Tuesday 16 June, 2009

ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా?

గాలి జనార్ధనరెడ్డిగారు ముఫ్ఫై కిలోల బరువైన వజ్రాల కిరీటం స్వామివారికి బహూకరించారట. ఆహా ఎంత కనులపండువగా వుందండీ, చూట్టానికి రెండు కళ్ళూ సరిపోవటంలేదంటే నమ్మండి. దీనితో స్వామివారికి ఏడు కిరీటాలు పూర్తయ్యాయట. వారికి ఎన్నో కిలోల బంగారం కూడా వుందట. ఈనాడు వాడు రాశాడండీ.

కానీ ఒక్కటే అర్థంకావట్లేదు మన జనార్థనరెడ్డి గారు సమర్పించింది వారి సొంత డబ్బా లేక ప్రజల డబ్బా? ప్రజల డబ్బైతే అక్షరాలా 45కోట్లు ఆవిధంగా ఖర్చుపెట్టే హక్కు సారుకెవరిచ్చారు? సొంత డబ్బైతే వాటికి లెక్కా, పత్రమూ వుండాలిగా(అహ వున్నయ్యో లేదో నాకు తెలియదండీ, వున్నాయా అని అడుగుతున్నా అంతే) పైగా వారి సొంత కార్యక్రమానికి అసెంబ్లీ సమావేశాలకొచ్చినట్లు అంతమంది కర్ణాటక మంత్రులెందుకు విచ్చేసినట్లో దొరగారివెంట(అసలీ గ్యాంగుని చూసే అది ప్రభుత్వ కార్యక్రమమేమో అని అనుమానమొచ్చింది సుమండీ నాకు).

ఇంకో సందేహం! అసలెప్పుడైనా ఆ ఏడుకొండలవాడు దిగివచ్చి నాకు కిరీటం చేయించండి, నాకు వజ్రాల నగలు చేయించండి అని చెప్పాడంటారా? మన పిచ్చిగానీ చెపితే గిపితే మనలాంటోళ్ళకెందుకు చెపుతాడండీ మీరు మరీనూ. ఏ అమితాబచ్చన్ కల్లోకో, జనార్ధనరెడ్డికల్లోకో వచ్చి శలవిస్తాడుగానీ!! సర్లేండి, అయినా మీకూ నాకూ చెపితే మాత్రం ఏం చేయించగలమండీ మన మొహం. వాళ్ళయితే ఆపధ్ధతే వేరు. ఓ కే, అంతంత డబ్బుపెట్టి నగలూ అవీ చేయించే బదులు వాటిలో కనీసం పదో వంతు ఖర్చు పెట్టి ఏవైనా మంచి పనులు చెయ్యవచ్చుగదా అనిపిస్తోందా మీకు? హవ్వ! కళ్ళుపోతై చెంపలేసుకోండి యమార్జెంటుగా. ఎదో ఒహ నలభయ్యయిదు కోట్లు పెట్టాడని గాలిని ఆడిపోసుకుంటున్నాం మనం కానీ అసలు అన్నన్ని విరాళాలు పొందుతున్న టి.టి.డి వాటన్నిట్నీ ఏం చేస్తోందో మీకేమయినా తెలుసా? బావుంది నన్నే ఎదురు అడుగుతారేమండీ? నాకు తెలియకేకదా మిమ్మల్నడుగుతా?

అబ్బ కాదండీ, కళ్యాణ మండపాలు వ్యాపారమండీ, అవి సేవలెలాగవుతై? వేద పాఠశాలలా? అవి కొంతమందికే అందుబాటులో వుండేవే మరి? ఏంటీ అన్నదానమా? కొండపైనే కాదు కదండీ ఆకలిగొన్న అభాగ్యులుండేది? అదేదో మరో నాలుగుచోట్ల కూడా చెయ్యొచ్చుకదండీ స్వామి తనకి వంద కిరీటాలు చేయించినంత ఆనందిస్తారు. ఎండా వానా చలీ లెక్క చెయ్యకుండా స్వామి దర్శనానికొచ్చే భక్తులకి సత్రాల్లాంటివి మరిన్ని కట్టించొచ్చు కదండీ?

అసలు మన్లోమనమాట రోజూ భక్తులేసే కానుకల్లో ఎన్ని సక్రమంగా స్వామివారికి చెందుతున్నయ్యంటారు? ఏంటి నువ్వేసే బోడి వంద రూపాయలకి అక్కడో మనిషిని పెట్టి నీకు రసీదిచ్చే ఏర్పాటు చెయ్యమంటావా అనకండి. అంతా గాలిగారి అంతటివాళ్ళుండరు కదండీ? నాలాంటి వాళ్ళ జనాభాయే ఎక్కువ మనదేశంలో. మరామాత్రం తెలుసుకోవాలనిపిస్తుందీ వెర్రి మనసుకి. తెలీదా? సర్లేండి మిమ్మల్ని మరీ ఇబ్బంది పెడుతున్నట్లున్నాను.

అద్సరేగానీ మా వీధి చివర ఈమధ్య కొత్తగా వెంకటేశ్వరస్వామి గుడి కట్టారండీ. స్వామి అచ్చు తిరపతి వెంకన్నలాగున్నారంటే వెళ్ళి చూసొచ్చాను. మీరు నమ్మరుగానీండి, ముమ్మూర్తులా అదే విగ్రహం. అప్పుడే నాకింకోటనిపించింది. ఇలాంటి దేవుణ్ణే చూట్టానికి ఎక్కడో అల్లంతదూరంలో తిరపతికెళ్ళి, వసతి దొరక్క రోడ్డు మీద పడుకుని, నాజీ శిబిరాల్లాంటి క్యూ కాంప్లెక్సుల్లో మగ్గి ఇవన్నీ అవసరమంటారా? ఇక్కడే ఈస్వామికే మనసారా దణ్ణంపెట్టుకోవచ్చుకదా? దేవుడెవరైనా ఒక్కడే కదండీ? ఏంటేంటి ప్రశాంతతా? ఆధ్యాత్మికతా?? పవిత్రత కూడానా??? హమ్మో హమ్మో ఇంకాపండే! ఇవన్నీ తిరపతిలో ఇంకా వున్నాయని మీరనుకుంటున్నారా బాబయ్యా? మన్లో మనమాట మీరు మనదేశంలో అడుగెట్టి ఎన్నేళ్ళయిందండీ? మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తున్నానా? సరే వుంటానండీ, మీరు తిరపతి నించొచ్చాక కలుస్తా.

Tuesday 2 June, 2009

చందమామ సీరియళ్ళు-3

సీరియళ్ళు డౌన్లోడ్ చేసుకోవటానికి బొమ్మమీద నొక్కండి.విచిత్ర కవలలు(రంగుల్లో) - వేణుగారి కోరిక ప్రకారం


చివరిగా, ulib.org లోలేని చందమామలు chandamama.com లో 1980 వరకూ వున్నాయి. వాటిని డౌన్లోడ్ చేసేందుకు Downloader ప్రోగ్రాం ని కాస్త మార్చాను. ఇదివరకట్లాగే ఇక్కడినించి ప్రోగ్రాం ని దింపుకుని jre1.6.0_05\bin\java -jar Downloader.jar -help అని ఇస్తే మీకు విషయం అర్థమయిపోతుంది. క్వాలిటీ మాత్రం ulib వాడిదే బాగుందని నాకనిపించింది. chandamama.com లో బొమ్మలు అంత స్పష్టంగా లేవు.