Thursday, 9 September 2010

ఏం పీకుతున్నారు బయటకెళ్ళి?

ఉదయం తొమ్మిదవుతోంది.


ఆరింటికే వివిధ చానెళ్ళలో మొదలయిన సీరియళ్ళను ఒక పట్టుపడుతూ ఇంకా పళ్ళు కూడా తోముకోకుండా కూర్చున్న రమ్య కాలింగ్ బెల్ మోగితే విసుక్కుంటూ లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కేబుల్ అబ్బాయి. "సారు ఈ నెల కేబుల్ డబ్బులింకా ఇవ్వలేదమ్మా" అన్నాడు. "ఈయన పనులన్నీ ఇలాగే ఏడుస్తాయి. ఇప్పుడు వీడు కేబుల్ కట్ చేస్తే అదొక చావు" అని భర్తను మనసులోనే విసుక్కుని "ఆయనతో చెపుతాను. రేపు తప్పకుండా ఇచ్చేస్తార్లే" అని సర్దిచెప్పి పంపేసి మళ్ళీ టి.వి. ముందు సెటిలయ్యింది. అయిదు నిమిషాలు గడిచిందో లేదో ఫోన్ మోగింది. పిల్లల స్కూలు నుంచి ప్రిన్సిపాల్. టర్మ్ ఫీజు కట్టటానికి ఇవాళే ఆఖరి రోజనీ, ఇప్పటికే రెండు రిమైండర్లు పంపించామనీ ఇంకా ఆలస్యమైతే కష్టమనీ దులిపి పారేసింది. ప్రిన్సిపాల్ చెడుగుడు కన్నా ఈ గొడవవల్ల అయిదునిమిషాలు చిట్టెమ్మ సీరియల్ మిస్సయినందుకు తిక్కరేగిన రమ్యకు భర్త మీద పీకలదాకా కోపం వచ్చింది. "పొద్దున్నే ఆఫీసుకంటూ టింగురంగామని బైకుమీద వెళ్ళిపోతాడు, రాత్రిగ్గానీ ఇంటికిరాడు. మధ్యలో ఈయన వెలగబెడుతున్న రాచకార్యాలేమిటో? కాస్త వీటి సంగతి చూస్తే ఆయన సొమ్మేంబోయిందటా?" చిరాగ్గా అనుకుని భర్తకు ఫోన్ చెయ్యనారంభించింది, టి.వి.లో ప్రకటనలు మొదలవ్వటంతో.


ఎంతకీ ఫోను కలవటంలేదు. "ఏడ్చినట్లుంది, ఫోనుబిల్లు కట్టటం కూడా మర్చిపోయినట్లున్నాడు మతిమరపు మొగుడు" కసిగా అనుకుంది రమ్య. కాస్సేపటికి మళ్ళీ సీరియళ్ళ మాయలో పడిపోయి తాత్కాలికంగా సమస్యను మర్చిపోయింది. రాత్రికి ఇల్లు చేరిన నారాయణను చూస్తేగానీ మళ్ళీ విషయం గుర్తుకు రాలేదు. గుర్తొచ్చిన వెంటనే గయ్యిమని లేచింది "ఏం పీకుతున్నారు మీరు బయటికెళ్ళి? బైకుమీద ఝామ్మంటూ వెళ్ళడం, ఓ పదో పన్నెండో గంటలు ఏ.సి. ఆఫీసులో కూర్చుని ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుని రావటం. ఈమాత్రానికే ఏదో సంసార సాగరాన్ని మీరొక్కళ్ళే ఈదుతున్నట్లు ఫోజొకటి." ధారావాహికగా సాగిపోతున్న రమ్య వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అన్నాడు నారాయణ "అది కాదు రమ్యా, ఇవాళ ఒక బాల్య మిత్రుడు కలిశాడు. ఏదైనా మనసుకు హత్తుకునేట్లు చెప్పడంలో వాడు దిట్ట. ఇదే విషయం మామధ్య చర్చకు వచ్చిందివాళ. అప్పుడు వాడు చెప్పింది ఇదిగో ఇలా ఉంది.


