Thursday 23 August, 2007

మాతృస్వామ్యం వర్థిల్లాలి - 1

జనవరి 2, 2008, హైదరాబాద్. సమయం రాత్రి తొమ్మిదిన్నర. ఆఫీసునుంచి ఉసూరుమంటూ ఇల్లు చేరాడు కుమార్. 'రాధా! కాసిని మంచినీళ్ళిస్తావూ?'. గమిని టివిలో వస్తున్న బొందావనం సీరియల్ 1294వ భాగం ఏకాగ్రతతో చూస్తున్న రాధ చిరాగ్గా, 'అబ్బా మీరే తీసుకుని తాగుదురూ, సీరియల్ చూస్తున్నపుడు అవీ ఇవీ అడగొద్దని ఎన్ని సార్లు చెప్పాలి' అనేసి మళ్ళీ సీరియల్ చూడడంలో మునిగిపోయింది. చేసేదేమీలేక తనే మంచినీళ్ళు తాగి వచ్చి సోఫా లో కూలబడ్డాడు కుమార్. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సీరియల్ అయిపోతేగాని భోజనభాగ్యం ఉండదని అర్ధమై ఎప్పుడు అది అయిపోతుందా అని ఎదురుచూడసాగాడు కుమార్.


కట్ చేస్తే, జూన్ 18, 2027, న్యూయార్క్. సమయం ఉదయం తొమ్మిది. అమెరికన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశపు గది. వివిధ దేశాలకు చెందిన సుమారు వందమంది శాస్త్రవేత్తలు సమావేశమైవున్నారు. అందరి చేతుల్లో ఆరోజు న్యూయార్క్ టైమ్స్ పేపరు ప్రతులు ఉన్నాయి. 'ఓ కె, లెటజ్ స్టార్ట్' అన్నాడు ఎడ్వర్డ్, సమావేశపు అధ్యక్షుడు. అందరూ తమ తమ భాషలకు సంబందించిన ట్రాన్స్లేటర్లు ఆన్ చేసి హెడ్ఫోన్స్ తగిలించుకున్నారు. న్యూయార్క్ టైమ్స్ లో ఆరోజు ప్రముఖంగా ప్రచురితమైన ఒక వార్తను కంప్యూటర్ చదవనారంభించింది.


"మాతృస్వామ్య వ్యవస్థ వైపు మళ్ళుతున్న భారత దేశం. గత పాతికేళ్ళుగా భారత దేశ సంస్కృతిలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు భర్త ఉద్యోగం చేసి సంపాయిస్తే, భార్య ఇంటి వ్యవహారాలు చక్కబెట్టుకునేది. ఇప్పుడు భర్తలు పూర్తిగా వంటింటి కుందేళ్ళుగా మారిపోయారు. భార్యలు ఉద్యోగాలు చేసి సంపాదిస్తూ ఇంటి మీద పెత్తనం పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ మార్పు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఎక్కువగా వుందని ప్రాధమిక నివేదిక...". సమావేశం ముగిసింది. యుద్ధప్రాతిపదికమీద నిర్ణయాలు తీసుకోబడ్డాయి. జాన్, లూసీ అనే ఇద్దరు యువ శాస్త్రవేత్తలను ఈమార్పును పరిశోధించే నిమిత్తమై ఆంధ్ర పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా వారికి తెలుగు భాష, ఆహారపు అలవాట్లు, సంస్కృతి వంటి విషయాలమీద నాసాలో రెండు నెలలపాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

శిక్షణ పూర్తిచేసుకుని హైదరాబాద్ లో అడుగుపెట్టారు జాన్, లూసీ. ఆరోజుకు విశ్రాంతి తీసుకుని మరుసటి రోజునుంచి పరిశోధన మొదలుపెట్టాలని అనుకున్నారిద్దరూ. రాత్రి భోజనం చేసి తీరిగ్గా టివి ఆన్ చేసాడు జాన్. తెరమీద ఒక పదిహేనువందల చానెళ్ళ పేర్లు ప్రత్యక్షమయ్యాయి తెలుగు కాటగిరీ కింద. 'వామ్మో, ఒక్క తెలుగులోనే పదిహేనువందల చానెళ్ళా, మా అమెరికా మొత్తంలోనే ఇన్నిలేవు' అనుకొని ఏచానల్ చూద్దామా అని వెతకసాగాడు జాన్. 'టివి 9/11' అనే చానల్ పేరు కాస్త పరిచయమున్నట్టు తోచి పెట్టాడు. వార్తలు వస్తున్నాయి. 'వెల్కమ్ టు నైన్ పి.ఎమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. న్యూక్లియర్ ట్రీటీ పై అప్పోజిషన్ ప్రొటెస్ట్. పాస్ పోర్ట్ స్కామ్ లో ఎమ్.ఎల్.ఎ అరెస్ట్. వాటర్ ప్రాబ్లెమ్ తో సఫర్ అవుతున్న ట్విన్ సిటీస్. థర్డ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మిజరబుల్ గా ఫెయిల్ అయిన ఇండియా టాపార్డర్. ఇప్పుడు డిటైల్డ్ న్యూస్'. 'హర్రె, తెలుగుకు ఇంగ్లీష్ కి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయే, ఈవిషయం తెలీక నాసా వెధవల చేతిలో అనవసరంగా రెండునెల్లు చావగొట్టించుకున్నా' అనుకున్నాడు జాన్.


మరునాడు లూసీ తట్టి లేపితేగాని మెలుకువరాలేదు జాన్ కి. ఆరోజే వారి పరిశోదనకి మొదటి రోజు. త్వర త్వరగా లేచి తయారయ్యి బయల్దేరారిద్దరూ. 'మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం?' ప్రశ్నించింది లూసీ. 'అమీర్ పేటకి' బదులిచ్చాడు జాన్. 'అత్యధిక సంఖ్యలో నకిలీ సాఫ్ట్వేర్ సంస్థలున్న ప్రదేశంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన ప్లేసేనా?' అంది లూసీ వుత్సాహంగా. 'అవును, మన ట్రైనింగ్ లో చెప్పలేదూ, ఎక్కడైతే ఆకాశం కనిపించకుండా బానర్లూ, రోడ్డు కనిపించకుండా పాంప్లెట్లూ వుంటాయో అదే అమీర్ పేట్. అక్కడి ఆదిత్యా ఎన్ క్లేవ్ దగ్గర నించుని రాయి విసిరితే, ఖచ్చితంగా అది కుక్కకుగాని సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ వాడికిగాని తగులుతుందని నాసా పరిశోధనలో తేలింది ' అన్నాడు జాన్. సారధీ స్టూడియో దగ్గర బస్సు దిగారిద్దరూ. వీధి వీధంతా బానర్లూ, పాంప్లెట్లతో నిండిపోయుంది. 'హాయ్, ఈ ప్రదేశం ఇప్పటికీ ఏమీ మారలేదు' అంది లూసీ. యధాలాపంగా తలయెత్తి చూసిన జాన్ డంగైపోయాడు. లూసీ కూడా అప్పుడే గమనించినట్టుంది, 'జాన్, ఏమిటిది' అంది ఆశ్చర్యంగా. సాఫ్ట్వేర్ సంస్థల బానర్లు ఒక్కటి కూడా కనిపించట్లేదు!! ఎక్కడ చూసినా 'రక్తా కపూర్ డాన్స్ అకాడెమీ', 'రక్తా కపూర్ యాక్టింగ్ స్కూల్','రక్తా కపూర్ డైరెక్షన్ ఇన్స్టిట్యూట్' వగైరా వగైరా బానర్లే...!!!