Monday 26 November, 2007

మూర్తి Vs. జార్జి ఫెర్నాండెజ్

మేము నరసరావుపేటలో యమ్.సి.ఏ వెలగబెట్టేటప్పుడు మూర్తి అనే ఒక సహాధ్యాయి ఉండేవాడు. మనిషి చాలా మంచివాడు, మృదుస్వభావి. కానీ వాడికి ఉన్న ఒక గొప్ప బలహీనత వాడి జనరల్ నాలెడ్జి. మన దేశప్రధాని ఎవరన్న దాని మీద కూడా మావాడికి సందేహమే. అలా అని నోరుమూసుకుని కూర్చుంటాడా అంటే లేదు. ఏవిషయంలోనైనా, తెలిసినా తెలియకున్నా ఏదో ఒకటి వాగందే వాడి నోరు ఊరుకునేది కాదు. అప్పట్లో, అంటే 98-01 లలో రోజూ మా కాలేజీ దగ్గరి టిఫిన్ సెంటరులో టిఫిన్ చేసి కొసరుగా అక్కడున్న పేపర్ని ఆసాంతం చదివేసి ఆ విశేషాలమీద చర్చించుకొని(వీలైతే కొన్నిసార్లు చిన్నపాటి వాదనలు/గొడవలు కూడా పెట్టుకొని) తీరిగ్గా కాలేజీకి వెళ్ళటం మా దినచర్య. ఈ చర్చలన్నింటిలో మా మూర్తి కూడా మహోత్సాహంతో పాల్గొనేవాడు. ఒకరోజు ఉదయం మిత్రబృందం అంతా యధాప్రకారం టిఫిన్ కుమ్మేస్తున్నాం. మూర్తి మాకన్నా కొంచెం ముందుగా తినేసి బయటకెళ్ళి పేపరు చదువుతున్నాడు. ఉన్నట్టుండి బయటనుంచి పెద్దగా అరుపులు,కేకలు. తేరుకొని చూద్దుం కదా బయట మా మూర్తి రౌద్రమూర్తిగా మారిపోయి శివతాండవం చేస్తున్నాడు. పైగా మధ్య మధ్యలో 'ఎంత ధైర్యం ఈ అమెరికా వాడికి' అనీ 'ఇండియా మీదే దాడి చేస్తానంటాడా' అనీ అరుపులొకటి. అప్పుడే సీనులోకి ఎంటరయిన మాకు విషయం అర్థం కాలేదు. నెమ్మదిగా మూర్తిని చల్లబరిచి అసలు సంగతి అడిగితే అనాటి 'ఈనాడు' లో తాటికాయంత అక్షరాల్తో వచ్చిన వార్తని చూపించాడు. ఇంతకీ ఆ వార్త హెడ్లైన్స్ ఇదీ 'కాశ్మీర్లోని శిబిరాలపైన దాడి జరపడంలో తప్పులేదు - జార్జి ఫెర్నాండెజ్'. అంతే, అప్పటిదాకా మూర్తి అరుపులతో మార్మోగిన టిఫిన్ సెంటర్ మా నవ్వుల్తో దద్దరిల్లసాగింది.

అసలు విషయమేమిటంటే అంతకు ఒకటి రెండు రోజుల క్రిందట అమెరికా, తీవ్రవాద శిబిరాలున్నాయనే నెపంతో సిరియా,సూడాన్ ల రసాయన కర్మాగారాలమీద వైమానిక దాడులు నిర్వహించింది. దాని తర్వాత అప్పటి సదరు మన రక్షణ మంత్రి గారు కాశ్మీర్ లోని తీవ్రవాద శిబిరాలపై భారత సైన్యం మాత్రమెందుకు దాడులు చెయ్యకూడదు అని అర్థం వచ్చేటట్లు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మూర్తిగారి జనరల్ నాలెడ్జి ప్రకారం జార్జి, జేమ్సు, బిల్లు లాంటివన్నీ అమెరికా పేర్లే. దాంతో మావాడు ఇదేదో అమెరికా వాడు జారీ చేసిన ప్రకటన అనుకున్నాడు. అదీ సంగతి.

