Saturday, 20 December 2008

రన్నింగ్ బస్సు ఎక్కర బాబు - 1

కళ్ళు చికిలించి చూశాను ఒక్కసారి. సిటీ బస్సొకటి కోఠీ మహిళాకళాశాల మలుపు తిరుగుతూ కనపడింది. నంబరు చూశాను. నేనెక్కాల్సిన బస్సే. వేగం పుంజుకుంటూ నావైపే వస్తోంది. హ్హ హ్హ, ఎంత వేగంగా వస్తే మనకేంటి. జ్యోతిలక్ష్మి ముందా దీని క్లబ్బు డాన్సులు? సిధ్ధంగా నిలుచున్నా. సరిగ్గా బస్సు నన్ను దాటబోతున్న సమయంలో ఎడమచేత్తో చులాగ్గా బస్సు కడ్డీ పట్టుకుని అలవోగ్గా ఒక్క గెంతులో బస్సెక్కేశా. బస్సులో నలుగురు మెరుపుతీగల్లాంటి అమ్మాయిలు! నావంకే ఆశ్చర్యంగా, ఆరాధనగా చూస్తూ వాళ్ళల్లో వాళ్ళు గుసగుస లాడుకుంటున్నారు. మనం చేసిన సాహసకార్యానికి వాళ్ళు ఫ్లాట్ అయిపోయారని అర్ధమవ్వగానే ఛాతీ ఎకరంన్నరమేర పొంగింది. ఇంతలో ఒక ఇందువదన జరిగి తనపక్కన కూర్చోవటానికి చోటు చూపించింది. వావ్! ఈసంగతి మా రూమ్మేట్లకి ఎంత రసభరితంగా వర్ణించాలా అని ఆలోచిస్తూ కూర్చునే లోపలే మరో కోమలాంగి నావైపు తిరిగి ఫెడీమని కాలిమీద తన్ని “మీద కాళ్ళెయ్యొద్దని నీకెన్నిసార్లు చెప్పాన్రా?” అంది. ఇదేంటీ ఈ అమ్మడి గొంతు మా కృష్ణగాడిదిలాగుంది అనుకునే లోపలే మరో రెండు తన్నులు తగలటం ఈసారి కృష్ణగాడి ఆడియోతో పాటు వీడియో కూడా కనబట్టం వెనువెంటనే జరిగిపోయాయి. మంచి కల పాడు చేసినందుకు వాడి గొంతు పిసకాలనిపించినా అసలే నిద్ర చెడిన తిక్కలో వున్న కృష్ణగాడిని చూశాక ఆ నిర్ణయాన్ని మర్నాటికి వాయిదా వేసి అటు తిరిగి పడుకున్నా కిమ్మనకుండా.

నాకిలాంటి రన్నింగ్ బస్సు కలలు రావటం కొత్త కాదు. ఎప్పుడో చిన్నప్పుడు నేను ఎనిమిదో తరగతిలో వుండగా మొదటిసారి హైదరాబాదుకు వచ్చా. నగరంలో అన్నిటికన్నా ప్రముఖంగా నన్నాకట్టుకున్నది ఇక్కడి జనాల పొదుపరితనం(సమయం విషయంలో). స్టాపు దాకా నడిస్తే సమయం వృధా అని సిగ్నళ్ళ దగ్గర రన్నింగులోనే ఎక్కెయ్యటం, బస్సాపేదాకా ఆగటమెందుకని రన్నింగులోనే దిగెయ్యటం, దిగాల్సిందానికి మూడు స్టాపులు ముందే వెళ్ళి ఫుట్బోర్డు మీద వేళ్ళాడుతూ నించోవడం వగైరాలన్నీ చూశాక నేనెంత కాలాన్ని వృధా చేస్తున్నానో జ్ఞానోదయమైంది. ఎప్పటికైనా సరే హైదరాబాదులోనే ఉద్యోగం చేస్తాననీ, ఇప్పుడు వృధా చేసిన కాలాన్నంతటినీ అప్పుడు వడ్డీతో సహా పొదుపు చేస్తాననీ ఆక్షణమే నిర్ణయించుకున్నాను. ఇహ అప్పట్నించీ ఒహటే మెరుపు కలలు, ఆర్.టి.సి. వాడిదగ్గర ఒక ఖాళీ బస్సు అద్దెకు తీసుకుని రన్నింగులో ఎక్కడం ప్రాక్టీస్ చేస్తున్నట్టు, బస్సులు, కార్లు, లారీలు, ట్రాక్టర్లు ఒకటేమిటి ఆఖరికి విమానాలు కూడా రన్నింగులో ఎక్కగల 'ఒక్క మగాడు' అని గుంటూరు జిల్లా మొత్తం పేరు తెచ్చుకున్నట్టూ, ఇలా అన్నమాట.

