ఉదయం తొమ్మిదవుతోంది.
ఆరింటికే వివిధ చానెళ్ళలో మొదలయిన సీరియళ్ళను ఒక పట్టుపడుతూ ఇంకా పళ్ళు కూడా తోముకోకుండా కూర్చున్న రమ్య కాలింగ్ బెల్ మోగితే విసుక్కుంటూ లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కేబుల్ అబ్బాయి. "సారు ఈ నెల కేబుల్ డబ్బులింకా ఇవ్వలేదమ్మా" అన్నాడు. "ఈయన పనులన్నీ ఇలాగే ఏడుస్తాయి. ఇప్పుడు వీడు కేబుల్ కట్ చేస్తే అదొక చావు" అని భర్తను మనసులోనే విసుక్కుని "ఆయనతో చెపుతాను. రేపు తప్పకుండా ఇచ్చేస్తార్లే" అని సర్దిచెప్పి పంపేసి మళ్ళీ టి.వి. ముందు సెటిలయ్యింది. అయిదు నిమిషాలు గడిచిందో లేదో ఫోన్ మోగింది. పిల్లల స్కూలు నుంచి ప్రిన్సిపాల్. టర్మ్ ఫీజు కట్టటానికి ఇవాళే ఆఖరి రోజనీ, ఇప్పటికే రెండు రిమైండర్లు పంపించామనీ ఇంకా ఆలస్యమైతే కష్టమనీ దులిపి పారేసింది. ప్రిన్సిపాల్ చెడుగుడు కన్నా ఈ గొడవవల్ల అయిదునిమిషాలు చిట్టెమ్మ సీరియల్ మిస్సయినందుకు తిక్కరేగిన రమ్యకు భర్త మీద పీకలదాకా కోపం వచ్చింది. "పొద్దున్నే ఆఫీసుకంటూ టింగురంగామని బైకుమీద వెళ్ళిపోతాడు, రాత్రిగ్గానీ ఇంటికిరాడు. మధ్యలో ఈయన వెలగబెడుతున్న రాచకార్యాలేమిటో? కాస్త వీటి సంగతి చూస్తే ఆయన సొమ్మేంబోయిందటా?" చిరాగ్గా అనుకుని భర్తకు ఫోన్ చెయ్యనారంభించింది, టి.వి.లో ప్రకటనలు మొదలవ్వటంతో.
ఎంతకీ ఫోను కలవటంలేదు. "ఏడ్చినట్లుంది, ఫోనుబిల్లు కట్టటం కూడా మర్చిపోయినట్లున్నాడు మతిమరపు మొగుడు" కసిగా అనుకుంది రమ్య. కాస్సేపటికి మళ్ళీ సీరియళ్ళ మాయలో పడిపోయి తాత్కాలికంగా సమస్యను మర్చిపోయింది. రాత్రికి ఇల్లు చేరిన నారాయణను చూస్తేగానీ మళ్ళీ విషయం గుర్తుకు రాలేదు. గుర్తొచ్చిన వెంటనే గయ్యిమని లేచింది "ఏం పీకుతున్నారు మీరు బయటికెళ్ళి? బైకుమీద ఝామ్మంటూ వెళ్ళడం, ఓ పదో పన్నెండో గంటలు ఏ.సి. ఆఫీసులో కూర్చుని ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుని రావటం. ఈమాత్రానికే ఏదో సంసార సాగరాన్ని మీరొక్కళ్ళే ఈదుతున్నట్లు ఫోజొకటి." ధారావాహికగా సాగిపోతున్న రమ్య వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అన్నాడు నారాయణ "అది కాదు రమ్యా, ఇవాళ ఒక బాల్య మిత్రుడు కలిశాడు. ఏదైనా మనసుకు హత్తుకునేట్లు చెప్పడంలో వాడు దిట్ట. ఇదే విషయం మామధ్య చర్చకు వచ్చిందివాళ. అప్పుడు వాడు చెప్పింది ఇదిగో ఇలా ఉంది.
