Friday 16 November, 2012

నామక'రణం'

నా బాల్య మిత్రుడు శ్రీధర్‌కి బాబు పుట్టిన సందర్భంగా వాడిని కలిసి అభినందనలు తెలుపటానికి నిన్న సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళా. ఏదో సమస్యకు పరిష్కారం కనుగొనాల్సినవాడిలాగా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు వాడు నేను వెళ్ళేసరికి. పలకరింపులయ్యాక విషయమేంటని నేను ప్రశ్నించేలోపే వాడే అడిగేశాడు.

"పదకొండో రోజున మా వాడికి పేరు పెట్టాలిరా. మంచి పేరేదైనా సజెస్ట్ చేస్తావా కొంచెం".

నేనసలే అపరిచితుడి టైపు. అంటే భయంకరమైన శిక్షలూ అవీ వేస్తుంటానని కాదు, మల్టిపుల్ పర్సనాలిటీ అన్నమాట. నేనే సలహా ఇవ్వాలన్నా నాలోని వివిధ వ్యక్తులు దాన్ని రకరకాల కోణాల్లోంచి శోధించి, చీల్చి చెండాడనిదే నేనొక నిర్ణయానికి రాను.

మొదటగా నాలోని గీతాచార్యుడు నిద్ర లేచాడు. "నాయనా పార్థా! నేను చెప్పేది సావకాశంగా విను".
"ఈ పార్థుడెవరురా? నా పేరు శ్రీధర్"
"షటప్. అలా మొదలెడితేనే గానీ భగవద్గీత ఎఫెక్టు రాదు నాయనా. అడిగినదానికి మాత్రమే సమాధానం చెప్పు. నీ పేరు నీ భార్య తరఫు బంధువులెంతమందికి తెలుసు నాయనా?"
"మా అత్తగారు, మామగారు తప్ప మిగతా అందరికీ నేను హారిక భర్తగానే పరిచయం స్వామీ" అన్నాడు శ్రీధర్. వాడు కూడా గీత మూడ్‌లోకి వచ్చేసినట్లున్నాడు. హారిక వాడి భార్య పేరు.
"మంచిది. మరి మీ అపార్ట్మెంట్‌లో?"
"నేనెప్పుడో పొద్దుననగా వెళితే రాత్రిగ్గానీ ఇంటికి రాను స్వామీ. మా ఆవిడే ఎక్కువ ఫేమస్ ఇక్కడ. నన్ను హారిక భర్తగానే ఎక్కువమంది గుర్తిస్తారు."
"బాగుంది. చివరగా ఇది చెప్పు. మీ ఆఫీసులో పరిస్థితి ఏమిటి?"
"కొన్నాళ్ళ క్రితం వరకూ మా టీం వాళ్ళకు మాత్రమే నా పేరు తెలుసు స్వామీ. కానీ మొన్నామధ్య మా ఆవిడ అదేదో వంటల ప్రోగ్రాము, బంగారం గెలుచుకునే ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేసి పిచ్చి డాన్సులేసి రచ్చ రచ్చ చెయ్యడంతో ఆఫీసంతటికీ ఫలానా ఆవిడ భర్త అని తెలిసిపొయ్యింది."
"సూపరు. దీన్నిబట్టి నీకేం అర్ధమవుతోంది నాయనా? నీ స్మార్ట్ ఫోనులో ఎన్ని ఫీచర్లున్నప్పటికీ కొంతకాలానికి రెడ్ మరియు గ్రీన్ బటన్లను మాత్రమే ఎలా వాడటం మొదలెడతావో, మగవాడికి పెళ్ళికి ముందు ఎంత పెద్ద/కొత్త పేరైనా ఉండవచ్చుగానీ పెళ్ళయిన తరువాత ఫలానా ఆవిడ భర్తగా మాత్రమే పిలువబడతారు. అనివార్యమగు ఈ విషయము గూర్చి ఆలోచించ వలదు. కొత్త పేరు, కొత్త పేరు అని టైం వేస్ట్ చేసుకొనవలదు."