చూస్తుండగానే డిగ్రీ పూర్తవ్వొచ్చింది. ఎమ్.సి.ఏ ఎంట్రెన్స్ కోచింగ్ హైదరాబాద్ లో తీసుకోవడానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించా. డిగ్రీ పరీక్షలవ్వగానే హైదరాబాదు బండెక్కడానికి అంతా రంగం సిద్ధమయ్యింది. హైదరాబాదు వెళ్ళిన మొదటిరోజే రన్నింగ్ బస్సెక్కి నా స్నేహితులతో వార్నీ అనిపించుకోవాలని నా పధకం. మరి ప్రాక్టీసు చెయ్యాలిగా? అదేదో గుంటూరు సిటీబస్సులమీదే చెయ్యాలని నిర్ణయించా. ఇక్కడ గుంటూరు సిటీబస్సుల గురించి ఒక చిన్న పిడకలవేట. గుంటూరులో చాలావరకు సిటీబస్సులు ప్రైవేటు యాజమాన్యానికి చెందినవి. వీలయినంత ఎక్కువమంది జనాలని ఎక్కించుకోవటమే జీవితాశయంగా నడపబడేవి. చెయ్యెత్తటం ఆలస్యం సర్రున బస్సొచ్చి పక్కన ఆగటం,మీచొక్కా పట్టుకుని బస్సులోకి లాగటం,మళ్ళీ బర్రున బయల్దేరటం అన్నీ క్షణాలమీద ఛ ఛ కాదు మిల్లీసెకెన్ల మీద జరిగిపోతాయి. ఆమధ్యొకసారి తలదువ్వుకోవటానికి చెయ్యెత్తిన వాడ్ని, చంకలో దురద పుట్టి గోక్కోవటానికి చెయ్యెత్తినవాడ్నీ కూడా బస్సులో లాగేశారిలాగే. కాబట్టి ఈసారి మీరెవరైనా గుంటూరొస్తే చేతులు దగ్గర పెట్టుకుని నడవాల్సిందిగా హెచ్చరిక. పిడకలవేట సమాప్తం. అలాంటి ఘనత వహించిన సిటీబస్సుని లక్ష్మీపురం సెంటర్లో రన్నింగులో ఎక్కాలని ప్లాను.

(ఇంకావుంది)

Monday, 8 December 2008

www.ulib.org నుంచి చందమామలు దింపుకోండిలా

JRE ని అనుసంధానించి తయారు చేసిన కొత్త ప్రోగ్రామ్(Downloader.zip) ని ఇక్కడినించి దింపుకోవచ్చు. దీన్ని పరిగెత్తించటానికి జావా ఉండాల్సిన అవసరం లేదు. Downloader.zip ని దింపుకున్నాక unzip చేస్తే మీకు Downloader.bat అనే ఫైలు కనిపిస్తుంది. దాని మీద రెండుసార్లు నొక్కి ఇదివరకట్లాగే ఫైల్ పాత్, సంవత్సరం, నెల వరుసగా ఇవ్వటమే. నెల అఖ్ఖర్లేదనుకుంటే Enter the month in quotes అని ప్రాంప్ట్ వచ్చినప్పుడు Enter key నొక్కండి.

