరా" ప్రశ్నించాడు ప్రసాదు. "ఏడ్చినట్లుంది, ఈరోజుల్లో
జనాలకి ఏదైనా ఓవర్‌గా చేస్తేనే ఆనుతుంది. నాకు తెలిసిన ఒక ఫోటో గ్రాఫర్ ఉన్నాడు.
వాడి దగ్గరకెళ్దాం రేపు." అని ముగించాడు ప్రభు.
కట్ చేస్తే, `మాయా
బజార్`
స్టూడియో బయట నించున్నారు
స్నేహితులిద్దరూ. పరిచయాలవీ అయ్యాక ఫోటోగ్రాఫర్ మురళి చెపుతున్నాడు ప్రసాదుకు
"ఫోటోలు మీకెలాంటి టైప్‌లో కావాలన్నా నేను తియ్యగలను. ఉదాహరణకు మీరు
నడుస్తున్నట్లుగా పోజ్ ఇచ్చారనుకోండి, నేను దానికి గ్రాఫిక్స్ తో అటొక
సింహాన్ని ఇటొక పులిని కలుపుతానన్నమాట. అలాగే మీరు ఎగురుతున్నట్లుగా పోజ్ పెడితే
చాలు,
నేను దాన్ని మీరు ఈఫిల్ టవర్ మీదనుంచి
దూకుతున్నట్లుగా మార్చేస్తానన్నమాట." ఇంకా ఏదో చెప్పబోతుండగా ప్రసాదు అన్నాడు, "నాకావలసింది
పెళ్ళిచూపుల ఫోటోలండీ బాబూ, సర్కస్ కంపెనీలో ఉద్యోగానికి అప్లయి
చెయ్యటానిక్కాదు". మురళి నవ్వి అన్నాడు, "పోనీ
మీకీ థీం నచ్చకపోతే ఇంకోటి చెబుతా. ఇదెలా ఉందో చెప్పండి, మీరు
గొంతుకు కూర్చుని ఉంటారు. గ్రాఫిక్స్‌లో మీ రెండు కాళ్ళ కిందా రెండు ఎవరెస్ట్
పర్వతాలను కలుపుదాం" అన్నాడు ఉత్సాహంగా. "నీ బొంద, ఇంకా
నయం పక్కనొక చెంబు పెడతాననలేదు. రెండు ఎవరెస్ట్ పర్వతాలేంట్రా నీ శ్రాధ్ధం"
అనుకున్నాడు ప్రసాదు మనసులో. పైకి మాత్రం నవ్వుతూ, "ఇలాంటివి
నాకు సూట్ అవ్వవనిపిస్తోంది. కాస్త మామూలుగా ఉండే ఫోటోలు ఏవైనా తియ్యండి"
అన్నాడు. మురళి చులకనగా మొహం పెట్టి అన్నాడు, "సరేలెండి, ఇలా
వచ్చి ఈ కొబ్బరి చెట్టు చుట్టూ ఒక కాలేసి చెయ్యి పక్కకు పెట్టి పైకి చూడండి".
ఆ పోజ్ పెడుతుంటే కాలెత్తిన కుక్క జ్ఞాపకం వచ్చినా ఇక ప్రతీదీ కాదంటే మొదటికే మోసం
వస్తుందేమో అనుకున్న ప్రసాదు కిక్కురుమనకుండా చెప్పినట్లు చేసాడు. "బాగుంది, ఇప్పుడు
మీరు ఇలా నావంకే చూసి నవ్వుతూ వెనక్కి నడిచి వెళ్ళండి" అని మురళి కెమేరా
అడ్జస్ట్ చేసుకుంటుండగా పెద్దగా ఢామ్మన్న చప్పుడు దానితోటే ఇంతెత్తున దుమ్మూ
రేగాయి. తేరుకుని చూసిన మురళి , ప్రభులకి ఒక గోతిలోనించి అతికష్టమ్మీద
పైకి రావటానికి ప్రయత్నిస్తున్న ప్రసాదు చేతులు కనిపించాయి. పరుగున వెళ్ళి
ప్రసాదుని బయటకు లాగారిద్దరూ. "నిన్ను తగలెయ్య, ఇక్కడ
గొయ్యెందుకుందయ్యా?" అన్నాడు ప్రసాదు కోపంగా. "అదీ, నిన్న
మీలాంటాయనే ఒకాయన సద్దాం హుస్సేన్ పోజ్‌లో ఫోటో కావాలంటే తవ్వించానా గోతిని. ఇంకా
మావాడు పూడ్చినట్లు లేదు. అయినా మీరేంటి సార్, యాక్షన్
చెప్పకుండానే నడిచేశారు?" అన్నాడు మురళి. "హి, హి, ఏదో
ఒకసారి ప్రాక్టీస్ చేద్దామని" అన్నాడు ప్రసాదు ఏడవలేక నవ్వుతూ. మొత్తానికి
నానా తంటాలూ పడి ఎలాగయితేనేం, ఒక ఆల్బం తయారు చేసుకోగలిగాడు మన
ప్రసాదు.