గీతాసారం శ్రీధర్ బుర్రకెక్కినట్లుగానే కనపడుతోంది. కాసేపాలోచించి బుర్ర గోక్కుని భయంగా అన్నాడు "కానీ కొత్త పేరు ఆర్డరు హారికది గురూ". ఒక భార్యా విధేయుడిని మరొక భార్యా విధేయుడుకాక ఇంకెవరు అర్ధం చేసుకోగలరు. వెంటనే గీతాచార్యుడిని బజ్జోపెట్టి నాలోని సనాతనవాదికి ఫోన్ చేశా.


"ఒక పని చెయ్యి, విష్ణు సహస్రనామాల పుస్తకం తిరగెయ్యి. బోలెడన్ని మంచి పేర్లు దొరుకుతాయి."

"ఆగాగు తండ్రీ! హారికవి ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయీ విషయంలో. పేరు మూడు లేక నాలుగు అక్షరాలకు మించి ఉండకూడదు. అది ఇంతకుముందు ఎవరూ పెట్టుకోని పేరై ఉండాలి. నోరు తిరగని పదాలు పేరుగా పెట్టకూడదు వగైరా, వగైరా" అన్నాడు శ్రీధర్.

సనాతనవాదికి నాక్ఔట్ పంచ్ పడింది. నాలో ఉన్న ఆధునిక/అభ్యుదయ వాది విజృంభించాడు ఈసారి.

"చైనా వాళ్ళు పిల్లలు పుట్టగానే ఏదైనా గిన్నో తపేళానో కింద పడేసి ఆ వచ్చిన సౌండుని బట్టి పేర్లు పెడతారుట. ఆ పధ్ధతి ఇంతవరకూ ఇండియాలో ఎవరూ ట్రై చేసినట్లు రుజువుల్లేవు. ఒక్క దెబ్బతో రెండు పిట్టలన్నట్లు ఒక కొత్త ట్రెండ్ సృష్టించినట్లుగానూ ఉంటుంది" అన్నాను. 

శ్రీధర్ కళ్ళు మెరిశాయి. ఉత్సాహంగా ఒక్క ఉదుటన లేచి లోపలికి వెళ్ళాడు, వాళ్ళ సూపర్ పవర్ ఆమోదముద్ర వేయించుకోటానికి. కొన్ని క్షణాలు భారంగా గడిచాక "ఢన్ టిన్ ఢాంగ్" అని పెద్దగా చప్పుళ్ళు వినబడ్డాయి.

నా హృదయం కృతజ్ఞతతో భారమయిపోయింది. సలహా తీసుకోవడమే కాకుండా దానికి విలువనిచ్చి వెంటనే అమలు చేసే ఇలాంటి స్నేహితుడు ఎంతమందికి దొరుకుతాడు? నెమ్మదిగా బయటకు వస్తున్న శ్రీధర్‌ను కౌగిలించుకుని వీలయినంత ఎమోషనల్‌గా చెప్పాను "థాంక్స్ రా మామా". వాడు కోపంగా చూసి నన్ను విదిలించుకుని అన్నాడు "చాల్లే వెధవ్వేషాలు. చచ్చు సలహా ఒకటి ఇచ్చింది చాలక". అప్పుడు చూసాను, కారు మబ్బుల్లోంచి అప్పుడప్పుడే బయటపడుతున్న చందమామలాంటి వాడి లేత బట్టతలమీద ఉన్న మూడు బొడిపెలను. జరిగిందేమిటో అర్ధమయ్యింది.

వాతావరణం తేలికపరచటానికి ఒక వెర్రి నవ్వు నవ్వి అన్నాను "సిస్టర్‌కి ఈ అయిడియా నచ్చినట్లు లేదు. పోనీ ఒక పని చెయ్యి. ఏదైనా తెలుగు పదం, అది క్రియా పదమో విశేషణమో అయినా పర్లేదు, తీసుకుని దాని చివర నకారపు పొల్లు తగిలించి ..." అంటుండగా, శ్రీధర్ అడ్డుపడి "ఆగాగు, ఆ అయిడియా ఏదో తెలుగులో ఏడువు, నీ మాటలొక్క ముక్క కూడా అర్థం కావడంలేదు" అన్నాడు.

"నీ ఇంగ్లీష్ మీడియం బుర్రకర్థమయ్యేట్లు చెప్పాలంటే నాతరం కాదు కానీ, మచ్చుకి కొన్ని పేర్లు విసుర్తా విను - అనుమాన్, సమ్యమన్, అవరోహ్, పురోగత్ - లాంటివి".

