Thursday 13 August, 2009

యండమూరి, నేను మరియు నా స్వార్థం

కొంతకాలం క్రితం చదివిన యండమూరి నవల ఆనందో బ్రహ్మలోని ఒక సన్నివేశం నాకు జరిగిన కొన్ని స్వానుభవాల వల్ల అలా మనసులో నిలిచిపోయింది. సన్నివేశం క్లుప్తంగా - "నవల్లో ఒక పాత్రకి భారత దేశమ్మీద జరగబోయే అణుదాడి గురించి ముందుగా సమాచారం తెలుస్తుంది. తనకున్న ముఖ్యమైన వస్తువులని వెంటపెట్టుకుని వీలైనంత త్వరగా తనుంటున్న ప్రదేశానికి దూరంగా పారిపొమ్మని అతడికి పరిచయమున్న ఒక సైనికాధికారి చెపుతాడు. దాన్ననుసరించి అతడు తనక్కావాల్సిన అత్యవసర వస్తువులు తీసుకుని భార్యా పిల్లలతోటి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. తీరా కారెక్కబోతుండగా అతడికి ఓల్డేజ్ హోం లో చేర్పించిన తండ్రి విషయం గుర్తొస్తుంది. తనతో పాటు తీసుకెళ్ళాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో/మనుషుల్లో ఒకడిగా తండ్రిని పరిగణించనందుకు చాలా బాధపడతాడు." ఇది చదివినప్పుడు కాస్త అతిశయోక్తిగా అనిపించింది. అంత మెటీరియలిస్టిగ్గా మనుషులుంటారని అప్పటికింకా అనుభవంలోకి రాకపోవడమే అందుకు కారణం.

ఏడెనిమిది నెల్ల క్రితం, ముంబాయి టెర్రరిస్టు దాడులు జరిగిన కొత్తల్లో ఒక చిన్న అకారణమైన భయం - ఈసారి లక్ష్యం పుణె అవుతుందేమో అని - నా సబ్ కాన్షస్ లో ఏమూలో నాటుకుపోయింది. ఒకరోజు అలవాటు ప్రకారం మా అబ్బాయిని బళ్ళో దించటానికి వెళ్ళా. బండి పార్క్ చేసి పైకి వెళ్ళి దింపివస్తూంటే వాళ్ళ ప్రిన్సిపాల్ కనిపించి మావాడి గురించి ఏదో మాట్లాడాలంది. సరేనని ఆవిడతో ఆ విషయమేదో మాట్లాడి కిందికొచ్చా. పార్కింగ్ లోనించి నా బండిని తీస్తుండగా యదాలాపంగా గమనించా దాని పక్కనే పార్క్ చేసిన మరో బండిని, దానికి వేళ్ళాడుతున్న ఒక చేతి సంచిని. ఇందాక పైకి వెళ్ళేటప్పుడు చూసినట్లే వుంది కానీ హడావుడిలో అంతగా పట్టించుకోలేదు. బాంబేమో? చాలాసేపట్నించీ ఇక్కడే వున్నట్లుంది?? ఒక్కసారిగా నా వెన్ను జలదరించినట్లైంది. ఇక ఏమీ అలోచించుకోవటానికి అవకాశమివ్వలేదు నా మెదడు. బైకును స్టార్ట్ కూడా చెయ్యకుండా అలాగే కాళ్ళతో నెట్టుకుంటూ ఓపదడుగుల దూరం వెళ్ళాక నాలో విచక్షణ మేలుకుంది. "ఒకవేళ అది నిజంగా బాంబే అయితే పక్కనే వున్న బళ్ళో పిల్లల పరిస్థితి ఏమిటి? అదేబళ్ళో మా అబ్బాయి కూడా వున్నాడన్న విషయం కూడా మరిచిపోయి నా ప్రాణాలు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాను నేను. ఛ ఛ!" అనిపించింది. బండి ఆపి మరో అయిదు నిమిషాలు చూసి ఈలోగా ఆ రెండో బైక్ తాలూకు ఎవరూ రాకపోతే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నిర్ణయించుకున్నాను. అంతలోనే ఎవరో వచ్చి ఆ బండి తీసుకెళ్ళటంతో హమ్మయ్య అనిపించింది కానీ నేను మొదట స్పందించిన తీరు మాత్రం నన్ను చాలా సిగ్గు పడేలా చేసింది.