ఆల్బం రావడమే తరువాయి, వెర్రెక్కినట్లుగా
అన్ని మారేజి బ్యూరోల వెబ్‌సైట్లలోనూ అప్‌లోడ్ చేసిపారేశాడు ప్రసాదు. కుప్పలు
తెప్పలుగా రెస్పాన్సులు రావడం మొదలైంది. వచ్చినవాటిలో తనకు నచ్చిన ఒక సంబంధాన్ని
ఎంచుకొని, ఒక మంచి రోజు చూసుకొని మొత్తానికి తన
మొదటి పెళ్ళిచూపులకు మాతా పిత సమేతంగా బయలుదేరాడు మనవాడు.
కారు పెళ్ళివారింటిముందాగింది. కార్లోంచి
దిగబోతూ ప్రసాదు ఆశ్చర్యంగా అన్నాడు తండ్రితో, "ఇదేంటి
నాన్నా,
మనం అరగంట క్రితం బయల్దేరినప్పుడు
మిట్టమధ్యాహ్నం గదా ఇప్పుడిక్కడేంటీ చీకటిగా ఉంది?" విశ్వనాధం
గారు కోపంగా బదులిచ్చారు, "శుభమా అని పెళ్ళిచూపులకెళుతూ ఆ
దిక్కుమాలిన నల్ల కళ్ళజోడెందుకురా అంటే విని తగలడితేగా తమరు". ఇంతలోకే ఏదో
తగిలి బోర్లా పడి లేచిన ప్రసాదుకి అంతా మామూలుగా కనిపించడం మొదలెట్టింది.
"నాన్నా, నాకిప్పుడంతా మామూలుగానే
కనిపిస్తుంది" అన్నాడు ప్రసాదు. కోపంతో పళ్ళుకొరుకుతూ దగ్గరకు వచ్చి
లోగొంతుకతో చెప్పారు విశ్వనాధం గారు "ఆ కళ్ళజోడు పెట్టుకుని కళ్ళు కనిపించక
నువ్వు బోర్లా పడితే, ఒక కంటికున్న అద్దం ఊడి చచ్చింది.
పెళ్ళివాళ్ళు చూడకముందే ఆ కళ్ళజోడు తియ్యకపోయావో నీ పేగులు తీస్తా అంట్ల
కుంకా" చటుక్కున కళ్ళజోడు తీసి దాచేశాడు ప్రసాదు. ఇంతలో పెళ్ళికూతురి తండ్రి
ఎదురు వచ్చి వీళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. కుశలప్రశ్నలవీ అయ్యాక విశ్వనాధం గారు అడిగారు
"అమ్మాయిని తీసుకురండి. దుర్ముహూర్తం రాకముందే త్వరగా ఆ పెళ్ళిచూపుల
కార్యక్రమం ముగిస్తే బాగుంటుంది". పెళ్ళికూతురి తండ్రి నసుగుతూ చెప్పాడు
"అదీ అమ్మాయి స్నానం చేస్తుందండీ, షష్ఠి
ఘడియలు మొదలయ్యాయి కదా". ప్రసాదు సంబరంగా తల్లితో చెప్పాడు "అమ్మా, చూడవే
ఆ అమ్మాయెంత సాంప్రదాయం మనిషో. తిథి మారినప్పుడల్లా స్నానం చేస్తుందట".