శ్రీధర్ ముఖంలోకి కొత్త వెలుగొచ్చింది. మళ్ళీ హైకమాండ్ దగ్గరికి పరిగెత్తాడు. అలా పోవటం పోవటం అరగంటగ్గానీ బయటకు రాలేదు. వస్తూనే ఒక కాగితాల బొత్తి నాచేతిలో పెట్టి చెప్పాడు నీరసంగా "ఇవన్నీ నువ్విప్పుడు చెప్పిన మోడల్లో మా ఇంటి చుట్టుపక్కలవాళ్ళు, బంధువులు వాళ్ళ పిల్లలకు పెట్టిన పేర్లట. నా చెయ్యి పడిపోయ్యేట్లు రాయించింది. నీ సలహా బాలయ్యకు చివరి హిట్టొచ్చిన నాటిదంత పాతదని చెప్పమంది"

ఆ కాగితాల బొత్తిని చూశా, చెప్పొద్దూ, కొన్ని పేర్లు నా ఇమాజినేషన్ని మించి ఉన్నాయి, అంధకార్, పాద రక్షక్, ఢమరుక్, రక్త పింజర్ లాంటివి చూస్తే ఆ పేర్లుపెట్టిన తల్లిదండ్రులకు దణ్ణం పెట్టాలనిపించదూ మీకు మాత్రం?


ఇక లాభం లేదు, అభ్యుదయవాదిని అర్జెంటుగా అవతలకు తోలేసి ఆఖరి అస్త్రంగా నాలోని క్రైసిస్ మేనేజరైన ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకర్‌ను ఆవాహన చేశా. ఏమైనా శ్రీధర్‌గాడికి థాంక్స్ చెప్పుకోవాలి. ఇంతకాలం సరైన గుర్తింపుకు నోచుకోని నా మల్టిపుల్ పర్సనాలిటీలన్నిటికీ వీడు మంచి మేత అందిస్తున్నాడు.

ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకర్ వెంటనే పనిలోకి దిగిపోయాడు.

"ఇలాంటి పరిస్థితుల్లోనే కాస్త కొత్తగా ఆలోచించాలి. ఒక బ్రహ్మాండమైన అయిడియా. ఆయుర్వేద మందుల పేర్లు ఒకసారి చూడు, మనకు పనికొచ్చేదేమైనా ఉండొచ్చు."

"నాకొక్క మందు పేరుకూడా తెలియదు. నీకేమైనా తెలిస్తే చెప్పు" అన్నాడు శ్రీధర్ వాడి అజ్ఞానాన్ని బయటేసుకుంటూ.

"ఓకే, ఇదెలా ఉందో చెప్పు 'వరాహోచ్చిష్ట గోరోజన మంజరి'. అబ్బాయి పేరు కాబట్టి చివర్లో మంజర్ అంటే సరిపోతుంది."

"బానే ఉన్నట్లుందిగానీ నోరు తిరగటంలేదు. హైకమాండ్ ఆమోదం పొందటం కష్టం." రిజెక్ట్ చేశాడు శ్రీధర్.

మళ్ళీ తనే అందుకుంటూ "మర్చిపోయాన్రోయ్ చెప్పడం. ఇందాక లోపలికి వెళ్ళినప్పుడు ఇంకొక కండిషన్ ఆడ్ అయ్యింది. ఫ్యూచర్లో మావాడు ఏ అమెరికాలోనో, ఆఫ్రికాలోనో ఉద్యోగం వెలగబెడతాడు కదా. అక్కడ ఇంటిపేరు వెనుక తగిలించుకోవటం సంప్రదాయం కాబట్టి అందుకు అనుకూలంగా ఉండేటట్లు ఏదైనా ఐడియా ఆలోచించాలి మనం."

"ఓహ్, అదెంత పని. ఒక సినిమాలో హీరో తన ఇంటి పేర్లోని మొదటి అక్షరాన్ని తన అసలు పేర్లోని మొదటి అక్షరాన్ని కలిపి తన షార్ట్ నేంగా వాడతాడు. మనం ఇంకాస్త వెరైటీగా మీవాడి అసలు పేరులోని మొదటి అక్షరాన్ని, మీ ఇంటిపేరులోని చివరి అక్షరాన్ని తీసుకుని షార్ట్ చేద్దాం. మీ ఇంటిపేరు ఎదురొడ్డి కదా,  ఇప్పుడు ఉదాహరణకి, చెన్నకేశవ ఎదురొడ్డి, జనార్ధన ఎదురొడ్డి , నరసిమ్హా ఎదురొడ్డి, మురళీధర్ ...."

