Saturday 24 July, 2010

ప్రయాణం - 3

నేను వీధినబడి(అనగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణకై రోడ్డెక్కి) దగ్గర దగ్గర దశాబ్దం పూర్తవ్వొస్తోంది. ఈ సందర్భంగా వెనక్కు తిరిగి నా ప్రయాణం ఒక్కసారి నెమరేసుకోవడం, అంతకన్నా ముఖ్యంగా నా ఉద్యోగ పర్వంలోని వివిధ దశల్లో కీలకమనదగ్గ అవకాశాలు కల్పించిన ముగ్గురు స్నేహితులను గుర్తు చేసుకోవడం కోసం ఈ ప్రయత్నం.


నా చదువైపోయి అప్పటికే దాదాపు సంవత్సరం పూర్తవ్వొస్తోంది. ఇక నాకు సరైన ఉద్యోగం దొరకేదేమో అన్న నిస్పృహ నెమ్మదిగా నన్నావరిస్తున్న తరుణంలో అనుకోని విధంగా నాకు సహాయం చేశాడు నా మొదటి మిత్రుడు, హెచ్.ఎస్.శ్రీనివాస్. తనప్పటికే ఒక చిన్న కంపెనీలో చేసేవాడు. వాళ్ళ క్లైంట్కు తెలిసినవాళ్ళు కంప్యూటర్ తెలిసిన కుర్రాళ్ళకోసం వెతుకుతున్నారని తెలిసి, ఆయన్ని బతిమలాడి(ఎం.సి.. వాళ్ళు ఓవర్ క్వాలిఫై అవుతారని ఆయన వద్దన్నా వెంటపడి మరీ) నాకు, మరో రూమ్మేట్కూ(పేరు Ch. అనుకుందాం కాసేపు) ఇంటర్వ్యూ ఏర్పాటు చేయించాడు. ఆవిధంగా పంజగుట్టలోని ఒక ఇన్సూరెన్స్ సర్వీసెస్ కంపెనీలో మూడున్నరవేలతో నా మొదటి అసలు ఉద్యోగం మొదలైంది. ఒకవిధంగా హెచ్.ఎస్. గనుక సమయానుకూలంగా నన్నాదుకోక పోయిఉంటే నేనే డిప్రెషన్లోకో వెళ్ళిపోయి ఉండేవాడిని. తనిప్పించింది చిన్న ఉద్యోగమైనా నైతికంగా నాకది కొండంత మద్దతునిచ్చింది. ఆరకంగా తనది వెలకట్టలేని సహాయం. కొత్త ఉద్యోగం మొదట్లో కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఇన్సూరెన్స్ సర్వేయర్లకు ఉపయోగపడే సాఫ్ట్వేర్ ఒకటి రూపొందించేది మా కంపెనీ అప్పట్లో. మా బాసుకు కంప్యూటర్ పరిజ్ఞానం పెద్దగా లేకపోవడం వల్ల దీని కాంట్రాక్ట్ వేరే కంపెనీకి ఇచ్చివున్నారు. వాళ్ళు ఈయనకు అన్న సమయానికి సాఫ్ట్వేర్ ఇవ్వకుండా తీరా రిలీజ్ చేశాక భయంకరమైన బగ్గులతో రిలీజ్ చేశారు. దానిని మేము టెస్ట్ చేసి చాలావరకూ బగ్గుల్ని కనుక్కుని బాసుతో చెప్పి రిలీజ్ ఆపుచేయించి చాలావరకూ వాటిని ఫిక్స్ చేయించాము. తరువాత ఆయనకు మేము ఎం.సి.. అని తెలిసి సాఫ్ట్వేర్ బాధ్యతలు మొత్తం మాకు అప్పగించారు. అక్కడితో ఆకంపెనీతో మా హనీమూన్ ముగిసి కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే సాఫ్ట్వేర్ పరమ భయంకరమైన డెవలప్మెంట్ వల్ల తుమ్మితే ఊడే ముక్కులా ఉండేది. ఎక్కడ చిన్న మార్పు చేసినా ఏదో మూల కొత్త సమస్యొస్తుండేది. దీనికి తోడు అప్పటికే సాఫ్ట్వేర్ని మావాళ్ళు కొంతమంది గుజరాత్, మహారాష్ట్ర సర్వేయర్లకి అమ్మేశారు. దీంతో రోజూ వాళ్ళదగ్గరినుంచి ఫోన్లు. హిందీ వచ్చని చెప్పిన ఒకే ఒక్క పాపానికి వాళ్ళతో నేనే మాట్లాడి సమాధానపరచాల్సొచ్చేది.

