ఇవి చాలా వరకూ తమిళ హీరోల మీద నేను వివిధ సైట్లలో చదివిన జోకులు. ఇవి మన యువ నట వారసులకు ఎందులోనూ తీసిపోవనిపించి ఇలా కొంచెం మార్చి వ్రాస్తున్నాను.
1. (ఓ యువ నట వారసుడు నటించిన సినిమా ఆడుతున్న థియేటర్ బయట జనాల గుంపులను చూస్తూ)
దానయ్య 1: అబ్బో ఏంటండీ ఇంత జనం. సినిమా అంత బావుందా?
దానయ్య 2: అంత లేదు. ఎవడో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకై వచ్చాడట. వాణ్ణి చూడటానికి జనం విరగబడుతున్నారంతే.
2. యువహీరోగారి సినిమా విడుదలైన రెండ్రోజులకే డబ్బా తిరిగొచ్చేసే చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆశ్చర్యకరంగా నిర్మాత "మా సినిమాకు ఆంధ్రప్రదేశ్ అంతటా అన్ని థియేటర్లలోనూ ప్రవేశం ఉచితం" అని ప్రకటించాడు. ఊహించినట్టే మర్నాడు మార్నింగ్షోకి జనాలు ఎగబడ్డారు. అందర్నీ లోపలికి రానిచ్చిన తరువాత చల్లగా ప్రకటించాయి థియేటర్ వర్గాలు, "ప్రవేశం ఉచితమే, కానీ బయటకు వెళ్ళాలంటేనే వెయ్యి రూపాయలు పెట్టి టిక్కెట్ కొనాలి" అని. జనాలు ఎగబడి టిక్కెట్లు బ్లాకులో కొనుక్కుని మరీ పారిపోయారు, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని. నిర్మాతకు మరో రెండు యువహీరో సినిమాలు తియ్యటానికి సరిపడా డబ్బొచ్చింది.
3. బస్సులో ముఫ్ఫైమంది, వానులో పదిహేనుమంది, సుమోలో ఎనిమిదిమంది, కారులో ఆరుగురు కూర్చోగలరు.
కానీ ఒక్కడు కూడా కూర్చుని మన యు.న.వా. సినిమా చూడలేడు.
4. యు.న.వా.:(వాచి షాపులో) ఒక మంచి వాచి చూపించండి.
దుకాణాదారు: ఇదుగోండి. ఇది చాలా మంచి కంపెనీ.
యు.న.వా.: బాగా ఆడుతుందా?
దుకాణాదారు: ఓ, మీరు నటించిన సినిమాలకన్నా బానే ఆడుతుంది
5.చంద్రముఖి - స్ప్లిట్ పర్సనాలిటీ
అపరిచితుడు - మల్టిపుల్ పర్సనాలిటీ
యువ నట వారసుడు - నో పర్సనాలిటీ.