మన పెద్దవాళ్ళు చెప్పినట్లు మనం భార్య పిల్లలకోసం తెగ కష్టపడిపోయి,

బాసు తిట్టినా, క్లైంటు కోప్పడినా ఆ విషయం ఆఫీసులోనే మర్చిపోయి,

పక్క సీటు పంకజం అమ్మాయిననే వంకబెట్టుకుని ఆరింటికే ఆఫీసునించి తుర్రుమంటే ఆవిడ పనికూడా తన నెత్తిమీదపడినా విసుక్కోకుండా ఎంత రాత్రయినా ఉండి పూర్తి చేసి,

నరకాన్ని తలపించే రోడ్లమీద ప్రతి కిలోమీటరుకూ ఏర్పడే ట్రాఫిక్ జాములను రోజుకు రెండుసార్లు చచ్చీ చెడీ దాటుకుంటూ,

ఆఫీసు సమస్యలు ఆఫీసులోనే మర్చిపోవాలని, భార్యాపిల్లలమీద వాటిని చూపించకూడదన్న మాటను అక్షరాలా పాటించి,

ఇంటికెళ్ళి భార్యను నవ్వుతూ అస్సలు పలకరించకూడదన్నమాట.

ఎందుకంటే అలా చేస్తే మనం ఆఫీసులో అస్సలు కష్టపడటంలేదనీ, వీళ్ళు చేసేదల్లా మడత నలక్కుండా ఏ.సి. ఆఫీసులో గంటల తరబడి కూర్చుని రావటమేనన్న అభిప్రాయం వాళ్ళకేర్పడుతుంది.


ఇహ మనం ఏంచెయ్యాలయ్యా అంటే, బాసు తిట్టినా, ప్యూను తిట్టినా, ఎర్ర లైటు దగ్గర జీబ్రా క్రాసింగ్ వెనకాల ఆగలేదని పోలీసు తిట్టినా, ఆఖరికి మన పక్కింటోడిని వాడి పెళ్ళాం తిట్టినాసరే(మరి మన మగాళ్ళ ఐకమత్యం ప్రదర్శించొద్దూ) ఇంటికొచ్చేసి పెళ్ళాం మీద నిర్మొహమాటంగా విరుచుకు పడిపోవాలి.ఎప్పుడూ ఆఫీసొదలగానే ఇంటికొచ్చెయ్యడమేనా, కాస్త అలా అలా ఒక్కసారి టాంక్ బండ్, లుంబిని పార్క్ వగైరా వగైరాలు ఒక్కళ్ళమే తిరిగేసి కాస్త "పిల్ల" గాలి పీల్చి రావాలి. అంతగా ఇంట్లో ఆరాలు గట్రా పెడితే ఉండనే ఉందిగా, "ఆఫీసులో ఆలస్యమయ్యింది" అనే తారక మంత్రం.మరీ రాముడు మంచి బాలుడిలా అలా ఎప్పుడూ పెళ్ళాం కొంగుపట్టుకుని తిరిగితే ఏంబావుంటుందండీ, లైఫన్నాక ఓ సరదా అయినా ఏడవాలిగా. అందుకే వారానికోసారి మందు, అప్పుడప్పుడూ చతుర్ముఖ పారాయణం వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రవేశం పొందాలి. సీరియళ్ళలో కూడా హీరోయిన్లు అచ్చు ఇలాంటి కష్టాలే పడుతూ కడవలు కడవలు కన్నీళ్ళు కారుస్తుంటారు. కాబట్టి ఆడాళ్ళు వీటివల్ల తమకు సదరు హీరొయిన్ స్టేటస్ వచ్చేసిందని భావిస్తారే తప్ప బాధ పడరు. అదన్న మాట సంగతి". ముగించాడు నారాయణ.


"ఈ సోదంతా నాకెందుకు గాని, ఇంతకీ బయటికెళ్ళి ఏం పీకుతున్నారు ఈపనులన్నీ ఇలా వదిలేసి?" నిలదీసింది రమ్య.


"ఏం లేదు, ఇవాళ్టినించీ ఏమీ పీకబోవటం కూడాలేదు. అసలు పీక్కోవటానికి ఏమైనా మిగిలి ఉంటే కదా" అన్నాడు నారాయణ బట్టతలను చూపిస్తూ.

23 comments:

జ్యోతి said...

