Friday, 3 September 2010

మకర దేవత


తోకచుక్క తరువాత చందమామలో ప్రచురించబడిన సీరియల్ మకర దేవత. కథా పరంగా తోకచుక్కకు విరుధ్ధమైన అంశాన్ని ఎంచుకున్నారు రచయిత. తోకచుక్క మాయలూ మంత్రాలతో, చిత్ర విచిత్రాలతో నిండివుంటే మకర దేవత అంతా సాహసోపేత సన్నివేశాలతో, సేనాధిపతుల ఎత్తులూ పైఎత్తులతో సాగుతుంది. తోకచుక్క కథకూ దీనికీ సంబంధం లేకపోయినప్పటికీ అందులోని ముఖ్య పాత్రైన సమరసేనుడు ఈ కథలోనూ మనకు కనిపిస్తాడు. సమరసేనుడు అపారమైన ధనరాసులను కొల్లగొట్టుకుని కుండలినీ ద్వీపానికి తిరిగి వచ్చాక ఆ దేశ పరిస్థితులెలా మారినయ్యో తెలుస్తుంది సీరియల్ ప్రారంభంలో. ఈ మారిన పరిస్థితులు కుండలినీ, మరాళ ద్వీపాల్లో ఎటువంటి అరాచక పరిస్థితులు సృష్టించినయ్యో తెలిపేదే మిగిలిన కథ. తోకచుక్కతో పోలిస్తే దాసరి సుబ్రహ్మణ్యం గారి శైలిలో స్వల్పంగా మార్పు చోటు చేసుకోవడం మనం మకర దేవతలో గమనించవచ్చు.


క్లుప్తంగా కథను పరిశీలిస్తే, ప్రశాంత రాజ్యమైన మరాళ ద్వీపంపై కుండలినీ ద్వీప సైన్యాలు ఒకానొక రాత్రి హఠాత్తుగా దురాక్రమణ చేస్తాయి. ఈ పరిణామాన్ని ఊహించని మరాళద్వీప సైన్యాలు ఓటమి చవిచూస్తాయి. మరాళ ప్రభువైన మందరదేవుడు చేసేదిలేక కొద్దిమంది అంగరక్షకులను వెంటబెట్టుకుని ద్వీపం వదిలి ఒక చిన్న తెప్ప ద్వారా సముద్రంపై పారిపోతాడు. ఆ ప్రయాణంలో అతడు కుండలినీ ద్వీప సైన్యాధ్యక్షుడైన శివదత్తుడిని కలవడం సంభవిస్తుంది. శివదత్తుడి ద్వారా కుండలినీ ద్వీపంలో చెలరేగిన తిరుగుబాటు గురించీ, నరవాహన మిశ్రుడి నమ్మకద్రోహం గురించీ తెలుసుకుంటాడు మందరదేవుడు. మహారాజు చిత్రసేనుడు ఓటమి చెందాడనీ, సేనాని సమరసేనుడు మరణించాడనీ కూడా తెలుసుకుంటాడు. శివదత్తుడికి సహాయం చెయ్యబూనిన కోయ వీరులు కూడా చాలామంది నరవాహనమిశ్రుడి సైనికుల చేతిలో వీర మరణం పాలవుతారు. ఇప్పుడు మరాళ ద్వీపంపై దాడిచేసింది కూడా ఈ నరవాహనమిశ్రుడే. తమ ఉమ్మడి శత్రువైన నరవాహనమిశ్రుడిని ఏనాటికైనా తుదముట్టించడమే శివదత్తుడూ మందరదేవుల ముందున్న ఏకైక లక్ష్యం.