అలాగే రెండురోజుల క్రితం జరిగిన మరో సంఘటన. అందరికీ తెలుసు స్వైన్ ఫ్లూ పుణెలో ఎలా స్వైరవిహారం చేస్తోందో. మీడియా పుణ్యమాని జనాల్లో అవసరమైనదానికన్నా ఎక్కువే అవేర్నెస్(పానిక్ అనొచ్చేమో) వచ్చేసింది. గుంటూర్నించి మా అమ్మా వాళ్ళూ, అత్తగారు వాళ్ళూ ప్రతి పూటా ఫోన్లు చేసి కుశలం అడగటం మొదలుపెట్టారు. నేనూ మొదట్లో అంతగా పట్టించుకోలేదుగానీ హైరిస్క్ గ్రూపుల్లో ఐయిదేళ్ళలోపు పిల్లలున్నారని తెలిసినప్పట్నుంచీ మాత్రం మావాడెక్కడ దానిపాలబడతాడో అని భయం మొదలైంది. ఇక ప్రతిక్షణం వాడు తుమ్మినా, దగ్గినా ఉలిక్కిపడటం, వాడికి జలుబులాంటివి చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోవటం, టెంపరేచర్ గమనిస్తూండటం వగైరాలతో కాస్త టెన్షన్ గానే గడుపుతున్నాము. రెండ్రోజుల క్రితం పేపర్నిండా వున్న స్వైన్ ఫ్లూ వార్తలు చదువుతున్నాను. రోజూ వేసినట్లే ఆరోజు కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలు, జాగ్రత్తలు, ఎవరికి ఎక్కువ ప్రమాదకరం వగైరాలతో ఒక పట్టిక వుందక్కడ. పేపర్ తిప్పెయ్యబోతుండగా వెలిగింది బుర్రలో - స్వైన్ ఫ్లూ డయాబెటిక్ లకు అత్యంత ప్రమాదకరం. మా నాన్నగారు, అత్తగార్లు డయాబెటిస్ తో ఎన్నో ఏళ్ళుగా బాధపడుతున్నారు. మానాన్నగారికైతే రోజూ ఇన్సులిన్ తీసుకోకపోతే నడవని పరిస్థితి. స్వైన్ ఫ్లూ ఆంధ్రలో వ్యాపించే అవకాశాలు పుష్కలంగా వున్న పరిస్థితుల్లో(అలా జరక్కూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా), వీళ్ళిద్దరూ ప్రమాదంలో వున్నారన్న సంగతే నాకప్పటిదాకా స్ఫురించలేదు. నిజంగానే ఆంధ్రలో ఆ వైరస్ వ్యాపిస్తే నేనిక్కడినించి చెయ్యగలిగేది ఏమీ వుండదు. కానీ కనీసం జాగ్రత్తగా వుండమనైనా చెప్పలేకపోయాను నేను. నా భార్యా బిడ్డల గురించి తప్ప స్వంత తల్లిదండ్రుల గురించి కూడా అలోచించలేనంత స్వార్థంలో కూరుకుపోయానా అనిపించింది.

సాధారణంగా దేవుడిని నేనేమీ కోరుకోను. మహా అయితే సర్వేజనా సుఖినోభవంతు అని ప్రార్థిస్తా, ఆ సర్వ జనుల్లో నేను, నా కుటుంబం ఎలాగూ వుంటుందికదా అన్న నమ్మకంతో. కానీ ఈ రెండు సంఘటనల తరువాత అనిపిస్తోంది ఆ ప్రార్థన ఒట్టి నాలుక చివరి ప్రార్థనేనా, మనసులోంచి వస్తోంది కాదా అని. ఏమో. ఒక్క విషయం మాత్రం స్పష్టం ఇప్పుడు. యండమూరిది అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు - కనీసం నా విషయంలో.

13 comments:

Rani said...

all I can say is, You are not alone in this matter

మురళి said...

యండమూరి ఆ నవల్లో భవిష్యత్తు గురించి చెప్పినవి మరికొన్ని కూడా నిజాలయ్యాయండి.. ప్రతి ఒక్కరం ఏదో ఒక క్షణంలో ఇలాంటి ఆలోచనలో పడతాం.. బాగుంది టపా...

Bolloju Baba said...

ఇలా క్షణ క్షణం మనం చేసే ప్రతీ విషయాన్ని డిసెక్ట్ చేసుకోవటం అనవసరమని, నేను తెలుసుకొన్నాను.

జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల్ని తప్ప మిగిలిన వాటిపై మరీ ఎక్కువగా ఆలోచించటం వల్ల ప్రయోజనం లేదని గ్రహించాను.

ఉల్లిపాయ పొరల్ని ఒల్చుకొంటూ పోతే కన్నీళ్లే మిగులుతాయి తప్ప చేతిలో ఏమీ ఉండదు.

మీకు వినటానికి కష్టంగా ఉన్నా ఎందుకోచెప్పాలనిపిస్తుంది. బహుసా ఒకప్పుడు నేనూ ఇలాగే ఆలోచించేవాడిని. అందుకేనేమో.

if this is not palatable. pl. ignore my comment and take light.

bollojubaba

ఉమాశంకర్ said...

తరచి చూసుకొనేవరకూ మనం ఆ స్వార్ధంలో కొట్టుకుపోతున్నామనే స్పృహే ఉండదు.

good post..

శరత్ కాలమ్ said...

ఆనందోబ్రహ్మ నాకు బాగా నచ్చిన నవల. అందులోని ఆ సన్నివేశం నాక్కూడా బాగా గుర్తుకువుంటుంది.