ఈ ఉపాయం చెప్పిన నాగమురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు :)

=================================================================

మీరు చందమామ పిచ్చోళ్ళా? చందమామ వెబ్సైటులో పి.డి.ఎఫ్ లు తీసేసి ఫ్లాష్ ఫైళ్ళు పెట్టారని బాధపడుతున్నారా? 1947 నుండీ చందమామలు http://www.ulib.org/ లో వున్నాయని తెలిసీ ఒక్కొక్క పేజీ తెరిచి చదవలేక ఇబ్బంది పడుతున్నారా? అన్ని చందమామలూ డౌన్లోడ్ చేసుకుని ఒకానొక ఆదివారంపూట మధ్యాహ్నం తీరుబడిగా చదువుకోవాలని మీ ఆశా? టడట్టడా..........య్. ఇక్కడ ఒక్కసారి జేమ్స్ బాండ్ మ్యూజిక్ వేసుకోండి గాఠిగా.


ఐతే దింపుకోండి ఈ జావా ప్రోగ్రాం. దీన్ని పరిగెత్తించేముందు(అంటే రన్ చేసేముందన్నమాట) ఇక్కడినించి మీకు తగిన J.D.K. 1.6 దింపుకోవాలి. ఆతర్వాత ఈ ప్రోగ్రాముని స్టోర్ చేసిన ఫోల్డరుకెళ్ళి java -jar Downloader.jar -help అని కొడితే చాలు వివరాలు వస్తాయి.


సూక్ష్మంగా కొన్ని వివరాలు ఇక్కడ. ఈ ప్రోగ్రామునుపయోగించి ఏసంవత్సరం/నెల కి సంబంధించిన చందమామనైనా http://www.ulib.org/ నుంచి దిగుమతి చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు 1965 మార్చి చందమామ కావాలనుకుందాం. మీరు చెయ్యాల్సిందల్లా java -jar Downloader.jar "d:/Chandamama/1965" "1965" "3" అని ఆజ్ఞ(కమాండ్) ఇచ్చి పరిగెత్తించటమే. అదే మీకు 1967లోని అన్ని చందమామలూ కావాలనుకోండి java -jar Downloader.jar "d:/Chandamama/1967" "1967" అని ఇచ్చి పరిగెత్తించాలి(నెల ఇవ్వకుండానన్నమాట). ప్రతీసారి చందమామలు స్టోర్ చెయ్యాల్సిన ఫోల్డరు మాత్రం ఇవ్వటం తప్పనిసరి. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క పేజీని డౌన్లోడ్ చేసి, చివరగా అన్నింటినీ కలిపి ఒకే పి.డి.ఎఫ్ గా తయారుచేసి మీరు చెప్పిన ఫోల్డరులో పడేస్తుంది.


P.S. ఇది హడావుడిగా వ్రాసిన ప్రోగ్రామ్. ఎవరైనా దీన్ని improve చెయ్యదల్చుకుంటే సుస్వాగతం. సోర్స్ కోడ్ కూడా వుంది దీన్లో(నేన్రాసినదానికి మాత్రమే సుమా!). నేనైతే 1969 వరకూ చందమామలు దింపుకున్నా ఈ ప్రొగ్రామునుపయోగించి. కాబట్టి కాస్త పనిచేస్తున్నట్లే లెక్క. ఒకవేళ బగ్గులేమైనా మీ దృష్టికి వస్తే blogaagni@gmail.com కి ఒక మెయిలు కొట్టండి. వీలయినంత త్వరగా పరిష్కరించటానికి ప్రయత్నిస్తా. అలాగే ఒకవేళ మీకు జావా ఇన్స్టాల్ చెయ్యటం తెలియక ఈ ప్రోగ్రామ్ ని రన్ చెయ్యటంలో ఇబ్బందులు ఎదురవుతుంటే కూడా ఒక మెయిలు /కామెంటు పెట్టండి.