ఎందుకనో తెలియదు, సడెన్‌గా మావాడి ముఖం జేగురు రంగులోకి తిరిగింది. ముక్కుల్లోంచి చెవుల్లోంచి వేడి పొగలు వస్తూండగా అరిచాడు "ఆపరొరేయ్, ఆపు, ఆపు, ఆ............పూ".

నాలోని ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకర్ హర్ట్ అయ్యాడు. ఇంత మంచి ఉపాయం చెప్పినవాడిని ఇలాగేనా నిరుత్సాహపరచడం?

విసురుగా లేచాను. "నేనిచ్చే ఆఖరి సలహా ఇదే. పదోతరగతి తెలుగు మీడియం జీవశాస్త్రం పుస్తకం తీసుకుని ..."

"తెలుగు! తెలుగు!!"

"అదేలే, టెంత్ క్లాస్ తెలుగు మీడియం బయాలజీ బుక్కు తీసుకుని వెతుక్కో, అకశేరుక్, పరపరాగ్ లాంటి చాలా పదాలు దొరుకుతాయి" కసిగా చెప్పేసి బయటికొచ్చాను.

వారం తరువాత నామకరణానికి పిలుపొస్తే సతీసమేతంగా వెళ్ళాను. నా శ్రీమతి తెగ ఉత్కంఠ పడిపోతోంది, ఏ కొత్తపేరు పెట్టబోతున్నారో అని. బారసాల తంతు చివర్లో శ్రీధర్ నావంక ఓరగా చూస్తూ గట్టిగా ఎనౌన్స్ చేశాడు "ఈ పేరు పెట్టటానికి హెల్ప్ చేసిన ఫ్రెండ్‌కి చాలా థాంక్స్. అతని సహాయంతో మేము పెడుతున్న పేరు సరీసృప్".

అక్కడున్నవాళ్ళలో దానికర్ధం తెలిసిన ఒకరిద్దరు పెద్దలు ఢామ్మని పడిపోయారు. మిగతావాళ్ళంతా శ్రీధర్ చుట్టూ చేరి అభినందిస్తున్నారు.

భోజనాలయ్యాక తిరిగి వస్తూ నా శ్రీమతి అంది "భలే కొత్త పేరు కదండీ! ఆ ఫ్రెండ్ ఎవరోగానీ నిజంగా గ్రేట్. మనకూ ఒక బాబో, పాపో పుడితే పేరు పెట్టడానికి ఆయన సలహానే తీసుకోవాలి".

39 comments:

Surabhi said...

Hillarious !! Very good post.
Every line made me laugh. Hats off to your humor.
Thanks alot for making my day start with a good laugh. feel like its been ages I laughed so badly ( heavy work load at work these days)

వేణు said...

భలే.. హిలేరియస్!

నామకరణాల తంతుల్లోకి నిర్జీవమైన నక్షత్రాలూ, గ్రహాలూ వస్తే ఆగ్రహాలేమీ రావు కదా? మరి సజీవమైన మొక్కలూ, జంతువులూ రావటం తప్పెలా అవుతుందీ2

మన తెలుగు అకాడమీ వాళ్ళు కూడా ‘నామకరణ పదకోశం అను జీవశాస్త్రం’ అని తమ పుస్తకాలకు పేరు మార్చుకోవచ్చు. (నామలింగానుశాసనం అను అమరకోశం టైపులో).

>> సడెన్‌గా మావాడి ముఖం జేగురు రంగులోకి తిరిగింది.>>

ఇంతకీ ఈ జేగురు రంగు ఎలా ఉంటుందీ? కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో ఈ మాట పదేపదే వచ్చేది. అప్పుడేమీ అర్థం కాలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు మీరైనా చెప్పండి!

Padmarpita said...

పేరు సూపరో సూపర్....:-)

Kottapali said...

ROFLMAO .. literally .. BTW, that could be a name :)రోఫుల్మావో

teresa said...

Too Good!
Thanks for the link Nasy.

Wanderer said...