అక్కడే ఉన్న అమ్మాయి తమ్ముడు కల్పించుకుని అన్నాడు "అబ్బే, అంతలేదు
దానికి. అది స్నానం చేసేదే చాలా తక్కువ. అందుకే నాన్న దాన్ని కనీసం పుణ్య
తిథుల్లోనన్నా స్నానం చెయ్యమన్నారు. కాబట్టి అట్ల తదియ, వినాయక
చవితి,
వసంత పంచమి, సుబ్రహ్మణ్య
షష్టి,
రథ సప్తమి, దుర్గాష్టమి, రామ
నవమి ఇలా పర్వదినాల్లో మాత్రమే స్నానం చేస్తుంది అక్క". మూర్ఛపోబోయి
తమాయించుకున్న ప్రసాదు అడిగాడు "కనీసం రోజూ పళ్ళైనా తోముకుంటుందా మీ అక్క?" "ప్రతీ
రాత్రీ తోముతుందండీ" బదులిచ్చాడు పిల్ల తండ్రి. హమ్మయ్య అని ప్రసాదు
అనుకునేంతలోనే తమ్ముడు మళ్ళీ అందుకుని చెప్పాడు "రాత్రి అంటే సంకురాత్రి, శివరాత్రి, నవరాత్రులకన్న
మాట". "నువ్వు నోర్ముయ్యరా కాసేపు. అంత అదాటున అన్నీ చెప్పి వాళ్ళని
భయపెట్టొద్దన్నానా?" పిల్ల తండ్రి కసిరాడు కొడుకుని.
అంతావిని
లేవబోయిన ప్రసాదుని పట్టి ఆపింది తల్లి. "కాస్సేపు ఆగరా. ఇక్కడిదాకా వచ్చి
అమ్మాయిని చూడకుండా వెళితే ఏంబాగుంటుంది?" ఇంతలోకి
ఫలహారాలు రావడం మొదలయ్యాయి. టేబుల్ నిండా సర్దిన ఫలహారాల్లోంచి మూడు చిన్న
ప్లేట్లు తీసి అతిథులకిచ్చారు. "వచ్చింది ముగ్గురమేగా, ఇన్ని
ఫలహారాలెందుకు తెప్పించారన్నయ్యగారూ" అంది ప్రసాదు తల్లి. "ఇవి మీకు
కాదు,
అక్కకు. అయినా వాములు తినే స్వాములార్లకు
పచ్చగడ్డి ఒక ఫలహారమా అన్నట్లు, ఇవి మా అక్కకు ఒక పంటికిందకు కూడా
సరిపోవు" అన్నాడు తమ్ముడు. తూలిపడబోయి తమాయించుకుని అడిగాడు ప్రసాదు "మీ
అక్క ఒక్కతే ఇవన్నీ తింటుందా?" "అదొక పెద్ద విషయమే కాదు. త్వరగా మీరూ
తినటం పూర్తిచేసి పెళ్ళిచూపుల కార్యక్రమం ముగిస్తే పక్కవీధిలో ఎవరో నందికేశుని
నోము నోచుకుంటున్నారట, అక్క వెళ్ళాలని చెప్పింది" అన్నాడు
తమ్ముడు. "ఇవన్నీ తిన్నాక మళ్ళీ నందికేశుని నోముకి వెళ్ళి అక్కడ కూడా
తింటుందా?" "అదే మరి మా అక్కంటే. అసలు చద్దన్నం
తింటావా చక్కిలాలు తింటావా అనడిగితే, చద్దన్నం తింటాను, చక్కిలాలూ
తింటాను,
ఆనక అయ్యతో కలిసి అన్నమూ తింటాను అనే రకం
మా అక్క" అన్నాడు తమ్ముడు తన సామెతల పాండిత్యం మళ్ళీ ప్రదర్శిస్తూ. వింటున్న
ముగ్గురు అతిథులకూ విషయం పూర్తిగా అర్థమయ్యి లేచి నించున్నారు. పిల్ల తండ్రి వచ్చి, "అయ్యో, మీ
ప్లేట్లల్లోవి ఏమీ తినకుండానే లేచారేమండీ, ఇవన్నీ
వృధా అయిపోవూ" అన్నాడు నొచ్చుకుంటూ. "ఏం ఫరవాలేదులేండి, మీ
అమ్మాయికి పెట్టండి. అయినా లక్ష భక్ష్యాలు తినగలిగే లక్ష్మమ్మకు ఈ ఒక్క భక్ష్యం ఒక
లెక్కా?"