Tuesday, 18 November 2008

వరసల గందరగోళం

సంఘటన -1:
స్థల,కాలాలు : మిర్యాలగూడ, శ్రీ సరస్వతీ శిశుమందిర్. బహుశా అప్పుడు నేను ఆరవతరగతి చదువుతున్నాననుకుంటా.
గురూజీ: మీ నాన్నగారేం చేస్తుంటార్రా?
నేను: ఫలానా సిమెంటు కంపెనీలో సూపర్ వైజరండీ.
గురూజీ: అది జానపాడు దగ్గర వున్న కంపెనీ కదరా. రోజూ అక్కడనించి వస్తావా?
నేను: లేదండీ నేనీ వూళ్ళోనే వుంటాను. మా డాడీ ఇక్కడే పనిచేస్తారు.
గురూజీ: ఇందాక సిమెంటు ఫ్యాక్టరీ అన్నావు మరి?
నేను: ఆయన మా నాన్నగారండీ. ఈయన మా డాడీ.
గురూజీ: ఆఁ...???

సంఘటన -2:
స్థల,కాలాలు : మళ్ళీ మిర్యాలగూడ, మా ఇల్లు. ఈసారి నేను ఎనిమిదవతరగతి లో వున్నా.
సందర్భం: మా పిన్ని కూడా మా స్కూల్లోనే పనిచేసేది. ఒకసారెప్పుడో మా పిన్ని కూడా పనిచేసే మాతాజీలంతా మాఇంటికి భోజనానికి వచ్చారు. వాళ్ళకి మా ఫ్యామిలీ ఆల్బం చూపిస్తున్నప్పుడు ఒక మాతాజీ నాతో

మాతాజీ: వీళ్ళల్లో మీ డాడీ ఎవర్రా?
నేను: అరుగో ఫలానా ఆయనండీ.
మాతాజీ: మరి మీ పిన్ని ఈయన్ని చూపించి అన్నయ్య అని చెప్పింది?
నేను: అవును మా పిన్ని మా డాడీకి చెల్లెలు మాతాజీ.
ఇంతలో ఇంకో మాతాజీ: (ఫొటోలో మా అమ్మని చూపించి) ఈవిడెవరు?
నేను: ఈవిడ మా అమ్మ. మా డాడీ వాళ్ళ పెద్ద చెల్లెలు. మా పిన్నేమో చిన్న చెల్లెలు.
చిన్నగా ఢామ్మన్న చప్పుడు. ఆ ప్రశ్న వేసిన మాతాజీ కాస్త సన్నపాటి మనిషిలేండి.


సంఘటన -3:
స్థల,కాలాలు : ఈసారి సీను గుంటూరుకి మారింది. నేనప్పుడు డిగ్రీ చదువుతున్నా. మాకూ మా పక్కింటి వాళ్ళకీ కలిపి కామన్ బాల్కనీ వుండేది. ఒకరోజు సాయంత్రం మా డాడీ బాల్కనీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. పక్కింటావిడ కూడా వాళ్ళవైపు బాల్కనీలో కూర్చుని ఏదో పని చేసుకుంటూ వుంది. ఇంతలో
నేను: డాడీ! అమ్మమ్మ, తాతయ్యగారు వచ్చారు.
డాడీ: రండి నాన్నా. అమ్మా కులాసానా?
(ఇంతలో మా మమ్మీ లోపలనించి వచ్చి) అత్తయ్యగారూ, మామయ్యగారూ కులాసానా?
ఈ రెండుముక్కలూ విన్నందుకే తట్టుకోలేని పక్కింటి ఆవిడ బాల్కనీ రెయిలింగెక్కి కిందికి దూకబోతుంటే పరుగునవెళ్ళి నచ్చజెప్పి కిందికి దించాం నేనూ, మాతమ్ముడూ.


ముందుగా మీకు రెండు వీరతాళ్ళు. ఇక్కడిదాకా చదివింతర్వాత కూడ పిచ్చెక్కకుండా వున్నందుకొకటి. ఇంకా చదవటానికి ప్రయత్నిస్తున్నందుకు మరోటి.