ఇంతలో మందరదేవుడు, శివదత్తులు ప్రయాణిస్తున్న తెప్పలు ఒక ద్వీపాన్ని చేరుకుంటాయి. అక్కడ కొన్ని చిత్రమైన పరిస్థితుల మధ్య వజ్రముష్టి అనే ఒక వ్యక్తిని కలుసుకుని అతడినీ తమ బృందంలో చేర్చుకుంటారు. సముద్రకేతుడనే ఒక సముద్రపు దొంగల నాయకుడిచే మోసగించబడినవాడీ వజ్రముష్టి. అంతా కలిసి ఆ ద్వీపంలోనుంచి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తూండగా సముద్రకేతుడు ఏదో వర్తకుల పడవను వెంటాడుతూ ఆ ద్వీపంకేసే రావడం గమనిస్తారు మందరదేవుడు, శివదత్తులు. వర్తకుల పడవలో వచ్చిన స్వయంప్రభ అనే రాచ కన్యను సముద్రకేతుడు బందీగా పట్టుకుపోతాడు. స్వయంప్రభతో ఉన్న దేవమాయి మాత్రం తప్పించుకుంటుంది. దేవమాయి ద్వారా సముద్రకేతుడెక్కడ ఉండేదీ తెలుసుకుంటారు శివదత్తుడు, మందరదేవులు. హరిశిఖుడనే రాజు గురించీ, అతడి రాజ్యాన్ని పట్టి పీడిస్తున్న మకర దేవత అనబడే ఒక రాక్షసి మొసలి గురించీ కూడా తెలుపుతుంది దేవమాయి. దేవమాయి చెప్పిన గురుతులననుసరించి సముద్రకేతుడి రాజ్యాన్ని చేరి అతడిని సంహరిస్తారు మందరదేవుడు, శివదత్తులు. అటుపిమ్మట హరిశిఖుడి రాజ్యం చేరి మకరదేవతని తాము సంహరిస్తామనీ బదులుగా తమకు తమ రాజ్యాన్ని తిరిగి సంపాదించుకునే ప్రయత్నాల్లో సహాయపడవలసిందనీ కోరుతారు. హరిశిఖుడందుకు అంగీకరిస్తాడు. వజ్రముష్టి మకరదేవతతో హోరాహోరీ పోరాడి దానిని సంహరిస్తాడు. శమన ద్వీప రాకుమారి అయిన స్వయంప్రభను మందరదేవుడు పెళ్ళాడి హరిశిఖుడి సైన్యాలతోనూ, శమన ద్వీప సైన్యాలతోనూ కుండలినీ ద్వీపాన్ని ముట్టడిస్తాడు. ఈలోపే మరొకవైపునుంచి దాడిచేసిన కోయవీరుల ధాటికి నరవాహనమిశ్రుడి సైన్యం చెల్లాచెదురవుతుంది. నరవాహనుడికి మరణశిక్ష విధించబడుతుంది. మందరదేవుడిని కుండలిని, మరాళ ద్వీపాలకు రెండింటికీ రాజును చేసి శివదత్తుడు వానప్రస్థాశ్రమం స్వీకరించడంతో కథ ముగుస్తుంది.

ఈ కథలో మందరదేవుడు కథానాయకుడని మొదట అనిపించినా కథ ప్రధానంగా శివదత్తుడు, వజ్రముష్టిల చుట్టే తిరుగుతుంది. దాదాపు మొదటి సగం అంతా శివదత్తుడి సాహసాల గురించే చదువుతాము. ఈ శివదత్తుడు మహావీరుడు మరియు సేనాని సమరసేనుడికి విశ్వాసపాత్రుడు. ఇతడి పాత్ర ద్వారా మనకు ఎంతటి విపత్కర పరిస్థితులను అయినా మొక్కవోని ధైర్యంతో ఎలా ఎదుర్కొనవచ్చో తెలుస్తుంది. ఇతడు రహస్యమార్గం గుండా పారిపోయి సింహాల మందతో కలిసి శత్రు దళ నాయకుడిని సంహరించే తీరు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతూ చదువరులను ఉత్కంఠకులోను చేస్తుంది. తమను వెనుక ఎవరూ అనుసరించిరాకుండా రహస్యమార్గంలోని తలుపును లాగి సొరంగం అంతా జలమయం చెయ్యటం రచయిత ఊహాశక్తికి అద్దంపట్టే అద్భుతమైన ఆలోచన. శివదత్తుడు కోయలను సమీకరించి నరవాహనమిశ్రుడిపై మళ్ళీ దాడికి యత్నించే సందర్భంలో వీరుడైన వాడు ఒక్క ఓటమికి కుంగిపోయి ప్రయత్నాన్ని మానుకోడన్న సత్యం కనబడుతుంది. నరవాహనమిశ్రుడు కోయల నాయకుడికి పంపే చిత్ర సందేశం మరో చక్కటి ఆలోచన. కోయలకు నాగరికుల లిపి అర్థంకాకపోవచ్చనే భావనతో రచయిత తెలివిగా ఈ చిత్ర సందేశాన్ని సృష్టించి ఉండవచ్చు.

