ఇది తాగుబోతు వాగుడే అని నిశ్చయంగా అర్థమయ్యింది మా ఇద్దరికీ. పడుకుందామని లేచి వచ్చేస్తున్నాం. "నాది తాగుబోతు మాటలు అనుకుంటున్నారు కదూ" వెనకనుంచి అంటున్నాడు దివాకరం. "నిస్సందేహంగా" అన్నాడు విశ్వం వెనక్కి తిరగకుండానే. "ఏం చేసి మిమ్మల్ని నమ్మించాలో చెప్పండి మరి", దివాకరం ప్రేలాపనకు అంతులేకుండా పోతోంది. "ఏం చెయ్యవద్దుగానీ వెళ్ళి పడుకో రేపు మాట్లాడదాం" అన్నా నేను. "పోనీ వెంకట లక్ష్మి ఉత్తరం గురించి చెబితే నమ్ముతారా" అరిచాడు దివాకరం. మా ఇద్దరి ముఖాలూ కత్తి వేటుకు నెత్తురు చుక్క లేనట్టు పాలిపోయాయి. "ఆ విషయం ఇప్పుడెందుకురా" అన్నాడు విశ్వం కంగారుగా. వెంకట లక్ష్మి అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు దివాకరం తల్లిదండ్రులు. తరచూ దివాకరాన్ని కలుసుకోవటానికి అక్కడికొస్తూండటం వల్ల విశ్వంగాడి కన్ను ఆ అమ్మాయి మీద పడింది. పాపం ఆ అమ్మాయి వీడివంక కన్నెత్తి కూడా చూసేది కాదు. అయినా సరే నన్ను వెంటేసుకుని ఆ అమ్మాయి వెళ్ళినచోటల్లా నీడలా వెంబడిస్తూ ఉండేవాడు. ఇంతలో ఆ అమ్మాయికి ఏదో పెళ్ళి సంబంధం వచ్చింది. తనని పట్టించుకోలేదనే కసితో ఆ పిల్ల మీద ఉన్నవీ లేనివీ కల్పించి ప్రచారం చేసి ఆ సంబంధం చెడిపోయేట్లు చేశాడు విశ్వం, నా సహాయంతో. అవమానం భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని చనిపోయింది వెంకట లక్ష్మి. చనిపోతూ ఉత్తరమేదో రాసి అందులో తన చావుకు కారణంగా మా ఇద్దరి పేర్లు రాసిందట. సమయానికి ఇంట్లో ఎవరూ లేక పోవటం, ఆమె శవాన్ని మొదట దివాకరమే చూడటం వల్ల ఆ ఉత్తరం మూడోకంటికి తెలియకుండా మాయం చెయ్యబడింది. ఆ ఉత్తరం సంగతే ఇప్పుడు దివాకరం ప్రస్తావిస్తున్నది. "ఆ ఉత్తరం మాయం చేశానని చెప్పావు కదరా" అడిగాను నేను, నా గొంతు వణకడం నాకే స్పష్టంగా తెలుస్తోంది.