బావుంది మీ పేర్ల ప్రహసనం. నేను విన్న అతి దారుణమైన పేరు "అనైతిక్".. కల్పించట్లేదు.. సత్యప్రమాణంగా చెప్తున్నా. ఇంకొన్ని దారుణాలు "రోమాంచక్" "మరీచిక్" "విష్ణుసూదన్" "బలవంత్".

నారాయణస్వామి గారి "రోఫుల్మావో" పేరు బానే ఉంది.. చైనా వాడి పేరో, రష్యన్ వాడి పేరో అనుకుంటారు జనాలు.

ఇందు said...

అమ్మో నవ్వలేక చచ్చానండీ బాబూ!! భలే!

సుజాత వేల్పూరి said...

నీ స్మార్ట్ ఫోనులో ఎన్ని ఫీచర్లున్నప్పటికీ కొంతకాలానికి రెడ్ మరియు గ్రీన్ బటన్లను మాత్రమే ఎలా వాడటం మొదలెడతావో, _________________

ఇదేంటి, నా సంగతి మీకెలా తెల్సిందీ?

ఇలా తరచూ విచ్చేసి కేకలు పెట్టిస్తూ ఉండాలి మీరు.
Halrious..:-)))

Unknown said...

మోడరన్, కొత్త పేరు ఎవరికీ ఉండకూడదు అని చదువుకున్న తింగరోళ్ళే ఇలాంటి తింగరి పేర్లు పెట్టడం చాలానే చూసాను నేను. పాపం ఆ పిల్లలకు ఆ పేర్లకి అర్ధం తెలిస్తే ఏమైపోతారో? ఐనా మాకే రానిది వాళ్ళకెక్కడ వస్తుందిలే తెలుగు అని ధీమానో? మీ గమనిక బాగా ఉంది. బాగా నవ్వించారు. ఈ టపాకు ధన్యవాదాలు.

శ్రీ said...

బాగుంది. మీ బ్లాగు టాగ్ లైను కూడా అదిరింది.

శిశిర said...

హహ్హహ్హ.. బాగుందండీ.

saketh said...

nijanga entha tingari ga tayarayyaro kada janalu comedy ga ayina nijame chepparu thanks

రవి said...

మీ త్రోవలోనే ’నరవానర్’ అని ఒక పేరు ఒక ఫ్రెండుకు సజెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. వాడేమో ’పురీష్’ అనుకుంటున్నాడు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

భలే నవ్వించేసినారండీ. వ్యాఖ్యల్లో కూడా ఇన్ని పేర్లా? అయితే ఇక బ్లాగుల్లో కూడా పేర్లు వెతుక్కోవాల్సిందే.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

రవిగారు,
మీ నేస్తానికి నమస్కారాలు చెప్పండి. :)

S said...

అనైతిక్!!!
నిజంగా పెట్టారా? దానిపై సరీసృప్ నయం కాదూ? ;)
సరీసృపరాజ్ అని పెట్టుంటే నాగరాజులాగా కామన్ నేం అయిపోయేది కూడానూ!

spandana said...

భలే బావుంది.
కానీ సరీసృపం అంటే నాగరాజు కదా! మనకు అది చిరపరిచితమైన పేరే!

avyakta raagam said...

Ha ha ha ... Chala bagundandee... Each and every sentence naaku navvu teppinchindi.. Jandhyala gari cenema chusthunnattundhi...
Nee smartphone lo enni feacher unnappatikee...
Mabbullonchi bayatikosthunna chandrudila... Ee prayogaalu bagunnayi

vivek said...

hahaha...excellent...!! great one!

Veena said...

నిజంగానే చాల రోజులయింది ఇంతలా నవ్వుకుని....ఈ మధ్య కాలంలో పేర్లు నిజంగానే చాల విచిత్రంగాను, అర్థరహితంగానూ ఉంటున్నాయి..మమ్మల్ని ఇంతగా నవ్వించినందుకు మీకు మా కృతజ్ఞతలు:)

Unknown said...