సరే ఇహ నాన్చకుండా అసలు సంగతి తేల్చేస్తాను. విషయమేంటంటే మా అమ్మ, నాన్నగారు/ మేనత్త, మేనమామగార్లవి కుండ మార్పిడి పెళ్ళిళ్ళు. అంటే మా అమ్మ వాళ్ళ అన్నగారికి మా నాన్నగారి చెల్లెలినిచ్చారు అన్నమాట. ఈ మా మేనత్త, మేనమామగార్లకి సంతానం లేకపోవటం వల్ల నన్ను పెంచుకున్నారు. బాగా చిన్నప్పుడే అలా వెళ్ళిపోవడం చేత వారిని డాడీ, మమ్మీ అని పిలవడం అలవాటయ్యింది. ఒక ముక్కలో చెప్పాలంటే మా అమ్మా-నాన్నలని అమ్మా, నాన్నగారూ అనీ మేనత్త-మేనమామలని డాడీ, మమ్మీ అనీ పిలుస్తాను. అదీ సంగతి. ఇంతవరకూ ఏ పేచీ లేదు. అసలు ఇబ్బందల్లా మేనత్త-మేనమామగార్ల వరసలు మాత్రమే మారిపోయి మిగతావన్నీ అదేవిధంగా వుండిపోవడం దగ్గరే వచ్చింది.


అయ్యిందా? అబ్బే ఇంకా లేదు. ఇక్కడింకో గజిబిజి. నా ఇద్దరు తమ్ముళ్ళలో పెద్దవాడు కూడా చిన్నప్పుడే నాదగ్గరికి వచ్చేయటంవల్ల తను కూడా డాడీ మమ్మీ అనే పిలుస్తాడు. చిన్నవాడు మాత్రం పెద్దత్త, పెద్దమామయ్య అంటాడు. మరో తికమక ఏంటంటే మా మేనత్త కూతురు దానికి తొమ్మిది నెల్ల వయసునించీ మా ఇంట్లోనే పెరగటంవల్ల మమ్మల్ని అన్నయ్య అని పిలుస్తుంది. మా ఇంట్లో ఆడపిల్ల లేకపోవటం వల్ల మేం కూడా దాన్ని మా స్వంత చెల్లెల్లాగే చూసుకుంటాం. కానీ వాళ్ళ అమ్మా నాన్నల్ని మాత్రం మామయ్య/అత్తయ్య అని పిలుస్తాం(అది పుట్టకముందునించీ అలవాటయిన పిలుపులు - మారటం కష్టం కదా!)


ఇంకో తికమక చెప్పనా? అయ్యయ్యో!! మౌసునలా టేబులుకేసి బాదకండీ. ఇంకే తికమకలూ లేవు ఊరికే అన్నా మీరేమంటారో చూద్దామని. మీ పరిస్థితి నాకర్థమయ్యింది. ఉంటా మరి.

Thursday, 25 September 2008

ఒక సినీ కవి రెజ్యూమె

చదువు - నాట్ అప్లికబుల్

అనుభవం - పది తమిళ డబ్బింగు సినిమా పాటలని తెలుగులోకి ముక్కస్య ముక్కానువాదం చేసిన అనుభవం.

బలాలు/అర్హతలు -

1. హీరోగారి వంశానికి తగినట్లు పాటని మార్చి వ్రాయగల సామర్ధ్యం.

2. కేవలం అయిదంటే అయిదు తెలుగు పదాలతో పాట వ్రాయగల పాండిత్యం.

3. బొంబాయి భామలు, మళయాళ ముద్దుగుమ్మలు పెదాలు కదిల్చేందుకు కష్టపడక్కర్లేకుండా అతి సులువైన పదాలతో పాట వ్రాయగల ఘనత.

4. సెన్సారుబోర్డుకి (ఒకవేళ వుంటే...!) దొరక్కుండా పాటలో ద్వంద్వార్థాలు/ఏకార్థాలు జొప్పించగలిగే నైపుణ్యం.