కొన్నేళ్ళ క్రితం అమర్ నాధ్ యాత్రల సందర్భంగా యాత్రికులు మంచు తుఫానులో చిక్కుకొని కొన్నిరోజులపాటు ఆకలిదప్పులకు తాళలేక విలవిలలాడారు. అలాంటివారిలో పిల్లలు కూడా వున్నారు. సైన్యం హెలికాప్టర్ల ద్వారా కొంతమందికి ఆహారం పొట్లాలను అందించగలిగింది. పిల్లలని తోసేసి మరీ తల్లితండ్రులే ఆ ఆహారాన్ని ముందుగా తిన్నారట!!

భావన said...

బాగుంది టపా. నిజమే ఆ నవల లోనే అనుకుంటా అంటారు "స్వార్ధం ఎక్కువ ఐన కొద్ది నా అనే గిరి చిన్నదైపోతోంది ప్రస్తుతానికి దానిలో భార్యా పిల్లలు వున్నరు అది కూడా మాయమవుతుంది" అని. అప్పుడప్పుడు జీవితాన్ని సమీక్షించుకుని వీలైనంత వరకు మనకు తప్పులు అనిపించినవి తిరిగి చెయ్యకుండా వుండటానికి ప్రయత్నించటం తప్ప (మనకు మనమే బెస్ట్ జడ్జ్ లము కదా) ఇంకేమి చేస్తాము..
ప్రస్తుతానికైతే నాది రాణి గారి మాటే అందరం అదే బోట్ లో వున్నాము తప్పు ఐనా మనలానే ఇంకా చాలా మంది ఆ తప్పు చేస్తున్నారని తెలిసి కలిగే చిన్న రిలీఫ్ కోసం.. :-)

Anonymous said...

' జీవితం లో మరీ ముఖ్యమైన విషయాలు తప్పించి మిగిలిన విషయాలపై ఎక్కువ ఆలోచించి ప్రయోజనం లేదు "-- ముఖ్యమైన విషయం అంటే ఏమిటి? ఒక్కోక్కళ్ళకి ఒక్కో విషయం ముఖ్యమైనది కావచ్చు.దేని గురించి ఆలోచించాలీ? ఆ వ్రాసినవారికి తనూ, తన కుటుంబమే ముఖ్యం కావొచ్చు. కానీ కొంతమందుంటారు, ఊళ్ళో వాళ్ళ గురించే ఆలోచించేవాళ్ళు. అలాటి ట్రైబ్ చాలా తక్కువ.

Sharada said...

ఇదే ఇతివృత్తం మీద ఈ నెల రచన పత్రికలో యం.లక్ష్మణ రావు గారి "అంతిమ తీర్పు" అనే అద్భుతమైన కథ వచ్చింది.

శారద

sunita said...

నాది రాణి గారి మాటే అందరం అదే పడవ
లో వున్నాము

రవి said...

ఫణి గారు, యండమూరి నవల చాలా బావుంది, మీ టపా కూడానూ. అయితే గిల్టీ ఫీలింగ్ పూర్తిగా అసంబద్ధం అని నా భావన.

పక్కన బాంబు ఉంది అన్నప్పుడు మానవమాత్రుడెవరైనా అలానే ఆలోచిస్తాడు., యండమూరితో సహా. అది స్వార్థం అన్న భావన పూర్తిగా అసంబద్ధం.

అయినా మీరు స్వార్థానికి పరిధులెలా నిర్ణయిస్తారు? బాంబు పక్కన ఉన్నప్పుడు మీ అబ్బాయిని, ఇంకొంతమందిని రక్షించారనుకున్నా, ఆ తర్వాత కూడా మరేదో చేసుంటే ఇంకా బావుండేది అని అనిపించటం మానదు.

యండమూరి నవలను నవలగానే ఉంచేస్తేనే బెటరు. దానికి మానసిక పరివర్తనకుపయోగిస్తే అది మనకు గిల్టీ ఫీలింగ్ తెచ్చిపెట్టటం తప్ప చేసే ఉపయోగమేమీ ఉండదు.

పరిమళం said...

ఆనందోబ్రహ్మ నాకు బాగా నచ్చిన నవలల్లో ఒకటి .అది చదివినపుడు నేనూ మీలాగే ఫీలయ్యాను ...కానీ ఇక్కడి మెకానికల్ లైఫ్ చూశాక నాకూ తెలిసింది అది అతిశయోక్తి కాదని .

ప్రణీత స్వాతి said...

మీ పరిస్థితి లో ఎవరున్నా అలాగే అలోచిస్తారండి..

Unknown said...

hi andi...emiti suddenga miss ayyaru...nenu just e roje mee site vist chesanu..chala rojula nunchi mee care kanapadatam ledu..ru fine...hope ur cool..

bagundi...mee thought's naccayi....


TOUCH ...FEEL anedi andariki vastundi life lo...

atleast manam ala anna kooda think chestunamu....kaani mana pillalu?

job..future ..kosam ani entha dooram ayina veltunamu...present fine...kaani oka stage vaste evaru vundaremo..manam perigina life kani,manaki vunna care kaani mana kid's ki manam istunama?

life ante intenemo?