సంఘటన -1:
స్థల,కాలాలు : మిర్యాలగూడ, శ్రీ సరస్వతీ శిశుమందిర్. బహుశా అప్పుడు నేను ఆరవతరగతి చదువుతున్నాననుకుంటా.
గురూజీ: మీ నాన్నగారేం చేస్తుంటార్రా?
నేను: ఫలానా సిమెంటు కంపెనీలో సూపర్ వైజరండీ.
గురూజీ: అది జానపాడు దగ్గర వున్న కంపెనీ కదరా. రోజూ అక్కడనించి వస్తావా?
నేను: లేదండీ నేనీ వూళ్ళోనే వుంటాను. మా డాడీ ఇక్కడే పనిచేస్తారు.
గురూజీ: ఇందాక సిమెంటు ఫ్యాక్టరీ అన్నావు మరి?
నేను: ఆయన మా నాన్నగారండీ. ఈయన మా డాడీ.
గురూజీ: ఆఁ...???
సంఘటన -2:
స్థల,కాలాలు : మళ్ళీ మిర్యాలగూడ, మా ఇల్లు. ఈసారి నేను ఎనిమిదవతరగతి లో వున్నా.
సందర్భం: మా పిన్ని కూడా మా స్కూల్లోనే పనిచేసేది. ఒకసారెప్పుడో మా పిన్ని కూడా పనిచేసే మాతాజీలంతా మాఇంటికి భోజనానికి వచ్చారు. వాళ్ళకి మా ఫ్యామిలీ ఆల్బం చూపిస్తున్నప్పుడు ఒక మాతాజీ నాతో
మాతాజీ: వీళ్ళల్లో మీ డాడీ ఎవర్రా?
నేను: అరుగో ఫలానా ఆయనండీ.
మాతాజీ: మరి మీ పిన్ని ఈయన్ని చూపించి అన్నయ్య అని చెప్పింది?
నేను: అవును మా పిన్ని మా డాడీకి చెల్లెలు మాతాజీ.
ఇంతలో ఇంకో మాతాజీ: (ఫొటోలో మా అమ్మని చూపించి) ఈవిడెవరు?
నేను: ఈవిడ మా అమ్మ. మా డాడీ వాళ్ళ పెద్ద చెల్లెలు. మా పిన్నేమో చిన్న చెల్లెలు.
చిన్నగా ఢామ్మన్న చప్పుడు. ఆ ప్రశ్న వేసిన మాతాజీ కాస్త సన్నపాటి మనిషిలేండి.
సంఘటన -3:
స్థల,కాలాలు : ఈసారి సీను గుంటూరుకి మారింది. నేనప్పుడు డిగ్రీ చదువుతున్నా. మాకూ మా పక్కింటి వాళ్ళకీ కలిపి కామన్ బాల్కనీ వుండేది. ఒకరోజు సాయంత్రం మా డాడీ బాల్కనీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. పక్కింటావిడ కూడా వాళ్ళవైపు బాల్కనీలో కూర్చుని ఏదో పని చేసుకుంటూ వుంది. ఇంతలో
నేను: డాడీ! అమ్మమ్మ, తాతయ్యగారు వచ్చారు.
డాడీ: రండి నాన్నా. అమ్మా కులాసానా?
(ఇంతలో మా మమ్మీ లోపలనించి వచ్చి) అత్తయ్యగారూ, మామయ్యగారూ కులాసానా?
ఈ రెండుముక్కలూ విన్నందుకే తట్టుకోలేని పక్కింటి ఆవిడ బాల్కనీ రెయిలింగెక్కి కిందికి దూకబోతుంటే పరుగునవెళ్ళి నచ్చజెప్పి కిందికి దించాం నేనూ, మాతమ్ముడూ.
సరే ఇహ నాన్చకుండా అసలు సంగతి తేల్చేస్తాను. విషయమేంటంటే మా అమ్మ, నాన్నగారు/ మేనత్త, మేనమామగార్లవి కుండ మార్పిడి పెళ్ళిళ్ళు. అంటే మా అమ్మ వాళ్ళ అన్నగారికి మా నాన్నగారి చెల్లెలినిచ్చారు అన్నమాట. ఈ మా మేనత్త, మేనమామగార్లకి సంతానం లేకపోవటం వల్ల నన్ను పెంచుకున్నారు. బాగా చిన్నప్పుడే అలా వెళ్ళిపోవడం చేత వారిని డాడీ, మమ్మీ అని పిలవడం అలవాటయ్యింది. ఒక ముక్కలో చెప్పాలంటే మా అమ్మా-నాన్నలని అమ్మా, నాన్నగారూ అనీ మేనత్త-మేనమామలని డాడీ, మమ్మీ అనీ పిలుస్తాను. అదీ సంగతి. ఇంతవరకూ ఏ పేచీ లేదు. అసలు ఇబ్బందల్లా మేనత్త-మేనమామగార్ల వరసలు మాత్రమే మారిపోయి మిగతావన్నీ అదేవిధంగా వుండిపోవడం దగ్గరే వచ్చింది.
అయ్యిందా? అబ్బే ఇంకా లేదు. ఇక్కడింకో గజిబిజి. నా ఇద్దరు తమ్ముళ్ళలో పెద్దవాడు కూడా చిన్నప్పుడే నాదగ్గరికి వచ్చేయటంవల్ల తను కూడా డాడీ మమ్మీ అనే పిలుస్తాడు. చిన్నవాడు మాత్రం పెద్దత్త, పెద్దమామయ్య అంటాడు. మరో తికమక ఏంటంటే మా మేనత్త కూతురు దానికి తొమ్మిది నెల్ల వయసునించీ మా ఇంట్లోనే పెరగటంవల్ల మమ్మల్ని అన్నయ్య అని పిలుస్తుంది. మా ఇంట్లో ఆడపిల్ల లేకపోవటం వల్ల మేం కూడా దాన్ని మా స్వంత చెల్లెల్లాగే చూసుకుంటాం. కానీ వాళ్ళ అమ్మా నాన్నల్ని మాత్రం మామయ్య/అత్తయ్య అని పిలుస్తాం(అది పుట్టకముందునించీ అలవాటయిన పిలుపులు - మారటం కష్టం కదా!)
ఇంకో తికమక చెప్పనా? అయ్యయ్యో!! మౌసునలా టేబులుకేసి బాదకండీ. ఇంకే తికమకలూ లేవు ఊరికే అన్నా మీరేమంటారో చూద్దామని. మీ పరిస్థితి నాకర్థమయ్యింది. ఉంటా మరి.