"లేదు, ఎప్పటికైనా ఉపయోగపడుతుందని భద్రంగా ఉంచా" చిన్నగా నవ్వాడు దివాకరం. "వెంకట లక్ష్మి అన్నలకు ఈ ఊళ్ళో ఎంత పలుకుబడి ఉందో మీకు తెలుసుగా" బ్లాక్ మెయిల్ కు దిగుతున్నాడు. ఆ మాట నిజమే, ఆ దారుణానికి మేమే కారణమని తెలిస్తే ఇన్నేళ్ళ తరువాతైనా సరే నరికి పోగులు పెట్టకుండా వదలరు. గొంతు పిడచకట్టుకుపోతున్నట్టనిపించింది. విశ్వం వంక చూశా, వాడూ గుటకలు మింగుతూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. "కానీ… శేఖరాన్ని… ఎందుకు…?" అతికష్టం మీద అనగలిగా శక్తి కూడతీసుకుని. "అది నీకనవసరం, రెండ్రోజుల తరువాత వచ్చే వాడు ప్రాణాలతో ఈ ఊరు దాటి వెళ్ళటానికి వీల్లేదు" కొంతసేపటి క్రితం వరకూ ఎంతో సౌమ్యంగా కనిపించిన దివాకరం ముఖంలో ఇప్పుడు క్రౌర్యం ఉట్టిపడుతోంది. "సరే, ఆలోచించుకోవటానికి మాక్కాస్త సమయం కావాలి" అన్నాడు విశ్వం. "ఆలోచించుకో, కానీ శేఖరాన్ని ఎలా చంపాలా అని మాత్రమే. ఈ పని చెయ్యాలా వద్దా అని ఆలోచించుకోవటానికి మటుకు నీకు ఛాయిస్ లేదు" వెటకారం ధ్వనించింది దివాకరం మాటల్లో.
తడబడుతున్న అడుగులతో మా గదుల్లోకి వచ్చి పడుకున్నామే కానీ నిద్రలు పట్టలేదు ఇద్దరికీ. అసలు శేఖరాన్ని చంపాల్సిన అవసరమేమిటో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. పిల్లిలా బయటకు వచ్చి చూశాను. తప్పించుకుపోవటానికి వీల్లేకుండా తోట చుట్టూ గట్టి బందోబస్తే పెట్టాడు దివాకరం. గంట క్రితం వరకూ మా రక్షణ కోసం చేసినట్లనిపించిన ఏర్పాట్లు ఇప్పుడు కాపలా ఏర్పాట్లనిపించటంలో ఆశ్చర్యం లేదు. దివాకరం గాఢ నిద్రలో ఉన్నాడు. నెమ్మదిగా వెళ్ళి విశ్వాన్ని లేపా. వాడికీ విషయం ఏమీ అంతుబట్టటంలేదు. ఎన్నో తర్క వితర్కాల తరువాత తెల్లవారేలోపు ఎలాగోలా బయటపడి దొరికిన బస్సో మరోటో పట్టుకుని దగ్గర్లోని టౌనుకు చేరి అక్కడినుంచి హైదరాబాద్ చేరాలని, ఈలోపు శేఖరానికి కూడా ఫోన్ చేసి పల్లెకు తిరిగి రావద్దని చెప్పాలనీ నిర్ణయించుకున్నాం. రాత్రి జరిగినదానికి మావద్ద ఆధారాలేమీ లేనందువల్ల పోలీసుల దగ్గరికి వెళ్ళి నిరూపించగలిగేది ఏమీ ఉండదని మాకు తెలుసు. అదీగాక అటు తిరిగి ఇటు తిరిగి విషయం వెంకట లక్ష్మి దగ్గరకు వచ్చిందంటే ఇరుక్కునేది మేమే.