అన్నాడు ప్రసాదు కారెక్కబోతూ, ఈసారి
తన సామెతల పాండిత్యం ప్రదర్శిస్తూ.
క్రితంసారి ముగ్గురు వెళితే పనవ్వలేదని
ఈసారి పెళ్ళిచూపులకి మిత్రుడు ప్రభుతో కలిసి వెళ్ళాడు ప్రసాదు. క్రితం అనుభవం వల్ల
ఈసారి ముందు జాగ్రత్తగా పిల్ల అలవాట్లూ అవీ ముందుగానే భోగట్టా చేసి కన్‌ఫర్మ్
చేసుకున్నాడు. రొటీన్‌గా పలకరింపులవీ అయ్యాక పిల్ల తండ్రి చిలిపిగా నవ్వుతూ
చెప్పాడు ప్రసాదుతో, "మీకు వెరైటీగా పెళ్ళిచూపులు ఏర్పాటు
చేశాం. దీనిలో భాగంగా మీరే మా అమ్మాయి దగ్గరకు వెళ్ళాలి". "ఇదీ ఒక రకంగా
బానే వుంది" అనుకున్న ప్రసాదుని తీసుకువెళ్ళి ఒక చీకటి గదిలోకి తోసి గడియ
పెట్టాడు పె.కూ.తం. (పెళ్ళి కూతురి తండ్రి). లోపలికి వెళ్ళిన ప్రసాదుకి ఏమీ
కనిపించకపోగా వెనకాలనుంచి గజ్జెల చప్పుడు, గాజుల
గలగలలూ వినిపించాయి. ఇంతలో ఏవో రెండు చేతులు వెనకనుండి వచ్చి ప్రసాదు కళ్ళు
మూసాయి. దాంతో ప్రసాదుకి అప్పటిదాకా చూసిన చంద్రముఖి, కాంచన, పిశాచి
వగైరా సినిమాలన్నీ గుర్తుకు వచ్చి ఒక్క వెర్రికేక పెట్టాడు. "హి హి, సిద్దూ
ఎందుకలా అరిచావ్? నేను నీ హాసినిని" అంది ఆ ఆకారం.
ఇంతలోకి పె.కూ.తం బయటనుంచి లైటు వేసినట్లున్నాడు, హాసిని
దర్శనభాగ్యం కలిగింది ప్రసాదుకు. రేగిన ఎండుకొబ్బరి పీచులాంటి జుట్టూ, ఒకదానికొకటి
సంబంధం లేని కాంబినేషన్లో బట్టలూ, ఎటో చూస్తున్న చూపులతో హాసిని కాస్త
తేడాగా కనిపించినా, ఓ మోస్తరుగా బానేవుంది అనుకున్నాడు
ప్రసాదు. "సరేగాని, ఈ సిద్దూ ఏంటమ్మా? నా
పేరు ప్రసాదు" అనడిగాడు ప్రసాదు. "హి హి, నాకు
నచ్చినవాళ్ళని ఆ పేరుతోనే పిలుస్తాన్నేను" అంది హాసిని ప్రసాదు జుట్టు
పీకుతూ. ఇంతలో మళ్ళీ తనే అంది గోముగా "సిద్దూ, నా
పెన్సిలు, రబ్బరు పోయాయి ఇక్కడ, కొంచెం
వెతికి పెట్టవా". హీరోయిజం చూపించడానికన్నట్లు ప్రసాదు ఉరఫ్ సిద్దూ
రెచ్చిపోయి వీరలెవెల్లో అరగంటపాటు ఆ రూమంతా వెతికి వెతికి నడుం పడిపోయాక నీరసంగా
చెప్పాడు హాసినితో "అవెక్కడా దొరకలేదు, కొత్తవి
కొనుక్కుందాంలే". కిసుక్కు కిసుక్కుమని నవ్వి హాసిని చెప్పింది " అవి
దొరకవని నాకు ముందే తెలుసుగా". "ఎలా?" "అవి
నా ఎల్.కె.జి. లోనే పోయాయిగదరా తింగరోడా, హి
హి హి" ప్రసాదుకి ఏదో అర్ధమయ్యీ కానట్లుగా తెలుస్తోంది. మళ్ళీ హాసిని అంది
"కానీ సిద్దూ, నాకా పెన్సిలే కావాలి. త్వరగా వెతుకు
లేకపోతే కొరుకుతా హు హు" ఇదంతా ఒక చిన్న కిటికీలోంచి చూస్తున్న పె.కూ.తం.