మా ఇంట్లో కూడా ఈ తెగులు సోకింది. రెండేళ్ళ క్రితం, నా సోదరుడు తనకి సంగీతం ఇష్టమని కూతురికి "ధ్వని" అని పెరేట్టుకున్నాడు... అమ్మ 'ఎంత సంగీతం ఇష్టమైతే మాత్రం ఇలా సౌండ్ బాక్స్ పేరు పెట్టుకుంటావా .." అని ఎంత వాపోయినా లాభం లేకపోయింది. మీరు ".....కొన్ని క్షణాలు భారంగా గడిచాక "ఢన్ టిన్ ఢాంగ్" అని పెద్దగా చప్పుళ్ళు వినబడ్డాయి. ..' అని వ్రాసారు .... మా ఇంట్లో అక్షరాలా నా మేనకోడలి పేరు అదే...

నిత్యాన్వేషి said...

నేను మీ టపా చదివి ఎంతగా నవ్వానో మిత్రుల వ్యాఖ్యలకు కూడా అంతే పగలబడి నవ్వాను. మీ టపాకి మిత్రుల వ్యాఖ్యలకి అందరికి ధన్యవాదాలు.

sursourabh said...

though I wantto post my comment in telugu,I am not able to do so,.

I had great fun reading the nemayanam.one
movie has come with a name Takshsk and I was surprised to note that it has no relevance to the story.one name which has become most popular is Anitha .I always wonder at this name's adrushtam. Dr.R.Suman lata.

Unknown said...
This comment has been removed by the author.
Saahitya Abhimaani said...

ఫణి గారూ. మరీ ఎంత పని బిజీ అయినా సంవత్సరం పైగా అయిపోయింది మీరు బ్లాగు అప్డేట్ చేసి. మరొక్క వ్యాసం వదలండి మళ్ళీ కొన్నాళ్ళు అదే అదే చదువుకుని ఆనందిస్తాము.

బ్లాగాగ్ని said...

శివ గారూ, థాంక్ యూ :) :)
వీలైనంత త్వరలో వ్రాయడానికి ప్రయత్నిస్తున్నానండీ.

Unknown said...

navinchi aarogyani panchinanduku chala thanks

reguvardan said...

బావుంది వ్యాసం చక్కని కొటేషన్లతో. ధన్యవాదాలు
Telugu Cinema News

వనజ తాతినేని/VanajaTatineni said...

పిల్లలకి పేరు పెట్టడంలో ఉన్న పాట్లు చేసే ఫీట్లు అన్నీ ఇన్నీ కావు . వెర్రి ముదిరిన వారి ఆలోచనాధోరణి కళ్ళకి కట్టినట్టుంచారు . చక్కగా ఉందండీ! ప్రోద్దుప్రోద్దుటే చాలా నవ్వించారు Thank you!

Ramani Rao said...

సుపర్బ్ కామిడీ అండి చాలా రోజులయింది బ్లాగు చదివి.. మొదతే హాస్యం చదివించారు.. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వు కేక..

Ennela said...

supero!!!

reguvardan said...

news4andhra -- The Ultimate Source for Entertainment News, Movie Reviews, celebrity Interviews and many more at one place
Latest Telugu Movies Reviews
Telugu Actors Interviews

Saahitya Abhimaani said...

ఎలా ఉన్నారు ఫణి గారూ.దాదాపుగా మూడు సంవత్సరాల నుంచీ మీ బ్లాగుకు బూజు పట్టించేశారు. వ్రాయండి మాష్టారూ, నెలకి ఒక్కసారి వ్రాయండి సరదాగా.

Rajasekharam Kakani said...

chaala rojula taruvata kallallo neellu vachchettuga navvukunnanu.

ammo enneni perlo meeru rasinavi kakunda, commentlallo koodanu...'Narvaanar' nacchindi.

Tingar kooda bavuntudemo.

Sammeksha ane peru vini idem perra babu anukunnanu!

Unknown said...

first the title was super...very interesting story
https://abhilyrics.com/

Unknown said...

first the title was super...very interesting story
abhilyrics.com

Saahitya Abhimaani said...

Hello Phani! Are you there!!

శౌరి కందాడ (కోయిల్ కందాడై) said...

వీడి "పురీష్" పెద్ద చిన్న తేడా లేకుండా బంధుమిత్రుల ప్రతి నోటిలో వుంటుంది చూశారూ అది.....ఇక చెప్పలేను.

శౌరి కందాడ (కోయిల్ కందాడై) said...

వీడి "పురీష్" పెద్ద చిన్న తేడా లేకుండా బంధుమిత్రాదుల నోటివెంట వస్తూనే వుంటుంది నిర్విరామంగా నిరంతరం అద్గదీ.....