బయట కాపలా వాళ్ళ అలికిడి కూడా ఇప్పుడంతగా వినిపించడం లేదు. బహుశా వాళ్ళూ నిద్రలోకి జారుకుని వుంటారు. తప్పించుకోవటానికి ఇంతకంటే మంచి తరుణం ఉండబోదని అనిపించింది. అలికిడి చెయ్యకుండా వెనుక ద్వారం గుండా బయటికి వచ్చాం. కనిపించే ప్రహరీ గోడ ఎక్కి దూకి తోట దాటితే మెయిన్ రోడ్ కనిపిస్తుంది. అక్కడినుంచి లారీయో బస్సో పట్టుకోవచ్చు. ఆలోచిస్తూ నడుస్తూనే చీకట్లో చూసుకోక దేన్నో తన్నినట్లున్నాను, పెద్దగా చప్పుడు కావటం మామీద రెండు టార్చిలైట్లు పడటం క్షణాల్లో జరిగిపోయాయి. విశ్వాన్ని హెచ్చరించి పరుగందుకున్నాను. అలవాటులేకపోవటం వల్ల ఇద్దరమూ పరిగెత్తలేకపోతున్నాము. వెనక ముగ్గురు నలుగురు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మమ్మల్ని చుట్టుముట్టటానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ఎలాగోలా తోట దాటి మెయిన్ రోడ్ చేరుకున్నాం. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. వెనక పరిగెత్తుకొస్తున్న వాళ్ళు వదలక వెంటాడుతూనే వున్నారు. త్వరలో ఏదో ఒక సురక్షితమైన చోటు చేరుకోకపోతే వాళ్ళకు చిక్కటం ఖాయమని తోచింది నాకు. చూడబోతే ఒక్క చిన్న వాహనమూ వస్తున్నట్టులేదు. పరిగెత్తీ పరిగెత్తీ విశ్వం విపరీతంగా రొప్పుతున్నాడు. నాదీ అదే పరిస్థితి. ఇక దాదాపు శక్తి ఉడిగిపోయే సమయానికి దేవుడు పంపినట్లుగా అల్లంత దూరంలో దర్శనమిచ్చింది పోలీస్ స్టేషన్. మిగిలిన శక్తినంతా కూడదీసుకుని నాలుగంగల్లో వెళ్ళి పడ్డాం.
ఒక కానిస్టేబులు కునికిపాట్లు పడుతూ కనిపించాడు. జరిగినదంతా గబగబా వివరించాం. కానిస్టేబుల్ ఒక్కసారి గట్టిగా ఆవులించి, మత్తు వదలని కళ్ళని బలవంతంగా తెరిచి చూస్తూ అడిగాడు, "ఇంతకీ ఎవరు మిమ్మల్ని వెంటాడుతోంది"? దివాకరం మనుషులని చెప్పాను. సమాధానంగా ఒక వెకిలి నవ్వు నవ్వి, "మీ దగ్గర గుప్పున కంపు వచ్చినప్పుడే అనుకున్నాను, ఇలాంటిదే ఏదో అయ్యివుంటుందని. మా సమయం వృధా చెయ్యకుండా వెళ్ళిరండి" అన్నాడు హెచ్చరిస్తున్నట్టు. మా ఇద్దరికీ అరికాలిమంట నషాళానికంటింది. ఒక పక్క ప్రాణాల మీదికి వచ్చిందని మొత్తుకుంటూంటే ఏమిటి వీడి మాటలు? "మా ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పినా పట్టించుకోరేం" అనరిచా ఇంగ్లీషులో. బదులుగా అతడూ అదే స్వరంలో జవాబిచ్చాడు "తాగుబోతు నాయాళ్ళల్లారా, రెండు నెల్ల క్రితం చచ్చిపోయిన దివాకరం మిమ్మల్ని చంపుతానని వెంట పడుతున్నాడా. అది విని నమ్మటానికి మేమేమయినా మీలా మందుకొట్టి ఉన్నామనుకుంటున్నార్రా" ఇంకా ఏదేదో అంటున్నాడు కానీ ఏమీ వినిపించటంలేదు. మా ఇద్దరి పక్కనా రెండు పిడుగులు పడ్డట్టు అనిపించింది. దివాకరం చనిపోయి రెండు నెలలు అవుతోందా? మరి నిన్నటినుంచీ మాతో ఉన్నదెవరు??
(చివరి భాగం రేపు)
(ఇది నా మొదటి ప్రయత్నం. బాగుందనిపిస్తే చెప్పండి. బాగాలేదనిపిస్తే మాత్రం తప్పక చెప్పండి. మీ సలహాలూ, సూచనలకు స్వాగతం.)
18 comments:
బావుందండి ... తెలుగు సినిమా ప్రభావం బానే ఉన్నట్టుంది ...;-)
మూడో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మీరు పెద్ద గేప్ తీసుకోకుండా వెనువెంటనే ఇలా రాయడం కూడా బాగుంది..
