Monday 19 November, 2007

అప్పడోపాఖ్యానము

మామూలుగా మీరెన్ని అప్పడాలు తింటారు? ఒకటి, రెండు. మహా అయితే ఇంకో రెండు. ఓసోస్, అప్పడాలు తినటంకూడా ఒక గొప్పేనేంటీ అంటారా? ఇతర్ల విషయం ఏమోగానీ, చెప్పుకోవడానికి వేరే ఇంకేమీ విశేషాలు లేని నాలాంటి వారికిమాత్రం గొప్పే సుమండీ! నాకీ అప్పడాల మీద ఇష్టం ఎలా మొదలైందో తెలియదు. చిన్నప్పుడు మా మేనత్త పెళ్ళిలో గాడిపొయ్యి దగ్గర కూర్చుని(అప్పటికింకా కేటరింగు సంస్కృతి మొదలవ్వలేదు) ఓ ముప్ఫయ్యో ఎన్నో అప్పడాలు వేసినవి వేసినట్లే లాగించేశాము నేను, మా తమ్ముడు. ఆతర్వాత నెమ్మదిగా వాడీ అలవాటు మర్చిపోయాడుగానీ నేను మాత్రం వాడి వాటా అప్పడాలు కూడ మహదానందంగా కరకరలాడించేవాడిని. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు నా పిచ్చి ముదిరి పాకాన పడసాగింది. స్కూలుకి క్యారియర్లో అన్నం బదులు అప్పడాలే పెట్టాలని గొడవ చేసేవాడిని. దప్పళం అంటే అదేదో కొత్తరకం అప్పడం అనుకొని ఈసారి ఆ అప్పడాలే కొనాలని అమ్మని వేపుకు తినేవాడిని. నూనె నిండుకుందనో, ఈనెల వెచ్చాలతో తెచ్చిన అప్పడాలు అయిపోయాయనో చెపితే ఎంత కోపం వచ్చేదో అమ్మ మీద. పెద్దయ్యాక గొప్ప ఉద్యోగం సంపాదించి రోజూ టిఫిన్ లోకి కూడా అప్పడాలే తినాలని మనసులోనే ప్రతిజ్ఞలు చేసుకొనేవాడిని. కాలేజీ చదువులకి వచ్చాక మెస్సుల్లో ఈవిషయమై ఎన్నోసార్లు గొడవకూడా పెట్టుకున్నాను. ఎన్నోమాట్లు అప్పడం కావాలని అడగటమూ మెస్సు వాడు మొదట మామూలుగా తరువాత ఇబ్బందిగా అటుతరువాత చిరాగ్గా ఆపై కోపంగా అప్పడం మారువడ్డించడమూ జరిగేది. ప్రతి అప్పడానికీ రూపాయి అదనంగా ఇచ్చేటట్లు వాడితో ఒప్పందం కుదుర్చుకున్నాకగాని కథ సుఖాంతమవ్వలేదు. మా అమ్మావాళ్ళు నా భార్యని కాపురానికి పంపించేటప్పుడే నా అప్పడాలప్రియత్వం గురించి మొత్తం చెప్పి పంపించారులాగుంది, తనకి జడుపు జ్వరాలవంటివేమీ రాలేదు. ఇలా వుండగా, పెళ్ళయిన కొత్తలో కొత్తకాపురం చూడటానికి వచ్చారు మా అత్తగారు,మామగారు. భోజనాలప్పుడు మా అత్తగారు 'ఇన్నిఅప్పడాలెందుకే వేయించావ్' అని అడగటం, నా భార్య లోగొంతుకతో 'ష్. అరవకమ్మా. మీ అల్లుడుగారికోసంలే' అని జవాబివ్వటం వినిపించాయి. అటుతర్వాత వంటగదిలోంచి బయటికి వచ్చిన మా అత్తగారి మొహంలో కనిపించింది అపనమ్మకమో లేక ఆశ్చర్యమో లేక భయమో ఆ భావాన్ని నేనిప్పటికీ మర్చిపోలేదు. నా బావమరిది అందించిన రహస్య సమాచారాన్ని బట్టి తెలిసిందేమిటంటే, మరుసటి పండక్కి నేను అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వెచ్చాల కొట్టువాడు అడిగాడట, 'ప్రతీనెలా ఒకటి కంటే ఎక్కువ అప్పడాల పాకెట్లు కొనరు మరి ఈనెల ఇన్ని కొంటున్నారంటే ఏదైనా శుభకార్యం వుందాండీ' అని. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు నిజమే కాని ఆ జాబితాలో అప్పడాన్ని కూడా చేర్చాలని నా అభిప్రాయం. విందు భోజనాల్లో అప్పడాలు వదిలేసేవాళ్ళని చూస్తే ఇప్పటికీ నాకు చాలా చిరాకు. మరి ఈ విధంగా తింటూ పోతే బొజ్జ పెరగకుండా వుంటుందా? పెరగనే పెరిగింది. దాంతోటి గృహలక్ష్మి ఆంక్షలు మొదలు. ఇప్పుడు మోతాదు చాలా తగ్గించి వారానికి ఒక్కసారంటే ఒక్కసారి అందునా తడవకి రెండు లేదా మూడుతో సరిపెట్టుకోవలసివస్తూంది. ఆ విరహాన్ని తీర్చుకోవడానికే ఈ టపా. ఊకదంపుడు గారు, గిరి గారు ఇంకా కొత్తపాళీ గార్ల విద్వత్తులో పదోవంతు నాకున్నా ఇంత పెద్ద టపా బదులు అప్పడాలమీద ఒక కందమో లేక సీసమో రాసి వుందును. అదిలేకనే ఈ తిప్పలన్నీ. జై అప్పడం మాతా.