హా...హా...హా... పాపం మగాళ్లు.. :(

నాగప్రసాద్ said...

హిహిహి సూపర్. :))

Naresh said...

బాగుంది

Anonymous said...

ఆడవారి బాదను ఆడవారే అర్థం చేసుకోగలరు అని ఒక వ్యాఖ్యాత అంటే, నిజమే కానీ మగాళ్ళ బాదను మాత్రం సాటి మగాళ్ళు అర్థం చేసుకోరు అనిచెప్పా. కానీ, ఇప్పుడర్థమైంది.. కొంతమంది మగాళ్ళూ తమతోటి మగవారి బాదను అర్థం చేసుకుంటారని... :) Good one.

దీనికి సంబందించి ఇదివరకు నేను రాసిన ఒక టపాను చూడండి.

ఏంటి మగాడి బోడి గొప్ప!?

Anonymous said...

అదరగొట్టావబ్బాయి

హరే కృష్ణ said...

:D :D
సూపర్

Sujata M said...

అబ్బా.. చా ! నానయితే బిల్లు వచ్చాకా, బిల్లు కట్టి, రిసీట్లు ఫైల్ చేసి, ఎప్పుడైనా మా అయ్యోరికి ఏ డాక్యుమెంటైనా కావల్సొస్తే, స్కాన్లూ, జిరాక్సులూ చేయించి, ఈమెయిళ్ళూ, కొరియర్లూ చేసి, కంటోన్మెంటు ఆఫీసులోనూ, కరెంటు ఆఫీసులోనూ పన్లు చేసి పెట్టి, కిరాణా సామాన్లు రవాణా చేసి, పిల్లకి కావలసిన లాగూలూ, డైపర్లూ, క్రీములూ కొని, ఇంటికొచ్చిన బంధువుల పెట్టుపోతలూ చూసి పూడుస్తుంటే, మా అయ్యోరు - నా జీతం ఏమి చేస్తున్నావంటాడు. ఖర్చుల లెక్క చూపిస్తే, బాంకు మినీ స్టేట్మెంటు సంగతెత్త్తాడు. నా సేవింగ్స్ తన ఇన్ కం టాక్సుకి, మెడికల్ బిల్లులు రీ-ఇంబర్సుమెంటుకీ వాడేసుకుంటాడు. నానెవరితో చెప్పుకోవాలబ్బా ?

కాబట్టి అన్నయ్యా - ఇదంతా విష్ణుమాయయ్యా !

:D

బ్లాగాగ్ని said...

జ్యోతి గారు, నాగ గారు(ఏంటో, మిమ్మల్ని నాగ అనాలో బ్లాగు బాబ్జి అనాలో తెలీట్లా :)), నరేష్ గారు, నాగార్జున గారు, తార గారు, హరే కృష్ణ గారు - బోలేడు థాంక్యూలు.

ఆకాశ రామన్న గారు - ఆ టపా నేను చదివానండీ, అందులో నా కామెంటు కూడా ఉంది చూడండి :)

సుజాత గారు - మీలాంటి మంచి ఆడ లేడీస్ సంఖ్య మన దేశంలో మిగిలిన పులుల సంఖ్య కన్నా తక్కువ. కాబట్టి మీరు అరివీర భయంకర మైనారిటీ ఇక్కడ :) ఏదేమైనా మీ అయ్యోరు మంచి లక్కీ అన్నమాట.

Anonymous said...

నాగని ఇక్కడ ఎవరో బ్లాగ్ బాబ్జీ కాదన్నారు నేను ఖండిస్తున్నాను..

Anonymous said...

మీరు పూణె లోనే ఉంటున్నారు కాబట్టి, మేము ఈ మధ్యన ప్రారంభించిన గ్రంధాలయం,http://www.tenderleaves.com/ లో ఉన్న తెలుగు పుస్తకాల లిస్టు చూసి మీ అభిప్రాయం చెప్పండి.

శ్రీలలిత said...

ఎవరి బాధ వారిదే...

వేణూశ్రీకాంత్ said...

హ హ బాగుంది :)

Sai Praveen said...

హ హ హ :D

Anonymous said...