5. ఎటువంటి దరిద్రపు బాణీకయినా పాట వ్రాయగల సత్తా(మచ్చుకి ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు వక్రి గారి కొత్త సినిమా పుండాకోర్ లో వారి చావుడప్పు బాణీకి అనుగుణంగా వ్రాసిన పాట)

Monday, 15 September 2008

మరికొన్ని చందమామ సీరియళ్ళు.





క్రితం టపాకి స్పందించిన చందమామ అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ విడతలో జ్వాలాద్వీపం, మకరదేవత మరియు విచిత్ర కవలలు పోస్టు చేస్తున్నా.

జ్వాలాద్వీపం కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.






మకరదేవత కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.




విచిత్ర కవలలు కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.



అన్నట్లు నా దగ్గర 1947 నుండీ 1959 వరకూ(మధ్యలో అక్కడక్కడా కొన్ని నెలలు తప్ప) చందమామలు పి.డి.ఎఫ్ రూపంలో వున్నాయి. వీటిని చందమామ.కామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. కానీ మొత్తం అన్ని ఫైళ్ళ సైజు కలిపి దాదాపు 5.5 జి.బి. ప్రస్తుతం చందమామ వెబ్సైట్లో పి.డి.ఎఫ్ లు తీసేసి ఫ్లాష్ ఫైళ్ళు పెట్టారు కాబట్టి ఇవి కావాలనుకునే వాళ్ళు వీటిని షేర్ చేసుకోవటానికి ఏమయినా సులువైన మార్గం వుంటే చెప్పగలరు.

Friday, 12 September 2008

చందమామ సీరియళ్ళండీ.



నాకోసం పి.డి.ఎఫ్ రూపంలో మార్చి దాచుకున్న చందమామ సీరియళ్ళని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. మీరూ నాలాగే చందమామ అభిమానులయితే ఈ సీరియళ్ళు మీకెంతగానో నచ్చుతాయని నా నమ్మకం.

కంచుకోట కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.











ముగ్గురు మాంత్రికులు కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.












తోకచుక్క కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.










త్వరలో బ్రహ్మాండమైన విడుదల - జ్వాలాద్వీపం, మకరదేవత, విచిత్ర కవలలు మరియు పాతాళ దుర్గం.
చూస్తూనే వుండండి - http://blogaagni.blogspot.com/ :-)

Friday, 5 September 2008

ఏ కులమూ నీదంటే

నరసరావుపేట యం.సి.ఏ రోజుల్లోని ఒక మరచిపోలేని జ్ఞాపకం శ్రీశైలం, నాగార్జున సాగర్ యాత్ర. మా మిత్రబృందంలో ఒకడికి అనిపించిందే తడవుగా అందరం సిద్ధమయిపోయాం. బడ్జెట్ ప్రయాణం కావటాన బయల్దేరటానికి ముందుగానే మాలో ఒక మిత్రుడు అక్కడి వివరాలు కొన్ని సంపాదించాడు. అందులో ముఖ్యమైనదీ, మా చెవుల్లో పాలుపోసినట్లు వినిపించిందీ - శ్రీశైలంలో ఎక్కడ పడితే అక్కడ ధర్మసత్రాలుంటాయని, వాటిల్లో వసతి, భోజనం ఉచితంగా లభిస్తాయని. అదృష్టం కొద్దీ మేము మాట్లాడుకున్న జీపువాడు కూడా తన కొడుక్కి నాగార్జున సాగర్ చూపించాలని ఎన్నాళ్ళనించో అనుకుంటూ వుండటంతో తక్కువకే బేరం కుదిరింది. మొత్తానికి తలా రూ.300/- లతో(అక్షరాలా మూడువందల రూపాయలు మాత్రమే) ఏడుగురం మిత్రులం ఒక శుభరాత్రి బయల్దేరి మార్కాపురం మీదుగా తెల్లవారేప్పటికి శ్రీశైలం చేరాం. షరా మామూలుగానే పాతాళగంగలో మునకేసి, స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆత్మారాముడి గోల పడలేక భోజన సత్రాలకై వెదకటం మొదలెట్టాం. అప్పుడు తెలిసిన గొప్ప నిజమేమిటంటే అక్కడి సత్రాలు చాలావరకు caste based. అంటే ఏ కులంవారి సత్రంలో ఆ కులంవారికే వసతి లభిస్తుంది. కొన్ని సత్రాలు ఇతర కులాలవారికి కూడా భోజనం మాత్రం పెడతాయిగానీ వేరుగా కూర్చుని తినాలి. ఏం చెయ్యాలో ఒక్కడికీ పాలుబోలేదు. ఒకేకులానికి చెందిన వాళ్ళతోనే ఇట్లాంటి చోట్లకి రావాలని మాకు తెలియదింకా అప్పటికి.