మొత్తానికి ఒక నెలపాటు కిందా మీదా పడి దాన్నొక రూపానికి తెచ్చి కొనుక్కున్నవాళ్ళందరికీ డెలివరీ చేసేశాం. హమ్మయ్య అనుకున్నామో లేదో, మళ్ళీ ఫోన్లు, ఇది పనిచెయ్యట్లేదు అది పనిచెయ్యట్లేదు అని. ఇహ ఇలా కాదని మా బాసు పంపగా నేను, మరో కొలీగ్ గుజరాత్ వెళ్ళి అందరినీ వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, ఏమేం ఇంప్రూవ్మెంట్లు కావాలో అడిగి తిరిగి వచ్చాం. ఈలోపు ప్రాజెక్టు దెబ్బకు అదిరిపోయిన నా మరో స్నేహితుడు Ch. (నాతో పాటు చేరిన వ్యక్తి, ఇతడు చాలా కన్నింగ్ గురూ!) తను టెస్టింగ్ బాగా చేస్తానని బాసుని ఒప్పించి డెవలప్మెంట్ అంతా నా మీద తోసేశాడు. ఆవిధంగా దాదాపు రెండువందల స్క్రీన్లు, తికమక ఇన్సూరెన్స్ కాలిక్యులేషన్లు గల ఒక భారీ ప్రాజెక్టు నా ఒంటరి భుజాలమీద పడింది. కంపెనీలో ఉన్నదే ముగ్గురం, మా బాసు కాకుండా. నేను, Ch., ఇంకొకాయన. ఈమూడోవ్యక్తి మా మానేజర్లాంటివాడన్నమాట. దాంతో నేనూ చచ్చినట్లు ఆభారాన్ని మొయ్యక తప్పింది కాదు. మా బాసు మంచివాడే కానీ కాస్త బి.పి. ఎక్కువ. చిన్న తప్పులని కూడా సహించలేని స్వభావం. రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్లో ఏదైనా సమస్య వచ్చిందని ఫోన్ వచ్చిందంటే మేము(ముఖ్యంగా నేను) చచ్చామన్నమాటే. పైగా .టి. గురించి అస్సలు తెలియకపోవడం వల్ల తప్పులన్నీ డెవెలపర్ అజాగ్రత్త వల్లే వస్తాయనుకునేవాడాయన. కానీ అప్పటికే సాఫ్ట్వేర్ ఆర్.టి.సి. డొక్కు బస్సులా తయారవ్వటం వల్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒకచోట తన్ని నన్ను తన్నించేది. ఇలా రోజు రోజుకూ నా అక్షింతల కోటా ద్విగుణం, త్రిగుణంగా పెరిగిపోతున్న కాలంలో సిలిగురి నుంచి మా బాసుకు స్నేహితుడైన సర్వేయర్ ఒకాయన సాఫ్ట్వేర్లో ఒక మార్పు కోరాడు మా బాసును పర్సనల్గా. మా బాసు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాకు డూ ఆర్ డై లెవెల్లో వార్నింగిచ్చాడు. నేనూ ఒళ్ళు దగ్గిరపెట్టుకునే పని పూర్తిచేశాను. కానీ ఏంచేస్తాం, రిలీజ్ రోజు లేవగానే నా మొహం నేనే అద్దంలో చూసుకొని ఉంటాను, ఒక తప్పు కాలిక్యులేషన్తో సిలిగురి పంపించడం జరిగింది. రెండ్రోజుల తరువాత ఒక సాయంత్రం బాసునుండి ఫోన్, "నేను వచ్చి నీతో మాట్లాడాలి, అప్పటిదాకా ఇంటికి వెళ్ళొద్దు" అని. ఏదో జరిగిందిరా దేవుడా అనుకుంటూ భయపడుతూనే ఒక గంట గడిపాను. బాసు వస్తూనే తప్పు కాలిక్యులేషన్ చూపిస్తున్న రిపోర్ట్ కాగితాలు నా మొహం మీదకు విసిరికొట్టి ఇక మొదలుపెట్టారు స్వచ్చమైన బూతుల దండకం. నేనెందుకు బతికున్నానా అనిపించే లెవెల్లో, ఉద్యోగం కంటే అడుక్కుతినడం మంచిదనిపించే లెవెల్లో ఏకధారగా పావుగంట పాటు ఆఫీసులో అందరిముందూ ఫుట్బాల్ ఆడుకోబడ్డాను. అవమానంతో, రోషంతో బావురుమనడమే తక్కువైన స్థితి. ఇక ఆఉద్యోగం చెయ్యటం నావల్లకాదనిపించింది. ఇంటికి ఫోన్ చేసి సంఘటన గురించి ప్రస్తావించకుండా బాసుతో వేగడం కష్టంగా ఉందని మాత్రం చెప్పేశాను. వాళ్ళూ నాకు మద్దతుగా మాట్లాడటంతో కాస్త ఊరట కలిగింది. వేరేది ఎంత చిన్న ఉద్యోగమైనా సరే చూసుకోవాలని ప్రయత్నాలు ఆరంభించాను.

