నరసరావుపేట యం.సి.ఏ రోజుల్లోని ఒక మరచిపోలేని జ్ఞాపకం శ్రీశైలం, నాగార్జున సాగర్ యాత్ర. మా మిత్రబృందంలో ఒకడికి అనిపించిందే తడవుగా అందరం సిద్ధమయిపోయాం. బడ్జెట్ ప్రయాణం కావటాన బయల్దేరటానికి ముందుగానే మాలో ఒక మిత్రుడు అక్కడి వివరాలు కొన్ని సంపాదించాడు. అందులో ముఖ్యమైనదీ, మా చెవుల్లో పాలుపోసినట్లు వినిపించిందీ - శ్రీశైలంలో ఎక్కడ పడితే అక్కడ ధర్మసత్రాలుంటాయని, వాటిల్లో వసతి, భోజనం ఉచితంగా లభిస్తాయని. అదృష్టం కొద్దీ మేము మాట్లాడుకున్న జీపువాడు కూడా తన కొడుక్కి నాగార్జున సాగర్ చూపించాలని ఎన్నాళ్ళనించో అనుకుంటూ వుండటంతో తక్కువకే బేరం కుదిరింది. మొత్తానికి తలా రూ.300/- లతో(అక్షరాలా మూడువందల రూపాయలు మాత్రమే) ఏడుగురం మిత్రులం ఒక శుభరాత్రి బయల్దేరి మార్కాపురం మీదుగా తెల్లవారేప్పటికి శ్రీశైలం చేరాం. షరా మామూలుగానే పాతాళగంగలో మునకేసి, స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆత్మారాముడి గోల పడలేక భోజన సత్రాలకై వెదకటం మొదలెట్టాం. అప్పుడు తెలిసిన గొప్ప నిజమేమిటంటే అక్కడి సత్రాలు చాలావరకు caste based. అంటే ఏ కులంవారి సత్రంలో ఆ కులంవారికే వసతి లభిస్తుంది. కొన్ని సత్రాలు ఇతర కులాలవారికి కూడా భోజనం మాత్రం పెడతాయిగానీ వేరుగా కూర్చుని తినాలి. ఏం చెయ్యాలో ఒక్కడికీ పాలుబోలేదు. ఒకేకులానికి చెందిన వాళ్ళతోనే ఇట్లాంటి చోట్లకి రావాలని మాకు తెలియదింకా అప్పటికి.
మాలో ఇద్దరు ఫలానా1, మరో ఇద్దరు ఫలానా2, ఇక మిగతా ముగ్గురూ వేర్వేరు ఫలానాలన్నమాట. చూడబోతే ఒక్కోడూ ఒక్కోగదిలో వుండాల్సొచ్చేట్టుగా వుంది. అసలు వూరొచ్చిందే అంతా కలిసి ఎంజాయ్ చేద్దామని. మరెలా? సరే చించగా చించగా, గది ఇచ్చే ముందు ఇంటిపేరు, గోత్రం అడగటం చూసి ఒకడికి బ్రహ్మాండమైన లైటు వెలిగింది. ఫలానా1 కి సంబందించిన ఏవో ఒక గోత్రం/ఇంటిపేరు కాంబినేషను బట్టీ వేయించేసి ఒకడిని మాతోపాటు మా ఫలానా1 సత్రంలోకి లాగేశాం. మిగతా ఇద్దరు ఇతర ఫలానాలక్కూడా ఫలానా2 తాలూకు కాంబినేషన్లు బట్టీ పట్టించి వాళ్ళని ఫలానా2 లోకి విజయవంతంగా తోసేశాం(అని అనుకున్నాం). మాతో పాటు వచ్చినవాడు మేమే వార్నీ అనుకునే స్థాయిలో తడుముకోకుండా గోత్రనామాలు చెప్పిపారేశాడు. అవతల కూడా అంతా హ్యాప్పీసే అనుకుంటూ హాయిగా భోంచేసి గదిలో తొంగున్నాం.