ఈకథలోని మరో ముఖ్య పాత్ర వజ్రముష్టి. సముద్రకేతుడి వంచనకు గురై పన్నెండేళ్ళపాటు నిర్మానుష్యమైన దీవిలో జీవించవలసి వచ్చిన వజ్రముష్టి పరిస్థితులకు తగ్గట్టు తనను తాను మలచుకుంటాడు. ఆయుధాలేవీ దొరకని ఆ దీవిలో వట్టిచేతులతోనే ఆహార సంపాదన, ఆత్మరక్షణ చేసుకోవటం అలవరచుకుంటాడు. లేడిని పట్టుకున్న విధానం అతడి నైపుణ్యాన్ని తెలియజేస్తే ఒంటరిగా సముద్రకేతుడి అనుచరులను ఎదుర్కొన్న వైనం అతడి శక్తి సామర్ధ్యాలను, మకర దేవతను సంహరించిన తీరు అతడి సాహసాన్ని తెలియజేస్తుంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా అధైర్యపడకుండా దృఢసంకల్పంతో ఏవిధంగా మనుగడ సాగించవచ్చో వజ్రముష్టి పాత్ర ద్వారా తెలియజేస్తారు రచయిత.


చందమామలోని ఏకథ తీసుకున్నా అందులో నీతి అంతర్లీనంగా ఉంటుంది. మకరదేవత కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ కథ ఎంతగా మనల్ని సాహసోపేతమైన సంఘటనలతోనూ, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతోనూ, ఒళ్ళు గగుర్పొడిచే పోరాటాలతోనూ కూడుకున్నదై అలరించినప్పటికీ దీనిలోని అమూల్యమైన సందేశం అంతర్వాహినిగా అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. ధనం ఒక్కటే అన్ని సమస్యలకూ పరిష్కారం కాదని, రాజ్యం అంతులేని ధనంతో తులతూగుతున్నంత మాత్రాన మహారాజు తన బాధ్యతలను విస్మరించటానికి వీల్లేదని చిత్రసేన మహారాజు పాత్ర ద్వారా తెలుపుతుంది మకర దేవత. తమ చుట్టూ ఉన్నవాళ్ళను గుడ్డిగా నమ్మటం ఎంత ప్రమాదకరమో, గోముఖ వ్యాఘ్రాలవంటి వాళ్ళు అవకాశం దొరకగానే ఎంతటి నయవంచనకు పాల్పడగలరో మనకు నరవాహనమిశ్రుడి పాత్ర ద్వారా తెలుస్తుంది. ఆపదల్లో సంయమనం కోల్పోకుండా, సమయస్ఫూర్తితో ఏవిధంగా వ్యవహరించాలో శివదత్తుడి పాత్ర మనకు చెబుతుంది. మరో చిన్న విశేషం ఏమిటంటే, కుండలినీ ద్వీపంలోని పరిస్థితులను వర్ణించడం ద్వారా పెద్ద పెద్ద వాళ్ళకే ఒక పట్టాన అర్థంకాని ద్రవ్యోల్బణం గురించి చాలా సరళంగా వివరించారు సుబ్రహ్మణ్యం గారు.



4 comments:

వేణు said...

మకరదేవత సీరియల్ పై మీ పరిశీలనా, విశ్లేషణా బాగున్నాయి. అద్భుతమైన.. చిత్రా బొమ్మలు ఒకటి రెండైనా ఇచ్చివుంటే నిండుగా ఉండేది.

kishan said...

chala baaga chepparu.meeru chandamama kadhalaki manchi adhimanu anukuntanu.asalu nenu ee blog dwarane a kadhalani chadavagaliganu.anduku appudu cheppina malli ippudu dhanyawadhalu cheppalanipisthundi.

Dr Sarathi Padma said...

ఆర్యా! మీ అభిరుచికి మరియు మీ సంకలనాలకు నా వందనములు! నేను "ఉక్కు పిడి మాయావి" గురించి చాలా వెదుకు చున్నాను. కానీ ఎక్కడ కూడా లభించడం లేదు. మీ వద్ద ఏమైనా మార్గం దొరుక వచ్చేమో నన్న ఆశ!

వేణు said...

సారథి గారూ,
మీ వ్యాఖ్య లేటుగా చూశాను. మీరు దీన్ని రాయటానికి 5 నెలల ముందే ‘ఉక్కుపిడి మాయావి’ గురించి ఓ పోస్టు రాశాను. చూడండి-
http://venuvu.blogspot.in/2011/02/blog-post.html