ఇంతలో మరొకసారి నాకు దేవుడు పంపినట్లుగా మరొక స్నేహితుడు జె.వి.ఎస్.కె.కిరణ్ నుంచి సహాయం లభించింది. అప్పట్లో కిరణ్ విశాఖపట్నంలోని ఒక కంపెనీలో పనిచేసేవాడు. అక్కడ వాళ్ళ బాసు జావా తెలిసిన స్నేహితులెవరైనా ఉంటే రిఫర్ చెయ్యమనడంతో నాపేరు ప్రస్తావించడం, ఆయన నన్ను ఇంటర్వ్యూకు రమ్మనమనడం జరిగాయి. సుడిగుండంలో మునిగిపోతున్నవాడికి ఆలంబన దొరికినట్లయింది నాకు. ఇన్స్టిట్యూట్లో జావా క్లాసులు కూడా చెప్పడంవల్ల వి.బి., జావా రెంటిమీదా బానే పట్టు ఉండేది. ఆధైర్యంతో మరుసటిరోజే విశాఖ రైలెక్కేశాను. Ch. ను ఆఫీసులో ఒక్కరోజు ఏదో ఒక కారణం చెప్పి మానేజ్ చెయ్యమన్నాగాని తను చేస్తాడని నమ్మకంలేదు. అయినా మొండి ధైర్యంతో బయల్దేరాను. ఇంటర్వ్యూ అదీ బాగానే చేశాను. కానీ విశాఖపట్నం బాసుకు కాస్త అనుమానం ఎక్కువ. నేనేమయినా తప్పు చేసినట్లయితే కిరణ్‌దే బాధ్యత అని, దానికి తను సిధ్ధపడితే నాకు ఉద్యోగమివ్వడానికి అభ్యంతరం లేదనీ చెప్పారు. నిజం చెప్పాలంటే నాకెవరైనా అలాంటి పిచ్చి షరతు విధించినట్లయితే మరో ఆలోచన లేకుండా బాధ్యత తీసుకోననే చెపుతా. కానీ కిరణ్ మాత్రం నన్ను నమ్మి నా బాధ్యత తీసుకోవడానికి సిధ్ధపడ్డాడు. ఇక్కడ కూడ నా ప్రతిభ కంటే కిరణ్ చేసిన సహాయమే నాకెక్కువ తోడ్పడింది. నేనెంత బాగా ఇంటర్వ్యూ చేసినా కిరణ్ బాధ్యత తీసుకోనని ఒక్కమాటంటే చాలు నాకా ఉద్యోగం వచ్చిఉండేది కాదు. ఆ విధంగా అందరిముందూ ఫుట్‌బాల్ ఆడుకోబడ్డ నెలలోపు ఆరువేల జీతంతో విశాఖపట్నంలో నా రెండవ ఉద్యోగం ప్రారంభమైంది. ఇక్కడ జీతం ఎక్కువన్న సంతోషం కన్నా హైదరాబాద్ ఉద్యోగం నుంచి తప్పించుకున్న సంతోషం ఎన్నోరెట్లు అధికం అనిపించింది.

