Saturday, 20 December, 2008

రన్నింగ్ బస్సు ఎక్కర బాబు - 1

కళ్ళు చికిలించి చూశాను ఒక్కసారి. సిటీ బస్సొకటి కోఠీ మహిళాకళాశాల మలుపు తిరుగుతూ కనపడింది. నంబరు చూశాను. నేనెక్కాల్సిన బస్సే. వేగం పుంజుకుంటూ నావైపే వస్తోంది. హ్హ హ్హ, ఎంత వేగంగా వస్తే మనకేంటి. జ్యోతిలక్ష్మి ముందా దీని క్లబ్బు డాన్సులు? సిధ్ధంగా నిలుచున్నా. సరిగ్గా బస్సు నన్ను దాటబోతున్న సమయంలో ఎడమచేత్తో చులాగ్గా బస్సు కడ్డీ పట్టుకుని అలవోగ్గా ఒక్క గెంతులో బస్సెక్కేశా. బస్సులో నలుగురు మెరుపుతీగల్లాంటి అమ్మాయిలు! నావంకే ఆశ్చర్యంగా, ఆరాధనగా చూస్తూ వాళ్ళల్లో వాళ్ళు గుసగుస లాడుకుంటున్నారు. మనం చేసిన సాహసకార్యానికి వాళ్ళు ఫ్లాట్ అయిపోయారని అర్ధమవ్వగానే ఛాతీ ఎకరంన్నరమేర పొంగింది. ఇంతలో ఒక ఇందువదన జరిగి తనపక్కన కూర్చోవటానికి చోటు చూపించింది. వావ్! ఈసంగతి మా రూమ్మేట్లకి ఎంత రసభరితంగా వర్ణించాలా అని ఆలోచిస్తూ కూర్చునే లోపలే మరో కోమలాంగి నావైపు తిరిగి ఫెడీమని కాలిమీద తన్ని “మీద కాళ్ళెయ్యొద్దని నీకెన్నిసార్లు చెప్పాన్రా?” అంది. ఇదేంటీ ఈ అమ్మడి గొంతు మా కృష్ణగాడిదిలాగుంది అనుకునే లోపలే మరో రెండు తన్నులు తగలటం ఈసారి కృష్ణగాడి ఆడియోతో పాటు వీడియో కూడా కనబట్టం వెనువెంటనే జరిగిపోయాయి. మంచి కల పాడు చేసినందుకు వాడి గొంతు పిసకాలనిపించినా అసలే నిద్ర చెడిన తిక్కలో వున్న కృష్ణగాడిని చూశాక ఆ నిర్ణయాన్ని మర్నాటికి వాయిదా వేసి అటు తిరిగి పడుకున్నా కిమ్మనకుండా.

నాకిలాంటి రన్నింగ్ బస్సు కలలు రావటం కొత్త కాదు. ఎప్పుడో చిన్నప్పుడు నేను ఎనిమిదో తరగతిలో వుండగా మొదటిసారి హైదరాబాదుకు వచ్చా. నగరంలో అన్నిటికన్నా ప్రముఖంగా నన్నాకట్టుకున్నది ఇక్కడి జనాల పొదుపరితనం(సమయం విషయంలో). స్టాపు దాకా నడిస్తే సమయం వృధా అని సిగ్నళ్ళ దగ్గర రన్నింగులోనే ఎక్కెయ్యటం, బస్సాపేదాకా ఆగటమెందుకని రన్నింగులోనే దిగెయ్యటం, దిగాల్సిందానికి మూడు స్టాపులు ముందే వెళ్ళి ఫుట్బోర్డు మీద వేళ్ళాడుతూ నించోవడం వగైరాలన్నీ చూశాక నేనెంత కాలాన్ని వృధా చేస్తున్నానో జ్ఞానోదయమైంది. ఎప్పటికైనా సరే హైదరాబాదులోనే ఉద్యోగం చేస్తాననీ, ఇప్పుడు వృధా చేసిన కాలాన్నంతటినీ అప్పుడు వడ్డీతో సహా పొదుపు చేస్తాననీ ఆక్షణమే నిర్ణయించుకున్నాను. ఇహ అప్పట్నించీ ఒహటే మెరుపు కలలు, ఆర్.టి.సి. వాడిదగ్గర ఒక ఖాళీ బస్సు అద్దెకు తీసుకుని రన్నింగులో ఎక్కడం ప్రాక్టీస్ చేస్తున్నట్టు, బస్సులు, కార్లు, లారీలు, ట్రాక్టర్లు ఒకటేమిటి ఆఖరికి విమానాలు కూడా రన్నింగులో ఎక్కగల 'ఒక్క మగాడు' అని గుంటూరు జిల్లా మొత్తం పేరు తెచ్చుకున్నట్టూ, ఇలా అన్నమాట.