13 comments:

Anonymous said...

చాలా చక్క వర్ణించారు.
ఇదొక బ్లాగప్పడం :-)

అవును..బ్లాగాగ్ని అంటే ఏదో నిప్పులు కురిపిస్తారనుకుంటే ఇలా పూల రెకుల్ని కురిపిస్తున్నారేంటి.

-- విహారి.

teresa said...

microwave ఒవెన్లో రోస్ట్ చేసి చూశారా?

Unknown said...

అప్పడాలు, వడియాలంటే నాకు కూడా చాలా ఇష్టం.
అప్పడాల కంటే వడియాలే ఇంకా ఇష్టం. వాటిలో వెరయిటీలు గుమ్మడొడియాలు, సగ్గుబియ్యం వడియాలు, గోల్డు ఫింగర్సు... అబ్బో...
అప్పడాలలో మందంగా ఉండే ఒక రకమయినవి నాకు చాలా ఇష్టం.

కర కర కర కర...

Rajendra Devarapalli said...

నీ అప్పడం ముక్కలవ్వ, నీ అప్పడం ప్లేట్లొ నుంచి కిందప్ద,నీ అప్పడం ఫ్యాను గాలికి ఎగిరిపోనూ,నీ అప్పడం పచ్చిదవ్వా,ఇంకా చాలా శాపనార్ధ్హాలూ,తిట్లూ తిట్టాలనే వుంది,అప్పడమున ఇంత హాస్యము కురిపిచవచ్చని నేడే తెలియచేసినందులకు మరో బుట్టెడు అప్పడములు(పచ్చివి) ప్రాప్తిరస్తు

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

http://visakhateeraana.blogspot.com/

rākeśvara said...

మీరిలా మరీ రెండునెలలకోసారి బ్లాగితే ఎలాగండి. మీ టప్పడాల కోసం మా నోరులూరుతుంటాయి. మీరు సీరియళ్లమీద వ్రాసిన టపా నాకిప్పటికీ నవ్వు తెప్పిస్తుంది.

ఇక అప్పడాలకొస్తే, నాకు అప్పడాలూ వడియాలూ పడవు.