అన్నాడు "త్వరగా వెతుకు బాబూ, అదిగానీ కొరకడం మొదలుపెడితే ఎర్రగడ్డ బయట
హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి". విషయం పూర్తిగా అర్ధం చేసుకున్న ప్రసాదు
బుర్ర వేగంగా పనిచేసి తప్పించుకునేందుకు మంచి ఉపాయం ఆలోచించింది. "హాసీ డియర్, బయట
ఎండ చూడు 45 డిగ్రీలతో ఎంత చల్లగా ఉందో? ఇలాంటి
ఎండలో ఇంట్లో ఏ.సీ.లో కూర్చుని ఐస్‌క్రీం ఏ వెధవైనా తింటాడు. కానీ మనలాంటి తేడా, అదే, వెరైటీ
మనుషులు మాత్రం ఎండలో కాలే రోడ్డుమీద చెప్పుల్లేకుండా టాంక్‌బండ్ దాకా నడుచుకుంటూ
వెళ్ళి అక్కడ హుస్సేన్ సాగర్ నీళ్ళతో చేసిన పానీ పూరీ తింటారు. ఏమంటావ్?" అన్నాడు.
పిచ్చ హాసినికి ఆ ఐడియా పిచ్చ పిచ్చగా నచ్చేసినట్లుంది, వెంటనే
పె.కూ.తం.కి తలుపు తియ్యమని ఆర్డరు వేసేసింది. అలా తలుపు తెరవడమేమిటి, పి.టి.
ఉషను తలదన్నేలా పిక్కబలం చూపిస్తూ దౌడు తీశారు స్నేహితులిద్దరూ.
ముచ్చటగా మూడోసారి తల్లిదండ్రులతోటీ, మిత్రుడితోటీ
కలిసి వెళ్ళాడు ప్రసాదు. ఈసారి ఎలాంటి వాకబులూ చెయ్యకుండా ఒక రకమైన తెగింపుతో
బయల్దేరారంతా. అయితే ఇంట్లో అడుగుపెడుతున్నప్పుడు మాత్రం ఇదివరకు కనిపించిన ప్రమాద
చిహ్నాలేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పిల్ల తండ్రి అందరినీ
ఆహ్వానించి కూర్చోపెట్టాడు. టిఫిన్లూ, కాఫీలూ వచ్చేశాయి అంతా తిన్నారు కూడా.
అయినా పిల్ల జాడగానీ, పిల్ల తల్లి జాడగానీ లేదు. ఎదురుచూసీ, చూసీ
విశ్వనాధంగారు అడగనే అడిగారు పిల్ల తండ్రిని, "త్వరగా
అమ్మాయిని పిలిపిస్తే ఆ పెళ్ళిచూపుల కార్యక్రమం పూర్తి చేద్దాం". పిల్ల
తండ్రి నసుగుతూ అన్నాడు, "అదీ, ఇవాళ
బాలికా వధు మహా ఎపిసోడ్ వస్తోంది కదా, అమ్మాయీ, మా
ఆవిడా అది చూస్తున్నారు. ఒక రెండు గంటల్లో వచ్చేస్తారు." ఈ మాట విన్న
ప్రసాదుకి గుండెల్లో రాయి పడింది, ఏదో అందామని పక్కకి చూస్తే తల్లి లేదు.