మాలో ఇద్దరు ఫలానా1, మరో ఇద్దరు ఫలానా2, ఇక మిగతా ముగ్గురూ వేర్వేరు ఫలానాలన్నమాట. చూడబోతే ఒక్కోడూ ఒక్కోగదిలో వుండాల్సొచ్చేట్టుగా వుంది. అసలు వూరొచ్చిందే అంతా కలిసి ఎంజాయ్ చేద్దామని. మరెలా? సరే చించగా చించగా, గది ఇచ్చే ముందు ఇంటిపేరు, గోత్రం అడగటం చూసి ఒకడికి బ్రహ్మాండమైన లైటు వెలిగింది. ఫలానా1 కి సంబందించిన ఏవో ఒక గోత్రం/ఇంటిపేరు కాంబినేషను బట్టీ వేయించేసి ఒకడిని మాతోపాటు మా ఫలానా1 సత్రంలోకి లాగేశాం. మిగతా ఇద్దరు ఇతర ఫలానాలక్కూడా ఫలానా2 తాలూకు కాంబినేషన్లు బట్టీ పట్టించి వాళ్ళని ఫలానా2 లోకి విజయవంతంగా తోసేశాం(అని అనుకున్నాం). మాతో పాటు వచ్చినవాడు మేమే వార్నీ అనుకునే స్థాయిలో తడుముకోకుండా గోత్రనామాలు చెప్పిపారేశాడు. అవతల కూడా అంతా హ్యాప్పీసే అనుకుంటూ హాయిగా భోంచేసి గదిలో తొంగున్నాం.

అవతలి సత్రంలో ఒక చిన్నతేడా జరిగింది. గదులు ఇవ్వటానికి కూర్చున్నవాడికి మా బట్టీవీరుల్ని చూసేసరికి ఏం అనుమానం వచ్చిందో ఏమో, ఇంటిపేరు/గోత్రం తో సరిపెట్టకుండా మేనమామ గోత్రం చెప్పమని అడిగాడు ఒక బట్టీబాబుని. దాంతో కంగారుపడ్డ మావాడు ఏం చెప్పాలో తెలియని టెన్షన్లో వెనకనించి మావాళ్ళు సైగచేస్తున్నా పట్టించుకోకుండా 'ఆయనదీ అదే గోత్రం' అనేశాడు. చచ్చింది గొర్రె. గొడవ మొదలు. నీ అసలు కులమేమిటో చెప్పమని అంటాడు సత్రంవాడు. మావాడికీ ఆవేశమొచ్చి 'మంచితనానికి మాలని, మానవత్వానికి మాదిగని, అమ్మతనానికి కమ్మని ...(మిగతా డైలాగు గుర్తులేదు)'తో సరిసమానమైన డైలాగు వేశాడు బాలయ్య లెవెల్లో. కానీ అస్సలు కళాహృదయంలేని సత్రంవాడు ఆ డైలాగునేమాత్రం పట్టించుకోలేదు. రచ్చ మళ్ళీ మొదలు. మావాళ్ళ తడబాటు చూసి సత్రకాయగాడికి అనుమానం నిర్థారణ అయిపోయింది. దాంతో వాడు 'వీడు మావాడని మీరెవరైనా నిరూపిస్తే సంవత్సరం పాటు ఉచితంగా మీఇంట్లో పని మనిషిగా చేస్తాను' అని మావాళ్ళకి సవాళ్ళుకూడా విసరటం మొదలెట్టాడు. ఇక పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించి మావాళ్ళే నెమ్మదిగా అక్కడినించి జారుకున్నారు.