అన్నట్టు మీరు అప్పడాల మీద మంచి కందం వ్రాయవచ్చు, ప్ప ని ప్రాసగా వాడి. చాలా బాగుంటుంది. ఈ వంకతో మొదలుపెట్టండి.
లంకెలు
౧.
కందం పై వికీ వ్యాసం

౨. లేదా మీకు గురులఘువులు కూడా గుర్తులేవంటే, crash course కోసం నా
కందం, మందం టపా చూడండి.

rākeśvara said...

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి - యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుఁగువాడె - ధన్యుడు సుమతీ

కీ అప్పడాలతో మాంచి కరకరలాడే పేరడీ కట్టవచ్చు!

జ్యోతి said...

బ్లాగాగ్నిగారు,

నూనెలేకుండా కూడా అప్పడాలు వేయించొచ్చని తెలుసా!. మైక్రోవేవ్ అయితే కరెంట్ కాల్చేస్తుంది. అప్పడానికి రెండు చుక్కలు నూనె రాసి గ్యాస్ మంటపై కాలిస్తే సరి...

అప్పడాలతో కొన్ని వంటకాలు రాయమంటారా షడ్రుచులులో??

బ్లాగాగ్ని said...

విహారి గారు, ప్రవీణ్ గారు, teresa గారు ధన్యవాదాలు.

రాజేంద్ర గారు - మీతిట్లు కూడా వీనులవిందుగానే వున్నాయి.

రాకేశ్వరా, మీ అభిమానానికి కృతజ్ఞతలు. బద్ధకం వదిలించుకోవటానికి ప్రయత్నిస్తాను.

జ్యోతి గారు - ఆ వంటలేవో త్వరగా వ్రాసి పుణ్యం కట్టుకొందురూ!

కందర్ప కృష్ణ మోహన్ - said...

అప్పడాల టపా చాలా బాగుంది
నాక్కూడా అప్పడాలంటే చాలా చాలా ఇష్టం.
గో ఎహెడ్.

Usha said...

Blagaagni garu namaste naa peru USHA andi nijangaa mee appdopaakhyaanam chadivi entha navvochindante aa debbaki polamaari visaa vochi vellana maa parents ni kanipinchelaa chesindi ponilendi adi oka adrustame kadaa ilaa anna okasari tallitandrulani chuse bhagyam kalpincheru
nijangaa chalaa funny gaa undandi
kavitwam lo ilaanti kavitwam kuda rayochu ani telisindi.[:)]

కొత్త పాళీ said...

భలే భావుంది. పంజాబీ మసాలా అప్పడంలో ఘాటుగానూ, మద్రాసు సాంబారప్పడంలా కరకరగానూ.
తోలేటి జగన్మోహన రావు అని మంచి కథా రచయిత, ఈ అప్పడాల మీద గొప్ప హాస్య కథ ఒకటి రాశేరు - పేరు లక్ష్మీ కటాక్షం అనుకుంటా.
పైన రాకేశ్వరుడన్నట్టు, మీరింత ఆలస్యంగా రాయడం ఏమీ బాగులేదు, ఇంకా తరచుగా రాయాలి.

రానారె said...

అన్నం పరబ్రహ్మస్వరూపమయితే నాకేమీ అభ్యంతరం లేదు.

కలగంటి కలగంటి... ఇప్పుడిటు కలగంటి...
ఎల్ల లోకములకును అప్పడ(మ)గు తిరువేంకటాద్రీశు గంటి...

అని 'అప్పడ'పు మహిమను కీర్తించినాడు అన్నమాచార్య. కాబట్టి అప్పడం మహావిష్ణుస్వరూపం కావాలి. ;-)

Srinivas said...

@కొత్తపాళీ

ఆ కథ కప్పడాలు (మల్టీ నేషనల్ కంపెనీల మీద రాసింది). లక్ష్మీ కటాక్షం స్టాకు మార్కెట్ పిచ్చి మీద.