కొత్త బాసుకూడా మంచి మనిషే కానీ కాస్త వింత తరహా. ఆయనకు ప్రతీది బెంచ్ మార్కింగ్ చేసి చూసే అలవాటు. కొత్త ఆఫీసులో ఇషాక్ అనే ఆయన ఉండేవారు. ఈయన భలే చురుకు, అద్భుత ప్రతిభాశాలి. నేను కలిసి పనిచేసినవాళ్ళలో ది బెస్ట్ అనదగ్గ వాళ్ళలో ప్రథముడు. సహజంగానే ఈయన ఆఫీసులో బాసు తరువాత అత్యున్నత స్థానంలో ఉండేవారు. కొత్త బాసుకు ఈయన మీద విపరీతమయిన గురి. ఎంతంటే ఎవరే పని చేసినా దాన్ని ఇషాక్ అయితే ఎలా చేస్తారో, ఎంత టైములో పూర్తి చేస్తారో పోల్చి చూసి అవతలి వ్యక్తి సామర్ధ్యాన్ని అంచనా వేసేటంత. జావాలో పని అని ఉద్యోగంలో చేరినా ఆఫీసులో మాత్రం బయటెవ్వరికీ తెలియని ఒక సాఫ్ట్వేర్ మీద పనిచేసేవాళ్ళం. ఈ సాఫ్ట్వేర్ మా ఆఫీసువాళ్ళే రూపొందించినది. కాకి పిల్ల చందంగా మా వాళ్ళ కళ్ళకు ఇది మరో నెక్స్ట్ జెనరేషన్ సాఫ్ట్వేర్‌గా కనిపించేదిగానీ దానిలో చచ్చేటన్ని బొక్కలుండేవి. పైగా ప్రపంచంలో ఎవ్వడూ వాడనిది కావడంతో ఏదయినా ఇబ్బందొస్తే మనలో మనం కొట్టుకు చావడమే కానీ గూగుల్లో కాగడా పెట్టి వెతికినా ఏ సహాయమూ దొరికేది కాదు. ఇలాంటిదాన్ని మిగతా వాళ్ళతో పోలిస్తే అతి త్వరగా నేర్చేసుకుని దానిలో ఒక చిన్న అస్సైన్‌మెంటు కూడా పూర్తి చెయ్యడంతో వైజాగ్ బాసుకు నామీద బానే గురి కుదిరింది. దాంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఇషాక్ కు సహాయంగా నియమించడమే కాకుండా రెండు నెల్ల పాటు వరుసగా కొద్ది కొద్దిగా జీతమూ పెంచారు. పరిస్థితి ఫరవాలేదన్నట్టుగానే ఉందిగానీ ఎన్నాళ్ళిలా అనిపించసాగింది. కెరీర్ ప్రారంభించి సుమారు రెండేళ్ళవ్వొస్తున్నా సరైన బ్రేక్ దొరకలేదు ఇంకా. అప్పటికే మిత్రుల్లో చాలామంది పెద్ద కంపెనీల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. పైగా కొత్త బాసు పాతాయన కన్నా ముక్కోపి. పనిలో చిన్న తేడా వచ్చిందా మనం కేరాఫ్ అడ్రసు రోడ్డే.

5 comments:

సూర్యుడు said...

Your experiences are interesting though you would have struggled during those days.

Good narration.

~sUryuDu

వేణు said...

మీ అనుభవాలను బాగా రాస్తున్నారు. జీవితంలో నిలదొక్కుకోవటానికి వివిధ దశల్లో సహాయాలు చేసిన స్నేహితులను ఇలా తల్చుకోవటం చాలా మంచి పని!

శేఖర్ పెద్దగోపు said...

మీ నెరేషన్ ఆసక్తికరంగా సాగుతోంది..నెక్స్ట్ పోస్ట్ ఎప్పుడు? కొంచెం పెద్ద టపారాయండీ..మీరు కూడా ఇలా సీరియల్లోలా కొంచెం కొంచెం రాసి సహనం పరీక్షించటం బాలేదు..:)

kishan said...

haha nijamenandi.ee sari koncham pedha article raayandi.and meeru raase padhathi chala bagundi.vry nice wrk.

బ్లాగాగ్ని said...

సూర్యుడు గారు, వేణు గారు, కిషన్ గారు - థాంక్స్ అండీ.
శేఖర్ గారు - చివరి భాగం కూడా పోస్ట్ చేశానండీ, ఇంక సాగతీయదలచుకోలేదు :).