మన పెద్దవాళ్ళు చెప్పినట్లు మనం భార్య పిల్లలకోసం తెగ కష్టపడిపోయి,
బాసు తిట్టినా, క్లైంటు కోప్పడినా ఆ విషయం ఆఫీసులోనే మర్చిపోయి,
పక్క సీటు పంకజం అమ్మాయిననే వంకబెట్టుకుని ఆరింటికే ఆఫీసునించి తుర్రుమంటే ఆవిడ పనికూడా తన నెత్తిమీదపడినా విసుక్కోకుండా ఎంత రాత్రయినా ఉండి పూర్తి చేసి,
నరకాన్ని తలపించే రోడ్లమీద ప్రతి కిలోమీటరుకూ ఏర్పడే ట్రాఫిక్ జాములను రోజుకు రెండుసార్లు చచ్చీ చెడీ దాటుకుంటూ,
ఆఫీసు సమస్యలు ఆఫీసులోనే మర్చిపోవాలని, భార్యాపిల్లలమీద వాటిని చూపించకూడదన్న మాటను అక్షరాలా పాటించి,
ఇంటికెళ్ళి భార్యను నవ్వుతూ అస్సలు పలకరించకూడదన్నమాట.
ఎందుకంటే అలా చేస్తే మనం ఆఫీసులో అస్సలు కష్టపడటంలేదనీ, వీళ్ళు చేసేదల్లా మడత నలక్కుండా ఏ.సి. ఆఫీసులో గంటల తరబడి కూర్చుని రావటమేనన్న అభిప్రాయం వాళ్ళకేర్పడుతుంది.
ఇహ మనం ఏంచెయ్యాలయ్యా అంటే, బాసు తిట్టినా, ప్యూను తిట్టినా, ఎర్ర లైటు దగ్గర జీబ్రా క్రాసింగ్ వెనకాల ఆగలేదని పోలీసు తిట్టినా, ఆఖరికి మన పక్కింటోడిని వాడి పెళ్ళాం తిట్టినాసరే(మరి మన మగాళ్ళ ఐకమత్యం ప్రదర్శించొద్దూ) ఇంటికొచ్చేసి పెళ్ళాం మీద నిర్మొహమాటంగా విరుచుకు పడిపోవాలి.ఎప్పుడూ ఆఫీసొదలగానే ఇంటికొచ్చెయ్యడమేనా, కాస్త అలా అలా ఒక్కసారి టాంక్ బండ్, లుంబిని పార్క్ వగైరా వగైరాలు ఒక్కళ్ళమే తిరిగేసి కాస్త "పిల్ల" గాలి పీల్చి రావాలి. అంతగా ఇంట్లో ఆరాలు గట్రా పెడితే ఉండనే ఉందిగా, "ఆఫీసులో ఆలస్యమయ్యింది" అనే తారక మంత్రం.మరీ రాముడు మంచి బాలుడిలా అలా ఎప్పుడూ పెళ్ళాం కొంగుపట్టుకుని తిరిగితే ఏంబావుంటుందండీ, లైఫన్నాక ఓ సరదా అయినా ఏడవాలిగా. అందుకే వారానికోసారి మందు, అప్పుడప్పుడూ చతుర్ముఖ పారాయణం వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రవేశం పొందాలి. సీరియళ్ళలో కూడా హీరోయిన్లు అచ్చు ఇలాంటి కష్టాలే పడుతూ కడవలు కడవలు కన్నీళ్ళు కారుస్తుంటారు. కాబట్టి ఆడాళ్ళు వీటివల్ల తమకు సదరు హీరొయిన్ స్టేటస్ వచ్చేసిందని భావిస్తారే తప్ప బాధ పడరు. అదన్న మాట సంగతి". ముగించాడు నారాయణ.
"ఈ సోదంతా నాకెందుకు గాని, ఇంతకీ బయటికెళ్ళి ఏం పీకుతున్నారు ఈపనులన్నీ ఇలా వదిలేసి?" నిలదీసింది రమ్య.
"ఏం లేదు, ఇవాళ్టినించీ ఏమీ పీకబోవటం కూడాలేదు. అసలు పీక్కోవటానికి ఏమైనా మిగిలి ఉంటే కదా" అన్నాడు నారాయణ బట్టతలను చూపిస్తూ.