Interesting and waiting for next part!
భలే రాస్తున్నారు.కధనం కూడా చాలా బాగుంది :)
WAITING FOR NEXT PART
Agree with Sravya.
interesting :)
modavadi eppudu
nenu mee blogu open chesinappudallaa aa image chusi bhalE navvukuntaanu.....
eppatikee daanni marchakandi
వెంకటలక్ష్మి ఉత్తరం ఉత్తిదేనా? దివాకరం దెయ్యం అని మాత్రం తేల్చకండి :-)
ఈ పార్టులో ‘దయ్యం ట్విస్ట్’ని నేనసలు ఊహించలేదండీ.:)
మూడో పార్టు కోసం ఇంతమంది ఎదురుచూస్తున్నారంటే... మీ సస్పెన్స్ కథ, హిట్టేనండీ!
దివాకరం దయ్యం అయిపోయాడని చెప్పేసి, ఒప్పించటం కష్టం. అప్పుడు కథ కూడా దెబ్బతింటుంది. అలా చేస్తారని అనుకోను.
చివర్లో- ఇది ‘కల’ అని చల్లగా చెప్పేసి, తెలివిగా తప్పుకునే ప్లానేమీ లేదు కదా?!
ఈ దివాకరానికి ముప్పై/ముప్పై ఐదేళ్లేగా. ఇతను దెయ్యమూ కాదు, ఇది కలా కాదు. ఇతను దివాకరానికి కొడుకు. ఎంకట్లష్మి ఉరేసుకోలేదు, మర్డరయింది. అందులో శేఖరం హ్యాండుంది. ఇంతకీ ఈ కొత్త దివాకరం తల్లెవరు? ఎంకట్లష్మి చావుకి ఇతనెందుకు పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు?
చూద్దాం. బ్లాగాగ్ని ఇది కూడా కాకుండా ఇంకెలా మలుపు తిప్పుతాడో :-)
బాగుంది బాగుంది...అవధానంలో నిషేధాక్షరి లాగా అబ్రకదబ్ర మీ మలుపులన్నీ బ్లాక్ చేసారు. All the best !
నాకెందుకో ఇది శేకరం,దివాకరం కలిపి ఆడుతున్న నాటకం లా అనిపిస్తుంది..ఎందుకని సరిగ్గా సమయానికి శేకర్ అక్కడి నుండి ఊరికి వెళ్ళిపోయాడు.. పైగా సెల్ సిగ్నల్స్ కూడా లేని ప్రదేశం పెట్టారు ..ఫోన్ చేసి విషయం చెప్పడానికి..బ్లాగాగ్ని గారు మీ కధని చాలా కోణాల్లో పరిశీలించి పరిశోదించేస్తున్నాం.. అది మీ కధ మీద ప్రభావం చూపదు కదా :)
విజయక్రాంతి గారు, ఉమాశంకర్ గారు, శ్రావ్య గారు, నేస్తం గారు, వంశీ గారు, సునీత గారు, అశ్విన్ గారు, అబ్రకదబ్ర గారు, వేణు గారు, వేమన గారు - మీరిచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ :)
దయ్యం మలుపు చీప్ గా అనిపిస్తోంది. చూద్దాం తరువాత ఏం చేస్తారో ఈ దయ్యాన్ని. ఉత్సుకత కొనసాగిస్తున్నారు.
Sarath garu,
Thanks for taking time to read my story and for your valuable suggestions too :)
Hi Mr. Phani kumar,
I am writing from Taiwan. I came to know about your blog from eenadu paper. Nenu telugu vaadini, meeru chandamama paatha sanchikalanu online lo pdf format lo vuncharu ani vannanu. please tell me how to download those things.
Thankx in advance
Excellent read, Positive site, where did u come up with the information on this posting? I have read a few of the articles on your website now, and I really like your style. Thanks a million and please keep up the effective work
idhatri - this site also provide most trending and latest articles
Post a Comment