జరిగిన విషయం సాయంత్రం విన్న నేను మావాడూ విరగబడి నవ్వాం రవితేజలా, వెకిలిగా. అసలు ఇలాంటి విషయాన్ని ఎలా మానేజి చెయ్యాలో మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిందిగా ఒక ఉచిత సలహా కూడా పారేశాం వాళ్ళమొహాన. కానీ మాకేం తెలుసు ఆరోజు రాత్రికే మాక్కూడా గర్వభంగం జరగబోతోందని.

షాపింగ్ పేరుతో సాయంత్రమంతా తిరిగి, పనిలో పనిగా శ్రీశైలం వచ్చిన అమ్మాయిలందరినీ కవర్ చేసేసి బాగా పొద్దు పోయాక సత్రానికి తిరిగొచ్చాం. మర్నాడు పొద్దున్నే బయల్దేరి సాగర్ వెళ్ళాలనేది ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం. సాయంత్రమంతా బయట అడ్డమైన చెత్తా తిన్నందువల్ల నాకూ, నాతో పాటు ఇంకొకడికీ ఆకలివెయ్యలేదు. దాంతో వెళ్ళి భోంచేసి రమ్మని మాతో వున్న బట్టీబాబుని మాత్రం పంపించాం. ఉత్సాహంగా తలూపి వెళ్ళినవాడు కాస్తా కాసేపటికి ఖంగారుగా తిరిగివచ్చి 'భోజనం చేస్తుంటే అంతా నన్నే పరీక్షగా చూస్తున్నారురా మామా' అనేశాడు. అంతే మా ఇద్దరికీ గుండెల్లో అణుబాంబులు పేలాయి. వార్నాయినో కొంపదీసి గుట్టురట్టవ్వలేదు కద అనుకుని మావాడిని అసలు ఏం జరిగిందో చెప్పమన్నా. భోజనానికి వెళ్ళగానే మగాళ్ళు అంతా చొక్కాలు విప్పి భోంచెయ్యాలని చెప్పారట. సరే అని మావాడు చొక్కా విప్పి చుట్టూ చూసేసరికి చాలామంది అవపోశనపడుతూ కనిపించారుట. అంతే మావాడు కూడా ఆవేశపడిపోయి ఏదో వాడికి తోచినట్లు అవపోశనపట్టి భోజనం చేసివచ్చాడు. వీడి వంటిమీద జంధ్యం లేకపోయినా అవపోశనపట్టేటప్పటికి జనాలు అనుమానంగా చూడటం మొదలెట్టారు. అసలు అది పూర్తిగా మావాడి తప్పు కూడా కాదు. ఆరోజు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు వాడికి చెప్పాం మమ్మల్నే చూస్తూ మేమెలా తింటే అలాగే తినమని. రాత్రి పక్కన మేము లేము కాబట్టి వేరేవాళ్ళని ఫాలో అయిపోయాడు వాడు సిన్సియర్ గా.ఇక చూస్కోండి ఏరాత్రప్పుడు వచ్చి బయటికి గెంటుతారా అని ఎదురుచూస్తూ, గెంటితే గెంటారు తన్నకుండా వదిలితే అదే పదివేలు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆరాత్రి గడిపాం. అదృష్టవశాత్తూ అలాంటివేమీ జరగకుండానే తెల్లవారింది. త్వరత్వరగా స్నానాలూ గట్రా కానిచ్చి బయటపడి ఊపిరి పీల్చుకున్నాం. నాగార్జునసాగర్ యాత్ర మాత్రం పెద్దగా సాహసకార్యాలు లేకుండానే పూర్తయింది. ఇది జరిగి దాదాపు పదేళ్ళవుతున్నా ఇప్పటికీ ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించే అనుభవం ఇది.