మహా ఎపిసోడ్ సంగతి వినగానే ఎప్పుడో మాయమైపోయింది. కనీసం తండ్రితోనన్నా
మాట్లాడదామని అనుకుంటుండగా విశ్వనాధంగారు ఇబ్బందిగా కదులుతుండటం గమనించాడు. పిల్ల
తండ్రికూడా ఇది గమనించినట్టున్నాడు, "బావగారూ, ఏమైనా
కావాలా?"
"అదీ, అదీ
... మరీ,
నేను కూడా ..." పిల్ల తండ్రి
ఆశ్చర్యపోయాడు "మీరుకూడా బాలికా వధు చూస్తారా?" విశ్వనాధంగారు
మొహమాటంగా అన్నారు "హి హి, ఏదో రిటైర్ అయినప్పటినుంచీ టైంపాస్ కోసం, హి".
"ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళండి" కసిగా అన్నాడు ప్రసాదు.
చాలాసేపటి తర్వాత, ఎవరో కుదిపి లేపుతుంటే ప్రసాదుకు మెలకువ
వచ్చింది. అంతా వచ్చేసినట్లున్నారు, తననే పరీక్షగా చూస్తున్నారు.
పెళ్ళికూతురు ఎక్సయిట్‌మెంట్‌తో వాళ్ళమ్మతో అంటోంది "చూడవే అమ్మా, ఈయన
అచ్చు మొగలిరేకులులో మామి లాగా ఉన్నారు కదా". పిల్ల తల్లి కూడా అన్నది
"అవునే అమ్మాయ్. అచ్చు అలాగే ఉన్నాడీ అబ్బాయి. తెల్ల చీర కట్టుకుని, కళ్ళజోడు
పెట్టుకుని, అడ్డబొట్టు పెట్టామంటే అచ్చు అలానే
ఉంటాడు. ఏది బాబూ ఒక్కసారి చెప్పు `యామిరా ఇక్బాలూ, ఇట్టల
సేసి పూడిస్తివి? నీకుదా ఎన్ని తడవలు సెప్తిని`, ఈ
డైలాగ్ ఒక్కసారి చెప్పు" అంతా చూస్తున్న ప్రసాదుకు పిచ్చెక్కి పోతోంది.
పెళ్ళికూతురు మళ్ళీ అన్నది "అమ్మా, ఈయనతో ఒక్కసారి ఆవేషం వేయిద్దామే" ప్రసాదుకు ఒళ్ళంతా కంపరమెత్తుతుండగా లేచి
నించుని అన్నాడు "నేను అచ్చు మా నాన్నగారి పోలిక అని అందరూ అంటూ ఉంటారండీ.
కాబట్టి మీరు నాకు వెయ్యాలనుకుంటున్న వేషమేదో ఆయనకు నిరభ్యంతరంగా
వేసుకోవచ్చు" పళ్ళు పటపటలాడిస్తున్న తండ్రి వంక చూడకుండా పూర్తి చేశాడు
"పైగా ఆయనకు ఆ వేషం బాగా సూట్ అవుతుంది కూడానూ" పూర్తి కావడం తరువాయి, తండ్రి
తిట్లవర్షంలో తడవకుండా ఉండటానికి మిల్కా సింగ్‌ని మించిన వేగంతో పరుగు తీశాడు
ప్రసాదు.
ఆ విధంగా ఒక నలభై - యాభై పెళ్ళిచూపులన్నా
చూసివుంటాడు మనవాడు. చివరికి వీడికి పెళ్ళి అయిందా లేదా అన్న విషయం మనకు ఇప్పుడు
అప్రస్తుతంగానీ, ఈ అనుభవం ప్రసాదుకు ఒక పెళ్ళిచూపుల
కోచింగ్ సెంటర్ పెట్టటానికి పనికివచ్చింది. తనలాంటి ఎంతోమంది పెళ్ళీడు మగపిల్లలకు
సలహాలిస్తూ సెంటర్‌ని బానే అభివృధ్ధి చేసినట్లున్నాడు, ఈ
మధ్యే అమెరికాలోనూ ఒక బ్రాంచ్ తెరుస్తున్నాడని విన్నాను.