చూస్తుండగానే డిగ్రీ పూర్తవ్వొచ్చింది. ఎమ్.సి.ఏ ఎంట్రెన్స్ కోచింగ్ హైదరాబాద్ లో తీసుకోవడానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించా. డిగ్రీ పరీక్షలవ్వగానే హైదరాబాదు బండెక్కడానికి అంతా రంగం సిద్ధమయ్యింది. హైదరాబాదు వెళ్ళిన మొదటిరోజే రన్నింగ్ బస్సెక్కి నా స్నేహితులతో వార్నీ అనిపించుకోవాలని నా పధకం. మరి ప్రాక్టీసు చెయ్యాలిగా? అదేదో గుంటూరు సిటీబస్సులమీదే చెయ్యాలని నిర్ణయించా. ఇక్కడ గుంటూరు సిటీబస్సుల గురించి ఒక చిన్న పిడకలవేట. గుంటూరులో చాలావరకు సిటీబస్సులు ప్రైవేటు యాజమాన్యానికి చెందినవి. వీలయినంత ఎక్కువమంది జనాలని ఎక్కించుకోవటమే జీవితాశయంగా నడపబడేవి. చెయ్యెత్తటం ఆలస్యం సర్రున బస్సొచ్చి పక్కన ఆగటం,మీచొక్కా పట్టుకుని బస్సులోకి లాగటం,మళ్ళీ బర్రున బయల్దేరటం అన్నీ క్షణాలమీద ఛ ఛ కాదు మిల్లీసెకెన్ల మీద జరిగిపోతాయి. ఆమధ్యొకసారి తలదువ్వుకోవటానికి చెయ్యెత్తిన వాడ్ని, చంకలో దురద పుట్టి గోక్కోవటానికి చెయ్యెత్తినవాడ్నీ కూడా బస్సులో లాగేశారిలాగే. కాబట్టి ఈసారి మీరెవరైనా గుంటూరొస్తే చేతులు దగ్గర పెట్టుకుని నడవాల్సిందిగా హెచ్చరిక. పిడకలవేట సమాప్తం. అలాంటి ఘనత వహించిన సిటీబస్సుని లక్ష్మీపురం సెంటర్లో రన్నింగులో ఎక్కాలని ప్లాను.

(ఇంకావుంది)

11 comments:

Dreamer said...

నాక్కూడా రన్నింగ్ బస్ ఎక్కాలని కల ఉండేది, రెండు మూడు సార్లు ట్రై చేసి పళ్ళురాలగొట్టుకున్నాక, ఇంక ట్రై చెయ్యడం మానేశా.

"జ్యోతిలక్ష్మి ముందా క్లబ్బు డాన్సులు ?"
"ఆర్టీసీవాడి దగ్గర బస్సులు అద్దెకు తీస్కుని మరీ ప్రాక్టీస్ చెయ్యడం"

అదిరాయి :)

సిరిసిరిమువ్వ said...

:))రన్నింగ్ బస్సు ఎక్కే వాళ్లని చూస్తుంటే వీళ్లిక ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నారేమో అనిపిస్తుంటుంది నాకు.

మీదీ గుంటూరేనా! మాదీ గుంటూరే!

Rajendra Devarapalli said...

రన్నింగ్ ట్రైను ఎక్కిన అనుభవాలున్నయా ఎవరికన్నా??నేను ఒక సంవత్శరం అచ్చం ఆపని మీద ఉన్నాను ఇంటర్ చదివేటప్పుడు :)

సూర్యుడు said...

:-)

దేవన said...

waiting for part 2

:) :)

మధు said...

హహ్హా ...మష్టారూ కేక!!

లక్ష్మి said...

Hahha!!!

KumarN said...

రాజేంద్ర కుమార్ గారూ,

ఖశ్చితంగా ఛాతీ విరచి మరీ చెప్పగలను, ఇక్కడ ఉన్న వాళ్ళలో నా అంత రఫ్ గా, నా అంతా దూరాలు పరుగెట్టి ఎవ్వరూ ఎక్కి వుండరు అని. నా అంతగా ఫుట్ బోర్డింగ్ కూడా ఎవ్వరూ చేసి ఉండరు. అలా దాదాపు ఓ సంవత్సరపు విర్రవీగిన తరవాత, ఒకసారి 187లో వివేకానంద నగర్ కాలనీ దాటెళ్ళింతర్వాత మెలకువొచ్చి, అయ్యో కాలనీ దాటెల్లి పోతోందే అని, సీనిమా హీరో లాగా దూకేశా. మోకాలి చిప్పలు పగిలి రక్తాలు కారి, మూతి అంజనేయుడి లాగా అయ్యినప్పటినుంచి బాగా తగ్గించేసి, చివరికి మానేశా.

రన్నింగ్ ట్రైన్లు కూడా బాగా అనుభవమేనండోయ్. మా ఊరి నుంచి సికింద్రాబాద్ కి రోజూ షటిల్ చేసే రోజుల్లో, చాలా సార్లు అందులోకి దూకడాలూ, అందులోంచి దూకడాలు కూడా చేసా.

వేణూశ్రీకాంత్ said...

హ హ బాగుంది.. గుంటూరు సిటీ బస్సుల గురించి భలే చెప్పారు :-)

krishna rao jallipalli said...

ఆమధ్యొకసారి తలదువ్వుకోవటానికి చెయ్యెత్తిన వాడ్ని, చంకలో దురద పుట్టి గోక్కోవటానికి చెయ్యెత్తినవాడ్నీ కూడా బస్సులో లాగేశారిలాగే... ఇప్పుడు ఆటో వాళ్లు ఆ పని చేస్తున్నారు.

Bhaskar said...

రన్నింగు బస్సు ఏక్కడం లొ పీ.జీ చేసిన నేను చేప్పలిసిన సంగతి ఓక్కటి ఉన్నది. గుంటూరు బస్సు రెండున్నర అడుగులెత్తు. చాలా కష్తం. Hyderabad bus చాలా వీజీ..