Monday 19 November, 2007

అప్పడోపాఖ్యానము

మామూలుగా మీరెన్ని అప్పడాలు తింటారు? ఒకటి, రెండు. మహా అయితే ఇంకో రెండు. ఓసోస్, అప్పడాలు తినటంకూడా ఒక గొప్పేనేంటీ అంటారా? ఇతర్ల విషయం ఏమోగానీ, చెప్పుకోవడానికి వేరే ఇంకేమీ విశేషాలు లేని నాలాంటి వారికిమాత్రం గొప్పే సుమండీ! నాకీ అప్పడాల మీద ఇష్టం ఎలా మొదలైందో తెలియదు. చిన్నప్పుడు మా మేనత్త పెళ్ళిలో గాడిపొయ్యి దగ్గర కూర్చుని(అప్పటికింకా కేటరింగు సంస్కృతి మొదలవ్వలేదు) ఓ ముప్ఫయ్యో ఎన్నో అప్పడాలు వేసినవి వేసినట్లే లాగించేశాము నేను, మా తమ్ముడు. ఆతర్వాత నెమ్మదిగా వాడీ అలవాటు మర్చిపోయాడుగానీ నేను మాత్రం వాడి వాటా అప్పడాలు కూడ మహదానందంగా కరకరలాడించేవాడిని. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు నా పిచ్చి ముదిరి పాకాన పడసాగింది. స్కూలుకి క్యారియర్లో అన్నం బదులు అప్పడాలే పెట్టాలని గొడవ చేసేవాడిని. దప్పళం అంటే అదేదో కొత్తరకం అప్పడం అనుకొని ఈసారి ఆ అప్పడాలే కొనాలని అమ్మని వేపుకు తినేవాడిని. నూనె నిండుకుందనో, ఈనెల వెచ్చాలతో తెచ్చిన అప్పడాలు అయిపోయాయనో చెపితే ఎంత కోపం వచ్చేదో అమ్మ మీద. పెద్దయ్యాక గొప్ప ఉద్యోగం సంపాదించి రోజూ టిఫిన్ లోకి కూడా అప్పడాలే తినాలని మనసులోనే ప్రతిజ్ఞలు చేసుకొనేవాడిని. కాలేజీ చదువులకి వచ్చాక మెస్సుల్లో ఈవిషయమై ఎన్నోసార్లు గొడవకూడా పెట్టుకున్నాను. ఎన్నోమాట్లు అప్పడం కావాలని అడగటమూ మెస్సు వాడు మొదట మామూలుగా తరువాత ఇబ్బందిగా అటుతరువాత చిరాగ్గా ఆపై కోపంగా అప్పడం మారువడ్డించడమూ జరిగేది. ప్రతి అప్పడానికీ రూపాయి అదనంగా ఇచ్చేటట్లు వాడితో ఒప్పందం కుదుర్చుకున్నాకగాని కథ సుఖాంతమవ్వలేదు. మా అమ్మావాళ్ళు నా భార్యని కాపురానికి పంపించేటప్పుడే నా అప్పడాలప్రియత్వం గురించి మొత్తం చెప్పి పంపించారులాగుంది, తనకి జడుపు జ్వరాలవంటివేమీ రాలేదు. ఇలా వుండగా, పెళ్ళయిన కొత్తలో కొత్తకాపురం చూడటానికి వచ్చారు మా అత్తగారు,మామగారు. భోజనాలప్పుడు మా అత్తగారు 'ఇన్నిఅప్పడాలెందుకే వేయించావ్' అని అడగటం, నా భార్య లోగొంతుకతో 'ష్. అరవకమ్మా. మీ అల్లుడుగారికోసంలే' అని జవాబివ్వటం వినిపించాయి. అటుతర్వాత వంటగదిలోంచి బయటికి వచ్చిన మా అత్తగారి మొహంలో కనిపించింది అపనమ్మకమో లేక ఆశ్చర్యమో లేక భయమో ఆ భావాన్ని నేనిప్పటికీ మర్చిపోలేదు. నా బావమరిది అందించిన రహస్య సమాచారాన్ని బట్టి తెలిసిందేమిటంటే, మరుసటి పండక్కి నేను అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వెచ్చాల కొట్టువాడు అడిగాడట, 'ప్రతీనెలా ఒకటి కంటే ఎక్కువ అప్పడాల పాకెట్లు కొనరు మరి ఈనెల ఇన్ని కొంటున్నారంటే ఏదైనా శుభకార్యం వుందాండీ' అని. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు నిజమే కాని ఆ జాబితాలో అప్పడాన్ని కూడా చేర్చాలని నా అభిప్రాయం. విందు భోజనాల్లో అప్పడాలు వదిలేసేవాళ్ళని చూస్తే ఇప్పటికీ నాకు చాలా చిరాకు. మరి ఈ విధంగా తింటూ పోతే బొజ్జ పెరగకుండా వుంటుందా? పెరగనే పెరిగింది. దాంతోటి గృహలక్ష్మి ఆంక్షలు మొదలు. ఇప్పుడు మోతాదు చాలా తగ్గించి వారానికి ఒక్కసారంటే ఒక్కసారి అందునా తడవకి రెండు లేదా మూడుతో సరిపెట్టుకోవలసివస్తూంది. ఆ విరహాన్ని తీర్చుకోవడానికే ఈ టపా. ఊకదంపుడు గారు, గిరి గారు ఇంకా కొత్తపాళీ గార్ల విద్వత్తులో పదోవంతు నాకున్నా ఇంత పెద్ద టపా బదులు అప్పడాలమీద ఒక కందమో లేక సీసమో రాసి వుందును. అదిలేకనే ఈ తిప్పలన్నీ. జై అప్పడం మాతా.