అవతలి సత్రంలో ఒక చిన్నతేడా జరిగింది. గదులు ఇవ్వటానికి కూర్చున్నవాడికి మా బట్టీవీరుల్ని చూసేసరికి ఏం అనుమానం వచ్చిందో ఏమో, ఇంటిపేరు/గోత్రం తో సరిపెట్టకుండా మేనమామ గోత్రం చెప్పమని అడిగాడు ఒక బట్టీబాబుని. దాంతో కంగారుపడ్డ మావాడు ఏం చెప్పాలో తెలియని టెన్షన్లో వెనకనించి మావాళ్ళు సైగచేస్తున్నా పట్టించుకోకుండా 'ఆయనదీ అదే గోత్రం' అనేశాడు. చచ్చింది గొర్రె. గొడవ మొదలు. నీ అసలు కులమేమిటో చెప్పమని అంటాడు సత్రంవాడు. మావాడికీ ఆవేశమొచ్చి 'మంచితనానికి మాలని, మానవత్వానికి మాదిగని, అమ్మతనానికి కమ్మని ...(మిగతా డైలాగు గుర్తులేదు)'తో సరిసమానమైన డైలాగు వేశాడు బాలయ్య లెవెల్లో. కానీ అస్సలు కళాహృదయంలేని సత్రంవాడు ఆ డైలాగునేమాత్రం పట్టించుకోలేదు. రచ్చ మళ్ళీ మొదలు. మావాళ్ళ తడబాటు చూసి సత్రకాయగాడికి అనుమానం నిర్థారణ అయిపోయింది. దాంతో వాడు 'వీడు మావాడని మీరెవరైనా నిరూపిస్తే సంవత్సరం పాటు ఉచితంగా మీఇంట్లో పని మనిషిగా చేస్తాను' అని మావాళ్ళకి సవాళ్ళుకూడా విసరటం మొదలెట్టాడు. ఇక పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించి మావాళ్ళే నెమ్మదిగా అక్కడినించి జారుకున్నారు.
జరిగిన విషయం సాయంత్రం విన్న నేను మావాడూ విరగబడి నవ్వాం రవితేజలా, వెకిలిగా. అసలు ఇలాంటి విషయాన్ని ఎలా మానేజి చెయ్యాలో మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిందిగా ఒక ఉచిత సలహా కూడా పారేశాం వాళ్ళమొహాన. కానీ మాకేం తెలుసు ఆరోజు రాత్రికే మాక్కూడా గర్వభంగం జరగబోతోందని.
షాపింగ్ పేరుతో సాయంత్రమంతా తిరిగి, పనిలో పనిగా శ్రీశైలం వచ్చిన అమ్మాయిలందరినీ కవర్ చేసేసి బాగా పొద్దు పోయాక సత్రానికి తిరిగొచ్చాం. మర్నాడు పొద్దున్నే బయల్దేరి సాగర్ వెళ్ళాలనేది ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం. సాయంత్రమంతా బయట అడ్డమైన చెత్తా తిన్నందువల్ల నాకూ, నాతో పాటు ఇంకొకడికీ ఆకలివెయ్యలేదు. దాంతో వెళ్ళి భోంచేసి రమ్మని మాతో వున్న బట్టీబాబుని మాత్రం పంపించాం. ఉత్సాహంగా తలూపి వెళ్ళినవాడు కాస్తా కాసేపటికి ఖంగారుగా తిరిగివచ్చి 'భోజనం చేస్తుంటే అంతా నన్నే పరీక్షగా చూస్తున్నారురా మామా' అనేశాడు. అంతే మా ఇద్దరికీ గుండెల్లో అణుబాంబులు పేలాయి. వార్నాయినో కొంపదీసి గుట్టురట్టవ్వలేదు కద అనుకుని మావాడిని అసలు ఏం జరిగిందో చెప్పమన్నా. భోజనానికి వెళ్ళగానే మగాళ్ళు అంతా చొక్కాలు విప్పి భోంచెయ్యాలని చెప్పారట. సరే అని మావాడు చొక్కా విప్పి చుట్టూ చూసేసరికి చాలామంది అవపోశనపడుతూ కనిపించారుట. అంతే మావాడు కూడా ఆవేశపడిపోయి ఏదో వాడికి తోచినట్లు అవపోశనపట్టి భోజనం చేసివచ్చాడు. వీడి వంటిమీద జంధ్యం లేకపోయినా అవపోశనపట్టేటప్పటికి జనాలు అనుమానంగా చూడటం మొదలెట్టారు. అసలు అది పూర్తిగా మావాడి తప్పు కూడా కాదు. ఆరోజు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు వాడికి చెప్పాం మమ్మల్నే చూస్తూ మేమెలా తింటే అలాగే తినమని. రాత్రి పక్కన మేము లేము కాబట్టి వేరేవాళ్ళని ఫాలో అయిపోయాడు వాడు సిన్సియర్ గా.ఇక చూస్కోండి ఏరాత్రప్పుడు వచ్చి బయటికి గెంటుతారా అని ఎదురుచూస్తూ, గెంటితే గెంటారు తన్నకుండా వదిలితే అదే పదివేలు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆరాత్రి గడిపాం. అదృష్టవశాత్తూ అలాంటివేమీ జరగకుండానే తెల్లవారింది. త్వరత్వరగా స్నానాలూ గట్రా కానిచ్చి బయటపడి ఊపిరి పీల్చుకున్నాం. నాగార్జునసాగర్ యాత్ర మాత్రం పెద్దగా సాహసకార్యాలు లేకుండానే పూర్తయింది. ఇది జరిగి దాదాపు పదేళ్ళవుతున్నా ఇప్పటికీ ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించే అనుభవం ఇది.