పాపం! మగవాళ్ళ కష్టాలు వింటుంటే గుండె చెరువైపోయి ఆ నీళ్ళన్నీ కళ్ళల్లోంచి వచ్చాయండీ.
మరి మాలాటి ఆడా-మగా-లేడిసు సుఖాలు ఏకరువు పెట్టలేదే?
మేము-
పొద్దున్నే లేచి ఇంట్లో వున్న నలుగురికీ వంటలు వొండి, డబ్బాలు కట్టి, ఆఫీసుకి ఇస్త్రీ బట్టలేసుకుని వెళ్ళి, అక్కడ ఏ.సీ లో కూర్చుని అఫీసులో మీరు చేసిన పనే చేసి, మీరొచ్చే సిటీ ట్రాఫిక్కులోనే వచ్చి, (డ్రైవింగు రాకపోతే బస్సుల సుఖం అదనం!) ఇంటికి ఉసూరని వొచ్చి, పిల్లల హోం వర్కు చూసి, రాత్రి కి వంట పని చూసుకుని, మర్నాటికి కూరగాయలు సర్దుకుని, సుఖ పడీ, పడీ అలిసిపోతున్నాము.
ఒకవేళ ఈ సుఖం సరిపోలేదనుకుంటే, అంట్లూ, బట్టలూ, (మా వూళ్ళో పని మనుషులండరు), ఇల్లు ఊడ్చుకోవటం, బిల్లులు కట్టటం ("అబ్బా! ఇంటర్నెట్టులోనే కదా. నువ్వు కట్టేయ్!"), పిల్లలని క్లాసులకి తిప్పటం ("ఆడా మగా సమానమోయ్!నీకు డ్రైవింగ్ కూడా వచ్చు కదా. మరి నువ్వే తీసుకెళ్ళూ!"), ఇంటి సామాన్లు తెచ్చుకోవటం లాటి కాలక్షేపాలు వుండనే వున్నాయి.

ఇంతింత సుఖం మేమేం చేసుకోమబ్బా?
శారద

మేధ said...

ప్చ్.. పీత కష్టాలు పీతవి.. రాముడి కష్టాలు రాముడివి...!!!

3g said...

:))

మీలాంటి మంచి ఆడ లేడీస్ సంఖ్య మన దేశంలో మిగిలిన పులుల సంఖ్య కన్నా తక్కువ:))

బ్లాగాగ్ని said...

తార గారు - :)

ఫణిబాబు గారు - చూశానండీ, కలెక్షన్ బావుంది. వ్యక్తిగత చందాలు ఎప్పటినుంచి మొదలుపెడతారో తెలియజేయగలరు. నేనూ చేరాలనుకుంటున్నాను.

లలిత గారు, వేణు గారు, సాయి ప్రవీణ్ గారు, మేధ గారు, 3g గారు - బోలెడు థాంక్యూలు.

శారద గారు - ఆడాళ్ళ కష్టాలు ఇక్కడ, ఇంకా ఇక్కడ చదివి మా గుండె ద్రవించిన ఫలితమే ఈ టపా. ఇక మీరు చెప్పిన కాటగిరీ కష్టాలు రాసే అవకాశం మీకే వదిలేశామండీ. అన్నీ మేమే రాసేస్తే మళ్ళీ అదో తంటా. పైగా మీ కన్నీళ్ళూ వృధా పోవు. ఏమంటారు :)

Anonymous said...

ఆ లింకులో, మీరు ఒకసారి లాగ్ ఇన్ అయితే, తొందరలో మీకు తెలియచేస్తాను. నాకొక మెయిల్ పంపుతారా? మిగిలిన వివరాలు మాట్లాడుతాను-09325508220

భాస్కర రామిరెడ్డి said...

బ్లాగాగ్ని గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

హారం

kishan said...

హహ చాలా బాగా రాసారు.ఇన్న్ది రోజుల తరువాత మల్లి మీ టపా వచినందుకు సంతోషం.ఇలానే మీరు మంచి టపాలను రాస్తుండాలని మీ అభిమాని.

శేఖర్ పెద్దగోపు said...

:-):-)
మీ టపా ఓ జీవిత సత్యం చెప్పిందండీ....థాంకులు..

rohinireddy said...

it's really nice..

rohinireddy said...

i'm big fan of telugu novels and books..if u knw any link reply to me..
tnx in adv